17, డిసెంబర్ 2009, గురువారం

ఒంటరి గూడు.

డిసెంబర్ నెల కౌముది లో నా లేఖ


ఒంటరి గూడుప్రియమైన రాధి,
ఇంకా నువ్వు నాకు ప్రియమైన దానివే నీకు నేను కాక పోయినా.... అచేతనమైన మనః శరీరాలతో జీవితం పునఃసమీక్షించు కోవటం వలనేమో తప్పొప్పుల మాట అటుంచి అసలు ఈ చిందర వందర ఎక్కడ నుంచి మొదలయ్యిందో కూడా అర్ధం కావటం లేదు. జీవితం లో ఇంత దూరం వచ్చాక జీవితపు మొదలు ను పరిచయం చేసుకోవలసిన అవసరం రావటం నా వరకు దురదృష్టమనే అనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావో కాని.

ప్రతి ప్రశ్న కు సమాధానం వుంటుందని ఎవరన్నారో కాని వాళ్ళకు వెళ్ళి చెప్పాలని వుంది, జీవితమే ఒక అంతు దొరకని ప్రశ్న రా ఇంక చిన్న ప్రశ్న లకు సమాధానం దొరుకుతుందా అని. నువ్వు నేను కలిసిన ప్రతి సారి ఒక వాగ్యుద్ధం మొదలైతే అది మన ఇద్దరి తెలివి తేటలకు ఒక చిహ్నమనుకున్నా, కాని అది పగిలే గుండెల దూరానికి పడే బీటు అనుకోలేదు. అవును మన పరిచయమే ఒక ఆర్గ్యుమెంట్ తో మొదలయ్యింది కదా. గుర్తు వుందా.. మొదటి సారి అంతరాష్ట్రీయ డిబేట్ టీం లో 'కుటుంబం అది పొందుతున్న సామాజిక మార్పులు అది గురి అవుతున్న మిథ్ లు' అనే విషయం మీద మన చర్చ. ఇద్దరం పూర్తి గా రెండు విభిన్న దృక్పధాలతో నాణేనికి రెండు పక్కలా చూపించటానికి ప్రయత్నించాము అని జడ్జ్ మనలను మెచ్చుకున్నాడు, కాని వాదన లో వున్న బలం మూలం గా నాకే మొదటి బహుమతి అని ప్రకటించినప్పుడు ఎర్ర బడిన నీ మొహం ఇప్పటికి నిన్నే జరిగినంత ఫ్రెష్ గా నా మది లో వుంది. ఇప్పుడు అనిపిస్తుంది అప్పటి నుంచి మన పరిచయం పెరిగిన ప్రతి మలుపు లో గెలుపు, ఓటములలో ప్రతి విషయాన్ని నువ్వు చాలా సీరియస్ గా తీసుకున్నావు అని.

కలిసి పెరిగిన అనుభందాల విలువలను.. అభిప్రాయాల తేడా లతో, అపార్ధాల నీడల .... తోసి రాజనుకోవటం నువ్వెందుకు చేసేవు అని నేను ప్రశ్నించను కాని ఏమైనా కారణం వుందా అని మాత్రం అడగాలి అనుకుంటున్నా. మనం 21 వ శతాబ్ధం లో వున్నాము ఇంకా ఆటవిక యుగం లో లేము కదా ప్రతి సమస్య ను చర్చల తో పరిష్కరించుకోవచ్చు అనే నువ్వే పెద్ద గా చర్చ అనేది లేకుండా జీవితం నుంచి బయటకు నడిచి నన్ను పిల్లలను కూడా ఎందుకంత చీకటి తెర ల వెనుక తోసేసేవు? కిందటి సారి కలిసినప్పుడు దాచి, దివ్వు ఇద్దరు నాతో సరి గా మాట్లాడ లేదు నాతో ఎక్కువ సేపు కలిసి వుండటానికి కూడా ఇష్ట పడ లేదు అది నాకు ఎంత క్షోభ గా వుంటుందో నీకు బాగా తెలుసు, తెలిసే వాళ్ళను అలా తయారు చేసేవు కదు. రాధి ఎందుకు నీకు ప్రతి విషయం లో ఇంత మొండి తనం.. 'నేను అనుకున్నదే జరగాలని' పంతం. తప్పు మానవ సహజం కాదా..... తప్పని తప్పు ఒప్పుకున్నాక కూడా జరిగిన వాటినే పదే పదే అనుకుని నాకు ఇంత గా శిక్ష విధించటం ఏమో మరి నీకు న్యాయమనిపిస్తుందా..

ఆలోచించు నువ్వేమి చిన్నపిల్లవు కాదు, నీ ఒక్క దాని అభిప్రాయం తో.... నీ ఒక్క దాని జీవిత విలువలతో (నువ్వు అనుకునే జీవిత విలువలు వాటిని నాకు ఆపాదించకు) మొత్తం కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసేవు.. రాధి ఈ రోజు కు నువ్వు ఇంటి నుంచి వెళ్ళి సవత్సరం అయ్యింది కాని నాకు మాత్రం గాయం ఇంకా పచ్చి పుండు లా కెలుకుతూనే వుంది.. ప్రతి క్షణం నువ్వు లేని లోటు నా జీవితాన కనిపిస్తూ నన్ను నా అంతట నేను స్వశక్తి తో ఆలో చించనియ్యకుండా నిర్వీర్యుడను చేస్తోంది. ఇంక ఇంత కంటే ఏమని చెప్పాలో కూడా అర్ధం కావటం లేదు..

ఒక స్థాయి కి వచ్చాక జీవితం మనదే కాదు అందరిది అని చెప్పే నీవే ఆ జీవితాన్ని మా అందరి దగ్గర నుంచి తీసేసుకుని నీ చేతి లో పెట్టుకుని ఆడిస్తున్నావు రా రాధి. నీకు తెలుసు ఆ విషయం. నీకు న్యాయమా నన్ను నా తల్లి తండ్రులతో మాట్లాడ వద్దు అనటం. వాళ్ళు నా తల్లి తండ్రులు. నా వలన కాదు రా అలా వాళ్ళను నిస్సహాయులను చేయటం. ఏమో రా రాధి ఆలోచించు వృత్తి రీత్య, ప్రవృత్తి రీత్యా కూడా ఆలోచించటం, పరిష్కారాలు వెతకటం నీకు అలవాటే కదా.. ఆలోచించు పరిష్కారం దొరుకుతుందేమో ఈ సమస్య కూ.

ఎక్కువ మాట్లాడే కొద్ది నేను బ్యాలెన్స్ ను కోల్పోతానేమో అని ఇక్కడి తో ఆపేస్తున్నా నా మనసు నీకు పంపే వినతి పత్రం మాత్రం నిరంతర సాగే స్రవంతి అని తెలుసు కదా..

ప్రేమ తో
ఎప్పటికి నీ
కృష్ణ.కృష్ణా,

మీరు చెప్పిన ప్రతి మాట మీరు రాసినంత సూటి గాను అర్ధం అయ్యింది, ప్రతిపదార్ధాలతోనూ, టీకా తాత్పర్యాలతోనూ అర్ధం అయ్యింది. ఎంతైనా కలిసి సాగిన 12 ఏళ్ళ పరిచయం కదా. ప్రతి వాక్యానికి సమాధానం రాయాలనే వుంది కాని దాని వలన ఏమైనా వుపయోగం వుంటుందా అనే ఆలోచిస్తూ దాదాపు గా రెండు నెలలు చేసేను మీకు సమాధానం ఇవ్వటానికి. ప్రతి దానికి జీవితం లో లేటే గా నేను (మీరనే మాటే నాది కాదు). హ్మ్... విభిన్న దృక్పధాల విచిత్ర కలయిక మన పరిచయమైతే, ఆ విభిన్నత లోని మూలమే మనలను విడతీసిన కారణమని నేను అనుకుంటున్నా. "ప్రతి కలయిక విడిపోవటానికి నాంది" అని మీరు షాయరీ లు చెపుతూ అనే వారు గుర్తు వుందా.. అది గుర్తు వచ్చింది నాకు మీ వుత్తరం చదివేక.

హ్మ్.. పదాలను నేర్పు గా కూర్చే కళ మీకు స్వతహా గా దేవుడిచ్చిన వరం. అది పట్టుబట్టి నేర్చుకుని జీవనాధారం చేసుకున్న కధనం నాది. చూడండి ఇక్కడ కూడా నాణేనికి రెండు ప్రతిమలమే. అవును ప్రతి సమస్య ను చర్చలతోనో, మనం వున్న స్థాయి కంటే వేరే గా స్పందించి, ఆ కోణం లో పరిచయం చేసుకోవటం మూలం గానో పరిష్కరించవచ్చు అనుకునే దానిని నేను, కాని కొన్ని కొన్ని సమస్య లకు మౌనమే పరిష్కారమనిపించి మాట్లాడ కుండా వున్నాను.

ఏమని మాట్లాడమంటారు.. అభిప్రాయాల తేడా కాదు, అపార్ధాల నీడ అసలే కాదు మనలను విడ తీసినది జీవన విధానాల లోని.. నమ్మకాలలోని వైరుధ్యం కృష్ణా. మన జీవనం లో ప్రతి క్షణం వాటి మూలం గా కలిగిన ఘర్షణే ఈ మార్పు కు కారణం కాదంటారా. సహ జీవనానికి పునాదైన ప్రేమ నమ్మకం మన మధ్య న సడలి పోయాయి.. అది ప్రేమ కు పరాకాష్ట అని మీరనుకోవచ్చు. అనుకోవచ్చు ఏమి వుంది అన్నారు కూడా కదా... మీ వుత్తరం లో దానిని అడుగడుగునా ప్రదర్శించారు కూడా, కేవలం వాదన ల లోని అభిప్రాయ బేధమే గుండె గోడ లు బీట వారటానికి కారణమా? అది కూడా ప్రతి సారి ఆ వాదన ను 'నేను సీరియస్ గా తీసుకోవటం వలన' అని మీ అభియోగం. ఆపైన ఎందుకు చేసేవు అని నన్ను ప్రశ్నిస్తున్నారు.

మన మొదటి పరిచయం లోని టాపిక్ మీకు బాగా గుర్తు వుందే.. అవును కుటుంబం అనే మిథ్ మనం విడి పోవటానికి కారణం. కుటుంబం లో వుండవలసినవి అని మీరనుకున్న, మీరు వుంచిన...... పొరల మందం ఎక్కువ అయ్యి కలపవలసిన ప్రేమ, అనుభందం పల్చనైపోయినట్లుంది. తప్పు ను తప్పు అని ఒప్పుకోవటం మూలం గా ఒప్పు ఐపోదు కృష్ణా.. ఆ దిశ గా సాగే నడక ముఖ్యం. నడిచేరా మీరు ఆ దిశ గా ???? ప్రయత్నించారా? ?????ప్రేమ వివాహాలలో కూడ వివాహేతర సంబంధాలు వుంటాయి అంటే నేను నమ్మే దానిని కాదు, కాని అది నిజమై నా ముందు నిలబడి వెక్కిరించిన రోజు నా క్షోభ మీరు అర్ధం చేసుకున్నారా?

ఈ క్షణాన ఒంటరి తనం తో నిర్వీర్యుడైన నా జీవన సహచరుడా ఈ ఒంటరి తనం తో నేను నడిచిన క్షణాలన్ని యుగాలై ఇంకా నా వెనుక నీడ లానే వున్నాయి. ' తప్పే' అని ఒక్క మాట అంటే సరి పోయిందా. ఏమన్నారు నేను అడిగిన రోజు 'పదే పదే తప్పు చేసి ఒప్పంటున్నారు' అన్నప్పుడు...... నేను మొగవాడిని బయటకు వెళ్ళినప్పుడు వుండే అనేకానేక ఒత్తిడుల మధ్య న జరిగే ప్రతి విషయాన్ని, కేవలం మన మధ్య వుండే కాపురం ప్రేమ ల మధ్య కు కలిపి ముడి పెట్టకు అన్నారు. సున్నితమైన మనసు వుండటమే కాదు కృష్ణా అవతలి వాళ్ళకు కూడా అది వుంటుందని గుర్తించటం కూడా అవసరమే కాదు అంటారా.

మీ నాన్న గారి లానే మీరు ఆలోచిస్తున్నారు కాని ఆయన కంటే విధ్యాధికులు కదా, ఆ అధికత మీ తప్పు ను అందం గా కప్పి పుచ్చుకుంటానికి దానిని సమర్ధించుకోవటానికి మాత్రమే వుపయోగ పడింది. కాని బేసిక్ ఇన్స్టింక్ట్స్, ఆ పైన నన్ను అవమానించటానికి మీ నాన్న గారి తో కలిసి మీరు పెరిగిన వాతావరణమే ముందుకు వచ్చింది. అందుకే ఆ వాతావరణం పిల్లలకు వద్దని బయటకు వచ్చాను. అనుక్షణం తల్లి తెలివి తేటలు ప్రశ్నించ బడుతు, వెక్కిరించబడుతూ అంతలోనే ఆ కుటుంబం అనే మిథ్ తో ప్రేమించబడుతూ సాగే ఆ ద్వంద ప్రమాణాల జీవన విధానం వద్దు కనీసం ఆ లూప్ లో నుంచి పిల్లలనైనా బయటకు రాని కృష్ణా. నేను 12 సవత్సరాలు ప్రయత్నించాక అర్ధం ఐంది అందులోనే వుంటూ ఆ ద్వందత ను ఎదిరించటం కష్టం అని.

కలిసి సాగే సహ జీవనం లో ప్రేమ అనేది ఒక మిథ్ లా కాకుండ ఒకరికొకరు అనే మాట కు ఒకే అర్ధం తో, ఒకే ప్రమాణం తో, ఇల్లంటే మొగ వాడు అలసి ఇంటికి రాగానే అతని అలసట తీర్చి అన్ని అందించే ప్రేమ గోపురం ఆ ప్రేమ అందించే భార్య మూల స్థభం మే కాక, అలసి గూడు చేరిన గువ్వలు రెండిటిని కలిపే ఒక ప్రేమ గోపురమై, ఒకరికొకరు మానసిక ఆలంబన ఇవ్వగల గూడవ్వాలని అటు వంటి భావి తరాన్ని తయారు చేయాలనే ఈ క్షణపు నా ఒంటరి గూడు ను నా చేతులతో నిర్మించుకుంటున్నా.. దాని అర్ధం, విలువ మీకు తెలిస్తే ఎప్పుడైనా తలుపు తట్ట వచ్చు.

రాధిక.

23, నవంబర్ 2009, సోమవారం

నీదైన నా స్వగతం నీకోసం....

నిన్ను నువ్వు కోల్పోయి నాలో మిగిలే ప్రతి చీకటి రాతిరి, మన ఇద్దరి మధ్యా దగ్గరి తనాన్ని మన వూపిరే నిర్ణయించే కొలమానమవ్వనీ నా సఖి... నా వునికే నీ వూపిరైనప్పుడు ఇంక కొలిచేందుకేముంది, ఇద్దరం ఒకటే అనే వేద మంత్రాన్ని మన గుండెల్ని అనంతం గా పఠించనివ్వటం తప్ప అంటావు నువ్వు ఇప్పుడు..... నాకు తెలుసు ..

తెలిసినదే అయినా...... తెలియ వలసిన రాగాల కోసం సాగే ప్రయాణం లో నా తోడెప్పుడూ వుంటానని బాస చేసి కూడా, భాద్యతల హోరు గాలికి కలవలేనంతగా కొట్టుకుపోయామని తెలిసీ.... కలలో నా రూపు ను వెతికే నా ముద్దుల సత్యభామ చేసిన విన్నపమందిదని చెప్పనా, చెప్ప లేక గుండెల లో ఆగిన వంశధార హోరు ను ఒంటరి పాంధుడనై దాటుతున్న నీ కృష్ణుడు అశక్తుడైనాడు నిన్ను కలవలేక అని మారు సందేశమంపించనా.. ఏమి చేసి నీ వేదన తగ్గించగలనో నాకు తెలియదు రా బంగారం..

నీ ముందు బయట పడి, బేల తనమన్నది మీకాపాదింపబడిన అపవాదు మాత్రమే.... కోరిన మనసు కనుమరుగవుతున్నప్పుడు అది అందరికి వర్తించే ఒక జీవన లక్షణమని చెప్పాలనిపించక వూరుకున్నాను కాని నువ్వు వెళ్ళిన మరుక్షణం నుంచి నాకూ అలానే వుంది రా అమ్ము... అమ్మాయివి, అందునా అబల అన్న పేరు వరం గా పొందినవాళ్ళు కాబట్టి నీ బాధ లోకమొప్పిన వేదన రా, నాది అలా కాదు కదా.. నీకు తెలియదు పైచేయి కూడా ఒక విధం గా శాపమే .. సారీ రా బాధ పెడితే..

మరి నేనేమి చెయ్యను ఎలానో నువ్వు లేవన్న బాధ ను తోసేసుకుని, ఈ పిల్లలకు చేయించ వలసిన ప్రాజెక్ట్ లలో మునిగి వుండగా మనసు మీద విసిరేసిన నిప్పు కణికల్లే నీ వుత్తరం వస్తుంది.. నన్ను పరధ్యానపు పలవరింతలలో ముంచి లేపటానికి.. నిన్న నీ వుత్తరం వచ్చిన దగ్గర నుంచి... శ్రీ ప్రాజెక్ట్ ఫణి కి ఇచ్చాను. ఆమె వర్క్ అంతా సీడీ లో పెట్టి రాఘవ కు పంపించాను అట. రాత్రి ఆఫీస్ క్లోజ్ చేస్తుంటె రాఘవ పరుగెత్తుకుని వచ్చాడు నేను కాదు కదా సార్ 'జీపీస్ లొకేషన్ ఫైండర్' చేసేది నేను 'పోర్టల్' కదా అని. ఇంక అప్పటికి ఓపిక లేక రాత్రికి పంపిస్తాను లే అని చెప్పి ఇంటికి వచ్చేసేను.. ఇంటికి వెళ్ళే సరికి నాన్న గారి వుత్తరం వచ్చి వుంది అమ్మ కు బాలేదు రత్న వాళ్ళ అబ్బాయి కి హార్ట్ ప్రాబ్లం అని చెప్పిన దగ్గర నుంచి ఈమె బెంగ పెట్టుకుని ఏడుస్తోంది అట. ఈ ప్రపంచం లో తల్లి కు మించిన అనుభందం, ప్రేమ ఇంకెక్కడా వుండదు కాని పాపం అమ్మ ను చూస్తుంటే ఆమె కు తిరిగి మేమందరం ఇవ్వగల బహుమానమేదైనా వుంటే దుఃఖం ఒక్కటే కదా అనిపించి అసలు ఈమె ఎందుకు ఇంత అనుభందాలు పెంచుకోవటం అని విసుగనిపిస్తోంది..అలా కోపం గా చూడకు మరి. అసహాయత, పరిష్కారం లేని సమస్యలు ఇలా అంగీకారం కాని భావాలను రప్పిస్తాయి.

