2, సెప్టెంబర్ 2009, బుధవారం

మారిన విలువలు

కౌముది లో సెప్టెంబర్ లేఖ

అన్నయ్య,

ఎలా వున్నావు రా. నేను చాలా బాగున్నా (అదే నీ దృష్టి లో ఏడ్చినట్టు). :-)

అమ్మ వాళ్ళు ఎలా వున్నారు? నాన్న చాలా సంతోషం గానే వుండి వుంటాడు నీ దగ్గర కదా వుంది. అమ్మ కు నాన్న సంతోషం తప్ప ఏమి అక్కర్లేదు కాబట్టి ఆమె సంతోషం గానే వుండి వుంటుంది. "సర్వే జనా సుఖినోభవంతు" అని ముగించెయ్యవచ్చు ఈ వుత్తరాన్ని ఇక్కడికి, కాని నా ఈ వుత్తరం వుద్దేశం అది కాదు కాబట్టి ఇంకా రాస్తున్నా. అసలు రాత్రి ఫోన్ చేద్దామనుకున్నా కాని నీ దొరతనం బైట వెలగబెట్టి కొంప కు చేరే సరికి ఏ అర్ధరాత్రో అవుతుంది, అప్పుడు మాట్లాడే ఓపిక నీకు వుండదు అని వుత్తరం రాస్తున్నా..

ఒరే అన్నయ్య గుర్తు వుందా మనం చిన్నప్పుడు, నాకు తొమ్మిది ఏళ్ళు, నీకు పదిహేను ఏళ్ళు వుండి వుంటాయి అప్పుడు, నాకు సైకిల్ నేర్ప టానికి నువ్వు నీ ఫ్రెండ్ కృష్ణా ప్రయత్నిస్తున్నారు. నేను అరుస్తున్నాను..... మీ మీద వో ఆధరపడి అసలు సరిగా నేర్చుకోవటం లేదు అని వున్నట్లుండి వదిలేసేరు నాకు చెప్పకుండా, కొంచెం సేపు అయ్యాక చూసుకుంటే మీరు లేరు, దెబ్బ కు భయ పడి నేను వెళ్ళి మన వీధి చివర శంకర్రావు గారి ఇంటి ముందట ముళ్ళగోరింత పూల చెట్టు మీద పడ్డాను. ముళ్ళు గుచ్చుకున్నాయి, నీకు గుర్తు వుండే వుంటుంది లే, అన్నీ మర్చి పోయే సెక్షన్ నాది కదా,

నేను ఏడుస్తుంటే వచ్చి ఏమన్నావో గుర్తు వుందా ... వ్యక్తి స్వాతంత్రం సాధించాలంటే ములుకు మాటలు, ముళ్ళ మార్గాలు కూడా వుంటాయి తీసి పారెయ్యాలి కాని ఇలా ఏడిస్తే ముళ్ళు ఇంకా నెప్పేస్తాయి అని.. నాకు అప్పట్లో పూర్తి గా అర్ధం కాక పోయినా, నీ మాట మాత్రం గుర్తు వుండి పోయింది. తరువాత ఇంటికి వచ్చాక నాన్న"ఆడ ముండ కు ఈ సైకిళ్ళు.... గోలా ఎందుకు రా" అని తిడుతుంటే అంటే ఎంత రోష పడ్డావో... నన్ను ఇంటి వెనుక బాదం చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి నాతో ఒట్టు పెట్టించుకున్నావు గుర్తు వుందా " ఎప్పటికి ఈ ఆడదాన్ని అనే బేల తనం, నా పని కాదు అనే అధైర్యత రానివ్వను నా జీవితం లో" అని, అప్పట్లో ఆ ప్రమాణం కు అర్ధం ఏమిటో తెలియక పోయినా నీ కళ్ళలో నీళ్ళు చూసి ఏడుస్తు ఒట్టు పెట్టేను... ఇప్పుడు తలుచుకున్నా ఎంత సంతోషం గా వుంటుందో నాకు, నీ లాంటి అన్నయ్య తోడు గా వున్నాడు నాకు అని. అప్పుడనే కాదు పెద్ద అయ్యే దాక ఎన్ని సార్లు నాకు ఎన్ని తెలియనివి తెలియచెప్పేవు రా..

