19, జనవరి 2010, మంగళవారం

నలత కు నెలవై...







కృష్ణా,

మౌన గీతం లోని గీతమాగి మౌనం ప్రజ్వరిల్లితే, జీవిత శిలాఫలకాల కింద కాలధర్మం రాజ్యమేలిందనుకున్నా కాని అనారోగ్యం కంబళి కింద అశక్తుడవై వున్నావని తెలిసి తల్లడిల్లుతున్నా. నా ఆరోగ్య, ఆయుష్యులను తీసుకుని నా కృష్ణుడి కిచ్చి కాపాడమని కోరితే, వంటింటి గూటిలో ని కన్నయ్య నవ్వి "నీదే మాత్రం ఆరోగ్యమేమిటి నీ సఖుడి కివ్వటానికి" అని గేలి చేసి నవ్వేడు. మరి బృదావనం లో నాన్న గారికి నీ సఖి రాధమ్మ ఎవరెవరి దగ్గరి నుంచో అయుష్య్యు తీసుకుని ఇవ్వలేదా..!! నా కృష్ణుడి కి నేను ఇవ్వటానికేమి ఎంత ఐనా రాధమ్మ కున్న ప్రేమార్దత్ర నీకు లేదు అని బాగా పోట్లాడేను లే.


ఎలా వున్నావు కృష్ణా... నిజం గా నిజం...నేను నీకు ఇంత నొక్కి చెప్పనక్కర్లేదు నువ్వు నమ్ముతావనుకో, కానీ నా భావమొక వీచికై బయటకు వచ్చేప్పుడు తిరిగే సుడి ఒక్కో సారి బలమైనప్పుడు మాటల వడి మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటుందనుకుంటా.. కిందటి సారి నువ్వు కల లో వచ్చినప్పుడు నీ భుజంపైని నా తల ను తిప్పి కళ్ళలోకి చూసి చెప్పేవు గుర్తు వుందా "ఇప్పట్లో కనపడను రా, గుండెలోని అశక్తత ను కళ్ళలోకి రానివ్వనని మాటివ్వు.. నిఘంటువు ల లోని పదాలకు చాలని ప్రణయాలింగనపు అనుభూతి ఇద్దరిని కలిపి వుంచే సావాసి కదా దిగులొద్దు" అని. అది విని దిగులు పడ్డానని " లేదు రా నేనెక్కడికి వెళతాను ఈ విరహం, ఈ దూరం తాత్కాలికమే కదా " అని ఓదార్చావు వుత్తరం లో తరువాత. నువ్వు నవ్వుతావు, నీకు నమ్మకం వుండదు, నా కోసం సరే అన్నట్లు వూ కొడతావని నాకు తెలుసు. అయినా కాని నాకు ఖచ్చితం గా తెలుసు ఈ తాత్కాలిక ఏడబాటు తెలిసే, నీలోని నీ నాకు, నా లో నిండిన నువ్వు నచ్చచెప్పేవు అని... ప్రతి భందాన్ని కొన్ని లెక్కల్లో ఇంకొన్ని కొలమానాల్లో ఇరికించేయాలని చూసే వాళ్ళకు నేనేమి చెప్పలేను కాని నమ్మే నీ గుండె చప్పుడు కు మాత్రం తెలుసు నా మాట లోని అంతరార్ధనం.


నీ అనారోగ్యపు ఆనవాలు నా మీదకు వచ్చి వాలింది కామోలు, నెల నుంచి నాకు ఏమి రాయబుద్ది కావటం లేదు చదవ బుద్ది కావటం లేదు. నవ్వుల గల గల ను శీతాకాలపు మంచుకు నెమ్మదైన కెరటాల హోరు కింద దాచి, ఏకాంత మనః సౌధం లో అవిశ్రాంతం గా తిరుగుతున్నా అశాంతి ను తోడు గా తీసుకుని. శూన్యాక్షరాల గవాక్షాలలో నా నీడ నే చూసుకుని నువ్వని భ్రమ పడ్డ క్షణాలెన్నో....నీ కోసమని సాగే అనంత యాత్ర లో తిరిగిన చోటే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ నన్ను నేను కోల్పోయి నువ్వయ్యానేమో... అప్పుడిక ఈ యాత్ర కు ఒక ముగింపు పలకవొచ్చు కదా ఎందుకింత అలసట, తిప్పట అంటే ఏమో నాకు మాత్రం ఏమి తెలుసు


