27, ఫిబ్రవరి 2009, శుక్రవారం

ఒంటరి గా ఇంకో రాత్రి...


కృష్ణా.. ఏమి చేస్తున్నారు...

టెక్నాలజీ టెక్నాలజీ ఎటు తీసుకెళుతున్నావే అంటే నీ వునికి నీ తేజస్సు నేను లాగేసుకునే వరకు అంది అట . అలా వుంది మన పరిస్తితి . రాత్రి నుంచి మంచు పడుతుంది , ఫోన్ లేదు , టీవీ లేదు , ఇంటర్నెట్ లేదు, అమ్మయ్యో కరెంటు అయినా వుంది . ఈ దేశం లో అన్ని వుంటే మనమే రాజులం , ఒక్కటి కొంచం తేడా వచ్చినా ఏమి చెయ్యలేని బందీలము కదు . తమాషా గా వుంటుంది ఆలోచిస్తే , దేనికి ఆధార పడనవసరం లేని స్వతంత్రత , కాలు కదపటానికి కూడా వీలుకాని నిస్సహాయత రెండు పెనవేసుకుని పక్క పక్క నే మనతో నే వుంటాయేమో .

సరే ఈ గోల కేమి కాని ఏమి చేస్తున్నారు.. జన జీవన ప్రవాహం.. గల గల సాగే స్రవంతి... ఏమి వుంటుంది చేసేందుకు... వద్దు అన్నా వుహుఅన్నా సాగిపోవటం తప్ప అంటారా?

నీవున్నవన్న వుహే
నాకింకా ఈ ప్రపంచం తో పోరాడే శక్తి నిస్తోంది..
చిరునవ్వు తో వెలిగే నీ మోము
నాకు చీకటి వైపు చూడగలిగే ధైర్యాన్ని ఇస్తోంది...
నీవేగా నేస్తం ఈ రాకాసి ప్రపంచాన్ని
నీ మమతల మాయాజాలం తో
సుందర స్వప్నం చేసి నిలుపుతోంది..

అబ్బ ఈ చలి పులి వచ్చి చంపేస్తోంది.. బయటకు వెళితే చలి ఇంట్లోనేమో ఈ పిచ్చి వేడి తో విసుగు... ఈ పని... వంట... విసుగు పుడుతోంది... చదువుకునే రోజుల్లో ఎంత విర్ర వీగే దాన్ని.. నేను వీళ్ళందరి లా కాదు ప్రత్యేకం గా గడుపుతాను జీవితం అని... ఇప్పుడు తలుచుకుంటేనే నవ్వు వస్తోంది..

ఏమన్నావు కృష్ణా కిందటి సారి వుత్తరం లో చలం ప్రేమ లేఖలు ఎప్పుడైనా ఖాళీ గా వున్నప్పుడు చదువుదామని తీస్తే దాని బదులు ఒరాకిల్ పుస్తకం తిరగ వేస్తె రేపు స్టూడెంట్స్ కు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే చేయించేటప్పుడు వుపయోగం కదా అనిపిస్తోందా... ఎవరు నా కృష్ణే నా అలా అంటోంది...

గుండెకు వచ్చే వెక్కిళ్ళను తీర్చే ఒకే మంత్రం మంచి సాహిత్యం అని...

నిన్నటి నీ స్వప్నం ప్రియా ఇంకా నా నిద్ర రాని నిశీధి వీధుల తారాడుతూ పలుకలేని పదాలను
కన్నీళ్ళతో కదంబ మాలికలల్లుతూ, జారిపోయే కాలాన్ని జావళీలు గా మార్చి నాకు అందించింది...
నేస్తం నేటికి స్వప్నమే నీకు బరువైతే జీవితమేమవుతుందో నాకు .........
అంటు... విరహాన్ని కవితలల్లి ఇచ్చిన నా కృష్ణే నా ఇలా మాట్లాడేది
కాలమా నీకిదే నా జోహార్లు..

