ప్రియమైన నీకు,
చాలా కాలానికి వుత్తరం వ్రాస్తున్నాను అని కోపం వచ్చిందా!
ఇదుగో రేపు అదిగో మాపు అనుకుంటూనే ఈ పనుల వ్యవధి లో రాయలేక పోయాను అని కిందటి సారి నిన్ను కలిసినప్పుడు చెపితే నీ గుబురు మీసాల కిందుగా కదిలిన చిరుదరహాసం నేను గమనించలేదనుకున్నావా? అవును మరి...... ప్రేమ అన్నిటి మద్యా వుండి కూడా అన్నిటి తో కలిసి పోయిన ఒక చిత్తు కాగితం మీద రాసిన వెలిసి పోయిన వాక్యం లా మాత్రం కాదు అని... ప్రేమ లేఖ అయినా ప్రేమ అయినా ఎప్పుడు నేను అల్లరి చేసినప్పుడు నువ్వు విసుక్కుంటూ తల పక్కకు తిప్పి నవ్వినంత కమ్మ గాను అంత స్వచ్చం గాను వుంటుంది అని కబుర్లు చెప్పిన పిల్ల ఇదేనా అనుకుంటావు అని తెలుసు.....
నిన్ను నన్ను ఈ ప్రేమ ను అన్నిటిని మింగేసే మహిమ కాలానికి వుంది మరి అనకు, అంతటి కాలం.. ఎంత ప్రయత్నించి విఫలమయ్యింది చూడు మన ప్రేమ ను చెరిపేద్దామని, అది మరి మన ప్రేమ గొప్పతనం కాదు అంటావా?
కాలం విసిరిన పాచికలతో నా జీవిత వైకు౦ఠపాళి లోనేనెప్పుడు పాముల చేతిలో పడి మళ్ళీ మళ్ళి కిందకే వస్తున్నా తిరిగి పైకి వెళ్లేందుకు ధైర్యం ఇచ్చేది నీ ప్రేమే కదా కృష్ణా... పాములంటావా ఇక వాటి నోటి లోపల పడటం నీ చేతి లోనో నా చేతిలోనో లేదు కదా... మన చేతిలో నిర్ణయాలు వున్నప్పుడే మనం తీసుకోలేక పోయాము.. అది మాత్రం మన చేతిలో వుందా విధి లిఖితం తప్ప..... అబ్బా అంతా వేదాంతమే అని వెక్కిరించకోయ్ ... నీ అంత గా జీవితాన్ని చదవక పోయినా నేను ఎంతో కొంత చూసేను కదా జీవితాన్ని.... నాకు మాత్రం తెలియదా విసిరే వానజల్లు ఒక్క సారిగా సముద్రం మీది వాన లా హోరుమన్నప్పుడు మూసేసిన తలుపుల వెనుక రోది౦చే హృదయం బాధ ఏమిటో...
నిన్న R.P రోడ్ మీదుగా వెళుతుంటే ఆ చివరి తురాయి చెట్టు ఆ పక్కనే బామ్మ గారి ఇంటిలో ని పారిజాతపు మొక్క ఎంత ప్రేమ గా పలకరించాయి అనుకుంటున్నావు... నాకైతే పనులన్నీ ఆపేసి ఒక్క సారి మళ్ళీ ఆ తురాయి చెట్టు కింద కుర్చోవాలని ప్రాణం కొట్టుకుంది. నువ్వు లేవు కదా నేను ఒక్క దాన్ని కూర్చున్నా ఆ అనుభవమైతే తిరిగి రాదు గా అని ఒక్క నిట్టుర్పు ని వాటికి మధ్యాన్నపు వడగాలితో కలిపి ఇచ్చేసి వెళ్లిపోయాను.