జల్లు గా స్నో పడుతూనే వుంది పొద్దుట నుంచి. ఎర్రనైన సంధ్య లో నల్లనయ్య నవ్వితే మోగింది భూపాల రాగమట.. మరి ఒంటరైన సంధ్య దిగులు చీకటులు సావేరా? ఈ రాత్రి... తెల్లటి మంచును నల్లటి చీకటి తో కలిపి ముద్దలు చేసి విసిరి కొడుతుంటే కిటికి దగ్గర నుంచుని చూస్తున్నా. 27 రోజులు యాంటీ బయాటిక్స్ తీసుకున్న నీ శరీరం ఎలా వుండి వుంటుందో, ఆ మందు ల తీవ్రత నే ఫోన్ చేసినప్పటి నీ గొంతులో వణుకై కనపడుతుంటే, మంచుకు వడలి, ఎండి కొమ్మన వుండలేక వదల లేక వూగిస లాడుతున్న వూపిరి తో కదిలే సుగర్ మేపుల్ చెట్టు ఆకు చెపుతోంది నీ బాధ ను జంగం కధ లో బుడగ జంగమల్లే.


ప్రపంచంలో ఇందరుంటారు కదా ఇన్ని కోటాను కోట్ల మనుష్యులు, వారందరిలో ఈ విచిత్రమైన బేక్టీరియల్ ఇన్ఫెక్షన్ నీకే రావాలా అని ఒక దుగ్ధ, వచ్చాక ఆ డాక్టర్స్ అది ఏమిటో, గ్లాండ్స్ వాచి నొప్పి పెడుతుంటే కారణం ఇది అని తెలియ చెప్పటానికి అంత టైం ఎందుకు తీసుకున్నారో ఇదేనా టెక్నాలజీ మెడిసన్ సాధించిన ప్రగతి అని వాళ్ళందరి మీదా అనంతంగా కోపం వస్తోంది. ఇంతలోనే ఎవరికైనా రావొచ్చు కదా నా కృష్ణ కెందుకు అనుకున్నానే..... ఆ ఎవరికో, వారిని ప్రేమించే వ్యక్తులకు ఇంతే బాధ, దుఃఖం కలుగుతుంది కదా. ఆ డాక్టర్స్ ఐనా మనుష్యులే కదా అనే వితరణ, నువ్వు అన్నట్లు 50 రోజుల నుంచి కనిపెట్టలేక సతమవుతున్న బేక్టీరియా లు మన పక్కనే పెరుగుతుంటే ఒక్క మనమే మన కోసమే అనే ఆలోచన ఎంత స్వార్ధం కదా అనే సిగ్గు కలుగుతోంది. కాని ఏమి చెయ్యను కృష్ణా నీకు కలుగుతున్న బాధ, కనీసం దగ్గర వుండి చూసుకోలేని అశక్తత నా మానవ తత్వాన్ని చంపేసి కౄరమైన స్వార్ధం వచ్చేట్లు చేస్తోంది.


విశ్రాంతి తీసుకో అని చెప్పాలంటే పరుగెత్తే జీవన ప్రవాహం పడనివ్వదు అంటావు, మందులు సరి గా వేసుకో అంటే నెల రోజులకు చేసే పరామర్శ కూడ మధురమేలే అంటావు కొంటె గా. సరి గా తిను అంటే ఏమిటి విరహపు దిగులు నా అంటావు. ఏమనాలో కూడా తెలియక సాగే కన్నీటి జలపాతాలను నిదురమ్మకు కానుకనిచ్చి, ఒంటరి దిగులు మేఘాలను వేకువకు తోడు నిస్తూ నీ తలపులలో ఇలా జంటనై ఒంతరి తనాన్ని అనుభవిస్తున్నా.