1, మార్చి 2010, సోమవారం

జీవితం లోని ఇంకో చీకటి కోణం...

ఫిబ్రవరి కౌముది లోని వుత్తరం




రమా,
నేను బానే వున్నా, నువ్వు ఎలా వున్నావు? మావయ్య వాళ్ళు అందరు బాగున్నారా? దుర్గ బాగుందా? చిన్న మావయ్య వాళ్ళు కూడా బానే వుండి వుంటారు. చాలా రోజులయ్యింది నీతో మాట్లాడి, మొన్న సంక్రాంతి శెలవలకు అమ్మ పంపిస్తానని అంది. నేను బట్టలు సర్దుకున్నాను, అమ్మతల్లి వాళ్ళకు అందరకు చెప్పేసేను కూడా. కాని పండగకు రెండు రోజుల ముందు రాంబాబు చని పోయాడు. ఇంక నాన్న ఎక్కడకు వద్దు అన్నారు. నాకే ఇంక అసలు రావాలనిపించలేదు. పాపం మా ఇంటి వొనర్ గారి అబ్బాయి రాంబాబు ఆత్మహత్య చేసుకున్నాడు తెలుసా... బలే బాధ, భయం వేసింది.

ఇంక సంక్రాంతి శెలవలు రెండు రోజులలో మొదలవుతాయి అనంగా ఆ రోజు పొద్దున్నే నేనేమో టిఫిన్ ఒక చేత్తో, పుస్తకం ఒక చేత్తో స్వాహా చేస్తూ బుర్ర లో ఒక పక్క సిలబస్ ఇంకో పక్క అమ్మ తిట్లు ఎక్కించుకుంటున్నా. నాయుడు తాత గారు వాళ్ళ తలుపు తీసుకుని పరుగెత్తుకుని వచ్చారు...... ప్లీడరు గారు రాంబాబు మాట్లాడటం లేదు అని. నాన్న, అమ్మ వెళుతూ పైన రాఘవరావు మాస్టారు నూ పిలిచారు. ఆయన, నేను, శేషు అందరం పరుగెత్తుకుని వెళ్ళేము... డాబా మీద ఆ పెద్ద పట్టె మంచం పైన పడుకుని వున్నాడు. పక్కన ఏదో కాగితం వుందనుకుంటా, నాన్న తీసి లోన పెట్టేసేరు. రామచంద్ర మావయ్య గారికి ఇంకా అందరికి ఫోన్ లు చేసేరు, రిక్షా లో హాస్పటల్ కు తీసుకుని వెళ్ళేరు.

ఇంక ఆ తరువాత నాలుగు రోజులు ఎలా గడిచాయో ఎవ్వరికి వూహ కూడ లేదు. మామ్మ గారు వచ్చారు వాళ్ళ వాళ్ళందరు.. విశాలక్క, శేషు అక్క, హర్ష మావయ్య అందరు వచ్చారు. అందరు పాపం తాత గారిని తిట్టేరు... ఆయన మూలం గానే ఇంత జరిగింది అని. రోజూ విశాలక్క అమ్మ దగ్గరకు వచ్చి ఏడ్చేది పాపం. మూడో రోజు చచ్చి పోయాడు రాంబాబు. అంతకు ముందు వారమే నన్ను "ఏమే లిమ్కా బాగా చదువుతున్నావా లెక్క లు అర్ధం అవుతున్నాయా లేకపోతే అడుగు" అని పలకరించిన రాంబాబు, కనపడినప్పుడల్లా "ఏమే జాంకాయల కోసం నిన్న మా గోడ దూకింది నువ్వే అంటంగా" అని వుడికించే రాంబాబు.... ఇంక ఎవ్వరికి తెలియని లోకాలకు వెళ్ళి పోయాడంట రమ.

రమా పది రోజుల నుంచి వాళ్ళందరి బాధ చూస్తుంటే రాంబాబు మీద బలే కోపం వస్తోంది రాంబాబు వాళ్ళ చిన్నక్క అదే పద్మక్క ఐతే ఎట్లా ఏడుస్తోందో అమెరికా నుంచి వచ్చిన దగ్గరనుంచి, పాపం అన్నం కూడా తినటం లేదు. అంత మంది ప్రేమించే వాళ్ళు వుండగా నాకు ఎవ్వరు అక్కరలేదు అని ఎలా అనుకోగలిగాడో...