అవును రా చిన్న నిన్ను ఆరకిల్ సర్టిఫికేషన్ పూర్తి చెయ్యమన్నాను ఇంకా మొదలు పెట్టలేదా? మనసు మీదకు మూగే ఆలోచనలను మళ్ళించుకోగల ఏకైక మార్గం సాహిత్యం అంటావు నువ్వు, దానిలో నిన్ను నువ్వు మర్చి పోయి ఒక విశాలమైన ప్రపంచం లో నీకైన ఒక ప్రత్యేకమైన పాస్ పోర్ట్ తో తిరగొచ్చు అంటావు. నిజమే కాని ఒక్కోసారి నాకైతే వున్న సొంత తల నొప్పులు తో పాటు ఇంకా ఎవరివో కూడా నెత్తికెత్తుకుని ఆలోచించే బదులు, నీ మనసు కు సంభందం లేకుండా నీ శక్తి ని మొత్తం కేంద్రీకరించి బుర్ర ను తీసేసుకోగల చదువు హాయి గా వుంటుంది.. ఏమిటో ఈ మనసు, బుర్ర ల మధ్య న గోల.

మొన్న రాత్రి పవర్ కట్ రోజు ఏమి తోచక డాబా మీద కు వెళ్ళి మనం ఎప్పుడూ కూర్చునే చోటు లో దుప్పటి పరచుకుని పొడుకుని ఆకాశం లోకి చూస్తూ.... పక్క నుంచి తేలి వస్తున్న విరజాజుల వాసన నీ తల నుంచి, దూరం గా వసుంధర గారి దొడ్లో నుంచి పాకుతున్న రాధా మనోహరాల సువాసన నీ ఒంటి పరిమళమని భ్రమించి అలవాటు గా నువ్వు మాట్లాడుతున్నావనుకుని 'ఈ సారి తప్పకుండా కొంటాను రా నీకు అచ్చం గా నీలాకాశానికి తణుకులద్దినట్లుండే చీర' అనేసేను. డాబా మీదే వున్న వాసు ఏమిటి సార్ కలవరిస్తున్నారు అని అనేంత వరకు నువ్వు పక్కన ఆ కొబ్బరాకుల నీడ లో ' నా అభిరుచి నీకెప్పుడు అర్ధం కాదని ' అలిగి వెన్నెల ను కొబ్బరాకుల నీడలతో కదుపుతూ కొత్త డిజైన్ లు చేస్తూ వున్నావనుకున్నా.. నా భ్రమ కు నాకే నవ్వు వచ్చింది. చూడు దగ్గరున్నంత వరకు అలా అనుక్షణం నా మీద అలిగి నీ వునికి ని వెలుగు చీకట్లతో వెన్నెల సంతకాలు చేసి ఇచ్చావు ఇప్పుడేమో అవి అన్నీ నిన్ను నాకు తిరిగి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాయి.. అలకలో, కోపం లో అదిరే నా నల్ల పిల్ల ముక్కు కొనల మీద ఆన ఇంకో సారి అలా చెయ్యను వచ్చెయ్యరా ప్లీజ్...

16, నవంబర్ 2009, సోమవారం

అక్కా అంతేనంటావా ... !!!!

నవంబర్ నెల కౌముది లో నా లేఖ

అక్కా అంతే నంటావా.....!!!!! 


అక్కా,

ఎట్లా వున్నావు? నేను నా పతి... పుత్ర, పుత్రికా రత్నాల తో సహా నిక్షేపం గా వున్నాము.. నిక్షేపం గా అంటే గుర్తు వచ్చిందే మొన్న నాయనమ్మ నిక్షేపం లాంటి నా జాజి కాయ పెట్టె కనపడలేదు అని గోల గోల పెట్టింది అని చెప్పేను కదా... నాయనమ్మ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నాన్న అది పెద నాన్న గారింటికి పంపించేసేరు అంట.. ఎందుకలా గా నాన్న అంటే రోజు దాని గురించి మీ అమ్మ కు నాయనమ్మకు గోలే.. ఆమె కా ఆ పెట్టె ఎత్తే ఓపిక లేదు ప్రతి అరగంట కు ఒక సారి అమ్మ ను రమ్మని రాత్రి తోడు పెట్టిన పాల గిన్నె ఇంకా తీసి నట్లు లేవు తియ్యవే అనో, మొన్న మధ్యాన్నం రెడ్డి గారింటి నుంచి వచ్చిన వులవల మూట అందులోనే పెట్టేనే తీస్తావా దాలి పొయ్య పొద్దుట నుంచి వూరికే వుంది అని ఏదో ఒకటి గొడవ చేస్తోంది అట. పూర్తి గా ఆ మతిమరుపు ఎక్కువ ఐపోయింది..

ఏనాటి అబ్బరాం, జరుగులు మొన్నీ మధ్య న వాళ్ళు పొలం నుంచి వచ్చే టైం అయ్యింది నువ్వు ఇంకా అన్నం వండలేదు అని గోల అంట. మనకు వినటానికి నవ్వు గానే వుంది కాని పాపం అమ్మ కు కష్టం గానె వుంటోంది అనుకుంటా. ఒక పక్క నాన్న చాదస్తం అది చాలదన్నట్లు ఇప్పుడు ఈ నాయనమ్మ తో కూడా. కాని అమ్మకెంత ప్రేమే నాయనమ్మ అంటే..!! నాకు ఆశ్చర్యం గా వుంటుంది.

నాకు మా అత్త ను చూస్తేనే చిర్రు మంటూ వుంటుంది లోన ఆమె మాట్లాడే వెటకారం మాటలకు. మొన్న ఎంత నీలిగిందని ఇంటికి రాగానే కొడుకు తనంతట తనే కాఫీ పెట్టుకున్నాడంట 'ఎంత కష్ట పడుతున్నాడో చంటి' అని, అక్కడికి నేనేదో తిని అరగక తిరుగుతున్నట్లు.. నాకు మాత్రం ఎంత కష్టం గా వుందే ఈ ప్రయాణం చేసే వుద్యో గం చెయ్యాలంటే.. అక్కడికి రవి ఏదో సాయం చెయ్యబట్టి లాక్కొస్తున్నా కాని. దానికి తోడు వచ్చినప్పుడంతా ఈమె సూటి పోటి మాటలు.. మేము మాత్రం చెయ్యలేదా వుద్యోగాలు అంటు. ఏమి చేసిందే ఆ పనికి రాని టీచరుద్యోగం.. ఒక్కనాడన్నా ఎలెక్షన్ పనులకు కూడా వెళ్ళకుండా వాళ్ళ ఆయన పదవి ని అడ్డం పెట్టుకుని ఒక్క సారి కూడా పల్లెటూళ్ళకు బదిలీ లు లేకుండా ఆ గుడివాడ లో పడి హాయి గా బతికేసి వృద్ధ నారి అన్నట్లు చెపుతుంది..

సరే ఈ సోది కు ఏమి వచ్చే కాని బాబి గాడు బాగున్నాడా.. మొన్న వచ్చినప్పుడు వాడి వచ్చి రాని తెలుగు లో ఎంత ముద్దు గా మాట్లాడేడో. ఇంకా నువ్వు తెచ్చిన అన్ కట్ పగడాల దండ చేయించుకోలేదు. పైన అపార్ట్మెంట్ పార్వతి గారు ఏమి చేయించుకోక పోయినా అలా కొక్కెం పెట్టి వేసుకోవచ్చు మూడు వరసలు గా, తరువాత నెమ్మది గా లాకెట్,దిద్దులు చేయించుకోవచ్చు అంటుంది. ఏమంటావు.. మొన్నీ మధ్యన పరమేశ్వర రావు గారు తీసుకోమన్నారని రవి వద్దు అంటున్నా వినకుండా ఈడ్పుగల్లు దగ్గర ఆ దగ్గుబాటి వాళ్ళు ప్లాట్ లు వేసి అమ్ముతున్నారు మంచి ధర కు ఇప్పిస్తాను అంటే ఒకటి బ్లాక్ చేయమని చెప్పేను తీసుకోకూడదు.. పెద్ద దాని పేరు మీద వుంటుంది కదా.

వచ్చే వయసే కాని తగ్గేది కాదు కదా ఏమిటో నాకు అప్పుడే ఈ మధ్యన కళ్ళు తిరుగుతున్నాయి అని, రవి గోల చేసి డాక్టర్ దగ్గరకు తీసుకెళితే ఆయన బీపీ బోర్డర్ లో వుంది సరిగా తిని ఎక్సర్సైజ్ చెయ్యక పోతే మందులేసుకోవాలి అన్నారు. రవి పెద్ది కి కూడా ఫోన్ చేసి గోల గోల చూడు నీ స్నేహితురాలు ఎలా చెస్తోందో అని.

అవునూ బావ గారి వాళ్ళ బాబాయి గారు వాళ్ళు అదే వినాయక్ ధియేటర్ దగ్గర వుంటారు చూడు వాళ్ళ చిన్నల్లుడు చని పోయాడు అంటగా.. నాకు చెప్పనే లేదే మే , నిన్న దినం కార్డ్ వచ్చింది.. సాయింత్రం రమత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పేరు. పాపం ఏమిటో.. చిన్న వయసు లోనే. అందరు బాగున్నారు ఇంకా రెండు బస్ లు కూడా కొన్నారు కేశినేని ట్రావెల్స్ వాళ్ళవి అని కిందటి సవత్సరమే అనుకున్నాము.

ఏమిటోనే చిన్నప్పటినుంచి నేనేమో ఈ బడా బడా వాగే గుణం, నువ్వేమో మాట పెదవి దాటనివ్వని తత్వం మార్చుకోలేక పోయాము. ఏమి చేస్తాము ఈ జన్మ కు ఇంతే.. వీలు చూసుకుని అన్ని వివరాలతో వుత్తరం రాయి. మాట మాట కు ఫోన్ చెయ్యక. మొన్న వచ్చినప్పుడు బావ గారు కూడా అంటున్నారు మీ అక్క ఫోన్ ల మీద పెట్టిన డబ్బు లతో నెలసరి వాయిదాలు కట్టుకున్నా విజయవాడ లో సగం మాది ఐపోయేది అని. శ్లేష గా అన్నారేమో నాకు తెలియదు కాని నిజమే కదా..... వూరికే అమ్మ కు, నాకు, మావయ్యలకు, పెద నాన్న గార్లకు ఇంకా ఎందెరెందరికి చేస్తావో అర్ధం పర్ధం లేకుండా.. వుంటాను మరి.. బావ గారిని అడిగేను అని చెప్పు.

ప్రేమతో
నీ చెల్లి,
చిన్ని.చిన్నా,

నువ్వేమి మారలేదే వచ్చినప్పుడే చెపుదామనుకున్నాను. ఈ వుత్తరం చూస్తుంటె మళ్ళీ మనం ఇంటి బయట అరుగు మీద కూర్చుని వాదులాడుకుంటున్నట్లు వుందే. గుడ్లవల్లేరు లాకులెత్తేసినట్లు నీ ధోరణే నీది కాని ఎదుటి వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వవు కదా.. నీ చిన్ని వుత్తరం లో చాలానే విషయాలు కలయ తిప్పేసేవు.. చిన్నప్పటినుంచి నీ ప్రత్యేకతే అది.. నీ బలహీనత కూడ అదేనే చిన్ని. దేని మీద ఎక్కువ సేపు కుదురు లేదు సవ్య సాచి లా గా వయసులో వున్నప్పుడు పరుగులు తీయటం బానే వుంటుందేమో కాని ఎప్పుడూ అంటే కొంచం తగ్గించుకోవాలేమో..

నీకు ఎందుకు ఆశ్చర్యం గా వుందే అమ్మ, నాయనమ్మ అనుభందం చూస్తే...!! అమ్మ చెప్పిందా నాయనమ్మ తో కష్టం గా వుందని? నేను నమ్మను నాన్న కు అంతా కంగారే అందుకే పంపించి వుంటారు ఆ భోషాణం పెట్టెను. నాయనమ్మ చిన్నప్పుడు అందులో పటికి బెల్లం ముక్కలు దాచి సాయింత్రం బడి నుంచి ఇంటికి రాగానే ఆ రోజు ప్రసాదం తీసి పెట్టేది గుర్తు వుందా?

ఆమె కు ఎంత అనుభందం ఆ పెట్టె తో, దాలి పొయ్యతో. నిజమే మన చిన్నప్పుడు ఎప్పుడైనా ఆ దాలి పొయ్య నుంచి పొగ రాకుండా గుర్తు వుందా? నాకు మన ఇల్లు అంటేనే ఆ చుట్టింటి పక్క నుంచి గాలితో పాటు గడ్డి కాలుతున్న వాసనతో తేలి వచ్చే దాలి పొయ్య పొగ కూడా మెదల కుండా వుంటుందా కళ్ల ముందు..

మీ బావ గారు 'అబ్బ స్వగృహా లో వులవ చారు ఎలా ఐనా ఆ రుచే వేరు' అంటే నేను మా వూళ్ళో పొంత పెట్టి రోజంతా వులవలు, గుగ్గిళ్ళు వుడక పెట్టి దానిలోని సారమంతా మా బర్రెల కు కుడితి కలిపేక, మిగిలిన తుక్కు లో నీళ్ళు పోసి తీసిన చారు కూడా అంత కంటే బాగానే వుంటుంది అంటె తెగ వుడుక్కున్నారు అనుకో ..

సాయింత్రమవ్వ గానే గుడిలో నుంచి వచ్చే పాట "ఆజాను బాహుడమ్మ.... అరవింద నేత్రుడమ్మా.... కోదండ రాముడమ్మా.. సీతమ్మ వలచిన, గోపన్న కొలిచిన, భద్రుని బ్రోచిన శ్రీరాముడు... శంఖ చక్ర ధారుడు. అది గో గౌతమి ఇదుగో భద్రాద్రి" అనే పాటను వింటూ.. అప్పుడే జరుగులు పితికిన పాల నురగతో అమ్మ చేసి ఇచ్చిన కాఫీ తాగుతూ, స్టూల్ వేసుకుని ఎగిరెగిరి కోసుకున్న సన్నజాజుల పూల ను మాల కట్టుకుంటున్నప్పటి ప్రశాంతత ఇప్పుడు నువ్వు వెళ్ళే ఎన్ని రిసార్ట్ లలో వస్తుందే...

మనకే అలా వుంటే మరి పూర్తి జీవితమంతా వాటితో గడిపిన నాయనమ్మ కు ఎలా వుంటుందో వూహించుకో.. మర్చిపోయావా... అమ్మ కు మేకు గుచ్చుకుని వాతం కమ్మితే, నాయనమ్మ ఎంత హడావుడి చేసిందో, ఎంత మంది దేవుళ్ళకు మొక్కిందో. తగ్గేక ఒక రోజు అమ్మ కు తలకు పోసి దిష్టి తీసి అమ్మ కు సంధ్య వేళ సాంభ్రాణి వేస్తూ ఎంత హడావుడి చేసిందో నాయనమ్మ. ఇప్పటికి నా మనో ఫలకం మీద అది ఒక చెరగని ముద్ర. అమ్మ కూడా మర్చి పోయి వుంటుందని నేననుకోను. చిన్ని... ప్రేమానుభందాలు మనం పెంచుకుంటే పెరిగేవేనే... నువ్వు చిన్న దానివి అప్పుడు, ఏమి గుర్తు వుండి వుండదు..

మీ అత్త గారి కి కొంచం చాదస్తం అంతే నేను మొన్న వచ్చినప్పుడు ఎంత గొప్ప గానో చెప్పింది 'మా సుమా కు క్షణం కూడా తీరిక దొరకదమ్మా అమెరికా లో మీరైనా ఇంత కష్ట పడతారో లేదో ఒక్క క్షణం కూడా కూర్చోదు' అని ఎంతో ఆపేక్ష గా చెప్పింది.

అలా కాలం తో పాటు పరుగులు తీయకు రా చిన్ని. మీ బావ గారికి, నీకు ఈ పరుగులు తీసే గుణం ఎప్పటికి ఆగుతుందో.. ఏమి చేస్తారు రా ఇన్ని కొని, దాచి చెప్పండి. మొన్న కృష్ణ కూడా వాళ్ళ వూళ్ళో పొలం అమ్మి అది చేస్తా ఇది చేస్తా అని వురుకులు పెడుతుంటే చెప్పేను. రైతు బిడ్దలం మనం, ఆ భూమినే అమ్మేసి ఏమి చేస్తావు ఇంత సంపాదించుకుంటున్నాము మనం ఇప్పుడు..... ఆ కౌలు దారులు ఇచ్చేది శిస్తు కట్టటానికి వస్తే చాలదా ఆ భూమి ని వుంచితే నష్టం ఏమిటి అని. ఇళ్ళు స్తలాలు కొంటే మాత్రం పని వుండదా ఏమిటి.. వదిలెయ్యండి ఆ గోల.

