పుట్టినూరు.. పున్నమి నవ్వులు.. పులకరింతల పువ్వులూ...
కన్నతల్లి పుట్టిన వూరి రుణం ఎంత అయినా తీర్చుకోలేనిది అంటారు.. అటువంటి పుట్టినూరుకు రాసిన ఒక వుత్తరం
అమ్మా,
ఎలా వున్నావు? నీ బిడ్డలు నిను వదిలి పోతున్నారని దిగులు తో గుండె ఘోషను సాగరుడికి పంచి, వున్న బిడ్డల ముద్దు మురిపాలను వెన్నెల నురగ గా మెరిపిస్తున్నావా???? తాటి తోపుల గాలిని మొగలి పూల దొన్నెలలో నింపి పారిజాతాల సొగసులద్ది కృష్ణమ్మ నీలాల కురులకు విరి మాలలల్లి.. ఎన్నెన్నో జాతీయ వుద్యమాలకు బాసట గా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన యోధుల కన్న తల్లి వై వున్న నీకు దిగులెందుకమ్మా.. నీ గుండెల మీద ఆడుకున్న మాకు నీ తలపు గుండెలో ఎప్పటికీ బాల్యాన్ని పలకరిస్తున్న వెన్నల వాగంటి నవ్వు లా సమ్మోహన పరుస్తూనే వుంది.. నిన్ను వదిలి ఎన్నెన్ని క్రోసుల ఎన్ని బారుల ఎన్నెన్ని సముద్రాలు దాటి ఎక్కడెక్కడో తెగిన ముత్యాల సరాల తుంపులమై వున్నా నీ గుండెలోతుల మొదటి గా మెదిలిన మెరుపుల స్వచ్చత మర్చిపోలేదమ్మా...
యోజనాల కావల ఒంటరి రాత్రి ఆకాశం లోని నిండు చందమామ ను చూస్తూ ఆ వెన్నెల వెలుగులు మెట్టిన వూరి నేల ను అమృత ధారలలో ముంచుతున్న క్షణాన, ఈ సుధ లు నిన్న రాత్రి మా వూరి మీద కురిపించి ఈ పూట ఇటు వచ్చి వుంటాడు కదూ ఈ సుధాముడు అని అనిపిస్తే అతని మీద ఎంత ప్రేమ పొంగుకు వస్తుందనుకుంటున్నావు.. అమ్మా నిన్ను వదిలి ఎన్నేళ్ళు ఐనా నిన్ను తలచుకుంటే ఒక్కోసారి మనసు నిన్నో మొన్నో నే నిన్ను వదిలి వచ్చినట్లు బెంగేస్తుంది.. సముద్రం మీది వాన లా దుఃఖం అలలై మూసిన కనురెప్పల వెనుక ముత్యాల ను పేరుస్తుంది...
ఇంకా నిన్న కాక మొన్న స్కూల్ బేగ భుజాన తగిలించుకుని రివ్వున బాణమల్లే గోపాలం గారి దొడ్లో బాదంకాయల కోసం పరుగెత్తిన జ్నాపకం... పున్నాగ పూల ను స్కూల్ బేగ్ నిండా నింపుకుని ఇంటర్వెల్ లో జడలల్లిన పులకరింత... మూసేసిన పెద్ద గేటు లోనే అరతెరిచిన చిన్న గేటు ను చప్పుడు రాకుండా తోసి చంద్రకళ వాళ్ళ దొడ్లో ఎవ్వరికి కనపడకుండా శివుడి పూల చెట్టు వెనుక చేరి చేసిన తాటాకు బొమ్మలు... అమ్మ చీర ముక్క నుంచి చేసిన ముఖమల్ చీరలు... పీలికల జడలు.. దసరా కు శక్తి గుడి సెంటర్ లో శక్తి పటాలను ఎత్తే ఆచారిని హీరోలా చూసిన సంభ్రమం... మా పేట శక్తి పటం గొప్పదంటే కాదు మాది అనే చీమిడి ముక్కుల తగాదాలు.. టీచర్స్ డే కు రామచంద్ర రావు మేస్టారు కు హిందూ న్యూస్ పేపర్ వక్కపొడి పేకేట్, సులోచనా టీచర్ కు గులాబి పూల గుత్తులు గిఫ్ట్ లు గా ఇచ్చిన బడాయి పోకలు... ఇవి అన్ని నీతోటి నా అనుభందానికి అద్దిన చెక్కెర తునకలు కాదూ???
