18, మార్చి 2010, గురువారం

అంతులేని దూరం అంతమయ్యే చోటు....

మార్చ్ నెల కౌముది లేఖ
అంతులేని దూరం అంతమయ్యే చోటు....




నల్ల పొన్ను,

కాస్త కాస్త గా కరుగుతున్న హృదయపు ముక్క నుంచి జాలువారే వేదనను........ ఈ రాత్రి ఎంతకు అంతమవ్వని చీకటి గా మార్చి, ఎదురు గా సముద్రపు నీళ్ళ మీద గాలి పంకాలతో కలిపి కొడుతున్నదేమొ...... సంగమం దగ్గర నది జాలు వార్చే జాలి పాటలలో ఎప్పుడూ వినపడే మధు మాసగీతికలు, మల్లెల ఖవ్వాలిలూ వినిపించటం లేదు మరి.. నువ్వు నా పెదవి మీద నవ్వై మెరిసి ప్రతి క్షణం పలకరించాలని ప్రయత్నిస్తున్నా, నాకేమో నిన్ను ఈ రాత్రి, ధరిత్రి గుండె మీద మెరిసిన కన్నీటి మంచు బిందువులానే పలకరించాలని వుంది.

ఆశావాదపు అంచున చందమామ ముక్కపై మేఘాల మబ్బులతో నువ్వు, నిరాశావాదపు మత్తులో జోగుతూ నిద్రా దేవతను శపిస్తూ నేను... విరిసే వుదయాన, మెరిసిన పువ్వుల తొలి దరహాసమై నువ్వు..... నిన్న రాత్రి వడలిన ఆశలతో, రేపు ను ఎడారి వుష్ణపక్షి లా వెతుకుతూ అంగలారుస్తూ నేను... ఎలా రా చిన్నా కలిసేది.. ప్రతి రోజును ఒక ప్రశ్నార్ధకమై నా ముందు వుంచుతుంది ఈ శిశిరం... మొదలు వొరిగిన మానులా, కూలి మోడు వారిన కొమ్మ కొమ్మన, పువ్వుల నవ్వుల లా అలంకరింపాలని నువ్వానతించి పంపిన మంచు, తళుకు బెళుకుల సోకు ను తోడు తెచ్చుకుని వస్తే, కలవరింతలనే వరించిన నా మనసు వాటన్నిటిని కన్నీటి వరద లో ముంచేస్తోంది. నువ్వు, నీ ప్రేమ.... వుప్పెన లా వచ్చి ముంచేస్తే తప్ప, చిరునవ్వుల ఆ చిరుజల్లు........ విరబూసే కన్నీటి పూ తోటలలో ఏమి లెక్క చెప్పు.

కాలం ఎవరితో నిమిత్తం లేకుండా సాగిపోతోంది అంటారు మిత్రులందరు, నాకెందుకు కాలం నీతోనే ఆగి పోయి ముందుకు కదలనని మొరాయిస్తోంది. నాలోని లోపమా నీ లోని మహిమా ఇది... ఏదేమైతేనేమి నేను లోకానికి వ్యర్ధం గా మిగిలిపోయాక. ప్రేమ అంటే ఇంత విషాదమా.....!!!! "ప్రేమ జీవితం లో ఒక భాగమే కాని, ప్రేమే జీవితం కాదు. జీవితం ఆగక నిరంతరం సాగే ప్రవాహం. ఒక పాయ పక్కకు మళ్ళిందనో, ఇంకో పాయ వచ్చి కలిసిందనో ప్రవాహం ఆగదు కదా, సాగుతూనే వుంటుంది అను నిత్యం తనతో కలిసే కదలికలను తనవి గా చేసుకుని" అని చెప్పి నువ్వే ఇప్పుడు జీవితాన్ని కదలని కుళ్ళు నీరు లా చేసుకుంటున్నావే అని అడిగింది సుగుణ నిన్న.....