ఇక్కడ అంటా ప్రశాంతం గా వుంది... అర్ధ రాత్రి నేను నా పాటలు తప్ప ఎక్కడ ఏమి చప్పుడు లేదు, దూరాన హైవే మీద కూడా దీపాల తోరణాల జోరు తగ్గి అప్పుడొకటి అప్పుడొకటి పరుగెడుతూ వున్నాయి.. బయట పాపం ఏదో పేరు తెలియని చెట్టు నెమ్మది గా చలి కి కదులుతూ తన బాధ చెప్పుకుంటోంది.. అరె అంతా ఆకులతో పువ్వులతో వున్నప్పుడు అందరు నన్ను ఎంతో మెచ్చుకుంటారు కదా ఇప్పుడు ఆ ఆకులే వుంచుకోలేక వుంచుకోవటానికి వీలు కాక వదిలేస్తే విసుక్కుంటూ వూడుస్తారు, అప్పుడు అప్పుడు తల పైకెత్తి నావైపు విసుక్కుంటూ ఇంకా ఎన్ని ఆకులు వున్నాయా అని చూస్తూ లెక్క పెడతారు... ఇప్పుడు ఇంత చలి తో బాధ పడుతుంటే అయ్యో అనైనా అనరు.. రేపు నా కొమ్మలంతా మంచు తో నిండి బరువుతోనే వంగిపోయి నుంచో లేక ఆధారం సరిగా లేక బాధ పడుతుంటే అబ్బ ఈ చెట్టు నిండా మంచు తో బలే అందం గా మెరుస్తోంది అంటారు ఎంత స్వార్ధ పరులు మీరు అని చెప్పుకుంటోంది.. ఏమి బదులు చెప్పలేక కిటికీ పరదా పూర్తి గా లాగేసి వచ్చాను..

దానికేమి తెలుసు మన బాధ.. ఎంత వున్నా ఇంకా ఏదో కావాలని పరుగు... మనుగడ కోసం పరుగు... దాని తరువాత లగ్జరీస్ అవసరాలవుతాయి.. అప్పుడు ఇంకా ఇంకా వాటి కోసం పరుగు... దాని తరువాత ఇంకా దేనికో పరుగు... మొత్తం మీద పరుగో పరుగు.. చివరకు వెనక్కి తిరిగి చూసుకుందుము కదా.. చేసినా దానికి విచారిస్తూ ఇలా కాదు అని ఇంకో దారి మళ్ళి పరుగో పరుగు.. చాలు ఇంక ఆపు తల్లి అంటారా.. ఏమో కృష్ణా నా పరుగు మాత్రం గమ్యం నే పుట్టినప్పుడే నిర్దేసించ బడిందేమో నీ వైపుకు.. ప్రపంచం లో ఎక్కడ దొరకని శాంతి సంతోషం నాకు నీ చేతుల మద్యలో నే దొరుకుతుంది..
మరి నన్ను వదిలి ఎందుకు పరుగెట్టేవు అని మౌనం గా నే మీ కళ్లు అడుగుతున్నాయి ఈ వుత్తరాన్ని నాకు తెలుసు.. కాని దానికి సమాధానం కూడా మీకే తెలుసు నేను చెప్పనక్కర్లేదు.. ఈ నల్ల పిల్ల ఈ పరుగు మీరు నిర్ణయించిందే కదా.. భూమి గుండ్రం గా వుంది కృష్ణా ఎటు వెళ్ళినా ఒక రోజు మీ చేతుల మద్య మళ్లీ ఒంటరి సాన్నిహిత్యాన్ని అనుభ వించటంకోసమే ఎదురు చూస్తూ మరి సెలవిక... కలల వుషోదయానికి పరుగిక...

25, ఫిబ్రవరి 2009, బుధవారం

ప్రియమైన నీకు

ప్రియమైన నీకు ,
నువ్వు నేను వేరు కాదు అవును వేరు కానే కాదు మన వలపు తీవ కు వేరు లా ఎక్కడో అడుగున నేను ... చిరు కొమ్మ కు వేసిన చిగురు లా నువ్వు వేరు కానే కాదు కాని ఎప్పటికి వేరే వేరే నే.... కాని ఇద్దరం ఒకరు లేక ఇంకొకళ్ళం లేనే లేము ...చిత్రమైన మన జీవితం...... ఈ దేశపు వాతావరణం లానే.

ఇక్కడ బాగా చలి వచ్చేసింది .. కిందటి వారమైతే దాదాపు గా 2 అడుగుల మన్చు పడింది . అబ్బ తీసి తీసి చిరాకై పోయింది ..... ఈ 3 నెలలు పెద్ద శిక్ష అనుకో ఈ వూర్లో వుండటం ... మార్చ్ వచ్చేసరికి ఎందుకు రా బాబోయ్ ఈ జీవితం ఇంక ఎంత కాలం రా ఈ వూరిలో అనే వైరాగ్యం నెత్తి దాక ఎక్కి వుంటుంది అప్పుడు మొదలు అవుతుంది ప్రకృతి కరుణ మన మీద ... తలుచుకుంటేనే ఆ అందం ఈ మంచు జడులను చలి తుఫానులను వోర్చు కోవచ్చును ...

