5, నవంబర్ 2009, గురువారం

కల'వరించిన' క్షణం





కృష్ణా,



నీ తలపులెందుకో మనసును గజిబిజి చేస్తున్నాయి. ఈ రోజు ఎందుకంత స్పృష్టం గా వచ్చావు కలలోకి.???? కల నుంచి లేచిన దగ్గర నుంచి నీ విరహమింకా ప్రకాశ వంతమై ఆ అగ్ని లో నన్ను దహించేస్తోంది. ఎవరు ఏమని ఐనా చెప్పని, నేనైతే అందరికి తప్పకుండా చెపుతాను.... కాలిస్తేనేమి, సఫలమయ్యి సుధలను కురిపించనేమి ఏది ఏమైనా ప్రతి ఒక్కరు ఒక్క సారి ఐనా జీవితం లో ప్రేమించాలి.



అదేమిటి ఒక్క సారైనా... ఆ లెక్క ఏమిటి అంటావా?? అవును అందరం అంటుంటాము కదా నేను ప్రేమించాను కాని కుదరలేదు అనో, ప్రేమించాను కాని పెదవి దాటలేదు అనో, అది ప్రేమో ఆకర్షణో తెలియలేదు అప్పటికే కాలాతీతమయ్యింది అనో, లేదా ప్రేమించా పెళ్ళి చేసుకున్నా అనో చెపుతుంటాము కదా.. ఆ ప్రేమ లో తీవ్రమైన ఆకర్షణ అవతలి వ్యక్తి పట్ల భరించలేని మోహావేశం.... కాల్చాలి మనసు ను. ఎప్పుడు తలుచుకున్నా ఆ మోహావేశం అప్పుడే పుట్టిందా అన్నట్లు కాల్చి శుభ్రం చేయాలి మనసు మూల మూలలను. అప్పుడే ఆ ప్రేమ దేవతను నీ గుండె లో ప్రతిష్టించి పూజలు చేయ గలవు, మురికి మాలిన్యాలున్నచోట దైవ ప్రతిష్ట చేయ గలమా మరి.



ఆటు వంటి ప్రేమ ఒక్క సారి తటస్థించటమే అదృష్టం, ఇంక రెండు, మూడో సారి అంటే ఏమో, వుంటారేమో అంతటి గొప్ప వ్యక్తులు... కానీ కనీసం ఒక్క సారైనా లీలా మాత్రమైనా అనుభవం లోనికి వస్తే చాలు ప్రతి ఒక్కరికి. ఒక సారి ఆ అనుభవం అందుబాటు లోనికి వచ్చాక ఇంక మరి మిగతా విషయాల మీదకు మనసు పోగలదా ప్రజలకు చెప్పు, ఈ ధనం, ఈ మేడలు, పేరంటాలు, కృత్రిమమైన పేలవపు నవ్వులతో అతికించిన ముఖాలు ఇవి ఏమి వుండనే వుండవు.



నాకు సంబంధించినంత వరకు నువ్వే కదా నా దేవుడివి, ఇంక ఈ ప్రపంచం లో ఎందులోను నాకు ఆ సమైక్యత, ఆ అనుభవైక మైన అధ్బుతం తోచదు కదా.. నీవు మాత్రం కలలో కూడా నిన్ను పట్టి వుంచే భాద్యతల నుంచి తప్పించుకుని రాలేవు ... అంత ప్రేమ నీకు నామీద లేదా ఆ భాద్యతలు నిన్ను అంత మింగుతున్నాయా అనుకుంటా నేను.. కాని అంతలోనె అంత అనుమాన పడినందుకు నా మీద నాకే అసహ్యమనిపిస్తుంది. పాపం అంత నిస్సహాయులైన నీ వాళ్ళు, నీ మీద ఆధార పడ్డప్పుడు నా ప్రేమ కోసం ఆ చిన్ని అమాయకపు నవ్వులను ఆ జీవితాలను వదిలి నాకోసం రమ్మని నేనెలా చెప్పగలను కదా. అదా ప్రేమ కు అర్ధం అని నన్ను నేనే అనుకుని వూరుకుంటాను.



కలలో నేననుభవించిన నీ చొక్కా మెత్త దనాన్ని, నావైపు నువ్వు చూసిన చూపు లోని చల్ల దనాన్ని... పొద్దుట లేచిన దగ్గర నుంచి పూ రేకుల లో, ఆకుల నిగారింపు లో, దేవుడి గది లోని దేవతకలంకరించిన పట్టు వస్త్రం లో, ఎదురైన పసి పాప బుగ్గ లో అన్నిటి లో పోల్చి ఆనంద పడటానికి చూసేను.. వుహు.. వేటికి సరి రావటం లేదు. చూపు కు, ఒక చిన్ని స్పర్శ కు మది అంత గా పలవరించటమేమిటో... ఎదిగిన అనేకానేక ఇతరమైన విలువలలో ముంచుకున్న నాకే అర్ధం కావటం లేదు తెల్లారేక, ఇంక అందరికి ఎలా అర్ధం అయ్యేటట్లు చెప్పగలను చెప్పు...


కాని అంత మాత్రాన కలలోని నీ స్పర్శ కోసం, నీ క్రీగంటి చూపులో నవ్వు రంగరించి నా మీదకు వదిలిన ఆ అనుభవం కోసం నా మది పడిన కలవరం, అందినప్పుడు మనసు పడిన సంతుష్టి అబద్దమని మాత్రం ఒప్పుకోలేకుండా వున్నాను. కృష్ణయ్యా కలిసి సాగిన ఆ కలయికల సాయం సంధ్య ల వెలుతురు.... మూగిన జీవితపు చీకట్లను పార దోలటానికి ఎంత కాలం సహాయ పడగలవో తెలియదు కాని, వీలైనంత తొందరా గా మళ్ళీ నా కలలోకి తిరిగి రావూ నా జీవితాన తొలి వేకువను వుదయింపచేయటం కోసం..