పూల నరసయ్య ను బతిమాలి తెప్పించుకున్న మొగలు పొత్తు లోని ఆకు వొకటి అమ్మకు తెలియకుండా కొట్టేసి ఆ పైన తాటాకు ఆకు బదులు దానితో అమ్మాయి ని చేసి, నా అమ్మాయి మొగలి వాసనలు వస్తుంది మీకు లా తాటాకు కంపు కాదు అని స్నేహితులను ఏడిపించటం ఎంత బాగుండేది.... ఇప్పుడు ఈ పిల్లలు ఆడుకునే బార్బీ బొమ్మలతో ఆ కులుకేది వీళ్ళకు.. ఎట్లా ఐనా నువ్వే గొప్ప అమ్మా...!!!! అమ్మా ఇసుక నేలఅని అందరు నవ్వి పోదురు కాక ఆ పర్ర లలోనే ఎంతో మంది కళాకారులను, జాతీయోద్యమ రూపకర్తలను కన్న ఘనత కాదూ నీది.. ఆ గొప్ప ముందు ఏది నిలుస్తుంది చెప్పు... వరండాలోని గ్రిల్ అంచున పాకిన నైట్ క్వీన్ గుత్తుల తలలూపుతూ వెనుక పక్క కిటికి అంచున తొంగి చూస్తున్న మాలతీ లత అవునని తాళమేస్తూ... బయట గేటు ఆర్చ్ మీద పాకిన కాగితపూలు జల జల మంటూ గల గలా ఎన్ని కబుర్లు చెప్పేవి నీ గురించి... కోన సీమ కొబ్బరాకు అని అని గొప్పలు పోతారు కాని మన వూళ్ళో సరుగుడు తోటలు, కొబ్బరి తోటలు.... మధ్య సాగే లంకల లో వయ్యారాలు పోయే కృష్ణమ్మ కు సాటి వస్తాయా ఆ అందాలు చెప్పు... మరి ఆ అందాల షోకులన్నీ నీ పరమే గా ఎప్పటికి...
పాండురంగడు తిరణాలలో నువ్వు జీడీలు... కొమ్ము బూరలు... అమ్మాయిల కోసం కోర చూపులు చూసే కుర్రోళ్ళు.. చూసి కూడా చూడనట్లు బావి గట్టున కాళ్ళు కడుక్కుంటూ జమ్మిపూల ను చూస్తున్నట్లు కళ్ళు చిట్లించి కుర్రోళ్ళను చూసే కుర్ర పిల్లలు.. హుష్.... పెద్దోళ్ళయ్యారు అలా బహిరంగంగా చెప్పకూడదు అని అమ్మల్లే నువ్వు మందలిస్తున్నా నీ పెదవి అంచున మెరిసిన నవ్వు అర్ధనారీశ్వరుడి సిగలోని చంద్రవంకల్లే మెరిసింది లే.. పెళ్ళెయ్యిన మొదటి రోజు నువ్వు చెమరింతల చినుకులతో దీవెనెల జల్లు కురిపించావే.. ఆ జల్లు గుర్తొస్తే తోడు గా నా కళ్ళూ చెమరిస్తాయి అమ్మా...
అమ్మా... కన్న బిడ్డలందరూ నీ జ్నాపకాల ఆస్తిని తలా కూస్త పంచేసుకుని భద్రం గా గుండెలోతులలో వాటిని దాచేసుకుని ఇలా చెట్టుకు పుట్టకు ఒకరు గా వచ్చేమని దిగులు పడ్డావంటగా... మొన్న విష్ణు ఇండియా వచ్చినప్పుడు నిన్ను చూడటానికి వచ్చినప్పుడు కనిపెట్టేడంటలే.. ఎందుకలా ఆశ్చర్య పోతున్నావు? అమ్మా నువ్వు మమ్ములను గుండెలలో దాచి నీదైన ప్రతి సారాన్ని ప్రతి భావాన్ని మాకు ఇచ్చి మమ్ములను ఇంత వాళ్ళను చేసేవు నీ మనసు లో మాట ఆ మాత్రం కనిపెట్టలేమా చెప్పు.. మొగలి గాలు లూ లేవు కనకాంబరాల తోటలు లేవు.. శక్తి పటం చిందులూ లేవు... ఎండి పోయిన పాయల మధ్య గా గాలికి సుడులు రేగుతున్న ఇసుక తుఫానులను నింపుకుని నువ్వు రేపటి కోసం ఆశ గా చూస్తున్నావని తెలుసు అమ్మా... ఏమి చెయ్యము అమ్మా... సరస్వతి కటాక్షించింది నీ దయ వల్ల... మరి లక్ష్మి కూడా కావాలి కదా జీవన పధం లో అడుగులు సమ శ్రుతి లో సాగాలంటే.... కట్టుకున్నోడి చిటికిన వేలు పట్టుకుని సప్త సముద్రాలు దాటి వచ్చేసినా నీ తలపుల చివురు తీవె వేసే మొగ్గల మాలను ఎప్పటికి భద్రం గా కురుల తురుముకుని నువు నేర్పిన లాలి పాటలను బిడ్డలకు పాడుతూ వాళ్ళ అమ్మ నై ముందు తరాలకు ఇంకో భూమాత నవుతున్నా... నన్ను దీవించమ్మా..