ఆరోగ్యం జాగ్రత్త.. తొందర గా ఐపోతాయని ఆ వేపుడులు చేయక. నాయనమ్మ చేసేది వంకాయ రోటి పచ్చడి, చేసి ఆఖరి లో వుల్లిపాయ కలిపేది, అదీ.... నాయనమ్మ చేసినట్లు చామ దుంపల పులుసు మాత్రం కుదరటం లేదు రా చిన్ని నాకు. ఆమ్మ చేసే వుప్పూకారం పప్పు కూడ రావటం లేదు ఎట్లా ఐనా రాజయ్య తాత చేతి నుంచి వచ్చిన కందులు కావు కదా.. మీకు ఇంకా పంపుతున్నాడా రాజయ్య తాత కందులు, మినుములు. తాత పొలం బలే మంచి నేల కదా దుక్కి దున్నేడంటే రెండో పంట నుంచి కూడా పుట్లు రాలాల్సిందే కదా..

అవును మీ బావ గారి వాళ్ళ బావ గారు చని పోయారు పాపం. చాలా సార్లే మాట్లాడేరు కృష్ణ వాళ్ళ బాబాయి తో.. నేను కూడా మాట్లాడేను ఎవరు మాట్లాడినా ఏమి లాభం లే పోయిన వాళ్ళను తిరిగి తేలేము కదా.. పాపం పిల్లలను చూస్తేనే దిగులేస్తోంది.. తల్లి తండ్రులు లేని జీవితం ఎంత సుస్సంపన్న మైనా లోపమే కదా.

సరే మరి వుంటాను ఆరోగ్యం జాగ్రత్త. చింటూ, చాయమ్మ జాగ్రత్త.. కిందటి వారం నువ్వు లేవు, రవి తో పిల్లలతో చాలా సేపే మాట్లాడేను చెప్పే వుంటారు కదా. రవి ఏదో సిందాబాద్ రాజ కుమారుడి కధ చెపుతున్నాడంట ఆ కధ కూడా చెప్పేరు. చిన్నీ.... రవి బంగారు తండ్రే... అడిగేను అని చెప్పు మరి.
వుండనా
ప్రేమ తో నీ అక్క
సింధు.


5, నవంబర్ 2009, గురువారం

కల'వరించిన' క్షణం

కృష్ణా,నీ తలపులెందుకో మనసును గజిబిజి చేస్తున్నాయి. ఈ రోజు ఎందుకంత స్పృష్టం గా వచ్చావు కలలోకి.???? కల నుంచి లేచిన దగ్గర నుంచి నీ విరహమింకా ప్రకాశ వంతమై ఆ అగ్ని లో నన్ను దహించేస్తోంది. ఎవరు ఏమని ఐనా చెప్పని, నేనైతే అందరికి తప్పకుండా చెపుతాను.... కాలిస్తేనేమి, సఫలమయ్యి సుధలను కురిపించనేమి ఏది ఏమైనా ప్రతి ఒక్కరు ఒక్క సారి ఐనా జీవితం లో ప్రేమించాలి.అదేమిటి ఒక్క సారైనా... ఆ లెక్క ఏమిటి అంటావా?? అవును అందరం అంటుంటాము కదా నేను ప్రేమించాను కాని కుదరలేదు అనో, ప్రేమించాను కాని పెదవి దాటలేదు అనో, అది ప్రేమో ఆకర్షణో తెలియలేదు అప్పటికే కాలాతీతమయ్యింది అనో, లేదా ప్రేమించా పెళ్ళి చేసుకున్నా అనో చెపుతుంటాము కదా.. ఆ ప్రేమ లో తీవ్రమైన ఆకర్షణ అవతలి వ్యక్తి పట్ల భరించలేని మోహావేశం.... కాల్చాలి మనసు ను. ఎప్పుడు తలుచుకున్నా ఆ మోహావేశం అప్పుడే పుట్టిందా అన్నట్లు కాల్చి శుభ్రం చేయాలి మనసు మూల మూలలను. అప్పుడే ఆ ప్రేమ దేవతను నీ గుండె లో ప్రతిష్టించి పూజలు చేయ గలవు, మురికి మాలిన్యాలున్నచోట దైవ ప్రతిష్ట చేయ గలమా మరి.ఆటు వంటి ప్రేమ ఒక్క సారి తటస్థించటమే అదృష్టం, ఇంక రెండు, మూడో సారి అంటే ఏమో, వుంటారేమో అంతటి గొప్ప వ్యక్తులు... కానీ కనీసం ఒక్క సారైనా లీలా మాత్రమైనా అనుభవం లోనికి వస్తే చాలు ప్రతి ఒక్కరికి. ఒక సారి ఆ అనుభవం అందుబాటు లోనికి వచ్చాక ఇంక మరి మిగతా విషయాల మీదకు మనసు పోగలదా ప్రజలకు చెప్పు, ఈ ధనం, ఈ మేడలు, పేరంటాలు, కృత్రిమమైన పేలవపు నవ్వులతో అతికించిన ముఖాలు ఇవి ఏమి వుండనే వుండవు.నాకు సంబంధించినంత వరకు నువ్వే కదా నా దేవుడివి, ఇంక ఈ ప్రపంచం లో ఎందులోను నాకు ఆ సమైక్యత, ఆ అనుభవైక మైన అధ్బుతం తోచదు కదా.. నీవు మాత్రం కలలో కూడా నిన్ను పట్టి వుంచే భాద్యతల నుంచి తప్పించుకుని రాలేవు ... అంత ప్రేమ నీకు నామీద లేదా ఆ భాద్యతలు నిన్ను అంత మింగుతున్నాయా అనుకుంటా నేను.. కాని అంతలోనె అంత అనుమాన పడినందుకు నా మీద నాకే అసహ్యమనిపిస్తుంది. పాపం అంత నిస్సహాయులైన నీ వాళ్ళు, నీ మీద ఆధార పడ్డప్పుడు నా ప్రేమ కోసం ఆ చిన్ని అమాయకపు నవ్వులను ఆ జీవితాలను వదిలి నాకోసం రమ్మని నేనెలా చెప్పగలను కదా. అదా ప్రేమ కు అర్ధం అని నన్ను నేనే అనుకుని వూరుకుంటాను.కలలో నేననుభవించిన నీ చొక్కా మెత్త దనాన్ని, నావైపు నువ్వు చూసిన చూపు లోని చల్ల దనాన్ని... పొద్దుట లేచిన దగ్గర నుంచి పూ రేకుల లో, ఆకుల నిగారింపు లో, దేవుడి గది లోని దేవతకలంకరించిన పట్టు వస్త్రం లో, ఎదురైన పసి పాప బుగ్గ లో అన్నిటి లో పోల్చి ఆనంద పడటానికి చూసేను.. వుహు.. వేటికి సరి రావటం లేదు. చూపు కు, ఒక చిన్ని స్పర్శ కు మది అంత గా పలవరించటమేమిటో... ఎదిగిన అనేకానేక ఇతరమైన విలువలలో ముంచుకున్న నాకే అర్ధం కావటం లేదు తెల్లారేక, ఇంక అందరికి ఎలా అర్ధం అయ్యేటట్లు చెప్పగలను చెప్పు...


కాని అంత మాత్రాన కలలోని నీ స్పర్శ కోసం, నీ క్రీగంటి చూపులో నవ్వు రంగరించి నా మీదకు వదిలిన ఆ అనుభవం కోసం నా మది పడిన కలవరం, అందినప్పుడు మనసు పడిన సంతుష్టి అబద్దమని మాత్రం ఒప్పుకోలేకుండా వున్నాను. కృష్ణయ్యా కలిసి సాగిన ఆ కలయికల సాయం సంధ్య ల వెలుతురు.... మూగిన జీవితపు చీకట్లను పార దోలటానికి ఎంత కాలం సహాయ పడగలవో తెలియదు కాని, వీలైనంత తొందరా గా మళ్ళీ నా కలలోకి తిరిగి రావూ నా జీవితాన తొలి వేకువను వుదయింపచేయటం కోసం..


28, అక్టోబర్ 2009, బుధవారం

కొత్త పాళి గారికి బ్లాగ్ముఖం గా పుట్టిన రోజు శుభాకాంక్షలు.

కొత్త పాళి గా మనకందరికి చిర పరిచితమైన మన నారాయణ  స్వామి గారికి బ్లాగ్ముఖం గా పుట్టిన రోజు  శుభాకాంక్షలు.
ఈ సంధర్బం లో ఆయన గురించి నాలుగు మాటలు చెపుదామంటే 'జగమెరిగిన' సామెత గుర్తు వస్తుంది అందుకే  వెనక్కు తగ్గుతున్నాను. బ్లాగ్లోకంలోని ఆద్యుల లో ఒకరైన కొత్తపాళి గారిని ప్రత్యేకం గా మళ్ళీ బ్లాగ్లోకం కు పరిచయం  చేయవలసిన అవసరం వుందని నేనైతే అనుకోవటం లేదు..

లేదు ఎవరు అని కనుబొమ్మలెత్తి చూసే వారికి,  వో .. కొత్తపాళి గారి  పుట్టిన రోజా చెప్పరేం అనే వారికి, అయ్యో మర్చి  పోయామే అనుకుని వారికి వేంటనే "పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి" అని రాగాలు తీసే వారికి, సాంస్క్రతిక ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చి వారి కి శుభ కామనలు, దీవెనలు అందించే వారికి,  యాపీ యాపీ పుట్టిన రోజు విషెస్ we are all telugu's so need to wish in టెల్గు అనే వారికి..... అందరికి..

అందరికి మనవి...  మన బ్లాగ్లోకం తరపు నుంచి నాసీ కు ఇస్తున్న ఈ గిఫ్ట్ మీద ఒక క్లిక్కేసి, ఆపైన ఒక లుక్కేసి  అందరం మూకుమ్మడి గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెపుదాము మన మాస్టారికి.  


మా అందరి తో ఆత్మీయం గా మెలుగుతు మా వచ్చి రాని బ్లాగ్లోకపు బుడి బుడి అడుగులు, వచ్చి రాని మాటలను విసుక్కోకుండా  సరిదిద్దే మా గురు సమానులు, స్నేహితులు, హితులు...  నాసీ గారికి అందిస్తున్న బహుమాన పుష్ప గుచ్చం..

నాసీ కు బ్లాగ్లోకం తరుపున ఇస్తున్న బహుమానం..

23, అక్టోబర్ 2009, శుక్రవారం

పరిచయమయ్యే ప్రేమలేఖ...కృష్ణా,

మీ వుత్తరం చదవగానే నాకు కలిగిన మొదటి భావం ఆశ్చర్యం.. మీ ప్రేమ గురించి కాదు దానిని మీరు వ్యక్త పరిచిన విధానాన్ని చూసి....... ఆనంద భైరవి ఆలాపన అనంత గాంధారం లో ప్రయోగం చేస్తున్నట్లనిపించింది మీ వుత్తరం చూస్తుంటే... ఎవరికైనా వాళ్ళను పొగిడితే బానే వుంటుంది కదా.. :-)

ఇక మీ వుత్తరం లోని విషయానికి వస్తే... మీ అబ్బాయిలందరు అనుకుంటారు మేము చాలా బాగా వీక్షిస్తున్నాము అమ్మాయిలను వాళ్ళకు తెలియకుండా అని కాని మీకు తెలియని విషయం ఏమిటి అంటే, అమ్మాయిలకు ఈ తీక్షణ వీక్షణాల గురించి కొంచం స్పృహ ఎక్కువ గానే వుంటుంది... మీరు నన్ను గమనిస్తున్నారనేది నాతో పాటు మన ఆఫీస్ లో వున్న ఆడ వాళ్ళందరికి ఇంకా కొంచం మంది మొగవాళ్ళకు కూడా తెలుసనుకుంటా, ఆ విషయమే ఇంకా మీకు తెలియదనుకుంటా.. 

మాస్టారు....నా జాజి పువ్వు తో పాటు మీరు కూడ సగం పైగానే వంగేరు అది ఎక్కడ నేల మీద పడుతుందో అన్నట్లు కాని మీకు, నాకు అప్పుడు నాలుగు టేబుల్స్ దూరం వుంది అని ఆ రూం లో అందరు గమనించేరు మీరు తప్ప... మీరన్నది నిజమే అనుక్షణం ఒకరి చూపు వెంటాడే విహంగమల్లే మన చుట్టూ తిరుగుతుంటే ఇబ్బంది గానే వుంటుంది అలా అనుకోవటానికి పెద్ద ఫెమినిస్ట్ అయ్యే వుండనక్క ర్లేదు నిజం గా చెప్పాలంటె అవును మీ చూపు నన్ను ఇబ్బంది పెడుతూనే వుండేది...

మీ ప్రేమ శీతల సమీరమల్లే, ప్రత్యూష పవనమల్లే సుఖాన్నే కాదు గ్రీష్మ తాపమల్లే ఇరుకున పెట్టిన క్షణాలు ఈ రెండు సవత్సరాలలో చాలానే వున్నాయి... హ్మ్మ్ మొత్తానికి చివరకు ఎలా ఐతే ధైర్యం చేసి... చూపు చురుకు హెచ్చి, కనులలోని మాట కాగితం మీదకు వచ్చింది... క్రిష్ణా నాకు ఏమని చెప్పాలో తెలియటం లేదు... మీరు ఎంతో ప్రేమ గా మీ భావాన్ని జాజుల జల్లెడ వేసి గంధాల, సుమ భందాల మాలికలల్లి నా ముందు పరిచేరు నేను తప్పకుండా అర్ధం చేసుకోగలను మీ భావాన్ని, ప్రేమైక అనుభవాన్ని....  ఇలాంటి క్షణమేదో వస్తుందని అనుకుంటూనే వున్నా సమయం వచ్చేసరికి పదాన్ని కూర్చటానికి కొంచం కష్టం గానే వుంది...

ప్రేమ వేరు (మీరనే ప్రేమ), జీవితం వేరు.... ప్రేమ జీవించటానికి అవసరమయ్యే ఒక సాధనమే కాని ప్రేమే జీవితమంటే ఏమో నాకు నమ్మకశ్యం గా వుండదు... క్షమించాలి ఇది నా అభిప్రాయమే.

నిన్ను నీవు మర్చి పోయి ఆలపించే రాగం లో కూడా తాళం తప్పటం అనే అపశ్రుతి దొర్ల కుండా అను నిత్యం నువ్వు జాగ్రత్త పడుతూనే వుండాలి,  "ఎంత గొప్ప రాగమైనా తాళం జతులతో కలిసినప్పుడే సంపూర్తి అవుతుంది" అనేది ఒక అభిప్రాయమైతే దానిని వేర్వేరు వ్యక్తులు వేర్వేరు కోణాలలో చూడ వచ్చు... మీరు దానిని " ప్రేమ నీతో కలిసి జీవితాన్ని పంచుకున్నప్పుడే దానికి సార్ధకత అలా సాగే జీవితమే జీవితానికి, జీవనానికి అర్ధం" అనొచ్చు... మరి నేనేమో "ప్రేమ అందరి తో కలిసి పంచుకున్నప్పుడే... నీ తోటి వాళ్ళకు, అవసరమైన ప్రతి వ్యక్తి కి వివిధ రూపాలలో అందించి జీవితమనే రాగాన్ని స్నేహం, పంచుకోవటం అనే వాటితో కలిపితేనే సమిష్టి సమాజం గా  సంపూర్తి అవుతుంది" అనొచ్చు..

మీకు అర్ధం అవుతోంది అనుకుంటా... అలా అని జీవితం లో సహచరుడి తోడు, దాని విలువను నేను కాదనటం లేదు. ప్రేమ అనేది మొదలు "మన" అనే కుటుంబం తోనే మొదలవ్వాలి, కుటుంబం లో ప్రేమ, సహజీవనం అనే దానిని సాధించలేక పోతే బయట ఏమీ సాధించలేము.. మీరు నా మీద చూపిస్తున్న పెంచుకుంటున్న ప్రేమ నాకు చాలా సంతోషాన్నిస్తోంది, అది ఒక బంధమై.... నాకు బలాన్ని, ముందుకు కలిసి సాగే భవితవ్యాన్ని ఇవ్వాలి కాని..... ప్రేమ ఒక బంధమై, నే చూసే చూపు కు ఒక ప్రతి బంధకమవ్వ కూడదు అని నా ఆశ...

ఇంక ఇంత కంటే ఏమి చెప్పాలో నాకు అర్ధం అవ్వటం లేదు కాని మీ ఆలోచన బాగుంది క్రిష్ణా మనం కలిసి సాగి స్నేహితుల లా నచ్చిన పరిచయస్తులకు లా తప్పకుండా వుందాము. చూద్దాము కాలమే నిర్ణయించని ఆ పరిచయ ప్రభావం మిమ్ములను నన్ను ఏ దారి వైపు తోసుకుని వెళుతుందో... ఈ రోజు సాయింత్రం పని అయ్యాక రెండు ఆహ్వానాలున్నాయి నాకు ఒకటి రంగనాథన్ స్మృత్యర్ధం సాగే మృదంగ వాద్య సభ, ఇంకోకటి ఆధునిక రచయతల మీద గోపిచంద్ ప్రభావం.... మీరు వస్తానంటే నా కైనటిక్ వెనుక సీట్ ఖాళీనే .....:-)

విరాజిత.

20, అక్టోబర్ 2009, మంగళవారం

పరిచయమయ్యే ప్రేమలేఖ...

అక్టోబర్ నెల కౌముది లో నా లేఖ.   పార్ట్ 1

ప్రియమైన మీకు, 

నేనెవరో తెలియకుండానే మీ ముందు పరిచిన ఈ పిచ్చి వాడి మనసును మీరు తొక్కేస్తూ వెళ్ళి పోతారేమో నన్న బెంగే నన్ను మీ ముందు వ్యక్త పరుచుకోనివ్వకుండా ఆపింది, కాని నన్ను నేను వ్యక్తపరుచుకోకుండా మీకు నేనెలా తెలుస్తాను? తెలియకపోతే నా హృదయం మీకెలా అర్ధం అవుతుంది.... నా ప్రేమ మీ వెంబడి తిరిగే అనేక కోట్ల చూపులలోని ఒకటి కాదు.... దానికొక రంగు, రూపం, మాధుర్యం వుంది అది మీకోసమే పుట్టింది  మీతోనే జీవితాంతం తోడుంటుంది అని మీకెలా చెప్పాలో తెలియక సతమతమవుతూ చేసిన ఒక చిన్ని ప్రయత్నమే ఈ వుత్తరం. నా హృదయం లోని ఒక చిన్ని భాగాన్నైనా మీ ముందు ఈ ప్రయత్నం లో పంచుకోగలిగితే చాలు...

