24, జనవరి 2010, ఆదివారం

హేమంతాల చేమంతులు.

హేమంతాల చేమంతులు జనవరి కౌముది లో లేఖ

బావా,
ధనుర్మాసపు చలిగాలి చెంపలను నిమిరి గుండెలో గిలిగింతల పులకరింతో, గుబులు దుమారమో సరిగా తెలియకుండా లేపి ఎండిన ఆకులను సుడి తిప్పుకుని వెళ్ళి పోతోంది. నాకూ ఆ సుడిగుండం లోని ఆకు కు తేడా లేదేమో.. ప్రపంచం లో అన్నిటి కంటే వేగం గా పయనించ గల మనసు కూడా నా బావ కోసం ఎక్కడ పయనించాలో తెలియకనో ఏమో మూడంకె వేసుకుని ముడుచుకొని దిగులు గా వుంది. హేమంతమంటేనే దిగులు జలదరింపుల పలవరింతలంటే ఇదేనా బావ? ఇది రెండో సంక్రాంతి నువ్వు లేకుండా..! అందరు బానే వున్నారు. వాళ్ళెవ్వరికి కృష్ణయ్య లేని బాధ లేదు గా మరి.

నిన్న మునసబు గారింటికి పనేమి లేక పోయినా దుర్గ దగ్గర ఆ చదివిన పుస్తకాల కోసమే మళ్ళీ వెళ్ళి, అడిగేను మధ్యాన్నం నిద్ర టైం లో ఏమైనా ఫోన్ వచ్చిందేమో అని. వాళ్ళకు వినపడలేదో, వినపడ్డా మధ్యాన్నపు నిద్ర సౌఖ్యాన్ని వొదులుకోలేక వూరుకున్నారేమో అని. లేదు చెయ్యలేదన్నారు.

శీతాకాలం మధ్యాన్నాలు చాలా నిడివి తక్కువ ఇలా వచ్చి అలా మాయమై పోతాయి. ఈ రోజన్నా సాయింత్రం దీపం పెట్టమని అమ్మ అరిచేలోపు ఈ వుత్తరం పూర్తి చెయ్యాలని దొడ్లో వుసిరి చెట్టు పక్కన కూర్చుని రాస్తున్నా. కాలం కాని కాలం లో ఎక్కడో కోయిల కూత వినపడుతోంది విచిత్రం. అందరు అన్నాలు తిని ఏవో సర్దు కుంటున్నట్లున్నారు.పాపం అమ్మ కు, అత్తయ్య కు ఈ కాలం లో మధ్యాన్నం కాసేపు కునుకు తీయటానికి కూడా కుదరదు కదా. నాన్న మావయ్య నూర్పిళ్ళ కాలం వచ్చేస్తోంది అని పొలాల దగ్గరే వుంటున్నారు. ఇంకో గంట లో లేచి టీ తీసుకుని వెళి పోతారేమో కూడా. వాళ్ళకు టీ పెట్టాలి, ఇంకా అరిసెలు అవి చేయాలని గూడెం రంగి వాళ్ళకు కబురంపింది అమ్మ.

వీరాయి గాడొక్కడే ఏమిటో గొడ్ల సావిడి దగ్గర కూని రాగాలు తీసుకుంటూ ఏదో పని చేసుకుంటున్నాడు. నార పేనుస్తున్నాడు అనుకుంటా సంక్రాంతి కి మన లక్ష్మి కు కొత్త తాడు నేస్తాడేమో బహుమతి కింద. అవును బావా అది తాడయ్యి తనను కట్టినంత కాలం... అది రంగుల తాడయ్యి, పాత తాడయ్యి, పసుపూసిందయ్యీ లక్ష్మి కి ఒకటే కదా. దాని పని లక్ష్మి ని బంధించటం, అది లక్ష్మి కు దుఖ హేతువే కదా. అసలు లక్ష్మి కు తెలుస్తుందా అలా కట్టెయ్యక పోతే ఎలా వుంటుందో..??? ఇది బాగుంటుందో అది బాగుంటుందో పోల్చుకుని చూసుకోగల విచక్షణ. ఏమిటో ఆలోచన కే నవ్వు వస్తోంది.