ఇలానే కాబోలు మన జీవితం లో కూడా ఆశ నడిపిస్తూ వుంటుంది ముందు జీవితం లో వసంతం ఎదురుచూస్తుంది కొంచం గా ఈ కష్టాల పరంపర ను ఎదుర్కుంటే అని.... :-) కానీ మన జీవితం లో మాత్రం ఎప్పటికి వస్తుందో ఆ వసంతం ... చూసి చూసి కళ్లు కాయలే కాచేను అని అదేదో పాత సినిమా లోలా పాట కూడా పాడు కోవాలో ఏమో ...

మన వూరిలో ఈ సరి కి బోలెడన్ని చేమంతులు కనకాంబరాలు , ముళ్ళ గొరింట , డిసెంబర్ పువ్వులు బోలెడన్ని పూస్తాయి కాదు .... పొద్దుట పొద్దుటే పారిజాతాలు ... నిత్య మల్లెలు... ఇవి కాక పున్నాగ పువ్వులు ఎలాను నిద్ర లేపుతాయి ... సాయింత్రమైతే విరజాజుల వానలు , చంద్ర కాంత పూల పలకరింపులు ప్రకృతి ఇచ్చే అదనపు బహుమతి అనుకో ... అబ్బ అవి అన్ని తలుచుకుంటే ఎంత బెంగ గా అనిపిస్తుందో ... వదిలేసి వచ్సెసేము కదా వాటిని అన్ని టిని .. పాపం మా దొడ్లో పూలన్నీ నేను ఇక్కడికి వచ్సెయ్యగానే ఎంత బెంగ పెట్టుకున్నాయో ....

అరె అంతలోనే అంత ఎర్ర గా చూస్తావేంటోయ్ ... నువ్వు బెంగ పెట్టుకోలేదు అని అన్నానా నేను ... ఎర్ర బారిన కళ్ళలో కలువ లు చూడు ఎలా పూచాయో వాటికోసమైనా చంద్రుడి నై నేను రానా ప్రతి రాత్రి నీ కలలో కి అని నన్ను ఓదారుస్తూ నీ కళ్ళలో వచ్చిన మంకెన్నలను నేను చూడలేదనుకుంటావు నువ్వు .... అసలు ఎందుకు దూరం అవ్వాలి మనము అని నేను పెట్టిన పేచీ కు చెప్పిన మాటే మళ్ళి మళ్ళీ వెయ్య సార్లు పరిస్థితులను వివరిస్తూ నా చేతి ని గట్టి గా పెనవేసిన నీ చేయి వణకటం నేను గమనించలేదు అనుకుంటావు నువ్వు .... ఇద్దరికీ తెలుసు మళ్ళీ మన జీవితం లో తిరిగి వసంతం ఎప్పుడో తెలియదు అని కాని ఇద్దరికీ తెలియనట్లు నటించాము అంతే ... చూసేవా అందుకే నేను ప్రతి రోజు నీకు వుత్తరం రాయను .. బాధ పెట్టేనా నా ప్రాణాన్ని .... ఏమి చెయ్యను కృష్ణా ఎంత నన్ను ఓదార్చుకున్నా నువ్వు లేవు నా పక్కన అనే ఆలోచన ఒక శీతల పవనమల్లె మనసును ఒణికిస్తుంది ఒక్కోసారి ..

వు...... సరే కాని మర్చి పోకుండా శని వారం శని వారం బిర్లా టెంపుల్ కు వెళుతున్నావా . నీ కోసం ఎదురుచూస్తూ ఆ పెద్ద రాయి మీద నేను కనపడక పోయినా నా మనసు ఆత్మా అంతా అక్కడే వుంటుంది నీ కోసం ఎదురుచూస్తూ ... నా శరీరం ఇక్కడ వున్నా ....