మనం పిరికి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు అనుకుంటాము కాని, నిజానికి ఆత్మహత్య కు ఎంత ధైర్యం కావాలి కదా.. పది రోజుల నుంచి నాయుడు తాత గారి డాబా మీద పద్మ అక్క కు మందులు ఇవ్వటానికి అన్నం పెట్టటానికి నన్నే వుంచారు. అక్క నాతోనే కదా బాగా వుంటుంది మరి. గుర్తు వుందా నువ్వు వేసవి కాలం శెలవలకు మొదటి తడవ వచ్చి నప్పుడు చూపించా కూడా, ఆ డాబా మీదే నాయుడి తాత గారి గంతించిన గత వైభవ చిహ్నాలు గా ఆ పెద్ద సోఫాలు, దివాన్ లు, పేద్ద పేద్ద బీరువాలు, పేద్ద పేద్ద మంచాలు దాని పందిరికోళ్ళు, ఎంత అందం గా కాని దిగులు గా వుంటాయో. ఆ దిగులు కు తోడు పక్కన వరండా పిట్టగోడ నిండా పాకిన రాధా మనోహరాల సువాసనలు. అన్ని సార్లు పరిమళాలు మంచి తలపులను ఆహ్లాదాన్నే కాదు ఒక్కోసారి ఆ పరిమళాలు కూడా ఎంతో గుబులు దిగులును లేప గలవు కదా.. అసలే ఆ గత వైభావల దిగులు కు ఇప్పుడు రాంబాబు చేసిన పని తో, ఇంక ఆ వాతావరణం గాలి లో కూడా బాధ సాంద్రత, దుఖపు ఆర్ధ్రత్ర వెయ్యి రెట్లయ్యి నెమ్మది గా వీస్తూ వుక్క ల చిరాకులతో కలిపి విసిగిస్తోంది అక్కడ ఇప్పుడు.

అక్కడే నేను చదువుకుంటూ వుంటే పద్మక్క, రాంబాబు కబుర్లు చెప్పుకుంటూ వుండే వారు, నాకు వినపడటం లేదు అనుకుని అక్క తన యూనివర్సీటి ప్రేమ కధ అంతా అక్కడే రాంబాబు కు చెప్పి, ఇద్దరు తాత గారిని, మామ్మ గారిని ఇంకా అందరిని ఎలా వొప్పించాలో తర్జన భర్జనలు పడుతుంటే అప్పట్లో అదే పూల గాలి ఎన్ని మధురమైన ఆశలను చిరు గాలితో కలిపి, వుక్కపోసిన తనువు కు స్వాంతన ను, వుక్కిరి బిక్కిరి గా వున్న అక్క వాళ్ళ ఆలోచనల క్రమానికి విశ్రాంతి ని ఇస్తుండేది. ఇప్పుడు అక్కడే అక్క నిండు నెలలతో అలా మంచం మీద పొడుకుని అవి అన్ని తలచుకుని ఏడుస్తూ వుంటే రాంబాబు ఆత్మ అక్కడే తిరుగుతూ అవి అన్ని పద్మ అక్క తో పంచుకుంటున్నాడేమో అనిపించింది నాకు

అవును రమా ఎవరైనా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఇంక జీవితం మీద అశ లేకనా? ఇంక జీవితం లో ఏమి సాధించలేము అని వాళ్ళకు ఖచ్చితం గా తెలిసి పోవటం వలనా? ఎవరికైనా భవిష్యత్తు లో ఏమి అవుతుందో తెలియదు కదా ఇంక ఏమి సాధించలేము అని ఎలా అనుకుంటారు? అది కాదేమో కారణం. ప్రస్తుత ఆలోచనలకు, ఆశలకు, ఆశయాలకు తీరని తీవ్ర అఘాతం ఏర్పడి ఇంక ముందు జీవితమంతా అగమ్య గోచరమై, బతుకు బాట ఇక్కడి తో ముగించి కొత్త బాట పట్టాలని ఆశ తోనేమో.. ఐనా తెలిసి తెలిసి......... రేపనే ఒక రోజు నాకొద్దు అని తనకు తానే నిర్ణయించుకుని ఈ క్షణం తో ఆఖరు ఈ వూపిరి అనుకోవాలంటే, అమ్మో ఆ వూహే వెన్నులోనుంచి వణుకు తెస్తోంది కదా.. ఎన్నో తెలిసి, ఎన్నో చదివిన వేదాంతులు లేదా జీవితాన్ని నెమ్మది గా అనుభవించి, పరి పూర్ణమైన పెద్ద వాళ్ళు చిరునవ్వు తో "ఇంక మా పాత్ర లు చాలు ఈ జీవిత నాటక రంగపైన, ఆ పైన వాడి పిలుపు ఎప్పుడొచ్చినా ఆనందమే" అనటం చూసాను కాని, చాలా వరకు పెద్ద వాళ్ళు కూడా, ఇంకా తాపత్రయం పడుతూ, ఆశలు పెంచుకుంటూ వుంటారు కదా అలాంటిది అంత చిన్న వయసు లో అలా ఎలా నిర్ణయం తీసుకోగలిగాడో రాంబాబు.