వీరాయో, గంగో చూస్తే నవ్వుకుంటారేమో వాళ్ళకు ఒకటే ఆశ్చర్యం, అమ్మాయి గారు అలా దొడ్లో కూర్చుని రాసుకుంటూ ఒకటే నవ్వు కుంటారు, కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు అని, మొన్నెప్పుడో అంది కూడా గంగి, అమ్మాయి గారికి దిష్టి తాడు కట్టించండి ఆంజేనేయ స్వామి గుడి పంతులు గారిని అడిగి అని. అది అనుకుంటూందేమో నాకు పిచ్చి అని.

ఆ పక్కన ఎక్కడో దక్షిణపు పక్క మూల కున్న వేప చెట్టు ఆకులు దొడ్డి మొత్తం పరుచుకుపోయినాయి బావ ఎంతందం గా వున్నాయో పచ్చ పచ్చ గా.. నువ్వేమి చేస్తుంటావో ఇప్పుడు కాలేజ్ లో వుంటావేమో కదు.. నేను ఇంత తలచుకుంటాను కదా బావా ఒక్క సారన్నా కొర పోదా నీకు? చాలా రాయాలని వుంటుంది రోజు ఇక్కడ జరిగే ప్రతి చిన్న విషయం చెప్పాల్ని వుంటుంది, ఇది వరకు కూడా నీకు చెప్పినా, శెలవలకు నువ్వు వచ్చే వాడివి కదా చెప్పినవన్ని మళ్ళీ చూసే వాడివి.... ఇప్పుడూ....!!! రెండేళ్ళయ్యింది, ఎన్ని పండగలు ఎన్ని విషయాలు జరిగేయి.. ఒక్క దానికి కూడా నువ్వు లేవు.

దిగులు గా వుంది బావ! గుండెలోని గుబులంతా ఏమని చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా అర్ధం కావటం లేదు. మొన్న పక్కింటి రంగయ్య తాత..... ఇంకా మీ బావ కు నువ్వేమి గుర్తుంటావే.. అక్కడే ఎవరో ఒక తెల్లమ్మాయి ను చూసుకుని వుంటాడు అన్నాడు వెక్కిరింత గా. ఖచ్చితం గా అది నిజం కాదు, అలా ఏమి జరగదు నువ్వు ఎప్పటికి నా వాడివే అని తెలుసు, కాని ఎందుకో దుఖం సాయంకాలం నీడల్లే నా మీదకు ధీర్ఘం గా పాకేసింది. ఇంకా ఎన్నాళ్ళు బావా ప్రతి సారి వస్తానంటావు రానంటావు. ఈ సారి సంక్రాంతి కి ఖచ్చితం గా వస్తావనుకున్నాము. అత్తయ్య కూడా ఎంతో దిగులు పడుతోంది. మొన్న సోది అమ్మి వస్తే అడిగింది నువ్వు ఎప్పుడు వస్తావు మన పెళ్ళి ఎప్పుడూ అవుతుంది అని. చారెడు బియ్యం పోయించుకుని ఆ అమ్మి శ్రీనివాస కల్యాణం లెక్క ఘనం గా జరుగుతుంది మన పెళ్ళి అని చెప్పింది. అయ్యో అంత అప్పు అవుతుందా మావయ్య వాళ్ళకు ఐతే పెళ్ళి కు అని అడుగుదామనుకుని అత్తయ్య తిడుతుందని వూరుకున్నా.

అబ్బ ఒక కాగితం కూడా పూర్తి కాలేదు అప్పుడే గడ్డి వాము నీడ తిరిగింది.. అరటి పిలకల పక్కన మురుగు లో చంద్రకాంత పూల మొగ్గ పెద్దది అవుతోంది. ముళ్ళగోరింట పూల ఆయువు ఇంక పూర్తి గా గాలి దేవుడి ప్రతాపం మీదే ఆధారపడిపోయింది. మన పూల కోడి కి మాత్రం ఇంకా పొద్దు అవ్వలేదు కదా పిల్లలనేసుకుని హడావుడి గా ఆ ములగ చెట్టు దగ్గర తిరుగుతోంది.