ఇవి అన్ని ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నావు అంటావా... "చెయ్యతి జైకొట్టు తెలుగోడా... గంతమెంతో ఘన కీర్తి కలవోడా" అని పాడుకుంటానికి తప్ప ఎందుకు వుపయోగం లేని మన కీర్తల్లే మన గత అనుభవాలు అవ్వకూడదనిపించింది...

జీవితం లో నిరాసక్తత మొదలయ్యి నిర్లిప్తత మన జీవన పధమవుతుందో, అవకాశ వాదం అలవాట్లను, ఆనందాలను మింగేసి మనలను మాయా విలువలున్న లోకాన్నే శాశ్వతమని భ్రమింప చేస్తుందో నాకు తెలియదు కాని నీ విషయం లో ఏదో అయ్యింది అని మాత్రం తెలుసు, చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన నా అన్నయ్య ఎక్కడా కనిపించటం లేదు.. ఆ స్థానాన నాన్న కు ప్రతి రూపం (మనం ఏదైతే కాకూడదని అనుకున్నామో), డబ్బు కు మారు రూపం ఐ కనపడుతున్నావు. అమ్మ కు బదులు వదిన, మార్పు అంతే...... అదే కధ పునరావృతం... నువ్వు మారని నాన్న కు ప్రతి రూపమై ఆ ఇంటి పేరు నిలబెడుతున్నాను అని అను కుంటున్నావేమో కాని ఆ మూర్ఖత్వపు ఆనవాళ్ళను పతీవ్రతా రూపం లో ధరించే అమ్మ కు తరువాతి తరం వదిన అని గుర్తించలేక పోతున్నావు. చెల్లి కళ్ళల్లో అసహాయత రానీయకూడదని ఆరాట పడిన నా అన్నయ్య, భార్య కళ్ళల్లో నీలి నీడ లు గుర్తించలేని గుడ్డి వాడయ్యాడేమిటా అని ఆశ్చర్యం గా వుంది రా.. వుహు... అవమానం గా వుంది రా..

మొదటి సారి నా లోని బలాన్ని... నా భావాలని తట్టి లేపి మార్కిజం నుంచి ఫెమినిజం దాకా పరిచయం చేసి న నా అన్నయ్య ను ఆ ధృడ వ్యక్తిత్వం తో మళ్ళీ చూడాలంటే, కొంప తీసి మళ్ళీ నిన్ను ఆ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ మెట్ల మీద నిలబెట్టాలా ఏమి రా? ఆలోచించు నువ్వే మరి పరిష్కారాన్ని కూడా..

సాధన ఒక ప్రయత్నం, అర్ధవంతమైన జీవనం జీవిత సాధన కు గమ్యం. భౌతిక లాభమే సాధించటం అంటే అని జన సామాన్యం అనుకోవటం మూలం గానే కొలతలు బేరీజులు మొదలయ్యి, అర్ధం పరమార్ధం మారి, జీవితం లో అసంతృప్తి జీవిత పధమవుతోంది అని జీవిత వేదాంతాన్ని నాకు పరిచయం చేసిన నా మొదటి స్నేహితుడికి ఇంత కంటే ఏమి రాయగలను రా.. ఎంతో పౌరుషం గా నిన్ను మాటల తూటాల తో బాధ పెట్టాలని మొదలు పెట్టి (నాకు తెలుసు ఇప్పటికి నీ వీక్నెస్స్ అదే అని) నాకు తెలియకుండానే ఏడుస్తు ముగిస్తున్నా..

వుంటాను మరి... నీ చిరకాల స్నేహితుడు, నా సహచరుడు అడుగుతున్నాడు ఏమయ్యింది మీ అన్న గుర్తు వచ్చాడా అని. చూసే వా నా బలం, బలహీనత నా అన్నే అని కృష్ణ కు కూడా తెలిసి పోయింది..

వుండన
ప్రేమ తో
నేను.

ఒసెయ్ పిచ్చి,

నువ్వు ఇంకా మారలేదు, ఎప్పటికి మారవే... ఐనా నీది కాదు తప్పు, నిన్ను చిన్న దానివని గారాబం చేసి అడిగినవి అన్ని ఇచ్చి ముద్దు చేసి నెత్తికెక్కించుకున్నాను చూడు నన్ను అనుకోవాలి, అది చాలదన్నట్లు మళ్ళీ ఆ సెంటిమెంటల్ ఫూల్ గాడిని పెళ్ళి చేసుకుంటాను అంటే ఒప్పుకుని చేసేను చూడు.... అది ఇంకో తప్పు. సరే కాని, చేసిన దానికి నువ్వు ఏమి రాసినా వినక తప్పుతుందా..