వసంతం అనేది ప్రకృతి అందరికి సమానం గా ముందు వుంచినా దానిని చూడగల, అనుభవించగల రసజ్ఞులకే  ఆ వసంతోద్వేగం అనుభవైకమవుతుంది... మీరూ అందరి తో పాటు అందరిలానే తిరుగుతున్నా మీ వునికి కలిగించగల ప్రత్యేకత  ప్రతి క్షణం నాకు మాత్రమే పరిమితమవుతోంది.

వాల్చిన కనురెప్పల వెనుక సాగే హిందోళం,  అలవోక గా ఎత్తి చూసినప్పుడు సాగే దీపక రాగం, నవ్వినప్పుడు వినిపించిన సింధు భైరవి, కనుబొమ్మలు చిట్లించినపుడు మధ్యమం లో సాగే కల్యాణి, మీరు ఏదో ఆలోచిస్తు దిగులుగా మార్చిన ముఖ కవళికలలో పుట్టే గాంధారం... ఇన్ని రాగాలను ఇముడ్చుకున్న మీరే ఒక కృతి లా అలవోక గా తేలివచ్చే రాగమల్లే నా మనసును దోచిన ఏ నిమిషాన్ని మీకు ప్రత్యేకం గా చెప్పగలను  చెప్పండి, నేనే మీరై ఆ రాగాలాపన లో కరిగిపోయిన క్షణాలను  చెప్పగలను కాని. మీరు నన్ను అసలు గమనించి ఐనా వుంటారని నేను అనుకోవటం లేదు కాని నా చూపు మాత్రం అనుక్షణం మీ వెంట మీ నీడ లా మీ వెనుక సాగే నా శ్వాస లా తిరుగుతోంది... మీకు నాకు రెండే గోడలు అడ్డం భౌతికం గా, కాని మీ మనసును నేను అందుకోవటానికి ఎంత దూరమో నాకు తెలియటం లేదు...

క్రిష్ణవేణల్లే సాగే మీ కేశాల మధ్య చిక్కిన చేమంతి ని అలవోక గా తీస్తూ మీ స్నేహితురాలితో మీరు "నల్లని కృష్ణయ్యను బంగారు వన్నెల రాధమ్మ వదలటమే లేదే"  అంటే నాకెంత ఆశ్చర్యమయ్యిందో  అరె ఈమె నా మనస్సెలా చదివేరు అని  అంతకు ముందు రోజే మీరు జారుతున్న జాజి పువ్వు ను ఆపి దాని స్వస్థానానికి చేరుస్తున్నప్పుడు అనుకున్నా, "బిర బిరా సాగే క్రిష్ణమ్మ నీలి కెరటం మీద మెరిసిన వెండి నురుగల్లే ఆ జాజి కెంత అదృష్టమో విడకుండా ఆమే తోనే వుంటోంది కదా" అని.

ప్రతి రోజు మూసుకున్న కనురెప్పల వెనుక సాగే నా కలల రాజ్యం లో మహా రాజ్ఞి ని సెలవడిగి కనులు తెరిచిన ఘడియ... ఆమె నా హృదయ సామ్రాజ్ఞి గా కనురెప్పల మాటు నుంచి గుండె చప్పుడు తో కలిసి నా జీవితానికొక అర్ధాన్ని జీవన మాధుర్యాన్ని నింపుతోంది... ప్రభాతాన వినిపించే తిరుప్పవై లో గోదా దేవి కృష్ణుడికోసం పడిన తపన ఆ కృష్ణుడి  మనసులో కలిగించిన భావమేమో తెలియదు కాని ఈ కృష్ణుడి మనసులో ఆలోకించినా..... అవలోకించినా..... మీ మీద ప్రేమ కోటానుకోట్ల నా భావాలను " ప్రేమ" అనే ఒకే పదం గా మార్చి అన్ని వేదాలను ఓం కారం లోకి ఇమడ్చగలిగిన ప్రణవనాదం లా మోగుతొందది......

వెన్నెలా, చీకటి.... మీ రూపును లోని లావణ్యాన్ని, మీ కాటుక కంటి మెరుపును కలిపి గుప్పెళ్ళ తో నా మీద కుమ్మరిస్తున్న ఈ క్షణం, ఇలా ఈ వెలుగు నీడలు కలిపిన కొబ్బరాకు మాటున జారగిలబడి మీకు రాసే ఈ వుత్తరం, మీ దాకా పంపే ధైర్యం నాకెప్పుడూ వస్తుందో... మీరు అన్ని ఆఫీస్ కాగితాలలానే దీక్ష గా తల వంచి చదివి తలెత్తి మీ పక్కన ఆమె  తో, చూసే వా ఈ పిచ్చోడు ఇలా నన్ను గమనిస్తున్నాడన్నమాట  నాకు తెలియకుండా అందుకే నాకు ఈ మొగవాళ్ళంటె చిరాకు స్త్రీ కు తనదైన క్షణాలను అనేవిలేకుండా మింగేస్తారు ఈ వీక్షణ బకాసురులు అని కాగితాన్ని వుండ చేసి చెత్త బుట్టలో వేసేస్తారేమో అని ఒక భయం (మీరు లంచ్ లో మీ స్నేహితులతో మొగవాడూ వాడి ధాష్టీకం అని నిప్పులు కురిపిస్తున్నప్పుడు నేను అక్కడే మంచినీళ్ళు తాగుతు వింటున్నా మీరు గమనించి వుండరు)

నేను అలాంటి వాడిని కాదు అని అందరి లా చెప్పాలన్నా భయం వేస్తోంది కాని నేస్తామా.... స్నేహ హస్తమందిస్తానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రేమ పిపాసి ని మీరు మొదటే అనుమానాస్పందం గా కాకుండా కేవలం ఒక స్నేహితుడి గా పరిచయస్తుడి గా మీ  జీవన యాత్ర లో మీతో పాటు కలిసి  కొన్ని క్షణాలను పంచుకునే అవకాశమిస్తే నా ప్రేమ మిమ్ములను గెలుచుకోగలదు అనే ధైర్యం తో  మనసు మీదే మూగే ఆలోచనలను వెనక్కి నెట్టి మీకు ఈ వుత్తరం పంపిస్తున్నా... రెండు గోడల అవతల మీ హెలో కోసం ప్రతి క్షణం వెయ్యింతల భారమై వాటిని మోయలేక.... మోస్తూ..... చూస్తున్నా....

ప్రస్తుతానికి
మీ స్నేహితుడు కావాలని ఆశిస్తున్న,
కృష్ణ.

10, అక్టోబర్ 2009, శనివారం

ఒంటరి తోడు...


కృష్ణా,

ఎక్కడ నుంచి ఎక్కడికి పాకుతున్నాయో తెలియని ఈ ఆలోచనలు పాదరసం కంటే పదునైనవి, అవనీతలం కంటే బరువైనవి అని నా అనుభవం నాకు నేర్పిన పాఠాలు. .. జీవితం నేర్పించిన ఎన్నో పాఠాలలో ఇది ఎన్నవది అని అడగకు...ఎన్నైనా ప్రతి సారి కొత్తే... మరీ వుత్త బుర్ర తక్కువది నీ ఈ శిష్యురాలు ఏమి చేస్తాము చెప్పు...

రోజు ఎన్నో విషయాలు.. ప్రపంచం దృష్టి లో ఏ మాత్రం ప్రాముఖ్యం లేనివి, మనకు మాత్రమే ఎంతో విలువైనవి నీకు ఎన్నెన్నో చెప్పాలనుకుంటానా... రోజంతా ఎలా గడుస్తుందా నిన్ను చూసిన క్షణమే అవి అన్ని ఎలా పంచుకోవాలా అని ఆలోచించి సందె మబ్బు ముసిరే చీకటి పొద్దు మొదలవ్వగానే, అన్నిటిని ఒక క్రమం లో పదాల మాలికలల్లి చిరుమల్లెలలో కలిపి కదంబం చేస్తుంటాను. ఏమి లాభం నువ్వు రాగానే అన్ని మాటలు ఒక్కసారి ఫక్కుమని నవ్వి విరిసిన మల్లెలలో కలిసి పోతాయో ఏమి పాడో ఒక్కటి గుర్తు వచ్చి చావదు. నువ్వేమో "అందరితో ఎప్పుడు చూసినా పెదవి మీద పెదవి ఎక్కనివ్వకుండా మాట్లాడుతూనే వుంటావు. నన్ను చూస్తే ఏమిటి హఠాత్తు గా మూగ పిల్ల వైపోతావు" అని ఏడిపిస్తావు. ప్రపంచానికి నేనెవరైనా, ఏమైనా నీకు మాత్రం ఎప్పటికి ఈ మూగ పిల్లలానే నిలిచి పోతాననుకుంటా.

కృష్ణా నీవే కదా అని పాడే గొంతులోని మధురిమై పోతావో ఏమో ఒక్కోసారి నువ్వు...నీతో మాట్లాడుతుంటే ఎన్నెన్నో అవ్యక్త రాగాలు చప్పున మదికి మెరుపల్లే తోచి మాయమవుతాయి. నీతో కలిసి అడుగు వేస్తున్నప్పుడు కొబ్బరాకు కొనల సవ్వడులే ఆ మాయమైన రాగాలను ఎన్నో స్వరాలతో కలిపి వినిపిస్తుంటాయి. నిన్ను చూస్తుంటే కదిలే మదిలో భావాలన్నీ నేను ఎప్పటికైనా ఒక పదం లో పెట్టగలనో, ఒక పాదం లో కూర్చగలనో లేదో తెలియదు కాని... నా నేస్తమా, నా ప్రాణమా ఈ రోజు శ్వాస పలికే ఈ అనాచ్చాదిత భావం నీకోసం పంచటానికి ప్రయత్నిస్తున్నా, పంచకపోతే ఇది నన్ను వుక్కిరి బిక్కిరి చేసేస్తోంది మరి......

రాత్రి ఎందుకు అందరు నిద్ర పోతారో నాకు అర్ధం కాదు. "అందరికి నిద్ర పోయినా జీతాలిచ్చే వుద్యోగాలు వుండవమ్మా అందుకని ఇప్పుడే నిద్ర పోతారు మరి" అని నువ్వు అన్నప్పుడూ కోపం తో చిర చిర లాడేను కాని, నిజమే కదా.... ఐనా నువ్వు ఎంత చెప్పినా ఈ బానిస వుద్యోగాలు, ఈ తల తాకట్టు పెట్టి తెచ్చుకునే జీతాల కంటే వాటిని వదిలి నీకోసం నిదుర కాగ గల రాత్రుల కోసం చూడటమే ఇష్టం. రాత్రులే మరి విరజాజులు మాట్లాడతాయి. ఆ మాటలే నీవు వున్నప్పుడు ఏమి చెప్పాలో తెలియదు, నీవు లేనప్పుడు ఎంత రాసినా తనివి తీరదు.

రాత్రి ఎంత అందమైనది కదు...
ఒంటరి గా కిటికి పక్కన కూర్చుని నీకు వుత్తరం రాస్తూ వుంటే బయట వరండాలో కట్టిన చిరుగంటలు... వాన తో కలిసి వచ్చే గాలితో జత కూడి, రాత్రి పాడే ఈ మౌన రాగానికి వురుములతో పాటు దాని వంతు గా అది కూడా తన గొంతు అరువిస్తోంది. తల పక్క కు తిప్పి చూస్తే పక్క మీద నువ్వు నిద్దరోయే చోటు గుబులు గా , కూసంత దిగులు గా నా వైపే చూస్తోంది. అబ్బ ఈ జీవితమంతా నీ కోసం ఎదురు చూస్తు వుండటం తోనే సరి పోతుందనుకుంటా.. పక్కనే జానకి హృదయం తో కామోలు పాడుతోంది "కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని" అంటు. నిజమా కృష్ణా...

ఇంకో జన్మ కావాలా నే కోరుకున్న జీవితం నీతో గడపటానికి.. కావాలేమో... మన పెళ్ళి లో అందరు నన్ను అభినందనల పరంపర లో ముంచేసేరు. " నువ్వు చాలా అదృష్టవంతురాలివి నువ్వు కోరి వలచిన వాడే నీ వాడైపోయాడు" అని. మరి నాతో కలిసి చదివిన అందరికి తెలుసు గా నేను డేటా బేస్ ఆర్కిటెక్చర్ బుర్ర లోకి, నీ రూపం గుండెలోకి ఒకే సారి ఎక్కించుకున్నాను, రియల్ టైం ఆబ్జెక్ట్స్ తో పాటు నిన్ను కూడా నా రియల్ లైఫ్ లోకి ఆహ్వానించేసేను అని. :-)

కృష్ణా నాకు ఒక్కో సారి అనిపిస్తుంది నువ్వు ఇది అంతా నన్ను పరిక్షించటానికి చేస్తున్నావా అని. అమ్మో అంత అపవాదా నా మీద అని మొట్టికాయ వేస్తావేమో కాని నాకైతే అలానే అనిపిస్తుంది. "నీ ప్రేమ కళ్ళ నుంచి ఆగక నా వైపుకు పరుగెత్తి వెనక్కి తిరిగి రాస్తున్న నన్ను ఎన్ని సార్లు భుజాలు పట్టి తిప్పక పోతే నేను ఎందుకు చూసే వాడిని నీ వైపు" అని అనలేదు నీవు తరువాత? తెలిసీ ఏమి తెలియనట్లు ఎంత కాలం ఏడిపించి ఒక్క సారి నాకోసం హాస్టల్ కు వచ్చేసి "ఏరా గీతాంజలి కు వెళదామా" అని అడిగేవు...

ఏమైపోయింది ఆ ప్రేమావేశం.. అంటావేమో నువ్వు "ఎప్పటైకి అలానే వుండాలంటే ఎలా జీవితం, భాద్యతలు విస్తారమయ్యే కొద్ది మన పరిధి కూడా పెరగాలి" అని.. నిజమే రోజు లో 24 గంటలలో ఒక్క నిమిషం కూడా వదలకుండా గడపటం మాత్రమే ప్రేమ అని నేను అనటం లేదు.... కాని కలిసి గడిపే ఒక గంటైనా, వారానికి ఒక రోజైనా మిగతా రోజులకు గంటలకు బతకటానికి కావలసిన జీవన సారాన్ని అందిచలేకపోతే...? వున్న గంట కూడా రేపు చూడవలసిన డాక్యుమెంట్స్ మాట్లాడవలసిన మీటింగ్ ల గురించి ఆలోచిస్తే.... మనం పెట్టుబెడి పెట్టిన స్టాక్ ల గురించి అవి చెయ్యగల లాభాల గురించి ఎప్పుడో మనం రిటైర్ అయ్యాక గడిపే జీవితానికి ప్రగతి సోపానాలంటు ఈ క్షణం లోని జీవితాన్ని కాలదన్నుకుంటున్నాము అనిపించటం లేదా...

కలిసి మనం వాకింగ్ కు వెళ్ళి, ఒక పుస్తకం కలిసి చదివి, ఒక మంచి సినిమాను చూసి దానిని విశ్లేషించి ఇంతెందుకు ఇద్దరం కలిసి వంట చేసుకుని వరండాలో దుప్పటి వేసుకుని కూచుని కలిసి తిని ఎన్ని రోజులయ్యింది చెప్పు.. ఇంతటి అల్ప సంతోషాలే మనం కలిసి ఆనందించ లేక పోతున్నామే...

నేను ఏం అనకుండానే మొదలు పెట్టేస్తావు నీకు కాలం విలువ తెలియటంలేదు నేను లేనప్పుడు ఆ PMP exam పూర్తి చెయ్యమన్నానా? ఎందుకన్ని గులాబులు దొడ్డి నిండా, పొద్దుగూకులు వాటికోసం అక్కడ తిరగ... ఇక్కడ తిరగ, వున్న కాస్త ప్లేస్ చక్క గా స్టోన్ పరిపించుకుంటే తేలిక కదా ఆ బురద లో నుంచి నడుస్తూ ఎదగవా అన్నావు... గుర్తు వుందా.... ఎదగటమంటే మూలాలు మర్చిపోవటమని నాకు తెలియదు రా.. ఎంత సాధించినా.... ఎదిగినా ఇంకా సాధించ టానికి, ఎదగటానికెప్పుడు ఏదో ఒకటి మిగిలే వుంటుంది మన అంతట మనం ఎదుగుదలను ఎలా వుండాలో అది మనకెంత సుఖానిస్తుందో తెలుసుకుని నియంత్రించుకోక పొతే...

చిటారు కొమ్మల మీదుగా ఎగురుతున్న పతంగి ని చూసి కేరింతలు కొడుతున్న నా నేస్తమా ఆ పతంగి మొదలు ఇక్కడ నేల మీద స్తిరం గా నిలబడ్డ పిల్లవాడి చేతుల నుంచి నియంత్రించబడుతోంది గుర్తు పెట్టుకో... దారం అంచులకు గాజు పొడి రాసి పక్కన వాడి ని తెంచుకుంటూ ఎగరగలుగుతున్నావని మురుస్తున్నావు కాని ఆ పొడి తయారిలో తెగిన నీ చేతి వేళ్ళ గుండా కొంత నీ రక్త నాడులలోకి చేరి నీ హృదయ తంత్రులను కోస్తోంది గమనించుకో... నీ అడుగున అడుగై వేకువ వెన్నెల లో విరిసిన వేగు చుక్కంటి ప్రేమను నిద్ర మత్తుతో తోక చుక్కని భ్రమిస్తున్నావు..

ఏమిటో శిష్యురాలే మాస్టారుకు సుద్దులు చెపుతోందా... మధువని లో రాధిక కు కృష్ణుడికి తేడా లేదు గా.

