23, జూన్ 2010, బుధవారం

పాత తోటలో కొత్త పాట ల చిగురొకటి పలకరించిన వేళ...

జూన్  నెల కౌముది లేఖ
పాత తోటలో  కొత్త పాట ల చిగురొకటి పలకరించిన వేళ...



నువ్వు తలపుకొస్తే నిద్ర దరికే రాదు.... నిద్ర దరికొస్తే మాత్రం పోటి గా కలల తో కలవర పరచటానికి పరుగెత్తుకుని వచ్చేస్తావు నీకిది న్యాయమా నల్ల పిల్లా.... విశ్రాంతి తీసుకో అంటావు అమాయకం గా కళ్ళార్పుతూ....నీ మాట ను జవదాట గల వాడా ఈ సత్యాపతి అని విశ్రాంతి తీసుకుందామనుకుంటే నీవూపిరి వెచ్చగా బుగ్గల మీద, నీ చేతిలో ఈకేమో చెవిలో గిలి గిలి పెట్టేస్తుంటే పెద్ద గా నవ్వుతూ లేచేను............. దొంగ దొరికిందని చెయ్యపట్టుకోవటం కోసం చాపిన చేతి ని పడమటి దిక్కునుంచి పాకి వస్తున్న పువ్వుల పరిమళం తాకి పరామర్శిస్తే.... బుగ్గ మీద చిరుగాలి నీ పిచ్చితనమే కాని ఆమె ఏది...... ఇక నీ దగ్గరకు రానివ్వనంత దూరం పంపేసేవు గా అని చిటిక వేసి చెప్పి వెళ్ళి పోయింది... 

చిరు వెలుగుల కు, మత్తిల్లిన చీకటి తెరలకు వారధి గా ఎక్కడో అప్పుడే కోడి కూస్తోంది. ఇక ఈ రోజు కు నిద్ర చాలు లే అని మన ఇంటి వెనుక వేప చెట్టు పూత పలకరిస్తూ ,ఏది తువ్వాయి తో పాటు గా పరుగులు తీస్తూ కనపడేది గా ఇక్కడే, ఎక్కడ నీ గుండె సవ్వడి వినపడటం లేదు అంటోంది ఏమి చెప్పను..... నా వెర్రి తనం వేయి పడగలై నన్నే కాటేసి నాకిచ్చిన శిక్ష ఈ ఒంటరి తనమనా..... ఇక ఎప్పటికి కలవని రహదారుల వెంట పరుగులెత్తే అడుగుల సవ్వడి క్షణ క్షణానికి దూరమే అవుతుంది కాని కలిసి సాగే పదాన్ని కర్కశం గా విడగొట్టిన నా మది కి,  ఈ తోట కు ఎప్పటికి రాదు అనా..  ఈ పొద్దుటే ఇలా నిన్ను మది పలవరించటం తో మొదలయ్యిన రోజు ఇంకెన్ని మంచి తలపులను తీసుకు రానుందో కదా ..... 

అమ్మమ్మ వాళ్ళ తరమే హాయి అనుకుంటా... ఇన్ని సంఘర్షణ లు వుండేవి కావు అందినదానితో జీవితాన్ని అనుసంధానించుకుని తృప్తి గా బతికే వారేమో   ఏమోలే వాళ్ళ మనసుల్లో ఏమి వుండేదో వయసు లో వున్నప్పుడు మనకు తెలియవు కదా..... మన తరువాతి తరాలకు మనం కూడా, బోసి నవ్వులతో మీకు లా కాదు మేము, హాయి గా వుండే వాళ్ళం అని చెపుతామేమో. నేను నేను అనే లాజిక్ ఎక్కువ అయ్యే కొద్ది మనం అనె అనుభందానికి దూరమవుతున్నామా? అసలు ఏ మనిషి కైనా ఆనందం గా వుండటానికి కావలసిన మూల సూత్రమేమిటో ఆర్కిమెడీస్ సూత్రాలకు మల్లే వాటిని కూడా చిన్నప్పుడే పుస్తకాలలో ఫాఠ్యాంశాలు గా పెట్టి చదివించి బుర్రలోకి ఎక్కిస్తే ఐనా అందరికి అర్ధం అవుతుందేమో.  