కారణం ఏదైనా ఫలితం మాత్రం అంతు చిక్కని ఆవేదనను, ఆర్పలేని కారు చిచ్చు ను వాళ్ళ కుటుంబం లో రేపింది. తెలియని ఆ దేవుడి కి తలవొంచి మొక్కుతూ అడుగుతున్నా ఏమి ఆశించి రాంబాబు ఈ పని చేసేడో ఆ ఫలితాన్ని ఐనా ఇచ్చి కుటుంబాన్ని ఒక దరికి చేర్చు స్వామి అని. వింటాడంటావా?



ఉమా,
నీ వుత్తరం అందింది, మొన్న నాయనమ్మ కు వొంట్లో బాగోలేదని అత్త రావటం తో నువ్వు వుత్తరం లో చెప్పని కబుర్ల వివరం కూడా పూర్తి గా తెలిసింది. ముందు గా నీ పరిక్షలలో ఫస్టున పేస్ ఐనందుకు శుభాకాంక్షలు. నాకు తెలుసే నీ పట్టుదల నిన్ను తప్పక నువ్వు అనుకున్న గమ్యానికి చేరుస్తుంది. పట్టుదల కు అదృష్టం తోడైతే నీ వనుకున్న గమ్యానికి చేరే దారి నీకు సులువు గా కనపడుతుంది. కనపడిన దారిలోని ముళ్ళు పువ్వులు గా చేసుకుని సాగే ధైర్యం తోడైనప్పుడు నడక కూడా సుగమం అవుతుంది. నడక లో అలసట కమ్మి, కష్టం కారు చీకటై ముంచేసి, ధైర్యాన్ని నీరు కారిస్తే అదృష్టం భయపడి వెనక్కు పరుగెడుతుంది.

నేను పైన రాసింది మాములు గా మన వంటి మధ్య తరగతి కుటుంబాలలో పెరిగే వాళ్ళ గురించి చెపుతున్నా. ఇంక ఎంత పట్టుదల వున్నా పరిస్తితుల ప్రభావానికో, దురదృష్టం విడువని చెలిమి వలనో, అపజయాల పరంపరను జీవితపు కొంగున కట్టి..... ఆ బరువు ఎక్కువైనప్పుడు తెలియకుండానే మునిగే వాళ్ళు, అలానే కొన వూపిరి తో ఈదే వాళ్ళు, బరువు భారానికి ఈడుస్తూ నడక సాగించే మధ్యతరగతి మందహాసాలు కూడా వుంటాయి, ఇది చదువుకే కాదు జీవితానికి కూడా వర్తిస్తుంది. అవి ఇంకా మనకు పరిచయం కాక పోవటం వలన రాంబాబు చేసిన పని నీకు అంతు లేని ఆశ్చర్యాన్ని, కొండకచో ఆతనిపై ఆగ్రహాన్ని రప్పిస్తోంది.

అవును ఇక చాలు అనే చాలా ధైర్యమో, ఈ సమస్య కు ఇదే పరిష్కారమనే వెర్రి ఆవేశమో, లేదా వివరం తెలియలేనంత దుఃఖమో మనిషి ని కమ్మినప్పుడు చావు ఒక్కటే వాటన్నిటికి పరిష్కారమల్లే తోస్తుంది. అంతే కాదు ఇంకో పక్కన మనకు తెలియని ఆనందం వుందన్నపిలుపుల ఆశ కూడా ఒక్కో సారి ఇలాంటి పనులకు పురికొల్పు తుంది. నాకు ఏదో పెద్ద తెలుసు అని కాదు కాని, నా పరిధి లోని వితరణ ఇది.

అంతా ఐపోయాక దుఃఖ పడటం తప్పు అని నేను అనటం లేదు, అలానే వాళ్ళ దుఃఖం లో న్యాయం లెదు అందులో నిజాయతి లేదు అని కూడా నేను అనటం లేదు. కాని ధర్మారావు తాత గారి రాంబాబు విషయం లో మాత్రం, అతనిని ఒక్కడిని సమస్యల వలయం లో ముంచి, ఎవరికి వారు పక్కకు తప్పుకున్నారేమో అనిపిస్తోంది నాకు. ఆలోచించు. ఆ వయసులో మామ్మ గారు, తాత గారిని వదిలి విశాలక్క దగ్గర వుండటం లో ఆమె చిన్నతనం నుంచి పడిన ఆవేదన, ఆక్రోశం కనపడుతోంది నాకు. పాపం ఎప్పుడూ అవమానాల, విదిలింపుల లెక్కలేని తనం లో వంట ఇంటికి మారాణి ఆమె. అవును..... పలుకలేని కుండల, చట్టుల మధ్య లో ఆ తేలి వస్తున్న పొగ లమధ్యన తేలుతూ ఒక నడిచే ప్రేతమల్లే వుండే వారు ఆమె నాకు, మీరంతా (నువ్వు కాదులే అత్త, మావయ్య ఇంకా అందరు) ఆమె చాలా సహన శీలి, చాలా వుత్తమ ఇల్లాలని ఇచ్చిన ముద్ర లతో బరువులతో పాపం ఇంకా కుంచించుకు పోతూ వుండేవారు అనుకుంటా.