2, సెప్టెంబర్ 2009, బుధవారం

మారిన విలువలు

కౌముది లో సెప్టెంబర్ లేఖ

అన్నయ్య,

ఎలా వున్నావు రా. నేను చాలా బాగున్నా (అదే నీ దృష్టి లో ఏడ్చినట్టు). :-)

అమ్మ వాళ్ళు ఎలా వున్నారు? నాన్న చాలా సంతోషం గానే వుండి వుంటాడు నీ దగ్గర కదా వుంది. అమ్మ కు నాన్న సంతోషం తప్ప ఏమి అక్కర్లేదు కాబట్టి ఆమె సంతోషం గానే వుండి వుంటుంది. "సర్వే జనా సుఖినోభవంతు" అని ముగించెయ్యవచ్చు ఈ వుత్తరాన్ని ఇక్కడికి, కాని నా ఈ వుత్తరం వుద్దేశం అది కాదు కాబట్టి ఇంకా రాస్తున్నా. అసలు రాత్రి ఫోన్ చేద్దామనుకున్నా కాని నీ దొరతనం బైట వెలగబెట్టి కొంప కు చేరే సరికి ఏ అర్ధరాత్రో అవుతుంది, అప్పుడు మాట్లాడే ఓపిక నీకు వుండదు అని వుత్తరం రాస్తున్నా..

ఒరే అన్నయ్య గుర్తు వుందా మనం చిన్నప్పుడు, నాకు తొమ్మిది ఏళ్ళు, నీకు పదిహేను ఏళ్ళు వుండి వుంటాయి అప్పుడు, నాకు సైకిల్ నేర్ప టానికి నువ్వు నీ ఫ్రెండ్ కృష్ణా ప్రయత్నిస్తున్నారు. నేను అరుస్తున్నాను..... మీ మీద వో ఆధరపడి అసలు సరిగా నేర్చుకోవటం లేదు అని వున్నట్లుండి వదిలేసేరు నాకు చెప్పకుండా, కొంచెం సేపు అయ్యాక చూసుకుంటే మీరు లేరు, దెబ్బ కు భయ పడి నేను వెళ్ళి మన వీధి చివర శంకర్రావు గారి ఇంటి ముందట ముళ్ళగోరింత పూల చెట్టు మీద పడ్డాను. ముళ్ళు గుచ్చుకున్నాయి, నీకు గుర్తు వుండే వుంటుంది లే, అన్నీ మర్చి పోయే సెక్షన్ నాది కదా,

నేను ఏడుస్తుంటే వచ్చి ఏమన్నావో గుర్తు వుందా ... వ్యక్తి స్వాతంత్రం సాధించాలంటే ములుకు మాటలు, ముళ్ళ మార్గాలు కూడా వుంటాయి తీసి పారెయ్యాలి కాని ఇలా ఏడిస్తే ముళ్ళు ఇంకా నెప్పేస్తాయి అని.. నాకు అప్పట్లో పూర్తి గా అర్ధం కాక పోయినా, నీ మాట మాత్రం గుర్తు వుండి పోయింది. తరువాత ఇంటికి వచ్చాక నాన్న"ఆడ ముండ కు ఈ సైకిళ్ళు.... గోలా ఎందుకు రా" అని తిడుతుంటే అంటే ఎంత రోష పడ్డావో... నన్ను ఇంటి వెనుక బాదం చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి నాతో ఒట్టు పెట్టించుకున్నావు గుర్తు వుందా " ఎప్పటికి ఈ ఆడదాన్ని అనే బేల తనం, నా పని కాదు అనే అధైర్యత రానివ్వను నా జీవితం లో" అని, అప్పట్లో ఆ ప్రమాణం కు అర్ధం ఏమిటో తెలియక పోయినా నీ కళ్ళలో నీళ్ళు చూసి ఏడుస్తు ఒట్టు పెట్టేను... ఇప్పుడు తలుచుకున్నా ఎంత సంతోషం గా వుంటుందో నాకు, నీ లాంటి అన్నయ్య తోడు గా వున్నాడు నాకు అని. అప్పుడనే కాదు పెద్ద అయ్యే దాక ఎన్ని సార్లు నాకు ఎన్ని తెలియనివి తెలియచెప్పేవు రా..

ఇవి అన్ని ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నావు అంటావా... "చెయ్యతి జైకొట్టు తెలుగోడా... గంతమెంతో ఘన కీర్తి కలవోడా" అని పాడుకుంటానికి తప్ప ఎందుకు వుపయోగం లేని మన కీర్తల్లే మన గత అనుభవాలు అవ్వకూడదనిపించింది...

జీవితం లో నిరాసక్తత మొదలయ్యి నిర్లిప్తత మన జీవన పధమవుతుందో, అవకాశ వాదం అలవాట్లను, ఆనందాలను మింగేసి మనలను మాయా విలువలున్న లోకాన్నే శాశ్వతమని భ్రమింప చేస్తుందో నాకు తెలియదు కాని నీ విషయం లో ఏదో అయ్యింది అని మాత్రం తెలుసు, చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన నా అన్నయ్య ఎక్కడా కనిపించటం లేదు.. ఆ స్థానాన నాన్న కు ప్రతి రూపం (మనం ఏదైతే కాకూడదని అనుకున్నామో), డబ్బు కు మారు రూపం ఐ కనపడుతున్నావు. అమ్మ కు బదులు వదిన, మార్పు అంతే...... అదే కధ పునరావృతం... నువ్వు మారని నాన్న కు ప్రతి రూపమై ఆ ఇంటి పేరు నిలబెడుతున్నాను అని అను కుంటున్నావేమో కాని ఆ మూర్ఖత్వపు ఆనవాళ్ళను పతీవ్రతా రూపం లో ధరించే అమ్మ కు తరువాతి తరం వదిన అని గుర్తించలేక పోతున్నావు. చెల్లి కళ్ళల్లో అసహాయత రానీయకూడదని ఆరాట పడిన నా అన్నయ్య, భార్య కళ్ళల్లో నీలి నీడ లు గుర్తించలేని గుడ్డి వాడయ్యాడేమిటా అని ఆశ్చర్యం గా వుంది రా.. వుహు... అవమానం గా వుంది రా..

మొదటి సారి నా లోని బలాన్ని... నా భావాలని తట్టి లేపి మార్కిజం నుంచి ఫెమినిజం దాకా పరిచయం చేసి న నా అన్నయ్య ను ఆ ధృడ వ్యక్తిత్వం తో మళ్ళీ చూడాలంటే, కొంప తీసి మళ్ళీ నిన్ను ఆ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ మెట్ల మీద నిలబెట్టాలా ఏమి రా? ఆలోచించు నువ్వే మరి పరిష్కారాన్ని కూడా..

సాధన ఒక ప్రయత్నం, అర్ధవంతమైన జీవనం జీవిత సాధన కు గమ్యం. భౌతిక లాభమే సాధించటం అంటే అని జన సామాన్యం అనుకోవటం మూలం గానే కొలతలు బేరీజులు మొదలయ్యి, అర్ధం పరమార్ధం మారి, జీవితం లో అసంతృప్తి జీవిత పధమవుతోంది అని జీవిత వేదాంతాన్ని నాకు పరిచయం చేసిన నా మొదటి స్నేహితుడికి ఇంత కంటే ఏమి రాయగలను రా.. ఎంతో పౌరుషం గా నిన్ను మాటల తూటాల తో బాధ పెట్టాలని మొదలు పెట్టి (నాకు తెలుసు ఇప్పటికి నీ వీక్నెస్స్ అదే అని) నాకు తెలియకుండానే ఏడుస్తు ముగిస్తున్నా..

వుంటాను మరి... నీ చిరకాల స్నేహితుడు, నా సహచరుడు అడుగుతున్నాడు ఏమయ్యింది మీ అన్న గుర్తు వచ్చాడా అని. చూసే వా నా బలం, బలహీనత నా అన్నే అని కృష్ణ కు కూడా తెలిసి పోయింది..

వుండన
ప్రేమ తో
నేను.

ఒసెయ్ పిచ్చి,

నువ్వు ఇంకా మారలేదు, ఎప్పటికి మారవే... ఐనా నీది కాదు తప్పు, నిన్ను చిన్న దానివని గారాబం చేసి అడిగినవి అన్ని ఇచ్చి ముద్దు చేసి నెత్తికెక్కించుకున్నాను చూడు నన్ను అనుకోవాలి, అది చాలదన్నట్లు మళ్ళీ ఆ సెంటిమెంటల్ ఫూల్ గాడిని పెళ్ళి చేసుకుంటాను అంటే ఒప్పుకుని చేసేను చూడు.... అది ఇంకో తప్పు. సరే కాని, చేసిన దానికి నువ్వు ఏమి రాసినా వినక తప్పుతుందా..

ఏమంటావే ఐతే ఇప్పుడు.... పొద్దు గూకులు డబ్బు ధ్యాస లో పడి మీ ఒదిన ను పట్టించుకోవటం లేదంటావు.... మీ వదిన ఏదో నాతో చాలా కష్ట పడి పోతుందంటావు... అంతే నా.. ఈ తాపత్రయం అంతా ఎందుకు చెప్పు... దానికోసం, దాని పిల్లల కోసం కాదు... అంతకే నన్ను అంత విలన్ ను చేసేస్తున్నావు.

ఇంత వయసొచ్చాక కూడా ఇంత సున్నితమైతే నిన్ను కాదు.... నీ మొగుడిని అనాలి నిన్ను ఇంకా అంత గారాబం చేసి చెడగొడుతున్నందుకు. నీకు లా అర్ధ రాత్రి వరకు చీకటి లో పువ్వులు చూడటం కోసం తోట లో కూర్చోవటం, తెల్లవారు జామే, వేకువ అంచున చీకటి నురగ ను చూడటం కోసం సముద్రపుటొడ్డుకు పరుగెత్తటం ఇలాంటి వెర్రి మొర్రి పనులన్ని చేస్తూ కూర్చుంటే మీ ఒదిన సంతోషం గా వుంటుందా,..! అలా అని నీకు చెప్పిందా..! అది ఒక వెర్రి మాలోకం, నిన్ను చూడగానే దాని ఆనందం, నవ్వులు చూసినప్పుడే అనుకున్నా ఇలాంటివి ఏదో నూరిపోస్తున్నావు అని,

అమ్మా... తల్లి.. దానికి లేనివి నేర్పి నా మీదకు తోలక.. ఏదో చిన్నప్పుడు, చదువు కునేప్పుడు ఏదో ఆలోచించాము, ఏవో మాట్లాడేము అని ఇక జీవితాంతం అలానే వుండాలి అంటే ఎలా కుదురుతుంది చెప్పు... పరిగెత్తి జీవితాన్ని అందుకోవాలే.. అప్పుడే ఆ జీవితానికి అర్ధం... పరమార్ధం.. పరుగెత్తి పాలు తాగలేని చవట లందరు ఇలా నిలబడి నీళ్ళు తాగటం లోని లేని ఆనందాన్ని తలుచుకుని మురుస్తూ వుంటారు, ఇది ఈ కాలానికి మన వయసుకు తగిన జీవిత సిద్ధాంతం, వేదాంతము. అంత అన్న మాట వినే దానివైతే ఇకనైనా ఆ పిచ్చి గోల ఆపి, ఆ పనికి రాని టీచర్ వుద్యోగం మాని, పిల్లా పీచు రాక ముందే గ్రూప్ 2 పరిక్షలకు కూర్చుని పూర్తి చెయ్యి. తెలివంతా ఇలా ఎవరో రాసేసిన కవితల పుస్తకాలు చదవటం లో కాదు నీ భవిష్యత్తు ను నువ్వు సరి గా రాసుకోవటం లో చూపించవే పిచ్చి మొద్దు.

ఇదుగో ఇలా రాస్తుంటే తెల్లారుతుంది.. దీని బదులు కాసేపు ఏదైనా వుపయోగపడే పని చేసుకుంటే పుణ్యం పురుషార్ధం. రేపు మళ్ళీ ఆడిటింగ్ వుంది, ఈ సవత్సరం మన శ్యాం గారు లలిత అక్క వాళ్ళ ఆఫీస్ కు కూడా వస్తాను అని చెప్పేను.

అవును అమ్మ ఒకటే గోల చేస్తోంది కిందటి వారం వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఒక్క సారి ఫోన్ కూడా చేయలేదంట, ఇంకో నెల లో ఏదో అన్నా చెల్లెళ్ళు బట్టలు పెట్టుకోవటం.. ఏదో చెయ్యాలి అట, మీ ఒదిన కు చెప్పేను మంచి చీర తీసుకోమని వీలున్నప్పుడు రా మరి... వాడిని, కృష్ణ ని కూడా రమ్మను మరీ బొత్తి గా నల్లపూసై పోయాడు... వాడి కోసం మొన్న ఎక్కడో దొరికితే నవీన్ "అంపశయ్య" తీసుకున్నా.

వుంటాను మరి.
ప్రేమతో,

అన్నయ్య.

18, ఆగస్టు 2009, మంగళవారం

స్వేచ్చాభిలాషులు

కౌముది లో ఆగస్ట్ నెల లేఖ
స్వేచ్చాభిలాషులు లింక్

13, ఆగస్టు 2009, గురువారం

కృష్ణయ్య పుట్టిన రోజు పండుగక్రిష్ణయ్యా, ఈ రోజు నీ పుట్టిన రోజు... ఐనా నీకు పుట్టిన రోజేమిటి మా పిచ్చి కాని..... ఆది, అంతాలే లేక సర్వ వ్యాపకుడివైన నీకు ఒక రూపాన్ని, ఒక రోజు ను, ఒక పండుగను నీకోసం కల్పించి మేము చేసే ఈ వేడుక అంతా నీ లీలా వినోదాలలో ఒక భాగం కాదు.... ఐనా మా కోసం మాలో ఒకడి గా చేరి వెన్న తింటు, అల్లరి చేస్తూ, మువ్వలన్ని గల గల మంటు సాగే కాల ప్రవాహమల్లే నువ్వు వేసే గంతులు.... ఇవి అన్ని మా కోసమే కదు...


క్షణం క్షణం పసి పాపల చిలిపి అల్లరిలో వాళ్ళ చిరు ఆనందం లో, ఇంటి ముందు గంతులేసే తువ్వాయి చురుకు చూపులలో.... పెరట్లో విరిసిన రాధా మనోహరం మొగ్గ అంచున రూపుదిద్దుకుంటున్న ఎరుపు వర్ణపు ప్రేమ ఆనవాలు లో, విరిసిన చంద్రవంక లో తళుకులీనే చంద్ర కాంతి తో కలిసి అంచున వూయలలూగుతూ అవ్యక్తా వ్యక్తం గా వినిపించే నీ అనంత వేణు గానం లో..... ప్రతి అణువణువులో నిన్ను ప్రతి క్షణం గుర్తు పట్టిన ఆనందం తో యశోదనై రోజు నీ పుట్టిన రోజు జరుపుకుంటున్న నన్ను మన్నించి నా ముంగిటకు మళ్ళీ మళ్ళీ అన్ని రూపాలలో....... ఏదో ఒక రూపం లో రావూ...!!!!


ప్రతి క్షణం నిను ఏదో అడిగి, ఇంకేదో కావాలని కోరి... ఇచ్చినదాని విలువ తెలియక...... అది విసిరేసి మళ్ళీ ఇంకేదో కావాలని ఏడ్చి.. విలువైన బొమ్మ ను విసిరేసి అట్ట పెట్టెను చూసి ఆనంద పడి దానిలోని కాగితపు ముక్కలే అనంత సంపదలని భ్రమసిన నన్ను, తండ్రి లా నువ్వు అది తీసి పక్కన పెట్టి విలువైన జీవితాన్ని కానుక గా ఇవ్వటానికి ప్రయత్నిస్తుంటే వద్దని పేచి పెట్టే పసి బిడ్డను క్షమించి నా ముంగిటకు పసి వాడై నేను నీకు జరిపే క్రిష్ణాష్టమి ను జరిపించుకోవటానికి రావూ...


యుగం కితం నా వంటి ఒక పేద తల్లి మమత ని, ఇంకో అధ్బుత ప్రేమ మూర్తి ఆరాధన ను, కొన్ని కోట్ల మూగ జీవుల ఆర్తి ని అన్నిటి కోసం, అందరి కోసం రోజే వచ్చావట లోకానికి క్రిష్ణ నామం తో, క్రిష్ణ తత్వం తో, క్రిష్ణ ప్రేమ తో......అంతా నేనే, నేనే ఎప్పటికి, అంతా నాదే అనే మా కంస ప్రవృత్తి ని అణచటం కోసం ఏతెంచావంట రోజే... మా అహంకారం, పశు ప్రవృత్తి ని పిడి గుద్దులతో అణిచేవంట లే విన్నాను కథ లు... మా కోపాన్ని ఈసు అసూయలను కూడా కాళీయ మర్ధనం చేసి మా పీచమణిచావంటలే... నల్ల నల్లని మేఘమై నీల మేఘ శ్యాముడివై మా మీద నీ ప్రేమామృతాన్ని వెన్న లా, వేణు రాగం లా మా మీద కుండలతో, బోలైన జీవిత వేణువులతో వంపి వర్షించావంటలే..


ఐతే ఏం...ఎప్పటి కథే... ఎప్పటి వెతే.. .అన్నీ మర్చి మళ్ళీ ఖాళి కుండ తో నీ పూ పొదరింట నుంచు ని నీ కరుణామృతం కోసం నిలబడిన యాచకురాలిని మన్నించి మళ్ళీ ఒక్క సారి మా ముందుకు పసి బిడ్డ వై క్రిష్ణాష్టమి కి వచ్చెయ్యవా.....