ఎందుకు నీ వెర్రి తనానికి అందరికి కలిపి అంట గడతావు నీ సంగతి చూసుకో ముందు తరువాత అందరి గురించి ఆలోచిద్దువు అంటావా... అనవు నువ్వు..... నువ్వు మాట్లాడవు చాలా సార్లు నీ కళ్ళే మాట్లాడతాయి. నీ కళ్ళు చెప్పిన సంగతులను అన్వయిస్తే.... వుహూ అన్వయించగల శక్తే నాకు వుంటే ఎన్నో కావ్యాలను, ఎన్నో జీవిత పాఠాలను రాయగలిగే వాడిని.... ఇలా అశక్తుడినై పూర్తి గా వోడి పోయి ఎక్కడో పలికే నీ గుండె చప్పుడితో శృతి కలపాలని ఆశ తో పిచ్చి పదాలను కూర్చి లేఖ చేస్తానా.... 

ఇలా సాగే నా ఆలోచనల తీరుకు నాకే వెర్రి లా అనిపిస్తుంది ఒక్కోసారి అంటే, చందు "వో నీకు ఇప్పుడు అర్ధం అయ్యిందా నాకు ఎప్పుడు అనుమానమే రా,ఎందుకు కలిసేవో తెలియని ఒక విచిత్ర భందం ను ఇలా తలచి వగచే నీ మతి చలనం మీద " అన్నాడు, ఎంత సేపో నవ్వేను చందు మాటలకు. నిజమే జీవితం లో ఒక అధ్బుతమైన ప్రేమ తటస్థించక పోతే ఎవరికైనా ఎంత చెప్పినా ప్రేమ గొప్ప తనం అర్ధం కాదేమో.. ఆ మాట అంటే మొన్న రాత్రి జరిగిన చర్చలలో శ్రీధర్ వొప్పుకోలేదు. ఏ బంధానికైనా దాని గొప్పతనం అది నువ్వు కల్పించుకున్న విలువ ను బట్టీ వుంటుంది. దానంతటకై ఒక విలువ అంటూ దేనికి ప్రత్యేకం గా వుండదు...  ఏమో ఇంకో అధ్బుత ప్రేమ నీ కోసం ఎదురు చూస్తోందేమో,  ఒక ప్రేమ కాని, స్నేహం కాని లేదా ఒక పరిచయం కాని అధ్బుతమని ఎలా తోస్తుంది చెప్పమని అడిగేరు. కావాలంటే పుట్టుక నుంచి జరిగిన ప్రతి సంఘటన ను విశ్లేషించి చెప్పమని అడిగేరు. మొన్న రాత్రి అసలు ఆ చర్చే బలే తమాషా గా మొదలయ్యింది. నువ్వు వుంటే అరుగు మీద చలి గాలికి కొంగు లాగి బిగించి మోకాళ్ళను కడుపులోకి లాక్కుని కూర్చుని వూయలలూగుతూ నవ్వుకుంటూ వినే దానివేమో. 

ఎలా చెప్పాలో అర్ధం కాలేదు పద్యాలను యతి ప్రాసలతో గణ విభజనలతో మాత్రలతో లెక్క కట్టినట్లు, అనుభవాల మాలికను విడగొట్టి...లెక్క చూసి ఏది ఆగినా జీవితమగదు కాబట్టీ గతం ను గతించిన కాల జతి లో కలిపి నూతన ప్రవాహ కేళి కై వేచి చూడు అదే జీవితం అంటే నేను ఒప్పుకోలేదు.. వీటన్నిటీని మించి ఏదో వుంటుంది, అది ఏదో...... ఏమని చెప్పాలో ఎలా నిర్వచించాలో తెలియటం లేదు. మనసు కూడా మాట విననని ఎన్నెన్నో జ్నాపకాల గుత్తులను విరగ పూయించి చెపుతోంది. 

ఇన్నాళ్ళ తరువాత...వుహు....ఇన్నేళ్ళ తరువాత కూడా అదమలేని నా గుండెల విలాప గీతం, స్వయంకృతాపరాధ రాగం లో.... వొంటరైన జంట చకోర తాళం లో నిను తలుస్తుంటే.... నీవెక్కడున్నా ఇది నిను చేరాలని... నీ తలపుల చాటున మిగిలిన నా జీవన శ్వాసను పలకరించాలని ఆశిస్తూ.......