సమాధానమే లేని ప్రశ్న కు నేనేమని బదులివ్వగలను..... ఇచ్చినా అర్ధం అవుతుందా..!!!!! అడిగేసి, కదిలిపోయే ప్రవాహమల్లే పక్క వాళ్ళ తో గల గల మంటూ వెళ్ళి ఫోయింది ఆమె, నన్ను నా మౌన సముద్రం లోకి తోసేసి... నెమ్మది గా ఆ సముద్రపు వొడ్డున మన జ్ఞాపకాల శంఖులను ఏరి ప్రేమ రాగం కడదామని వూదుతుంటే ఖాళి నుంచి గాలి బుసలు కొడుతూ వెళి పోతోంది తప్ప ఒక్క రాగమైనా స్వరపడదే... గాలి వాలుకు ఎగిరే నీ కొంగును దోపి అలల తో పాటు పరుగెడుతూ..... నువు పెట్టే గస జంట శృతి లో సాగక పోతే, రాగం రానని పచ్చి కొట్టి పోయింది రా.


ఒక్క మనిషి లో ఇంత ప్రేమ ను వూహించుకుని బాధ పడటం నీ మూర్ఖత్వం అని ఒక ముక్కలో తేల్చేరు మొన్న రాత్రి సాహిత్య సభ లో శ్రీధర్ బాబు గారు. అవునా నీలో నేను ప్రేమ ను వూహించుకున్నానా... అవునా..????? ఐనా ఒక మనిషి కి ఇంకో మనిషి మీద ప్రేమ ఎందుకు వస్తుంది.. అసలు ఏ మనిషి కి ఐనా ఇంకొకరి మీద ప్రేమ ఎందుకు వస్తుంది... న్యూటన్ సూత్రాలల్లే ఈ ప్రేమ ఎలా ఎప్పుడు పుడుతుంది..???? దాని సరి ఐన వ్యతిరేక ప్రమాణమేమి..??? అది ఎలా పని చేస్తుంది.???? అని ఎవరైనా సూత్రీకరించి పెట్టకూడదు, చదువుకుని....... ఈ ప్రపంచం లో జరిగే అధ్బుత మైన అనుభవాలన్నిటిని, వాటి గొప్పతనం గుర్తించకుండా కనీసం అనుభూతించటం కూడా మానేసి..... మాకు చిన్నప్పుడూ 5 వ తరగతి లోనే చెప్పేరు అని బడాయి పోయే కుర్రవాడికి లా, వో ఇవన్ని మాకు తెలుసు........ ప్రేమ గతి ఇంతే, దాని చలన సూత్రాలివి..... అని చెప్పేవాడిని.

ఇలా ఆలోచిస్తూ ఆ రాత్రి, సమూహానికి దూరం గా, సాహిత్యానికి కూత వేటు లో కూడా అందకుండా, ఎప్పటి లానే ఒక్కడినే సముద్రపుటొడ్డున మన పరిచయమైన మొదటి రోజులను...... ప్రేమ సుగంధం ఇక్కడ అక్కడ అని లేకుండా మన ప్రపంచాలను పూర్తి గా చుట్టేసి, ఆ మత్తు లో భరించలేని సంతోషాన్ని..... కన్నీళ్ళ తో మనం పంచుకుని ఆ ప్రేమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న కాలాన్ని, కళ్ళ ముందుకు తెచ్చుకుని.. ఆ సంబరాన్ని ఇప్పుడూ మూడో వ్యక్తి లా సమీక్షించటానికి ప్రయత్నించాను ప్రశ్న కు సమాధానం దొరుకుతుందేమో అని.