నిన్న రాం నారాయణ గారి ఇంట్లో చండీ హోమం ఐతే వెళ్ళెను ... చాలా బాగా చేసేరు ... ప్రకృతి ని చూస్తే ఎంత గౌరవం గా ఎంత భయం గా కూడా వుంటుంది కదు .. గాలి నేల నీరు నిప్పు ఆకాశం... వీటిలో ఆకాశం ఏమో తెలియదు కాని మిగతా 4 మూలాలను ను చూస్తుంటే ఎంతో గౌరవం గా కొంచం భయం గాను వుంటుంది ... అలా ప్రజ్వరిల్లే అగ్ని ... చిత్ర విచిత్ర పోకడలు పోతూ గాలి ని తోడు తీసుకుని అంతలో సందె కెంజాయి రంగు ఇంతలోనే దాని లో కలిపే నీలి మిశ్రమం .... ఒక్క నిమిషం లో వెలుగు రవ్వలు అంత లోనే వూపు తగ్గించి కలిసే చీకటి దివ్వెలు ...... ఎంత అందం గా వుంటుందో ఆ మంత్రాలు మనకు ఎలాను అర్ధం కావు కాని ఎంతో శ్రద్ద గా ఆ అగ్ని ని చూస్తూ అది చెప్పే వూసులు వింటూ .. అది పోయే పోకడలు చూస్తూ ఆశ్చర్య పోతూ .. ఆనందిస్తూ .... 4 గంటలు ఎలా గడిచాయో కూడా తెలియలేదు ....

కాలం-మనసు

తెలియకుండా కాల గర్భం లో కలిసి పోయే ఇంకో ఘడియ
గడియలు వేసే మనసు తలుపులను తెరిపిస్తుందేందుకో .....
గడిచిపోయిన ఘడియ జ్ఞాపకం గా తప్ప నిలవదని
కదిలే కాలానికి తెలిసినా ...
ఆ గతించిన జ్ఞాపకం సజీవ మెప్పటికి అవ్వదని
నిలిచి పోయి గతం లోకి తొంగిచూస్తున్న మనసుకు తెలియటం లేదే !!!!!!!!!!!!!!

24, ఫిబ్రవరి 2009, మంగళవారం

డైరీ లో ఇంకో రోజు

కృష్ణా,

ఎన్ని రోజులు గడిచినా తరగని ఈ కత, చెదరని ఈ వెత ఎందుకో నీతో పంచుకోవాలనిపిస్తుంది. నువ్వు ఏదో పరిష్కారం వెతుకుతావని కాదు... అసలు జీవితం లో ఏ సమస్య కైనా పరిష్కారం వుంటుంది అంటారా? అసలు సమస్యే లేనప్పుడు పరిష్కారానికి తావెక్కడ వుంటుంది... సమస్యా నీ మనసే దాని పరిష్కారం నీ మనసే అంటారేమో వేదాంతులు.. నిజమే... కాని దానిని సంపూర్తి గా అర్ధం చేసుకుని ఆచరించటానికి ఎంత dedication వుండాలి కదా....

అదే వున్నప్పుడు ఈ వెతుకులాట ఎందుకు... అంతా అంతమై పోతుంది.. అంతా ప్రశాంతత అంతటా నీరవం... నిశ్శబ్దం , ఆ అచంచలమైన నిశ్శబ్దం లో నుంచి వుదయించే తొలి నాదం ఓం కారం.. అదేనా మన ప్రేమ కు శ్రీకారం ? మనదే కాదేమో ప్రేమ అనే పదానికే తోలి సాకారం... అవునా మన ప్రేమ అప్పటినుంచే అలా అనంతం గా సాగుతోందా? ఎప్పటికి కలవని సమాంతర రేఖలలా? ఎప్పటికి ముగియని కాలం లా..! అంతలోనే ముగిసి పోయిన ఒక సంధి కాలంలా... అదేనా మన ప్రేమ... ప్రేమ అనంతం.. అమరం అంటే అర్ధం అదేనేమో