నీ వాడు.


ప్రియ నేస్తం,
నీ రూపు... నీ మాట.... నీ అడుగు..... గత జన్మలోని బంధమల్లే మసకేసి పోతోంది కంటి చెలమల మధ్య కనుపాపలో. జారనివ్వు మిత్రమా, కిందకు జారిన ప్రతి చుక్క నీకిచ్చే నీరాజనమై నా గుండెలోని నీ జ్ఞాపకానికి హారతులెత్తుతోంది..

రోజు రోజు కొక రాగం పలకరించే ఈ ఉదయం... ఉదయానికే ఒక హాసం ప్రకృతి పరిచిన పూల వనం.. వనాల విరిసిన సంగీతం విరించి ఇచ్చిన అదనపు బహుమానం.... బహుమానాలన్ని ప్రోది చేసి గుచ్చి ఇచ్చిన సూత్రం ఈ ఉదయాన నా కృష్ణయ్య మధుర దరహాసపు ఆనవాలు నిచ్చే అక్షరాల భావం. భావాలన్నీ కలిసి విరిసిన సుమధుర సువాసనల సరాగం పంచుతూ ఈ రోజు పొద్దుటే నీ తలపొకటి వాలి వడలి పోయిన తోటలోకి నవవసంతం ఆకాంక్షించే రామచిలుకలా వాలితే అది అనునిత్యం సాగే నీ నామ జపమనుకున్నా కాని కాదు అది నువ్వు నాకొరకు పంపిన జ్నాపికల జలధారల జలదరింపు అని ఇప్పుడే ఈ క్షణానే వచ్చిన నీ జాబు చెప్పింది.. 

ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళకు ఒక మాట... ఒక తలపు.... ఒక పిలుపు మనమున్న ప్రేమ రాజ్యం నుంచి నాకొరకొచ్చింది.. నిన్న మొన్నటి విషయమల్లే గతించిన జ్నాపకమొకటి సజీవమై ఎదుట నిలిచిన క్షణం, ఎదురు చూసిన జన్మ జన్మ ల భంధం ఎదుట నిలిచి పలకరించిన క్షణం.. ప్రతి క్షణమొక యుగమైన ఈ కాలమంతా ఒక్క సారి ఘనీభవించి ఎక్కడ మన కధ ఆగిందో అక్కడే తిరిగి కాలం మొదలైనట్లనిపించింది. 

ప్రేమ అన్న పదమొక సుస్వర నాదమై నా జీవితాన్ని వెలిగించిన రోజులను నేను మరవగలనా... మన ప్రేమ ఎంత నిజమో, మన అనుభందమెంత సత్యమో, ఆ పైన నీ అపనమ్మకపు నీలి నీడల మేఘగర్జన అంతే నిజం.. అపస్వరాల సాగిన మన ప్రణయ రాగం ఒక్క సారి గుక్కపట్టి ఆగిపోవటం అంతే సత్యం. ఒక్క సారైనా ఆగి ఆలోచించినా.... మన అనుభందపు ఆనవాలు అంచైనా చెప్పేది నీకు నాగురించి. బాసల వూసులతో నిండిన నాకంటి వెలుగును ఆర్పేసి నన్ను అంధురాలిని చేసేక... ఇక నా కళ్ళు  ఏ ప్రణయ కావ్యాలను రచియించగలవు.. ఇక అవి ఏదూర తీరాలకో చేరిన సుధా మాధురి స్వరాన్ని వివరించగలవు చెప్పు....... 

నేను నేనన్న సామ్యమో... సాధనో నిను నిరంతర యాత్రికుడను చేస్తుందేమో కాని ప్రేమ అన్న పదమే ఆ మార్గం లో గమ్యాన్ని చూపించే సాధనం. నేను నేనన్నావు నీ ప్రేమ గొప్పన్నావు.. నీ తోడు గా నడిచే నీ నీడ నల్లదనాన్ని వక్రించావు.... అందులోని చల్లదనాన్ని నిరసించావు మళ్ళీ ఈ రోజు గొప్పదైన నీ తర్కం తో వెలకట్టిన అనుభందాల విలువలను వెనక్కు తిరిగి అడుగుతున్నావు.. వదిలిన చోటనే వెతికే నా వెర్రి నేస్తమా సాయంసమయపు నీ నీడ... ధీర్ఘమై మునిమాపు వేళ గోధూళి చాయల మిళితమై పోయింది చూడు..