ఆమెకు ఎందుకు అంత విసుగు వచ్చిందో????? పిల్లలు పెద్ద అయ్యి, అల్లుళ్ళ ముందు కోడళ్ళ ముందు కూడా ఆ ముండరికాల గోలలలో ఆమె ఆత్మ ఎంత క్షోభించి....... తన మాట చెప్పుకోగల కూతురు అల్లుడి దగ్గరకు వెళ్ళి వున్నారో మనకు తెలియదు కదా. కాని సమస్య ఏదైనా, ఎవ్వరు దానికి పరిష్కారం వెతక కుండా ఎవరికి వారు మాకెందుకు లే, మొదలు పెడితే ఎటు వెళుతుందో మౌనం గా గడిచి పోని, కాలమే పరిష్కరిస్తుంది ఇప్పుడు బజారున పడటం అవసరమా అనుకుంటూ ఒక అగ్ని పర్వతం రగులుతూ నీలి మంటలు కనపడుతుంటే..... పేలనీ, చూద్దాములే అన్నట్లు నిర్లక్ష్యం చేసేరు. మరి రాంబాబు ఒక్కడే ఎందుకు మొదలెట్టేడో ఈ సమస్య కు పరిష్కారం కని పెట్టాలని పిచ్చి ప్రయత్నం. ఆ ప్రయత్నం లో అన్నిటా విఫలమయ్యి తన మరణమే మొత్తాన్ని కలుపుతుంది అని అంత అమాయకంగా ఎలా అనుకున్నాడో మరి. ఏది ఏమైనా ఆతని నిండు జీవితం బలై పోయింది. సమస్య పరిష్కారమవటం బదులు పూర్తి గా నిందారోపణ లతో పగిలి పోయింది.

చాలా సార్లు, చాలా చోట్ల ఇటువంటి అసంతృప్తి తో రగిలే కుటుంబాలు కనపడుతూనే వున్నాయి మనకు. కాని మనకెందుకు....!!!! మనం మధ్యలో కల్పించుకోవటం అనవసరం .........అనే ఎవరికి వారే తరహా లో, కొత్త గా నేర్చుకున్న సో కాల్డ్ కల్చర్ తో సమస్య పరిష్కారానికి తోడ్పడం. కాని ఎప్పటి నుంచో అలవాటైన ఆ పాత విలువల కెలిడియోస్కోప్ లో చూసి వాళ్ళను ఎక్కిరించటానికి మాత్రం వెనుకాడం..

పాత లోని రోత, కొత్త లోని చెత్త రెండిటిని తీసుకుని ముందు తరాలకు సాగుతున్న ప్రతినిధులం కదా మరి. సున్నిత మనస్కులకు, పిరికి వాళ్ళకు ఇలాంటి దారి తోచి మన సమాజాన్ని ప్రశ్నించినప్పుడు......... ఒకింత ఆగి భుజాలను తడుముకుని ఏదో చొప్పదంటి సమాధానాలతో మనలను మనం, బయటి వాళ్ళను మోసపుచ్చుకుని..... అల్ ఈజ్ వెల్..... ఎవ్విరి వన్ ఈజ్ హేపీ అనుకుని సాగిపోవటం ఒక్కటే జరుగుతున్న విషయం. మారుస్తావా.. మార్చు.. ముందు నీలోని విలువలను, నీ అంతరాత్మ ను మార్చు...

ఏ విలువను నువ్వు నమ్ముతున్నావో అది ముందు గా ఆచరించు, నీ జీవితం లో అనుష్టానించు, తరువాత నీ కుటుంబం లో నీ బిడ్డలలో ఆ విలువలను నాటు.... మార్పు ఎక్కడో కాదు ముందు మనలో రావాలి.. అపుడు మారిన నువ్వు, మార్చబోయే వేయి మంది కు కర దీపికవవుతావు. ఆ కుటుంబం లో మార్పు ఏమో కాని భావి తరాల కుటుంబాలలో ఇటు వంటి కధలు పునరావృతం కావు. అదే నీ రూపం లో, నీలో వున్న దైవత్వం..... నీకు, నాకు ఈ సమాజానికి కి ఇచ్చే వరం. రాంబాబు వంటి వారికి మనం ఇవ్వగల వుపశమనం.