ఏమంటావే ఐతే ఇప్పుడు.... పొద్దు గూకులు డబ్బు ధ్యాస లో పడి మీ ఒదిన ను పట్టించుకోవటం లేదంటావు.... మీ వదిన ఏదో నాతో చాలా కష్ట పడి పోతుందంటావు... అంతే నా.. ఈ తాపత్రయం అంతా ఎందుకు చెప్పు... దానికోసం, దాని పిల్లల కోసం కాదు... అంతకే నన్ను అంత విలన్ ను చేసేస్తున్నావు.

ఇంత వయసొచ్చాక కూడా ఇంత సున్నితమైతే నిన్ను కాదు.... నీ మొగుడిని అనాలి నిన్ను ఇంకా అంత గారాబం చేసి చెడగొడుతున్నందుకు. నీకు లా అర్ధ రాత్రి వరకు చీకటి లో పువ్వులు చూడటం కోసం తోట లో కూర్చోవటం, తెల్లవారు జామే, వేకువ అంచున చీకటి నురగ ను చూడటం కోసం సముద్రపుటొడ్డుకు పరుగెత్తటం ఇలాంటి వెర్రి మొర్రి పనులన్ని చేస్తూ కూర్చుంటే మీ ఒదిన సంతోషం గా వుంటుందా,..! అలా అని నీకు చెప్పిందా..! అది ఒక వెర్రి మాలోకం, నిన్ను చూడగానే దాని ఆనందం, నవ్వులు చూసినప్పుడే అనుకున్నా ఇలాంటివి ఏదో నూరిపోస్తున్నావు అని,

అమ్మా... తల్లి.. దానికి లేనివి నేర్పి నా మీదకు తోలక.. ఏదో చిన్నప్పుడు, చదువు కునేప్పుడు ఏదో ఆలోచించాము, ఏవో మాట్లాడేము అని ఇక జీవితాంతం అలానే వుండాలి అంటే ఎలా కుదురుతుంది చెప్పు... పరిగెత్తి జీవితాన్ని అందుకోవాలే.. అప్పుడే ఆ జీవితానికి అర్ధం... పరమార్ధం.. పరుగెత్తి పాలు తాగలేని చవట లందరు ఇలా నిలబడి నీళ్ళు తాగటం లోని లేని ఆనందాన్ని తలుచుకుని మురుస్తూ వుంటారు, ఇది ఈ కాలానికి మన వయసుకు తగిన జీవిత సిద్ధాంతం, వేదాంతము. అంత అన్న మాట వినే దానివైతే ఇకనైనా ఆ పిచ్చి గోల ఆపి, ఆ పనికి రాని టీచర్ వుద్యోగం మాని, పిల్లా పీచు రాక ముందే గ్రూప్ 2 పరిక్షలకు కూర్చుని పూర్తి చెయ్యి. తెలివంతా ఇలా ఎవరో రాసేసిన కవితల పుస్తకాలు చదవటం లో కాదు నీ భవిష్యత్తు ను నువ్వు సరి గా రాసుకోవటం లో చూపించవే పిచ్చి మొద్దు.

ఇదుగో ఇలా రాస్తుంటే తెల్లారుతుంది.. దీని బదులు కాసేపు ఏదైనా వుపయోగపడే పని చేసుకుంటే పుణ్యం పురుషార్ధం. రేపు మళ్ళీ ఆడిటింగ్ వుంది, ఈ సవత్సరం మన శ్యాం గారు లలిత అక్క వాళ్ళ ఆఫీస్ కు కూడా వస్తాను అని చెప్పేను.

అవును అమ్మ ఒకటే గోల చేస్తోంది కిందటి వారం వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఒక్క సారి ఫోన్ కూడా చేయలేదంట, ఇంకో నెల లో ఏదో అన్నా చెల్లెళ్ళు బట్టలు పెట్టుకోవటం.. ఏదో చెయ్యాలి అట, మీ ఒదిన కు చెప్పేను మంచి చీర తీసుకోమని వీలున్నప్పుడు రా మరి... వాడిని, కృష్ణ ని కూడా రమ్మను మరీ బొత్తి గా నల్లపూసై పోయాడు... వాడి కోసం మొన్న ఎక్కడో దొరికితే నవీన్ "అంపశయ్య" తీసుకున్నా.

వుంటాను మరి.
ప్రేమతో,

అన్నయ్య.