ఒక్కసారి కలిసిన తరువాత ప్రేమ అంతా ఈ కలియుగపు కాల గర్భం లో పడిఈ సమాజపు మర్యాదల పద్దతుల కట్టుబాట్ల చట్రం లో పడి ఒక రూపం అదీ సభ్య సమాజం అంగీకరించే రూపం పొందవలసినదే... అవునా కృష్ణా.... ఏమో నాకైతే తెలియదు.. నాకే కాదు.. ప్రేమించే ఎవరికి తెలుస్తుంది చెప్పండి... ప్రేమిస్తే? ప్రేమిస్తే చూడాలి... మాట్లాడాలి.. కలవాలి.. కబుర్లు చెప్పుకోవాలి.. భౌతికమైన బంధం.. ఆ బంధాలకు రూపాలు... వాటిలో మన ప్రతిరూపాలు.. వీటన్నిటితో సాఫల్యమనుకోవటం... లేదంటే విరహవేదనలలో కృంగి దుఃఖ సముద్రాలలో మునిగి పోవటం... ఇంక ఎప్పుడో ఎక్కడో ఇక్కడో మరుజన్మకో అనే ఆశ తో మిగలటం.. అంతేనా ప్రేమ? అంతేనేమో అంతేనా.......

ఏమో కృష్ణా ఎన్నో ఆలోచనలు... సముద్రపు కెరటా లకు మల్లె అనంతం గా ఒక దాని వెంబడి ఒకటి ఒక దాని మీద ఇంకోటి... చాలా రోజులయ్యింది కలం తో కాగితం మీద నలుపు చేసి.. నా రాత నాకే అర్ధం కాకుండా వస్తోంది.. నా జీవితమే నాకు అర్ధం కాదు ఇంక ఈ రాత ఎలా వుంటే మాత్రం ఏమి లే అసలు జీవితం ఎవ్వరికైనా అర్ధం అవుతుంది అంటారా? ఇలా ఆలోచిస్తూ పొతే అబ్బ అర్ధం లేని ఆలోచనలు అనిపిస్తుంది... కాని నిజానికి అదే జీవితమేమో.. ఆలోచనే జీవితం ఆలోచన ఆగిన క్షణంo ఈ జీవితం కూడా ఆగుతుంది.. ఆగక సాగే ఆలోచన కు అనుసంధానం గా సాగేదే జీవితం... అరె... ఈ ఆలోచన ఏదో బాగున్నట్లు వుందే!

ఐతే మరి ఆగక సాగే ఆలోచన అంతా నువ్వే ఐనప్పుడు నా జీవితం నువ్వేనా ! నా జీవితం నువ్వే అయినా కూడా నువ్వు ఎక్కడా కనపడకుండా వుండటమేనా జీవితం .. అందులోని మెలోని ... ఒక్కొక్క క్షణం నాకు అదే అనిపిస్తుంది . కృష్ణా నేను మిమ్ములను ప్రేమించానా....... మీ వునికిని ప్రేమించానా..... మీ వూహను ప్రేమించానా ... మీ ఆకారాన్ని ప్రేమించానా .... మీ మీద ఆశ ను ప్రేమించానా .. ..మీతోటి జీవితాన్ని ప్రేమించానా... మీ ఆత్మ ను ప్రేమించానా ... అసలు మిమ్ములనే ప్రేమించానా .... ప్రేమించాలి అనే ఆశ తో మిమ్ములను , మీరు అనే అస్తిత్వాన్ని ప్రొదివి గా చేసుకుని నన్ను నేనే ప్రేమించానా ఎన్నో ప్రశ్న లు.... ఎన్నెన్నో ఆలోచనలు .. ఎవరు చెపుతారు ఈ ప్రశ్నలన్నిటికి సమాధానాలు ..

మా మధు బాబు గారైతే వెంటనే ఒక పాట లా పాడతారేమో ప్రేమా ఏమిటి ఈ అర్ధం కాని గామా హంగామా , ఎవరికీ అంతుపట్టని ప్రశ్నల డైలమా అని , లేదంటే .........ఏమిటి అండి బాబు ... ఈ ప్రశ్నల తోరణాల పూరణాలు .. ఎందుకు మాకీ శిక్ష అంటారేమో .. అవునేమో ... ఏది అబద్దం కాని ప్రతి సందేహం ఒక అర్ధం లేని ప్రశ్న తో కలుపుతున్నానా ?


మనసు మూగైన నిమిషం
నిమిషాలే యుగాలవుతాయి
కనురెప్పల వెనుక నీటి చుక్కే సముద్రమై ....
మనలను ముంచేస్తుంది .......
సాగరమైనా ... యుగాల దూరమైనా ...
కలిసి సాగే పాదం తో కలిపి దాటెయ్యగలమ్
కాని మన పాదాలే ఆవిటివై కదలలేనప్పుడు
ఎలా దాటగలను నేస్తం ... దూరాలేవైనా ఎంతున్నా ........