అధ్బుతాలను అనుభవాలను త్వరితం గా మారే లోక ప్రమాణాలతో లెక్కకట్టే నీ మిత్రుల సాహిత్య గుభాళింపుల వనాలలో ఈ గరిక పువ్వు పూచే అధ్బుతం.. ఈ కొండమల్లె కు పట్టిన పరిమళం ఆఘ్రాణింపుకు రావులే.... వదిలెయ్... 
మూసుకు పోయిన ప్రేమ రహదారుల వెంబడి సాగుతున్న వొంటరి పాంధుడు తన అడుగుల కింద నలిగి ధూళి లో కలిసిన చెలి హృదయపు ఆనవాలు తెలుసుకుని గురుతు వెతికి వచ్చినా.... మరణించిన ప్రేమ తోట లోకి రాని వసంతాల వలపు పాట పునర్జీవన రాగాలతో కలిపి ఆలపించినా, అనంత వాయులీనాలలో లీనమైన ఆత్మ అంతు చిక్కని ఆవలి అంచుకు ఆవలకు చేరుకున్న క్షణం వెనక్కి తిప్పి జీవ ధార తో నింప గలదా... ఆ శక్తి కృష్ణయ్య ప్రేమ కు వున్నా అందుకునే ఆశక్తి ఈ రాధమ్మ కు వుందా.....

22 కామెంట్‌లు:

సవ్వడి చెప్పారు...

Iam the first..
cadivi mallee raastaa..

పరిమళం చెప్పారు...

ముందే చెప్పానుగా భావనగారూ ! మీ దగ్గర అక్షర ధాన్యాగారం ఉందని ! మీ ప్రతి టపా చదివినప్పుడూ ఇలాగే అనిపిస్తుంది . చిత్రాలు అద్భుతంగా అమరాయి మీ భావ వ్యక్తీకరణకు !

హను చెప్పారు...

superb.... anDi, nd mainly meeru cheppe vidanam chala bagumdi..... alaa katTipaDesimdi ante...

సవ్వడి చెప్పారు...

భావన గారు! నాది కూడా పరిమళ గారి కామెంటే!
అమ్మాయి చెప్పినంత బాగా అబ్బాయి చెప్పలేకపోయాడు అనిపించింది.

రాధిక(నాని ) చెప్పారు...

అద్భుతం బావనగారు,చాలా.......చాలా....బాగారాసారు.చిత్రాలు కూడా చాలా బాగున్నాయి

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఏమండీ భావనగారూ, నేను ఈ టపాను మూడు విడతలగా చదివాను. బోరు కొట్టికాదు సుమా. ఒక్కోపేరా పూర్తిగా చదువుతూ చదువుతూ పూర్తిచేయడానికి రెండు రోజులు పట్టింది. అంతా చదివాక అనిపిస్తుంది ఇంతలా సాహిత్య గుభాళింపులను తెరపైకెక్కించడానికి మీరు విహరించే వనాలేవో అనుభూతికందని క్షణాలేవో అని అమితాశ్చర్యం కలుగుతుంది. చాలా నచ్చింది.

నేను చెప్పారు...

నేను నేను అనే లాజిక్ ఎక్కువ అయ్యే కొద్ది మనం అనె అనుభందానికి దూరమవుతున్నామా? .......

దూరమైన తర్వాతే ఈ ఆలోచన ఎందుకు వస్తుంది..


