10, అక్టోబర్ 2009, శనివారం

ఒంటరి తోడు...


కృష్ణా,

ఎక్కడ నుంచి ఎక్కడికి పాకుతున్నాయో తెలియని ఈ ఆలోచనలు పాదరసం కంటే పదునైనవి, అవనీతలం కంటే బరువైనవి అని నా అనుభవం నాకు నేర్పిన పాఠాలు. .. జీవితం నేర్పించిన ఎన్నో పాఠాలలో ఇది ఎన్నవది అని అడగకు...ఎన్నైనా ప్రతి సారి కొత్తే... మరీ వుత్త బుర్ర తక్కువది నీ ఈ శిష్యురాలు ఏమి చేస్తాము చెప్పు...

రోజు ఎన్నో విషయాలు.. ప్రపంచం దృష్టి లో ఏ మాత్రం ప్రాముఖ్యం లేనివి, మనకు మాత్రమే ఎంతో విలువైనవి నీకు ఎన్నెన్నో చెప్పాలనుకుంటానా... రోజంతా ఎలా గడుస్తుందా నిన్ను చూసిన క్షణమే అవి అన్ని ఎలా పంచుకోవాలా అని ఆలోచించి సందె మబ్బు ముసిరే చీకటి పొద్దు మొదలవ్వగానే, అన్నిటిని ఒక క్రమం లో పదాల మాలికలల్లి చిరుమల్లెలలో కలిపి కదంబం చేస్తుంటాను. ఏమి లాభం నువ్వు రాగానే అన్ని మాటలు ఒక్కసారి ఫక్కుమని నవ్వి విరిసిన మల్లెలలో కలిసి పోతాయో ఏమి పాడో ఒక్కటి గుర్తు వచ్చి చావదు. నువ్వేమో "అందరితో ఎప్పుడు చూసినా పెదవి మీద పెదవి ఎక్కనివ్వకుండా మాట్లాడుతూనే వుంటావు. నన్ను చూస్తే ఏమిటి హఠాత్తు గా మూగ పిల్ల వైపోతావు" అని ఏడిపిస్తావు. ప్రపంచానికి నేనెవరైనా, ఏమైనా నీకు మాత్రం ఎప్పటికి ఈ మూగ పిల్లలానే నిలిచి పోతాననుకుంటా.

కృష్ణా నీవే కదా అని పాడే గొంతులోని మధురిమై పోతావో ఏమో ఒక్కోసారి నువ్వు...నీతో మాట్లాడుతుంటే ఎన్నెన్నో అవ్యక్త రాగాలు చప్పున మదికి మెరుపల్లే తోచి మాయమవుతాయి. నీతో కలిసి అడుగు వేస్తున్నప్పుడు కొబ్బరాకు కొనల సవ్వడులే ఆ మాయమైన రాగాలను ఎన్నో స్వరాలతో కలిపి వినిపిస్తుంటాయి. నిన్ను చూస్తుంటే కదిలే మదిలో భావాలన్నీ నేను ఎప్పటికైనా ఒక పదం లో పెట్టగలనో, ఒక పాదం లో కూర్చగలనో లేదో తెలియదు కాని... నా నేస్తమా, నా ప్రాణమా ఈ రోజు శ్వాస పలికే ఈ అనాచ్చాదిత భావం నీకోసం పంచటానికి ప్రయత్నిస్తున్నా, పంచకపోతే ఇది నన్ను వుక్కిరి బిక్కిరి చేసేస్తోంది మరి......

రాత్రి ఎందుకు అందరు నిద్ర పోతారో నాకు అర్ధం కాదు. "అందరికి నిద్ర పోయినా జీతాలిచ్చే వుద్యోగాలు వుండవమ్మా అందుకని ఇప్పుడే నిద్ర పోతారు మరి" అని నువ్వు అన్నప్పుడూ కోపం తో చిర చిర లాడేను కాని, నిజమే కదా.... ఐనా నువ్వు ఎంత చెప్పినా ఈ బానిస వుద్యోగాలు, ఈ తల తాకట్టు పెట్టి తెచ్చుకునే జీతాల కంటే వాటిని వదిలి నీకోసం నిదుర కాగ గల రాత్రుల కోసం చూడటమే ఇష్టం. రాత్రులే మరి విరజాజులు మాట్లాడతాయి. ఆ మాటలే నీవు వున్నప్పుడు ఏమి చెప్పాలో తెలియదు, నీవు లేనప్పుడు ఎంత రాసినా తనివి తీరదు.

రాత్రి ఎంత అందమైనది కదు...
ఒంటరి గా కిటికి పక్కన కూర్చుని నీకు వుత్తరం రాస్తూ వుంటే బయట వరండాలో కట్టిన చిరుగంటలు... వాన తో కలిసి వచ్చే గాలితో జత కూడి, రాత్రి పాడే ఈ మౌన రాగానికి వురుములతో పాటు దాని వంతు గా అది కూడా తన గొంతు అరువిస్తోంది. తల పక్క కు తిప్పి చూస్తే పక్క మీద నువ్వు నిద్దరోయే చోటు గుబులు గా , కూసంత దిగులు గా నా వైపే చూస్తోంది. అబ్బ ఈ జీవితమంతా నీ కోసం ఎదురు చూస్తు వుండటం తోనే సరి పోతుందనుకుంటా.. పక్కనే జానకి హృదయం తో కామోలు పాడుతోంది "కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని" అంటు. నిజమా కృష్ణా...