చూడు దారి గుర్తు పట్టవేమో అని నీ కోసం నీ చిన్ని పాదాలను ముద్రించి వుంచేను .. అమ్మ కోసం పాదం లో పాదం,పదం లో పదం కలిపి నీ చిట్టి అడుగులతో వచ్చెయ్యి లోపలకు నా చిన్ని కన్నా... నీకోసం నా ప్రేమ ను నా ఆప్యాయతను అన్నిటిని అంతా కలిపి నీ కోసం వెన్నుండలు చేసేను, తీపి పాయసం చేసేను, ఆటుకులను పాలతో బెల్లం తో కలిపి తీపి తీపి తాయిలాలు, భక్ష్యాలు చేసేను.. ఈ ఇంటినే ఒక మధుర చేసేను.. నచ్చలేదా.. ఈ కంస ప్రవృత్తి మద మత్సరాలను రాక్షసులు గా నా బిడ్డవైన నీ మీదికే పంపుతోందా, వద్దా.... సరే పద బృందావనం వెళ్ళి పోదాము...


దొంగా తళుకులీనే నవ్వు చూడు, నాకు తెలుసు లే నీ వేషాలు బృదావనం ఐతే నీ ఆటలన్నీ సాగుతాయని కదు... ఎప్పుడైనా యశోదమ్మ నీ ఆట కాదందా నీ మాట కాదందా... ముందు మధుర గా మలుచుకున్న అంతరం లోకి ప్రేమమూర్తి వై రా, తరువాత ప్రేమైక లోకమైన బృదావనం వెళదాము.. వుట్టి కూడా కొడదాము.. మరి పిచ్చి తల్లి కోసమో, నీ మురిపాల రాధ కోసమో, నీ దాసాను దాసులైన నీ లోని రూపాలమైన అందరి కోసమో వచ్చేస్తావు కదు


ప్రేమతో
యశోదమ్మ పంపుతున్న ఆహ్వాన పత్రం...


5, ఆగస్టు 2009, బుధవారం

నేస్తం

నేస్తం,
మనసు మూలల్లోకి తొంగి కూడా చూడనవసరం లేకుండానే నా హృదయం లో ఆలోచనను నా గొంతులోని పదాన్ని భావ నిర్దేశం నువ్వే చేసేవా అన్నట్లు అణువైనా మార్చకుండా చెప్పగల నా నేస్తమా... ఎక్కడ వున్నావు. ఏమై పోయావు ఎందుకంత దూరం వెళ్ళి పోయావు... నీలా నేను నీ మనసు చదవ గలిగే సామర్ధ్యం లేని దానిని అని నీకు తెలుసు కదా మరి తెలిసీ అన్నీ ఎప్పుడు పంచుకునే నీ కలం ఎందుకు అలా ఒక్క సారి మూగ నోము పట్టింది..

మర్చి పోయావా మనం కలిసి చేసుకున్న వాగ్ధానాలు... మనం కలిసి పరుగెత్తిన పూల తోటలు, వణికి పోతూ చేతి లో చేయి వేసుకుని దాటిన సమస్యల సముద్రాలు. ఒక్క రోజైనా.... ప్రయాణం లో ఎంత అలసట కలిగినా, నా బెదురు, భయం గమ్యాన్ని దూరం చేస్తున్నా నన్ను విసుక్కోకుండా నా ప్రతి అడుగులో తోడై నడిచిన నా మిత్రమా... ఎక్కడున్నావు.... నీ ఆచూకి కూడా అందనంత దూరానికి నన్ను ఇలా వదిలేసి పారిపోగల ధైర్యం నీకు ఎవరు ఇచ్చారు.. ఒక్క మాట చెప్పేవా, ఒక్కరోజైనా ఆగి ఆలోచించేవా నువ్వులేని ఈ ప్రపంచం నాకు ఏమవుతుందో...

సరే నా సంగతి వదిలెయ్ నేను లేకుండా నువ్వెలా వున్నావు? గుర్తు వుందా మనం మాస్టారి ఇంటికి వెళ్ళినప్పుడు మాస్టారి జామ చెట్టు కింద కాయలు కోసుకుంటూ నువ్వు కింద కొమ్మకు వున్న జామకాయ కూడా చూసి కొయ్యమని అరుస్తుంటే, మాస్టారు కిందనే వుంది కోసుకోలేవా అమ్మా అని నవ్వితే ఏమన్నావు నువ్వు దానికి "మాస్టారు ఉమ దాని చేతితో తాకి చూసి కోస్తే కాని నాకు తృప్తి వుండదు, నా ఒక్క దాని అభిప్రాయం అభిప్రాయమే కాదు నా ఒక్క దాని జీవితం జీవితమే కాదు నా స్నేహితురాలు లేకుండా అని" గుర్తు వుందా, నా కంటి తో చూసి చెప్పకుండా జామకాయ మంచితనాన్నే నిర్ణయించలేని నువ్వు అంత పెద్ద నిర్ణయం నాకు చెప్పకుండా తీసుకుని నాకు తెలియకుండా ఎలా వెళ్ళిపోయావు.....

జీవితం లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క సారి ఒక్కసారంటే ఒక్క సారి కూడా నువ్వు తోడు లేకుండా నన్ను నేను ఒంటరి గా చూసుకున్న ప్రత్యేక సంధర్బమే లేదు. గుర్తు వుందా చిన్నప్పుడు అమ్మ లేనప్పుడూ వంట ఇంట్లో దూరి హార్లిక్స్ బొక్కినప్పడు తెలివితక్కువ గా ఆ పొడి నేలమీద వేసి ఆ జిగురు తో పట్టుబడి పోయి తన్నులు తిన్న రోజులు... మావయ్య వాళ్ళతో కలిసి వీధి చివర సత్యం గారింట్లో మామిడికాయల దొంగతనానికి వెళితే నువ్వు వెనుక వుప్పు కారం పొట్లాలు ఎవ్వరికి కనపడకుండా గౌను జేబు లో దాచి తెచ్చేదానివి.
శలవులకు మావయ్య గారి ఇంటికి నిన్ను కూడా తీసుకుని వెళితే వాళ్ళ అమ్మాయి రమ ప్రేమ వ్యవహారం లో పెద్ద పుడింగి లా గా మద్యవర్తిత్వం చేసి వీపు చిట్ల గొట్టించుకున్నావు మీ అమ్మ తో... :-)

మీ దొడ్లో బొండు మల్లె పూల పొద పక్కన అదేమి చెట్టో కూడా నాకు ఇప్పుడు గుర్తు లేదు దాని కొమ్మల మీద ఎక్కి కూర్చుని శంకరాభరణం లో పాటలు చదివి/పాడి నా కర్ణపుటాలలో తుప్పు అంతా వదల గొట్టే దానివి... ఎవ్వరు వినే వారు కాదు కదా నేను తప్ప నీ పాటలు...

జ్యోతక్క ఆపరేషన్ టేబుల్ మీద చని పోయింది అని ఎంత ఏడ్చామో మర్చిపోయావా! ఏమైపోయివుంటుందే అక్క...... ఆ ప్రాణం ఎటు వెళ్ళి వుంటుందో ఇంక జీవితమంటే ఏమిటి మనం ఇలానే ఎప్పుడో చచ్చి పోతామా అని ఎంత వణికి పోయాము అమాయకత్వం తో వచ్చిన భయం తో... అప్పుడే మనం ఒట్టు పెట్టుకున్నాము గుర్తు వుందా మనలో ముందు ఎవరు చనిపోతే వాళ్ళు మిగతా వాళ్ళకు కనపడాలి పరిక్షలలో తెలియని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి పుస్తకం చూసి వచ్చి అని కూడా ఒట్లు పెట్టుకున్నాము.

చదువుల పేరు తో దారులు వేరయ్యినా ఒక్కటన్నా ఒకరికి ఒకరం చెప్పుకోకుండా ఏరోజైనా వున్నామా? నా గుండెలో క్రిష్ణ నీ కళ్ళలో మెరిసి నచ్చాకే కదా అడుగు ముందుకు పడింది... నాకు నీ మీద ఎంత కోపం వస్తోందా తెలుసా చెంపలు పగల కొట్టాలనిపిస్తోంది... ఎదురు గా చూస్తూ నవ్వుతు వుంటావు... ఎక్కడున్నావు అని ఏడుస్తావు ఇక్కడే వుంటే అని నవ్వుతావు ... ఇంత మనసు లేని దానివైపోయావే నా కళ్ళ నుంచి కారే నీటి చుక్క ను చూసి కూడా నవ్వ గలుగుతున్నావు...అవును లే శరిరాన్ని వదిలేసేవు కదా మనసు కూడా దానితో వదిలేసి వుంటావు...

నువ్వు లేకుండా నాకు జీవితం లో స్నేహమనే పదం కు అర్ధం కూడా తోచటం లేదు... నువ్వు లేని జీవితమే స్నేహ రహితం గా వుంది... నువ్వు లేక సంతోషం సగమైనట్లుంది బాధేమో రెట్టింపైంది ....
మరణమంటే కధ ముగింపు కాదు ఒక కామా నే, కథ మళ్ళీ మొదలవుతుంది స్నేహమెన్నటికి దూరం కాదు అని మధు బాబు గారు చెపుతున్నా..... కన్నీటి తో మసకైన నా కళ్ళకు, దిగులు తో ఒంటరైన నా మన్సుకు ఆ కామానే ధుర్బరం గా వుంది... ప్రాణ స్నేహితురాలినని అనుకుందామంటే నువ్వెళ్ళి పోయావు నా ప్రాణమింకా వుంది,
ఈ జన్మ లో నన్ను మోసం చేసి 30 ఏళ్ళకే వదిలేసి వెళ్ళి పోయినట్లు ఇంక ఏ జన్మ కు చెయ్యక... అలా చేస్తే నీ జత పచ్చి.....

నన్ను వదిలి వెళ్ళిన నా ప్రియ నేస్తం అను కు ఆశ్రు నివాళులతో...

13, జులై 2009, సోమవారం

ఆషాడ విరహాలు

లేఖాయణం లో
ఆషాడ విరహాలు లింక్.

14, జూన్ 2009, ఆదివారం

నిరంతర ఘర్షణ నీతో పంచుకుంటూ...

క్రిష్ణా,
ఎందుకు జీవితం మరీ ఇంత మాములు ఐపోయింది... ప్రేమ లేకా!!! లేకపోతే గొప్ప దైన వెలుతురు వెన్నెల లానే రోజుచూడటం మూలం గా
ప్రేమ కూడా మాములు దైనందిక జీవితం లో కలిసి పోయి ప్రతి విషయం నిస్సారం గా కనపడుతోందా...

అలా కలిసి పోతే జీవితం ఒక అధ్బుతమై ... ప్రతి క్షణమొక వరమవ్వాలే కాని ఇలా ఎందుకువుంటుంది...

నాకింకా గుర్తు వుంది.. మిగతా రోజులన్నీ ఎలా వున్నా పౌర్ణమి రోజు రాత్రి కాసేపు ఐనా బయటకు వచ్చి వెన్నెల వాన లో తడవటం.. గాలి ఎక్కడ నుంచో వింత పరిమళాలను మోసుకుని వస్తూ వుంటుంది.. ఎక్కడ నుంచి వస్తుందో ఆ వింతపరిమళం.. మళ్ళీ తెల్లరితే రాదు ....

బహుశా చంద మామ తన వెన్నెల సంతకాన్ని పూల పరిమళం తో కలిపి కానుక గాపంపుతాడేమో భూదేవి కి... ఇప్పుడేమో అమావాస్య ఏదో పౌర్ణమి ఏదో కూడా గుర్తు లేదు మూగ పోయిన మనస్సుకి. ఎందుకిలా జరిగింది అంటావు....

వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకా విరగ బూసిన పారిజాతాల పరిమళం మనసుకు ఎక్కడో లీల గా తడుతోంది... అసలుజీవితమంటే ఏమిటి....

ఎన్ని సార్లు ప్రశ్న వేసుకున్నా ఏమో ఒక్కసారి ఐనా జీవితం అంటే విరబూసిన పున్నాగలు కొంచం గా మల్లెమరువం, వీటన్నిటికి మధ్య గా ప్రేమ అనే సమాధానం రావటం లేదు... అసలు అదైతే గా జీవితం అలా అని సమాధానంరావటానికి ......

కాదు అంటావా మరి ఏమిటి అంటావు ఇలా ఎన్నో ప్రశ్న లు వేస్తుంటే ముక్కు పుచ్చుకుని ఇలా ఐతేఎలా నల్ల పిల్ల అన్నిటికి ప్రశ్నలేనా అని వూయించేందుకు నువ్వు లేవు కదా అందుకని అలా అనిపిస్తోందా?

ఏమోమరి... నిన్నకు రేపొక తీరని ప్రశ్న రేపటికి మరునాడొక ప్రశ్న, కాలమనే గాలానికి చిక్కి దొరకనివెన్నెన్నో అనిపాడుకోవాలా???? ఇలా ఆలోచిస్తు ఒక రోజు పొడుకుంటే ఇంక మళ్ళీ లేవని సమాధానం దొరికే ఒక వుదయంవస్తుందేమో అప్పుడు తెలుస్తాయేమో అన్ని ప్రశ్నలకు సమాధానాలు.. ఏమో అదీ చూద్దాము...

కాంతి కవిత రాసి పంపమంటున్నారు... రాయగలను అంటావా...ఇంకా నేను కవితలు.. స్పందించే మనసు లేనప్పుడు స్పందన గురించి కవిత వస్తుంది...

ఏదీ జీవితం లో అత్యంత ప్రియమైనది కాదేమో అనే మీమాంస లో పడిపోతే విషయం గొప్ప కావటం లేదు కదా.

అమాయకత్వం ఒక వరం కదా హాయి గా ప్రతి దాన్ని నమ్ముతాము అదే నిజం అని అనుకుంటాము కాని దాని మూలాలను ఎప్పుడు ప్రశ్నించటం మొదలు పెడతామో కదులు తాయి మూలాలు.... అవి వచ్చి మనతో మాట్లాడతాయి
నువ్వు అనుకున్నంత గొప్పవేమి కాదు మేము అని ఇంకా ఎన్నెన్నో దాగిన చరిత్ర కందనినిజాలు చెపుతాయి అంతే అప్పటి వరకు మనం వాటిమీద నిర్మించుకున్న సౌధాలన్నీ కూలుతుంటే ఏమి చెయ్యలేనినిసహాయత ఒక వైపు, నిజం లోని తీవ్రత కలిగించే సంతోషం ఇంకో వైపు...

నువ్వు నా దగ్గర లేక పోవటం కూడా ఒక విధం గా మేలేనోయ్ నువ్వే వుంటే ఇంత ఆలోచన కు తావేది.... నిజాన్ని నిగ్గుతీయాలనేంత కోరిక వుండదు కదా..
నువ్వు నన్ను ఎప్పుడూ సత్యాన్వేషి కమ్మన్నావు, కాని మరీ ఇది ఇంత బాధ ను, నిషాను రెండిటిని ఇస్తుందని నీకు తెలుసా? తెలిసే దారి నాకు సూచించి వూరుకున్నావా????
చేయ పట్టుకుని కష్టమైన దారిని సుగమం చేయకుండా? వున్నాగా నీకు తోడు గా ప్రతి ఘడియ... నేను లేకుండానే దాటేవా ధీర్ఘ వర్షచ్హాయా రోజులన్నిటిని అంటావేమో... వు.... అది నిజమేలే...

మొన్నెప్పుడో సోమరి వేసవి సాయింత్రం బద్దకం గా ఏమి తోచక...... మరి కట్టటానికి మల్లె మాలలు లేవు... చదువుదామంటే ఒక మంచి పుస్తకం లేదు... సరి కలిసి టీ తాగుతు వాదనేద్దాము నాకు నచ్చిన కవి సామ్రాట్ విశ్వనాధ సత్యన్నారాయణ గారి గురించో నీకు నచ్చిన గోన బుద్దా రెడ్డి గారి గురించో అంటే నువ్వూ లేవాయే...

అందుకని ఎప్పుడో లోపల పడేసిన కోలాటం కర్రలు తీసి కాసేపు మనం చూసిన మహా నంది క్రిష్ణ కోలాటం పాటకు తాళంవేయాటానికి చూస్తే చాలా కష్టం ఐపోయింది రా.. మరీ నీ సావాసం ఎక్కువ పుస్తకాలకు, ఆలో చనలకు దగ్గర.... పనులకు, ప్రపంచానికి దూరం ఐపోతున్నా.. అదే మంటె అదే అసలు ప్రపంచం అంటావు

కిందటి నెల M.I.T లో MITHAS వాళ్ళది సంతాన గోపాలన్ గారి కర్నాటిక్ వోకల్ జరిగింది అట.. నా మైల్ ఎందుకనోరాలేదు.. ఎప్పుడు ఫోన్ చేసి చెప్పే శ్రీనివాసన్ కనీసం చెప్పలేదు.. ఎందుకు చెపుతాడు కిందటి సారి నువ్వు వచ్చావని మంచితనం గా భోజనానికి పిలిస్తే ఆయనతో ఆలోచనలలో సామ్య వాదం, ఆచరణలలో ఫ్యూడలిజం అంటు వాదనపెట్టుకున్నావు...

జీవితం లో ప్రతి దానికి వాదనై పోతోంది రా గమనించావా ఘర్షణ లో నుంచి పుట్టేదే నిజం ఘర్షణే లేకపోతే అమృతం పుట్టేదా అన్నావు మొన్న ఒక సారి మరి హాలాహలం కూడా నిరంతర ఘర్షణ లో నుంచే కదా అంటె హాలహలమే లేక పోతే అమృతం విలువే లేదు అంటావు...

నిజమే కాని వీటన్నిటికి మించిన సత్యమొకటి వుంటుంది, అది మౌనం నుంచే.... అనతానంత మైన విశ్వ శాంతి నుంచే పుడుతుంది ... ఏమంటావు...?

1, జూన్ 2009, సోమవారం

లేఖాయణం

కౌముది లో ఈ నెల నుంచి ప్రచురితమవుతున్న నా లేఖల లేఖాయణం లింక్.

19, మే 2009, మంగళవారం

ఎడబాటుని జపిస్తూ...