రోజు రోజు కొక రాగం పలకరించే ఈ ఉదయం... ఉదయానికే ఒక హాసం ప్రకృతి పరిచిన పూల వనం.. వనాల విరిసిన సంగీతం విరించి ఇచ్చిన అదనపు బహుమానం.... బహుమానాలన్ని ప్రోది చేసి గుచ్చి ఇచ్చిన సూత్రం ఈ ఉదయాన నా కృష్ణయ్య మధుర దరహాసపు ఆనవాలు నిచ్చే అక్షరాల భావం. భావాలన్నీ కలిసి విరిసిన సుమధుర సువాసనల సరాగం పంచుతూ ఈ రోజు పొద్దుటే నీ తలపొకటి వాలి వడలి పోయిన తోటలోకి నవవసంతం ఆకాంక్షించే రామచిలుకలా వాలితే అది అనునిత్యం సాగే నీ నామ జపమనుకున్నా కాని కాదు అది నువ్వు నాకొరకు పంపిన జ్నాపికల జలధారల జలదరింపు అని ఇప్పుడే ఈ క్షణానే వచ్చిన నీ జాబు చెప్పింది..

కొన్ని ఎన్ని సార్లు చదివినా తనివి తీరవెందుకో... అంటే మిగతావి నచ్చలేదని కాదు సుమండీ :)

మాలా కుమార్ చెప్పారు...

భావన గారు ,
అద్భుతం . మీరు ,భావాలను ఇంత బాగా ఎలా వ్యక్తీకరించకలుగుతారో కదా . చిత్రాలు పరమాద్భుతం .

Hima bindu చెప్పారు...

వావ్ !యంత బాగా రాసారండి !..లీనమైపోయనంటే నమ్మండి..చలం ఉత్తరాలు చదివినంత అనుభూతి కలుగుతుంది.బొమ్మలు కూడా సూపర్బ్ ....

అజ్ఞాత చెప్పారు...

ప్రేమ అనేది లేకపోతే మనుష్యులు ఈ భూప్రపంచం మీద ఉండలేరు. ఆ అనుభూతిని పొందక జీవించేవారిని వారికి అందులోని గొప్పతనాన్ని తెలియచేప్పాలనిపిస్తుంది. నేను నా స్నేహితురాలు రాసుకున్న ఉత్తరాలని తలపుకు తెచ్చారు. హ్రుదయానుభూతులను చక్కగా తెలియజేసారు.(తొలకరి)

అజ్ఞాత చెప్పారు...

ప్రేమ అనేది లేకపోతే మనుష్యులు ఈ భూప్రపంచం మీద ఉండలేరు. ఆ అనుభూతిని పొందక జీవించేవారిని వారికి అందులోని గొప్పతనాన్ని తెలియచేప్పాలనిపిస్తుంది. నేను నా స్నేహితురాలు రాసుకున్న ఉత్తరాలని తలపుకు తెచ్చారు. హ్రుదయానుభూతులను చక్కగా తెలియజేసారు.(తొలకరి)

భావన చెప్పారు...

@కృష్ణా... మీరే మొదలు కామెంటింది you made it ;-)
@ ధన్యవాదాలు పరిమళం గారు. అక్షర ధాన్యాగారం అమ్మో వద్దు కాని అందులో నుంచి తృణమో పణమో నా అక్షర తూణీరాల పొది లో పడాలే కాని మాటల పాటలలో పలకరింతల పువ్వుల రాగాలు చేసి విసరనూ మీ అందరి మీద.. :-)

@ హను: ధన్యవాదాలు. కట్టీవేసే శక్తి, చెప్పేవిధానం లోని చక్కదనం నచ్చితే ఆ గొప్పతనం ప్రేమది, ఇంకా చదివే మనసు ది అంతే నండీ. ప్రత్యేకం నా గొప్పతనం ఏం లేదు.

భావన చెప్పారు...

@ కృష్ణ: పరి మళం గారి కిచ్చిన సమాధానమే మీకూనూ. ఇంక అబ్బాయి బాగా రాయలేదా ఈ సారి.. ఏమో ఈ సారి అబ్బాయి ప్రేమ లో బలం తగ్గిందేమో రాతలలో చేవ తగ్గినట్లనిపించింది అంటె

@ రాధిక(నాని) గారు: చాలా ......చాలా ధన్యవాదాలు. చిత్రాలు గూగులమ్మ గొప్ప. నచ్చినందుకు ఇంకో సారి ధన్య వాదాలు.

భావన చెప్పారు...