ఏమిటో బావ గొంగళి పురుగుల కోసం పూల కోడి, పూల కోడి కోసం తెల్ల రెక్కల గద్ద, ఎక్కడో పెరిగిన వేట పోతు కోసం మనం మన కోసం గవర్నెమెంట్ అధికారులు ఇది ఒక ఆగని చక్రం కదా. వీటన్నిటికి అతీతం గా నీ కోసమే కాచుకుని కూర్చున్న ఈ పిచ్చి పద్మ. హ్మ్మ్ నిరీక్షణ ఎప్పటికి పూర్తి అయ్యేనో.. శ్రీనివాస కల్యాణమెన్నటికో అందాక ఎదురు చూస్తూ..
నీ
పద్మ.
అమ్మయ్యో వీరాయి కి మన కర్రోడి గిట్టల చప్పుడు కూడా వినపడినట్లుంది కుడితి కలపటానికి వెళుతున్నాడు. సరే బావ నిజం గానే వుంటాను. ఫోన్ చెయ్యమని చెప్పమన్నారు నాన్న, మావయ్య కూడా.


ప్రియమైన నా పిచ్చి మరదలికి,

మన వూరి కబుర్లను నీ బెంగ ను కలిపి తామారాకు మధ్య లో కట్టిన కనకాంబరాలంత ఫ్రెష్ గా నా ముందుంచింది నీ కబుర్ల కదంబ మాల. అది కాదు రా నల్ల బంగారం ఎన్ని సార్లు చెప్పేను మీకు మాకు ఒక రాత్రి పగలు తేడా వుంటుందని. నువ్వు మధ్యాన్నపు వెలుగు నీడల ను నీ పవిట చెంగున కట్టి కలయ తిప్పే టప్పుడు నిశి రాతిరి నీడల మధ్య నిద్రా దేవి తో నా సావాసం, నువ్వు కట్టిన వెలుగునీడల మూట పొద్దుటే నే విప్పుకుంటున్నప్పుడు సాయం సంధ్య తో నువ్వు కలిసి వేసే జడ కోలాటం వివరాలు ఎన్ని సార్లు చెప్పినా మర్చిపోతావేరా?

నేనూ చాలా మిస్ అవుతున్నాను మన వూరు ను, సంక్రాంతి సంబరాలను. ఈ సారి నిజం గానే వద్దామనుకున్నాను కాని అనుకోకుండా మంచి రిసెర్చ్ వర్క్ ఒకటి వచ్చింది రా. ఈ అసిస్టెంట్ షిప్ చేస్తే తొందర గా పేపర్ సబ్మిట్ చెయ్యొచ్చు అందుకని ఆగి పోయాను. నేను ఇక్కడ పని చేసుకుంటున్నా నా మనసు అంతా మన ఇంట్లో నే వుంది. నాన్న మావయ్య ఇద్దరు నేను పంపించిన స్వెటర్ లు వేసుకుంటున్నారా రాత్రి పొలం దగ్గర పొడుకునేప్పుడు? టార్చి లైట్ మర్చిపోవద్దని చెప్పు, నువ్వు మర్చిపోకుండా ప్రతి రోజు వెళ్ళేప్పుడు చూడు చేతి లో వుందో లేదో లైట్.

ఇక్కడ చాలా చలి గా వుంది. ఇంకా స్నో పడ లేదు కాని చలి మాత్రం విపరీతం గా వుంది. ఇక్కడ వాళ్ళ సంక్రాంతి నవంబర్ లో నే వస్తుంది. రెండు వారాల కితమే ఐపోయింది సంక్రాంతి ఇక్కడ. అరిసెలు, పొంగల్ తినలేదు కాని వీళ్ళు వండుకునే గిన్నెకోడి, మొక్కజొన్న పొత్తులు తిన్నాను. మా ప్రొఫెసర్ పిలిచింది అని చెప్పేను కదా భోజనానికి. ఈ రోజు పని ఐపోయింది ఇప్పుడే రూం కు వచ్చి తిని కూర్చున్నా నీకు వుత్తరం రాసి హోం వర్క్ చేసుకుందామని. నాకు తెలుసు నువ్వు నవ్వుతావు పెద్ద అయ్యాక కూడా ఇంకా హోంవర్క్ ఏమిటి బావా అని.