నేస్తమా నా ప్రాణమా నీ లేఖ అందింది. వుహు కాదు కాదు నీ వూపిరి వినిపించింది ఆ లేఖ లో.... ఈ అధ్బుతమైన సాంకేతిక రంగం ఎంత విస్తరించి పోని... దానిని వుపయోగించుకుని నీ రూపం సదా నా కనుల ముందు ఖండాంతరాల నుంచి కూడా ఆవిష్కరింపచేయని... కాని

నా కృష్ణుడూదిన వేణు గానామృతం పదాల మధ్య వూపిరి తో కలిసి స్వరాలు గా.... వరాలు గా మారి... పదాల మద్య మెదులుతు... ఆ పదాలలో కృష్ణయ్య హృదయాన్ని కొంచెం కొంచెం గా అవిష్కరిస్తూ, అంతలోనే జలపాతమల్లే కన్నీటి సుడులలో తిప్పేస్తూ... గాఢమైన అనుభవాల సాంద్రత ను ఆ రాగాలకు దట్టిస్తూ..... జగాలన్నిటిని దాటిస్తూ..

వుహు ఆ అనుభవం... అనుభూతి కి సరి పరచ గల సాంకేతికత ఇంక రాలెదు రా బంగారం... ఐనా నిన్ను చూడటానికి ఇవి అన్ని ఎందుకు చెప్పు. ఒక్క సారి కనుల ఎదుట ప్రపంచం అంతా మాయమయ్యి మనసు ముందు నింగి ని సాగే నీలి మేఘం కోసం పరుగెడుతున్న అమ్మాయి ఆ అమ్మాయి ని మాత్రమే పట్టుకోవటానికి వెను వెంటే పరుగు తీస్తున్న అబ్బాయి నీ స్మృతి పధం లో మెదలరా...........

అంతలోనే నీలిమేఘపు మెరుపులను పూలమ్మి బుట్టలోని విరజాజుల వెలుగు ని కళ్ళల్లో దాచేసిన ఆ జంట కలిసి విశాల మైదానం లో ఎగరేస్తున్న పతంగులు కనపడవా... పతంగుల టప టప లలో కలిసిన గాలిని అందులోని చెమ్మ ను ఆర్ధ్రత గా మార్చి కళ్ళల్లో కన్నీటి పూలను కురిపిస్తు సెలవు తీసుకుంటున్న ఒక పిచ్చి ప్రేమ జంట నీ కళ్ళ ముందు మెదలటానికి ఈ కెమెరా లు ఎందుకు చెప్పు...

నీ వంకర టింకర అక్షరాలనే కోట్ల సార్లు చదువుకుంటు... ప్రతి అక్షరం లోని ఆనందాన్ని ఆవేశాన్ని ఆవేదనను చిన్న్ని రాగాలు గా వాటన్నిటిని కలిపి సాగే అనంత మోహన రాగం గా అంతర్లీనమయ్యే నీ వేణు గానాన్ని వినటం అనే అధ్బుతం ఒక్క వుత్తరం తోనే వస్తుంది ఫోన్ కాని కెమెరా లు కాని వుపయోగ పడ గలవా నువ్వే చెప్పు...

మనం యూనివర్సిటి గుల్ మొహర్ చెట్ల కింద ఆ పూల గుత్తు లను చూస్తూ వాన నీళ్ళ తో కలిసి పరుగెడుతున్న తంగేడు పూల ప్రవాహాన్ని ఆపటం కోసం దోసిళ్ళతో తీసి దాచిన నీళ్ళన్ని గుండె లోనికి చేరి ఒకటె రొద పెడుతున్నాయి రా ఎప్పుడు వస్తావు నువ్వు కలిసి వదిలేద్దాము మళ్ళీ ఆ ధారలను ప్రవాహం లోకి.... వాటిని విడతీసిన పాపమేమో మనం కూడా ఇలా ఎడబాటు ను సహిస్తూ యుగాలు గడుపుతున్నాము...

14, మే 2009, గురువారం

ఆనందం ఆచూకి కోసం నా స్నేహితురాలి తపన...

నా స్నేహితురాలి పుట్టిన రోజు సంధర్బం గా తను రాసిన వుత్తరాన్ని తనకే అంతర్జాలం లో చూపిస్తున్నా.
జన్మదిన శుభాకాంక్షలతో.... తను కోరిన ఆనందం సదా తన సొంతమవ్వాలని కోరుకుంటు....


నేస్తమా,
అవును. ఏది? ఎక్కడ మనం కోల్పోతున్న అందమైన ఆ ఆనందం ఆచూకి? సగం పైగా దిగువ మద్య తరగతి కుటుంబాలున్న మా పల్లెలో అందరి మోము పై చిందులు వేసిన ఆ ఆనందం ఇప్పుడు ఎందరో శ్రీమంతుల్లో వెతికి చూసినా కనిపించదే? ముందుకు పరుగులు తీస్తున్నామనుకుంటూ వెనుకకు చేజారుతున్న ఆ స్వర్గాన్ని మనం బధ్ర పరుచుకునేది ఎలా?

ఒక్కొక్కరు ఒక్కొక్కలా నిర్వచించే ఆనందం.. ప్రతి మనిషి ఆరాటానికి మూలబిందువు ఈ ఆనందం.. మనమందరమూ పరితపించే ఆ ఆనందం ఎక్కడ వుంది? మనం ఎంతో ప్లాన్ చేసి వెళ్ళే వెకేషన్ లోనా... అప్పుడప్పుడు మనం కలిసే గెట్ టు గెదరు, బర్త్ డే, యానివర్సరీ లాంటి పార్టీస్ లోనా.. సంపాదించిన డబ్బులోనా... ఎచ్చీవ్ చేసిన సక్సెస్ లోనా.. నిజమే సుమా! వీటన్నిటిలో వెతికి చూస్తే చాలా ఆనందం కనపడుతోందే!! ఇలా కొంచం కొంచం గా అప్పుడప్పుడు వెదికిపట్టుకునే ఆనందం ప్రతి నిమిషం మన సొంతమైపోతే అదేనా భూతల స్వర్గం...

ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులు, పెయిన్ మేనేజిమెంటు, బ్యాలెన్సింగ్ వర్క్ అండ్ లైఫ్, పెర్సనాలిటి డెవలప్మెంట్.. ఇలా ఎన్నో .. ఎన్నెన్నో.. వీటన్నిటి ఆఖరి మజిలి ఈ ఆనందం. అన్నీ వుండి మనమింకా స్ట్రెస్... స్ట్రెస్ అంటూ వున్నామంటే లోపం ఎక్కడ వుంది... వీటి పేర్లు కాదు కదా కనీసం తెలుగులో ఒక వాక్యం చదవటానికి కష్టపడి... కరెక్టు గా చదివేనా అని అడిగి మురిసి పోయిన అమ్మమ్మ ఎప్పుడు అంత హాయి గా, ఆనందం గా ఎలా వుండేది? ఆమెకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసులు ఎవరు భోదించారు...

పసిపాప లా నవ్వే ఆ తరానికి ఏదో మొహమాటం గా తప్పక నవ్వే ఈ తరానికి ఇంతటి అంతరం ఏమిటి? ఆలోచిస్తుంటే అప్పటికి ఇప్పటికి మన జీవన విధానంలో చోటు చేసుకున్న మార్పులు... పోగొట్టుకున్న అలవాట్లే కారణమేమో అనిపిస్తుంది. తర తరాలు గా వస్తున్న మన ఆచారాల్లో అలవాట్లలో క్షుణ్ణం గా పరిశీలిస్తే ఎన్నో కళలు ఎంతో స్ట్రెస్ రిలీఫ్.

టైం ఈజ్ మనీ అనుకునే మనకు మనం పోగొట్టుకున్న వాటి విలువ తెలిసేది ఎలా? టైము లేదని కొన్ని మరీ పాత కాలపు అలవాట్లని కొన్నీ, ఒడిదుడుకుల జీవితం లో కూడా మనసును వూరడించే మంచి అలవాట్లు మనం దూరం చేసుకున్నామా?

ప్రొద్దున్నే నిద్ర లేచి వాకిట్లో ఎంతో మెళకువగా ముగ్గు చక చకా వేసి .. అయ్యాక ఒక అడుగు వెనక్కి వేసి ముచ్చటగా ముగ్గును చూసి, పనులు తరుముతున్నాయన్నట్లు వంటింటిలోకి పరుగెట్టిన మన అమ్మ లో వున్నది ఆర్టిస్టే కదా!! ప్రతి రోజు తల దువ్వి జడ అల్లేప్పుడు, ఎప్పటికి వుండి పోయే శిల్పాన్ని తీర్చినంత ఓపిక గా అందం గా అల్లి.. ఏది ఇటు తిరుగు అని గడ్డం పట్టుకుని తిలకం దిద్ది ప్రేమ గా చూసే మన అమ్మ లో ఎంత ఓర్పు.. పూవులు మాల కట్టటం లో ఎంత నేర్పు.

ఏదో పండుగ అనో, ఆషాడం అనో చేతులకు, కాళ్ళకు గోరింటాకు పెట్టి, మల్లెపువ్వుల జడ అల్లీ, .... ఏవి మనకు మన పిల్లలకు ఆ అనుభూతులు.... మనకి ఏది ఆ ఆనందం? దేశం కాని దేశం... అవన్ని ఇక్కడ ఎలా అనుకుంటే పొరపాటే సుమా.. మన దేశం లో కూడా అవన్ని టైము వేస్టు పనులైపోయాయి. ఇప్పుడు అక్కడ కూడా ఇళ్ళ ముందు ఏదో వుంది అన్నట్లు వున్న ముగ్గు పనిమనిషి కి ఇంకో పని. వేకువఝామునే ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ వేసే ముగ్గు అందరిలోనూ వుండే కళాకారిణి కి ప్రొద్దున్నే అర్పించే నైవేద్యమేమో...

మనం స్పీడ్ యుగం లో వున్నాము. అలాంటి పనులన్నీ చేసే తీరికేది? అందరికి అదే ప్రాబ్లం... ప్రతి ఒక్కరు పరుగులు తీసే ఫారెస్ట్ గంప్ లే ... అలా పరిగెడుతూనే దారి పక్కనే వున్న రంగు రంగు పూవుల అందాన్ని ఆస్వాదిస్తూ... సుమ గంధాలను ఆఘ్రాణిస్తూ... పరుగెడితే.. గమ్యం చేరే సరికి ఆయాసం తో పాటు కొన్ని అనుభూతులు, ఆ అనుభూతులు మిగిల్చే ఆనందం మన సొంతం అవుతాయేమో ప్రయత్నం చేద్దామా? ఆ రంగు రంగుల పువ్వులు మన ఇంటి ముందు పూసిన రోజాలు కావచ్చు.. అందమైన ప్రకృతి కావచ్చు.. తెల్ల గా మెరిసే స్నో కావచ్చు, చిన్నారుల నవ్వులు కావచ్చు, చెప్పి నవ్వుకున్న జోక్ కావచ్చు.. ఇలా మనం మెచ్చే ఏదైనా...

హడావుడి గా స్కూల్ కు రెడీ అవుతుంటే ఎంచక్క గా స్కూలుకు వెళ్ళనక్కర్లేని రెండేళ్ళ బుజ్జి గాడు వాచ్చేవాడు, లంచ్ బాక్స్ లు సర్దుతూనో, తలలు దువ్వుతూనో పిల్లల అరుపులు నాన్న గారి విసుగుల మద్య కూడా ఒక గిన్నె లో మరమరాలో కారప్పూసో పోసి ఇచ్చే అమ్మలో ఎంత బ్యాలెన్సు!!

అది అందుకుని కళ్ళు మెరుస్తు నవ్వే బుజ్జి అతిధి మొహం చూస్తే కలిగే ఆనందం ఎంత ముద్దు గా వుండేది? అప్పటి వరకు త్వరగా కాని అంటూ విసుక్కున్న న్నాన్న గారు కూడా నవ్వుకుంటు ఏరా .. అప్పుడే ఆటలకు బయలుదేరేవా అంటూ ఎత్తుకుని ముద్దాడటం...

అదేనా మనం కోరుకునే స్ట్రెస్ మేనేజ్మెంట్. బుజ్జి అతిధులు బుడి బుడి నడకలతో తానుగా రాగలిగే పల్లెలో మనం లేక పోయినా ప్రతి నిత్యం మనలను మురిపించే ఉషోదయాన్ని ఒక్కసారి మనసారా పలకరిద్దామా? రొటీన్ గా మనం చేసే పనుల్లో కొంచం ఆనందాన్ని రంగరిద్దామా?

11, మే 2009, సోమవారం

కృష్ణుడూదిన వేణు గానం

చిన్నా,
ఉభయకుశలోపరి అని మొదలు పెడదామా అంటే మరి అంత అబద్దం తోనా మొదలే అనిపించి ఆపేస్తున్నా! బాగున్నావా అని అడుగుతు మొదలు పెట్టాలంటే "నువ్వులేకుండానా" అని అడిగే నీ కళ్ళు గుర్తు వచ్చి కలం దానతట అదే ఆగిపోతోంది.. ఇలా ఏమి రాయాలా అనే మీమాంస తోనే వారాలు గడుస్తున్నాయి కాని నీకు రాయకూడదని కాదు రా...

రోజు లో 12 గంటలు ఆ ఆఫీసు వాడే తీసేసుకుంటాడా.. ఇంటికి వచ్చి తలుపు తెరుస్తూ అనుకుంటా
"మూసి మూయని తలుపు తెరిచేను మది తలపు విరిసి విరియని మొగ్గ చిక్కింది నా కురుల.... జాగేల నోయి నా చిన్ని క్రిష్ణా" అంటు రాగాలు తీస్తూ ఎదురు వస్తావని.. కాని ఎదురు గా శున్యం పక్కున నవ్వుతు ఎదురు వస్తుంది...

దాని మీదకు తాళాలు విసిరేసి కక్ష్య తీర్చు కుంటాను... నేను మొగవాడిని అనే అహంకారం నిలబెట్టుకుంటానికైనా
వచ్చే కన్నిటి చుక్క ను బలవంతం గా గుండె గోడలకు చెమ్మ గా అద్దేసి తదుపరి కార్య్క్రమానికి తయారు ఐపోతాను అసలు నాకేమి కానట్లు నువ్వనే వునికే నా జీవితం లో లేనట్లు...

నువ్వు అన్నట్లు ఒంటరి రాత్రి నా గొంతు తో తప్ప నా అసలు రూపం నీకు నేను ఎప్పటికి చూపించనేమో...... మరి నీ దృష్టి లో ఈ ఆరు అడుగుల దీరోదాత్తుడు నీ క్రిష్ణ అలానే వుండాలి కదా..

నాకు నీకు లా అంత పెద్ద వుత్తరం రాయటం రాదురా... అందులో నా మనసును అక్షరాలలో కూర్చటం అసలే రాదు... అబ్బ ఏమిటి చెయ్యి ఇలా చురుక్కుమంది.. వో ఫొటో లోనుంచే నీ చూపుల వేడి తట్టుకోలేక పోతున్నా.. సరే సరే మొదలు పెట్టకు రాస్తాను ప్రతి చిన్న విషయం రాస్తాను..

ఏమి వుంటుంది రా చెప్పటానికి కేపిటలిజానికి సోషలిజానికి తేడా కూడా తెలియని మేనేజర్, ఎక్కడ చూసినా పేరుకు పోయిన బ్యూరోక్రసి.... ఎక్కువ ఐన ఆర్ధిక మాంద్యం........ ఇప్పటికే వున్న బుద్ది మాంద్యానికి తోడు.....
సమస్య కు పరిష్కారం గాయానికి బేండ్ ఎయిడ్ కాదు సర్జరి అని తెలుసు కాని తెలియనట్లు నటిస్తారు మా ఒక్క ఆఫీస్ లో నే కాదు అంతా అదే పరిస్తితి...

ప్రపంచం అంతా ప్రేమ తో వెలుగుతోంది... ఆ ప్రేమ జ్యోతి జీవితాలను ప్రకాశం చేస్తుంది అంటారు నీ వంటి పిచ్చి వాళ్ళు నాకైతే ప్రపంచాన్ని మొత్తం స్వార్ధం, ఈగో నడిపిస్తున్నాయి అనిపిస్తుంది....
నిన్న ఆదివారం కదా రామక్రిష్ణా, ప్రకాష్ వాళ్ళు భోజనానికి పిలిచారు....

నిన్న పొద్దుటే వెళ్ళి కాసేపు టెన్నిస్ ఆడి తిని మద్యాన్నం రచనా గోష్టి లో కూర్చున్నాము .... నిన్నటి విషయం "ఆధునిక కవిత్వం/ రచన ల పైన టాగోర్ ప్రభావం" నువ్వు వుండి వుంటే బాగుండేది... ప్రత్యేకం గా నేను చొరబడి అభిప్రాయాలు చెప్పేంత తెలియదు కదా అందుకే వింటూ కూర్చున్నా...

అర్ధ రాత్రి ఇలా కూర్చుని నీకు వుత్తరం రాస్తున్నానా..... మద్యలో రేపు పొద్దుటే ఆఫీస్ లో మీటింగ్ లో ఆడవలసిన అబద్దాలు ఆలోచించుకుంటున్నా... ఇంతలొ ఎక్కడ నుంచి వచ్చిందో ఈ ఈగ ఒకటి నా చుట్టూతూ యెగురుతూ వుంది, చిరాకు గా వుంది ఇంత పెద్ద ఇంటి లో దానికి ఇంక చోటు ఎక్కడ దొరకనట్లు వచ్చి నా దుప్పటి , నా కంప్యూటర్ మీద వాలుతుంది ఏమిటి అని.
కొంచం శ్రద్ద పెట్టి దానిని ఒక్క దెబ్బ వేసి హరీ అనిపిద్దామా అనిపించింది మళ్ళీ అంతలోనే మనం ఒక సారి చేసుకున్న చీమ వేదాంతం చర్చ గుర్తు వచ్చింది...