@భాస్కరా: ధన్యవాదాలు. ఇంతకు ముందు నీకే చెప్పినట్లు వున్నా. ఒక సారి భావాల లాకులను ఎత్తి మనసును ఇచ్చ కు వదిలేస్తే ఎన్ని వనాల విహరించ వచ్చు, ఎన్నెన్ని అనుభవాల పరిమళాలను ఆఘ్రాణించవచ్చు. కదిలే ప్రతి ఆకు ఒక కధ చెపుతుంది. మెదిలే ప్రతి గాలి ఒక వ్యధ వినిపిస్తుంది.. వురికే తలపేమో వర్ణాలద్దుతుంది... వూరకుండనున్న కన్నేమో కలం తో కలిసి ఒక మాటై దానిని మార్చేస్తుంది.. విన్న, కన్న, ఆలకించిన, అనుభవించిన ప్రతి పదం వచన రాగమై వెలువడ్డాక.. నచ్చటం అనేది నీ మనసుకు సంభందించిన గొప్ప, నాది కాదు. :-)

భావన చెప్పారు...

@స్పందన (నేను) : ముందు గా ధన్యవాదాలు నీకు నచ్చినందుకు.
అవును..నేనన్న వాదన దగ్గరైనప్పుడే. భందమో.. భాద్యతో దూరమై, బాధ కు దగ్గరైనప్పుడు నేను అనే మాట అణిగి మనమన్న భందం విలువ గుర్తు కొస్తుంది. మానవ సహజం మరి. అంటే exceptions వుండవని కాదు, చాలా మటుకు అంతే. అందుకే అటువంటి బలహీనతను చూపించటానికి ప్రయత్నించా.
మనసు ఒకే స్ఠాయి లో స్పందించినపుడూ రాసిన అక్షరమొక మధుర పాకమై మనసులోనే స్రవించిందా అన్నంత సంతోషాన్నిస్తుంది. అందుకే అన్ని సార్లు చదవాలనిపిస్తుంది అనుకుంటా.

భావన చెప్పారు...

@మాల గారు: ధన్య వాదాలు. భావాలను వ్యక్తీకరించటం కోసమే భావనయ్యింది మరి. ;-) గూగులమ్మ గొప్ప ఆ చిత్రాలు.

@చిన్ని : చలం వుత్తరాలే అమ్మో అయ్యో... మాట వరసకు అన్నా చాలా ఇబ్బంది గా వుంది తీసుకోవాలంటే. చిన్ని చాలా ...చాలా............చాలా ధన్యవాదాలు. బొమ్మలు బాగా దొరికేయి కదా.

భావన చెప్పారు...

@తొలకరి గారు: ధన్యవాదాలు. అవునండి..ప్రేమ లేని జీవితమే వుండదు... ప్రేమ ను అనుభవించలేని మనసుంటుందా... చెప్పండి. మీకు అభినందనలు ఒక మంచి స్నేహితురాలున్నందుకు....

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఇక్కడ చిన్ని, భావన కలిసి ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నట్టుంది. మేం ఖండిస్తున్నాం

ఆ.సౌమ్య చెప్పారు...

ఊహూ ఇలా లాభంలేదు, మళ్ళీ చదవాల్సిందే...ఇంత ఇంత పెద్ద డోసులిచ్చేస్తే కష్టమండీ...మూడు పేరాలు చదివేసరికి అలసటొచ్చేసింది....ఆ ఆ అపార్థం చేసుకోకండి...భావాన్ని అర్థంచేసుకుని అలసిపోయాను,అంత బరువుగా ఉంది మరి.

భావన చెప్పారు...

చిన్ని నేను ఇలా మమ్ములను మ్యాచ్ ఫిక్సింగ్ అనటాన్ని కూడా ఖండిస్తున్నాము. :-|

సౌమ్య: బరువెక్కువయ్యిందా రోజు ఒక రెండు పెరాలు చదవండి ఐతే. భావాన్ని అర్ధం చేసుకున్నారా చదివినంతవరకు ఐతే. :-) నచ్చినందుకు ధన్య వాదాలు.

Hima bindu చెప్పారు...

@బా.రా.రె
అమాయకురాల్ని పట్టుకుని ఇంత మాట అంటారా !హు ..ఇది అన్యాయం ,ఇలాటి ఆరోపణలు నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను ..

సుమిత్ర చెప్పారు...

అద్భుతం!
ఇన్ని రోజులు మిస్ అయినందుకు బాధగా ఉంది.