పద్దూ I miss you so much raa ఒక్కడినే కూర్చుని నీకు వుత్తరం వ్రాస్తుంటే నా మనసంతా నీ కాలి గజ్జెల సవ్వడిలో లీనమయ్యి నీవు సిగ్గు పడుతూ వాల్చిన నీ కనురెప్పల నీడలలో కలిసి ఏకమయినట్లుంది రా. అలాంటి నన్ను..... నా మీద అంత అపవాదు వేస్తావా? నిను వలచిన మనసుతో ఇంకొక ఆలోచన రాగలదనే వూహే నాకు అయిష్టం గా వుంది. తాత కు చెప్పు అమ్మాయి అంటే పడకింటి భోగ వస్తువు గా చూసి గుటకలు వేసే వాళ్ళ తరం నుంచి, స్త్రీ ని తోటి మనిషి గా మనసున్న ఒక అపురూప సంపద గా భావించే తరం వచ్చిందని. నువ్వు మన పెరడు లో వుసిరి చెట్టు పక్కన కూర్చుని రాసిన ఈ కాగితం ఎన్ని సుగంధాలను తోడు తెచ్చిందనుకున్నావు? నువ్వు చెప్పినవే కాదు... చెప్పని చెప్పలేని వూసుల మాలలను పెనవేసుకుని కాగితానికి అలముకున్నట్లున్నాయి సుగంధాలు.

హేమంత కాలాన ముకుళించుకున్న పద్మాలున్న కొలను లో విరిసిన పద్మపు శోభ చూడటానికై ముసిరిన భ్రమరాల మధ్య కోనేట మునిగి హైమవతి తప్పసు చేసిందట శివుడి కోసం. హేమంతాన మన వూరి చెరువు మీద పొగ మంచు పేర్చిన మబ్బు తెరలను, ఆ తెరల మధ్య సూరీడు కోసం వెతుకుతూ బిక్క మొఖం పెట్టిన పద్మాల పక్కన వయ్యారాల వొంపుతూ బిందె నింపే పద్మమొకటి కన్నుల ముందు మెదిలింది.

మంచి ఆలోచన పద్దు స్వేచ్చ కు కట్టివేయబడటానికి తేడా మన లక్ష్మి కు తెలుసా అని అడిగేవు. ప్రశ్న కు ప్రశ్న సమాధానం కాదు కాని చాలా మంది మనుష్యులకు తెలుసా? స్వేచ్చకు కట్టివేయబడటానికి మధ్య తేడా......ముఖ్యం గా ఆడవాళ్ళకు. తర తరాలు గా రక రకాలు గా కట్టివేయబడుతున్న స్త్రీ కు కట్టించుకున్న తాడు రంగు, నాణ్యత తో చూసి మురవటం చూస్తుంటే మరి నాకైతే ఆ తేడా తెలియదనే అనిపిస్తుంది. మనకే తెలియనప్పుడు ఇంక ఆవుకేమి తెలుస్తుంది చెప్పు. సమాజం లో తాడు పెద్ద ది గా చేసి ఒక గాడి లో తిప్పుతుంటే తిరిగే అందరికి అసలు తాడే లేని ఆ స్వేచ్చ ను అనుభవిస్తే కాని అంతకు ముందు చేసిన దాస్యపు నీచత్వం అర్ధం కాదు. కాని తాడు వదిలే దెవ్వరు, వదిలినా అర్ధం చేసుకునే మనః శరీరాలతో ఈ సమాజం మనగలదా వికృత రూపాలు ధరించకుండా.. హ్మ్.. ప్రశ్నలను దద్దోజనం తో కలిపి ధనుర్మాసపు నైవేద్యం గా రాముడికి పెట్టి కృష్ణయ్య గుండె లో కొలువైన దేవేరి తలపులను సమీక్షించుకుంటూ ఈ రోజుకు శెలవా మరి..

ఎప్పటికి నీ వాడు.