ఈ ఈగ ను చంపి నేను పాపం మూట కట్టుకుంటానా అసలు ఈగ ను చంపితే పాపం వస్తుందా రాదా.. అప్పుడు మద్యాన్నం నేను తిన్న కోడి కూర రుచి గుర్తు వచ్చి అంతలోనే దిగులు వేసింది ఐతే ఆ కోడి ని చంపిన పాపం చలం గారి కథ లో లా ఈ దిగులు ఫడటం అనే శిక్ష తో పూర్తి అవుతుందా....

చిన్నా నీ ఆలోచనల జబ్బు నాకుకూడా పాకిందిరోయ్....

సావాసాల సుగంధం నాకు కూడా కొంచం అంటిందేమో గంధపు మాను ను నరికే గొడ్డలి కి కూడా ఆ సుగంధం అంటినట్లు... చూడు ఎంత పెద్ద వుత్తరం రాసేనో నేను...

నాకు ఈ వుత్తరాన్ని నీకు పంపాలని లేదు రా.. నేనే తీసుకు వచ్చి నీకు ఇచ్చి నువ్వు చదువుతు ......నవ్వుతు ..... అంతలోనే సగం కళ్ళు మూసి ఆలోచించే ఆ ఆనంద పారవశ్యపు ముద్ర ను ఎదురుగా నుంచుని చూసి ఈ నల్ల పిల్ల ప్రేమ ను ఇంత గా పొంద గలిగేను కదా అని నా అదృష్టానికి నేనే అబ్బురపడాలనిపిస్తొంది
కాని ఆ కోరిక ను మనం మళ్ళి కలిసేప్పటికి వాయిదా వేస్తూ... పంపిస్తున్నా చెలి ఈ వలపు తలపు ను నీ ప్రేమ సౌధం లోకి...

16, మార్చి 2009, సోమవారం

కంటి తో విను ఈ గుండె ఘోష ను..

క్రిష్ణా,ఎన్ని యుగాలయ్యాక ఎక్కడ ఈ పాతాళ కుహరాల నుంచీ పిలుపు అనుకుంటున్నావా? ఇక్కడే నీ గుండె లోతుల నుంచే... నేనింక ఎక్కడ వుండ గలను చెప్పూ?

ఎలావున్నావు నేస్తం? ఇంటి ముందు పూలతీవె ఇంటి వెనుక రావిచెట్టు క్షేమమా?కదిలిపోయే కాలమంతా కావ్యమైనా కాదు సుధా మాధురులతో మరొక్క సారి తలుచుకుందాము అంటే... ఎంత రాసినా ఇంకా చెప్పవలసినవి ....అస్పృష్టం గా మనసుకు తోచి తోచనివి......చెపుదామని తీరిక గా కూర్చుని, జ్ఞాపకాల పున్నాగలను ఏరి గుచ్చుదామంటే చిత్రం ఒక్క పువ్వూ కూడా చప్పున రాలి పడటం లేదు... అన్నీ అసంపూర్ణ చిత్ర గీతాలే... అన్నీ మద్యలో ఆగి పోయిన కాలం ఆపేసిన కావ్యాలే... ఏమని చెప్పుకుందాము చెప్పు.........
రోజంతా పూస గుచ్చినట్లు చెప్పూ ...... రోజులో నేను ఎన్ని సార్లు గుర్తు వస్తానో ఎప్పుడెప్పుడు గుర్తు వస్తానో చెప్పు అన్నావు కదు కిందటి వుత్తరం లో... వూ............

ప్రొద్దున కిటికి బయట చిన్ని రంగు రంగుల గువ్వ తన ముక్కుతో అద్దం మీద కొట్టి లేప గానే వసంతమొచ్చిందని నవ్వుకుంటు లేస్తుండగానే అనుకుంటా క్రిష్ణ కు చెప్పాలి ఈ గువ్వ ఈక లో ఆ తెలుపు ఎరుపు కలిపిన లేత రంగు ఎంత అందం తెచ్చిందో దాని చిన్ని పసుపు రంగు ముక్కు ఎంత అందం గా వుందో చెప్పాలి అనుకుంటా కానీ వెళ్ళాలి కదా కదన రంగానికి అని అక్కడికి పిట్ట సంగతి... ...నీ సంగతి ,.....పక్కన పెట్టి పరుగు మొదలు పెడతా...

సరే పైన పని అంతా ఐపోయి కిందకు వచ్చి కిటికి తెర పక్కకు లాగుతుంటే ఎదురుగా చెట్టూ చిన్ని చిన్ని ఎర్రటి మొలకలు పలకరిస్తాయి మళ్ళీ మనసు మీద మూగే ఆలోచనలను తోసేసుకుని పని చేసుకుంటాను.,.. బయటకు వచ్చి పని కి వెళుతుంటే ఎక్కడో నీలి ఆకాశపు అంచున ఒక తెల్లని మేఘం ఏదో నాకంటే తొందర తొందర గా పరుగెడుతు ఇంతలోనే నా కార్ లోనుంచి మంచి పాట వినపడో ఏమో పాపం నిలిచి నన్ను తేరి పారా చూస్తున్నప్పుడూ అనుకుంటా నీకు చెప్పాలని..

ఇంకా....... మధ్యాన్నపు ఎండ ఆకులను తళ తళ లాడిస్తున్నప్పుడు ఆ మెరుపులోని నిగ నిగ లు..... సాయింత్రం తన చీకటి పరదా ని ఆకాశం మీదకు వల విసురుతుంటే ఏమీ చేయలేక మొహమంతా ఎర్రన చేసుకుని తుర్రుమన్న సూరీడి అలక గురించి ఏన్నో చెపుదాము అనుకుంటా... ఒక రోజుకు ఈ టెక్నాలజి అంతా పెరిగి పోయి నా మనసులోని ఆలోచన నేను చెపుదాము అనుకోగానే దానిని కాంతి తరంగాలు గా మార్చి నీకు అందచేసే సాధనం ఒకటి వస్తే బాగుండు...... కొత్త గా వచ్చేది ఏమి వుంది అది ఎప్పుడూ మనతోనే వుంటుంది "మనసు" అంటావేమో నువ్వు అని నవ్వుకుంటా మళ్ళీ నాలో నేనే...

భావాల తీవ్ర త ఎక్కువ ఐందేమో అనిపించి నప్పుడు వాటి గోల తో నిన్ను వుక్కిరి బిక్కిరి చేస్తానేమో అనుకున్నప్పుడు... కాసేపు ఆపుతున్నా.. ఇప్పుడే ఇంద్ర గంటి శ్రీకాంత శర్మ గారి కవితలు చదువుతున్నా.. కొన్ని చాలా బాగున్నాయి నువ్వు వుండి వుంటే నీ లాప్ టాప్ లాక్కుని నీ పిచ్చి డేటా అంతా చెరిపేస్తాను రేపు నీ రాక్షసి మేనేజర్ వుద్యోగం లో నుంచి పీకేసినా సరే అని బెదిరించి మరీ వినిపించే దానిని......

నీకోసం నేను ఎంతో కష్టపడి శ్రీ శ్రీ గారి కవిత్వం ఇంకా ఆయన ఎవరు..... ఆ ఉస్మానియా యూనివర్సిటి పుస్తకం ఆ అదే వడ్డెర చండీదాస్ గారి అనుక్షణికం బలవంతం గా విన లేదూ.... సరే ఇక్కడ రాస్తున్నా కంటితో విను...
నిన్ను విడిచి వచ్చాక గాని
నీ స్వప్నచ్చాయలింత బలమైనవనినాకు
తెలియదు....
నిన్నటి నీ శ్పర్శ ఇంతగా నా వునికిని నీలోకి లాగేసుకుంటుందని
నాకు తెలియదు..
నీ ఇష్టానిష్టాలు నాకు తెలియవుఏమి
చెపితే అది వింటావువూ అంటావు...
విషమ సంధర్బాలలో
వడగాలిలో చెట్టులాగా జుట్టు విరబోసుకుని
మండుటెండల్ని పిడికిట బట్టీ
అగ్గి స్నానం చేయటం నాకలవాటు..
నా ఆగ్రహావేశాలే తప్ప
నిన్ను గురించి ఆలోచించిందెప్పుడు??
ఇప్పుడీ ధీర్గ రాత్రి లో నన్నవరించి
సరసన పవ్వళించిన ఏకాంత శూన్యానివి నువ్వు...
వూపిరిని బంధించి బెంగను రేపే స్నేహ శ్పర్శ కాదు మనది...
అలవాటు గా పరిణమించిన దైహిక క్రియ
మన వివాహం
మనకు విశ్రాంతి లేదు...
స్వప్నాల రెక్కలు కత్తిరించటమే కర్తవ్యాల పరాకాష్ట...

విచిత్రం గా వుంది కాని నాకు నచ్చింది.. నీకు ఎలా వుంది... ఇంకా చాలా వున్నాయి బాగున్నాయి ... నాకు తెలుసు నీకు నచ్చవు ఇలాంటి కవితలు... కాని తప్పవు కదా నీకు ఈ తిప్పలు... నా కోసం...

రాత్రి 1 దాటింది.. అమావాస్య రోజులు దగ్గరకు వస్తున్నట్లు వున్నాయి.. చిక్కని చీకటి కమ్మని నిద్ర లా లోకం మొత్తం మీద పరిచి జో కొడుతుంది... అబ్బ ఎంత శబ్ధం చేసుకుంటు వెళుతుందో ఇంటి వెనుక రైలు... అంత లా కూత పెట్టక పోతే ఏమో ఇంత అర్ధ రాత్రి ఎవడు వస్తాడు పట్టాలకు అడ్డు... నిజం గా ఎవడైనా వస్తే వాడు వెళ్ళటానికి కాదు కదా ఇంక ఈ శబ్ధానికి... చూడబోతే రైలు నడిపే వాడికి అన్ని ఇళ్ళల్లో అందరు నిద్ర పోతున్నారు అని నిష్కారణం గా బాధ వచ్చి అందరిని లేపటానికి ప్రయత్నిస్తున్నాడేమో ... వాడికేమి తెలుసు ఎన్ని మనసులు నిద్ర రాక చీకటి లో శూన్యం వైపు చూస్తున్నాయో ఎన్ని మనసులు దిక్కు తోచక ఆలోచిస్తు ఆలోచిస్తూ... అప్పుడే నిద్ర కు జారుకుంటున్నాయో..

పాపం ఇంటి ఎదురుగా గుడి గోపురం మీద పావురం కూడా నిద్ర లోనుంచి వులిక్కి పడి లేచి విచిత్రం గా ఏదో భారం గా శబ్ధం చేసి మళ్ళీ సర్దుకుంది., పాపం దానికి కూడా నాకు లానే అనుకుంటా, ఎన్నాళ్ళు అయినా నీ విరహమింకా కొత్తగానే నీవు లేని వెలితి తప్పించూకోలేనిది గానే వున్నట్లు దానికి ఆ బాధ అలవాటు కాలేదు అనుకుంటా..

27, ఫిబ్రవరి 2009, శుక్రవారం

ఒంటరి గా ఇంకో రాత్రి...


కృష్ణా.. ఏమి చేస్తున్నారు...

టెక్నాలజీ టెక్నాలజీ ఎటు తీసుకెళుతున్నావే అంటే నీ వునికి నీ తేజస్సు నేను లాగేసుకునే వరకు అంది అట . అలా వుంది మన పరిస్తితి . రాత్రి నుంచి మంచు పడుతుంది , ఫోన్ లేదు , టీవీ లేదు , ఇంటర్నెట్ లేదు, అమ్మయ్యో కరెంటు అయినా వుంది . ఈ దేశం లో అన్ని వుంటే మనమే రాజులం , ఒక్కటి కొంచం తేడా వచ్చినా ఏమి చెయ్యలేని బందీలము కదు . తమాషా గా వుంటుంది ఆలోచిస్తే , దేనికి ఆధార పడనవసరం లేని స్వతంత్రత , కాలు కదపటానికి కూడా వీలుకాని నిస్సహాయత రెండు పెనవేసుకుని పక్క పక్క నే మనతో నే వుంటాయేమో .

సరే ఈ గోల కేమి కాని ఏమి చేస్తున్నారు.. జన జీవన ప్రవాహం.. గల గల సాగే స్రవంతి... ఏమి వుంటుంది చేసేందుకు... వద్దు అన్నా వుహుఅన్నా సాగిపోవటం తప్ప అంటారా?

నీవున్నవన్న వుహే
నాకింకా ఈ ప్రపంచం తో పోరాడే శక్తి నిస్తోంది..
చిరునవ్వు తో వెలిగే నీ మోము
నాకు చీకటి వైపు చూడగలిగే ధైర్యాన్ని ఇస్తోంది...
నీవేగా నేస్తం ఈ రాకాసి ప్రపంచాన్ని
నీ మమతల మాయాజాలం తో
సుందర స్వప్నం చేసి నిలుపుతోంది..

అబ్బ ఈ చలి పులి వచ్చి చంపేస్తోంది.. బయటకు వెళితే చలి ఇంట్లోనేమో ఈ పిచ్చి వేడి తో విసుగు... ఈ పని... వంట... విసుగు పుడుతోంది... చదువుకునే రోజుల్లో ఎంత విర్ర వీగే దాన్ని.. నేను వీళ్ళందరి లా కాదు ప్రత్యేకం గా గడుపుతాను జీవితం అని... ఇప్పుడు తలుచుకుంటేనే నవ్వు వస్తోంది..

ఏమన్నావు కృష్ణా కిందటి సారి వుత్తరం లో చలం ప్రేమ లేఖలు ఎప్పుడైనా ఖాళీ గా వున్నప్పుడు చదువుదామని తీస్తే దాని బదులు ఒరాకిల్ పుస్తకం తిరగ వేస్తె రేపు స్టూడెంట్స్ కు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే చేయించేటప్పుడు వుపయోగం కదా అనిపిస్తోందా... ఎవరు నా కృష్ణే నా అలా అంటోంది...

గుండెకు వచ్చే వెక్కిళ్ళను తీర్చే ఒకే మంత్రం మంచి సాహిత్యం అని...

నిన్నటి నీ స్వప్నం ప్రియా ఇంకా నా నిద్ర రాని నిశీధి వీధుల తారాడుతూ పలుకలేని పదాలను
కన్నీళ్ళతో కదంబ మాలికలల్లుతూ, జారిపోయే కాలాన్ని జావళీలు గా మార్చి నాకు అందించింది...
నేస్తం నేటికి స్వప్నమే నీకు బరువైతే జీవితమేమవుతుందో నాకు .........
అంటు... విరహాన్ని కవితలల్లి ఇచ్చిన నా కృష్ణే నా ఇలా మాట్లాడేది
కాలమా నీకిదే నా జోహార్లు..

ఇక్కడ అంటా ప్రశాంతం గా వుంది... అర్ధ రాత్రి నేను నా పాటలు తప్ప ఎక్కడ ఏమి చప్పుడు లేదు, దూరాన హైవే మీద కూడా దీపాల తోరణాల జోరు తగ్గి అప్పుడొకటి అప్పుడొకటి పరుగెడుతూ వున్నాయి.. బయట పాపం ఏదో పేరు తెలియని చెట్టు నెమ్మది గా చలి కి కదులుతూ తన బాధ చెప్పుకుంటోంది.. అరె అంతా ఆకులతో పువ్వులతో వున్నప్పుడు అందరు నన్ను ఎంతో మెచ్చుకుంటారు కదా ఇప్పుడు ఆ ఆకులే వుంచుకోలేక వుంచుకోవటానికి వీలు కాక వదిలేస్తే విసుక్కుంటూ వూడుస్తారు, అప్పుడు అప్పుడు తల పైకెత్తి నావైపు విసుక్కుంటూ ఇంకా ఎన్ని ఆకులు వున్నాయా అని చూస్తూ లెక్క పెడతారు... ఇప్పుడు ఇంత చలి తో బాధ పడుతుంటే అయ్యో అనైనా అనరు.. రేపు నా కొమ్మలంతా మంచు తో నిండి బరువుతోనే వంగిపోయి నుంచో లేక ఆధారం సరిగా లేక బాధ పడుతుంటే అబ్బ ఈ చెట్టు నిండా మంచు తో బలే అందం గా మెరుస్తోంది అంటారు ఎంత స్వార్ధ పరులు మీరు అని చెప్పుకుంటోంది.. ఏమి బదులు చెప్పలేక కిటికీ పరదా పూర్తి గా లాగేసి వచ్చాను..

దానికేమి తెలుసు మన బాధ.. ఎంత వున్నా ఇంకా ఏదో కావాలని పరుగు... మనుగడ కోసం పరుగు... దాని తరువాత లగ్జరీస్ అవసరాలవుతాయి.. అప్పుడు ఇంకా ఇంకా వాటి కోసం పరుగు... దాని తరువాత ఇంకా దేనికో పరుగు... మొత్తం మీద పరుగో పరుగు.. చివరకు వెనక్కి తిరిగి చూసుకుందుము కదా.. చేసినా దానికి విచారిస్తూ ఇలా కాదు అని ఇంకో దారి మళ్ళి పరుగో పరుగు.. చాలు ఇంక ఆపు తల్లి అంటారా.. ఏమో కృష్ణా నా పరుగు మాత్రం గమ్యం నే పుట్టినప్పుడే నిర్దేసించ బడిందేమో నీ వైపుకు.. ప్రపంచం లో ఎక్కడ దొరకని శాంతి సంతోషం నాకు నీ చేతుల మద్యలో నే దొరుకుతుంది..
మరి నన్ను వదిలి ఎందుకు పరుగెట్టేవు అని మౌనం గా నే మీ కళ్లు అడుగుతున్నాయి ఈ వుత్తరాన్ని నాకు తెలుసు.. కాని దానికి సమాధానం కూడా మీకే తెలుసు నేను చెప్పనక్కర్లేదు.. ఈ నల్ల పిల్ల ఈ పరుగు మీరు నిర్ణయించిందే కదా.. భూమి గుండ్రం గా వుంది కృష్ణా ఎటు వెళ్ళినా ఒక రోజు మీ చేతుల మద్య మళ్లీ ఒంటరి సాన్నిహిత్యాన్ని అనుభ వించటంకోసమే ఎదురు చూస్తూ మరి సెలవిక... కలల వుషోదయానికి పరుగిక...