ఏమి చేస్తున్నావు ఎక్కడో సముద్రానికి అవతల నీవు ఇక్కడ ఒంటరి గా తీరానికి చేరని నావలను చూస్తూ ఎప్పుడో దరిచేరే స౦యోగ౦ కోస౦నేను... కలిసి వున్న కాలం కంటే మనం కలలు కన్న కాలం ఎక్కువేమో కదు... కలుసుకున్నా, కలలు కన్నా అంతా ఒక్కటే అనుభవాల మాలిక, తరచి చూస్తే ఏమి వుండదు అంతా అంటాడేమో చలం కదు...
అనుభవమంటే గుర్తు వచ్చింది, మొన్న లీల ఆమె భర్తా కనిపించేరు... చాలా సేపు మాట్లాడు కున్నాము... అదే మూర్ఖత్వం ఏమి మారలేదు ఆమె.. అనుభవాలతో అభిప్రాయాలు మార్చుకోవాలి అని నేను, అను ఎప్పుడు అనుకుంటాము..... మరి ఆమెకు మారేంత గా అనుభవాలు ఎదురవ్వలేదో ఆ అనుభవపు తీవ్రత ను అభిప్రాయాలను వేరు చేసి వుంచుతారేమో ఆమె... జీవితమంటే ఇలానే వుండాలి, ఇలా చేస్తేనే ఒప్పు, ఇలా కాకుండా ఏమి చేసినా తప్పే అని ఆమె కు అంత ఖచ్చితం గా ఎలా తెలుసో. ఇంతా చేసి ఆమె ఇలానే వుండాలి అనుకునే జీవితానికి ప్రమాణాలు ఏమి వుండవు ఆమె అమ్మమ్మ, అమ్మ పక్కింటి పంకంజం పని లేక మాట్లాడుకునే మాటలు తప్ప, వాటినే ఆమె అంత గాఢ౦గా ఎలా నమ్మగలుగుతుందో, ఎంత గొప్ప గా చెప్పిందో ఆమె అభిప్రాయాలను, నవ్వే ఆడదాన్ని ఏడ్చే మొగవాడిని నమ్మకూడదు అని మన పెద్దలు వురికే పెట్టలేదు తెలుసా ఎంతో ఆలోచించే పెట్టేరు, ఎందుకు బయటవాళ్ల ముందు అంత విరగబడి అంది.. తెల్ల మొహం వేసి చూసేను... మనిషి ప్రాధమిక హక్కులలో కూడా ఆడ మొగ అని విడదీసి మనం మన హద్దులలో వుంటే అసలుగోలలే రావు అని ఒక్క మాటలో తేల్చి చెప్పింది.. అబ్బ ఇలానే ఏమిటో మాట్లాడింది... వెళ్ళేక మంచి కాఫీ పెట్టుకుని చలం ప్రేమలేఖలు కాసేపు చదివితే కాని తలనొప్పి తగ్గ లేదు..
కాని కృష్ణా ఒక్కొక్క సారి అనిపిస్తుంది అలాంటి వాళ్ల తోనే ఏ గోల లేదు మనకు ఖచ్చితం గా తెలుసు.... వాళ్లు మన౦ ఒకే భూగోళం మీద వున్నా వేర్వేరు గ్రహాలకు సంభందించిన వాళ్ళం అని.. ఎందుకురా ఈ గోలలన్నీ నీకు ఇటురా అంటు చేతుల మధ్య కు లాక్కొని నువ్వుపెట్టే తడి ముద్దు తలుచుకుంటే కాసేపు ఈ గోలలన్ని మర్చి పోతాను... ఇంతలోనే దిగులు మళ్ళీ ఎప్పుడు వస్త్తావు ఇక్కడకు... నువ్వు వున్నపుడేమొ పరిగెత్తే కాలం నువ్వు లేనప్పుడు ఏమవుతుందో.... అసలు ఎక్కడ వుందో కూడా తెలియదు, ఘనీభవి౦చిన కాలం కరిగి కన్నీరైనా కాకూడదు... ఎంతో కొంత బరువు తగ్గేను...