ఇంకో జన్మ కావాలా నే కోరుకున్న జీవితం నీతో గడపటానికి.. కావాలేమో... మన పెళ్ళి లో అందరు నన్ను అభినందనల పరంపర లో ముంచేసేరు. " నువ్వు చాలా అదృష్టవంతురాలివి నువ్వు కోరి వలచిన వాడే నీ వాడైపోయాడు" అని. మరి నాతో కలిసి చదివిన అందరికి తెలుసు గా నేను డేటా బేస్ ఆర్కిటెక్చర్ బుర్ర లోకి, నీ రూపం గుండెలోకి ఒకే సారి ఎక్కించుకున్నాను, రియల్ టైం ఆబ్జెక్ట్స్ తో పాటు నిన్ను కూడా నా రియల్ లైఫ్ లోకి ఆహ్వానించేసేను అని. :-)

కృష్ణా నాకు ఒక్కో సారి అనిపిస్తుంది నువ్వు ఇది అంతా నన్ను పరిక్షించటానికి చేస్తున్నావా అని. అమ్మో అంత అపవాదా నా మీద అని మొట్టికాయ వేస్తావేమో కాని నాకైతే అలానే అనిపిస్తుంది. "నీ ప్రేమ కళ్ళ నుంచి ఆగక నా వైపుకు పరుగెత్తి వెనక్కి తిరిగి రాస్తున్న నన్ను ఎన్ని సార్లు భుజాలు పట్టి తిప్పక పోతే నేను ఎందుకు చూసే వాడిని నీ వైపు" అని అనలేదు నీవు తరువాత? తెలిసీ ఏమి తెలియనట్లు ఎంత కాలం ఏడిపించి ఒక్క సారి నాకోసం హాస్టల్ కు వచ్చేసి "ఏరా గీతాంజలి కు వెళదామా" అని అడిగేవు...

ఏమైపోయింది ఆ ప్రేమావేశం.. అంటావేమో నువ్వు "ఎప్పటైకి అలానే వుండాలంటే ఎలా జీవితం, భాద్యతలు విస్తారమయ్యే కొద్ది మన పరిధి కూడా పెరగాలి" అని.. నిజమే రోజు లో 24 గంటలలో ఒక్క నిమిషం కూడా వదలకుండా గడపటం మాత్రమే ప్రేమ అని నేను అనటం లేదు.... కాని కలిసి గడిపే ఒక గంటైనా, వారానికి ఒక రోజైనా మిగతా రోజులకు గంటలకు బతకటానికి కావలసిన జీవన సారాన్ని అందిచలేకపోతే...? వున్న గంట కూడా రేపు చూడవలసిన డాక్యుమెంట్స్ మాట్లాడవలసిన మీటింగ్ ల గురించి ఆలోచిస్తే.... మనం పెట్టుబెడి పెట్టిన స్టాక్ ల గురించి అవి చెయ్యగల లాభాల గురించి ఎప్పుడో మనం రిటైర్ అయ్యాక గడిపే జీవితానికి ప్రగతి సోపానాలంటు ఈ క్షణం లోని జీవితాన్ని కాలదన్నుకుంటున్నాము అనిపించటం లేదా...

కలిసి మనం వాకింగ్ కు వెళ్ళి, ఒక పుస్తకం కలిసి చదివి, ఒక మంచి సినిమాను చూసి దానిని విశ్లేషించి ఇంతెందుకు ఇద్దరం కలిసి వంట చేసుకుని వరండాలో దుప్పటి వేసుకుని కూచుని కలిసి తిని ఎన్ని రోజులయ్యింది చెప్పు.. ఇంతటి అల్ప సంతోషాలే మనం కలిసి ఆనందించ లేక పోతున్నామే...

నేను ఏం అనకుండానే మొదలు పెట్టేస్తావు నీకు కాలం విలువ తెలియటంలేదు నేను లేనప్పుడు ఆ PMP exam పూర్తి చెయ్యమన్నానా? ఎందుకన్ని గులాబులు దొడ్డి నిండా, పొద్దుగూకులు వాటికోసం అక్కడ తిరగ... ఇక్కడ తిరగ, వున్న కాస్త ప్లేస్ చక్క గా స్టోన్ పరిపించుకుంటే తేలిక కదా ఆ బురద లో నుంచి నడుస్తూ ఎదగవా అన్నావు... గుర్తు వుందా.... ఎదగటమంటే మూలాలు మర్చిపోవటమని నాకు తెలియదు రా.. ఎంత సాధించినా.... ఎదిగినా ఇంకా సాధించ టానికి, ఎదగటానికెప్పుడు ఏదో ఒకటి మిగిలే వుంటుంది మన అంతట మనం ఎదుగుదలను ఎలా వుండాలో అది మనకెంత సుఖానిస్తుందో తెలుసుకుని నియంత్రించుకోక పొతే...

చిటారు కొమ్మల మీదుగా ఎగురుతున్న పతంగి ని చూసి కేరింతలు కొడుతున్న నా నేస్తమా ఆ పతంగి మొదలు ఇక్కడ నేల మీద స్తిరం గా నిలబడ్డ పిల్లవాడి చేతుల నుంచి నియంత్రించబడుతోంది గుర్తు పెట్టుకో... దారం అంచులకు గాజు పొడి రాసి పక్కన వాడి ని తెంచుకుంటూ ఎగరగలుగుతున్నావని మురుస్తున్నావు కాని ఆ పొడి తయారిలో తెగిన నీ చేతి వేళ్ళ గుండా కొంత నీ రక్త నాడులలోకి చేరి నీ హృదయ తంత్రులను కోస్తోంది గమనించుకో... నీ అడుగున అడుగై వేకువ వెన్నెల లో విరిసిన వేగు చుక్కంటి ప్రేమను నిద్ర మత్తుతో తోక చుక్కని భ్రమిస్తున్నావు..

ఏమిటో శిష్యురాలే మాస్టారుకు సుద్దులు చెపుతోందా... మధువని లో రాధిక కు కృష్ణుడికి తేడా లేదు గా.