సమాధానమేమో కాని ఎంత ఆనందం దొరికింది రా ఆ ప్రయత్నం లో.... నీవు నాతో పంచుకున్న నీ అనుభవాలను నీకే ఇంకో సారి వినిపించనా ఈ వేళ. వుహు... నా వలన కావటం లేదు నా మాటలలో, సరే నీ వుత్తరాలనే నీకు చదివి వినిపిస్తా ఈ పూట..
"కృష్ణ మిమ్ములను మొదటి సారి గా...... ఆ ఇరుకు రోడ్ లో, చీకటి సగం వెలుతురు సగం పోటీ లు పడుతున్న రూమ్ లో, మొదటి సారిగా చూడగానే........ నాకు ఒక్క సారి వురికే వెలుగు వెల్లువ లను సన్నాయి తో కలిపి, విరపూసిన మందారాలను వేవేల గా నా కళ్ల ముందు కుప్పలు పోసి..... వాటి మధ్య నేనెప్పటి నుంచో నా కలలో వెతుకుతున్న రాకుమారుడిని అభిషిక్తం చేస్తున్నట్లు అనిపించింది.. అంతకు ముందు నా స్నేహితులతో మొట్ట మొదటి చూపు లో ప్రేమ అనే పదం గురించి వాదనలు చేసి, అది ప్రేమ కాదు ఆకర్షణ అని వాదించిన నా గొంతు ఒక్క సారి మూగపోయి...... ఇదే ప్రేమ, ఇతనే నీ ఆత్మ వెతుకుతున్న జంట అని మౌనంగా చెప్పినట్లనిపించింది.. మీరు తెల్లబోయిన నా మొహం చూసి తప్పు ఆడ్డ్రెస్ కు వచ్చాను అనుకుని "excuse me What can I do for you" అని అడుగుతుంటే మీ మనసు కావాలి ఇస్తారా అని అడగ బోయి, తమాయించుకుని ఏదేదో పిచ్చి పిచ్చి గా అంతూ పొంతూ లేకుండా మాట్లాడి వెళ్ళి పోయాను, నా మనసు ను మాత్రం భద్రం గా మీ గుండె జేబు లో మీకే తెలియకుండా పెట్టేసి"

రేయ్ నల్ల పిల్లా నువ్వు వూహించగలవా ఇది మొదటి సారి చదివినప్పుడు నా పరిస్తితి.. అంత వరకు నాకు నిజం గా ప్రేమ అంటె తెలియదు రా. మధ్య తరగతి జీవితం లో వున్నత స్థానాలకు ఎదగాలని, ప్రతి క్షణం గమ్యం వైపుకు దృష్టి సారించి పరుగులు తీసే నాకు ఒక్క సారి జీవితం లో గమ్యానికి నిజమైన అర్ధం తెలిసింది.. నిన్ను మొదటి సారి చూసినప్పుడు నేను ఎవరు రా ఈ నల్ల పిల్ల, ఇలా వెర్రి మొహం పెట్టి నా తల పై నుంచి శున్యం లోకి చుస్తోంది. ఏమి కంప్యూటర్స్ నేర్చుకుంటుంది రా నాయనా అనుకున్నా. నిజంగా అదే నా మొదటి ఫీలింగ్. ఆ మాట చెప్పినఫ్ఫుడు కోపం తో ఎర్రనైన నీ మోము ను....... ఆ రాత్రి చీకటిని చీల్చుకుని ఆకాశం తూరుపు అంచున ఆ ఆనవాలు కనపడే దాకా తలచుకుంటూ...... నవ్వుకుంటూనే వున్నా.

ఇదుగో ఇంకో ముక్క నీ వలపుల గీతాంజలి నుంచి.
"అవును అందరు దేవుడు, ప్రేమికుడు, స్నేహితుడు, భర్త, చెలికాడూ వీటన్నిటికి ఒక్కొక్క అర్ధం చెపుతారు... నాకు సంబంధించినంతవరకు అన్ని నాకు నువ్వే.. పాత కధ లలో భర్త ను గొప్ప గా ఆరాధించి ప్రేమించారు అని చదివి నవ్వుకునే దానిని, కాని నీ మీద ప్రేమ నాకు తటస్థించినాక ఇప్పుడు అర్ధం అవుతోంది ఆ మిశ్రమ సమ్మేళనాల భావానికి అర్ధం ఏమిటో... ప్రేమించిన వాడి లో పరమేశ్వరుడిని చూడటం ఎంత తేలికైన పనో. ఆ పరమేశ్వరుడి అర్ధ భాగం గా ఇమిడిన పరమేశ్వరి నేనయ్యాక జీవిత సాఫల్యానికి అర్ధం తెలిసింది. కృష్ణుడి కోసం ఎంత మంది ఎంత విరహపడినా రాధ రుక్మిణి ఎప్పుడూ కోపగించుకోలేదట, నిలువెల్లా ఈ కృష్ణయ్యను నింపుకున్న ఈ రాధ కు..... రుక్మిణి కి ఆ అవసరం రాదని అనుభవైకవేద్యమయ్యాకే కదా తెలిసింది."

నేనేమని బదులివ్వను, నీ ఆత్మ నన్ను నీ వశం చేసుకున్నాక, ఇంక నాదనే ఒక వునికినే కోల్పోయి నీ పాదా క్రాంతుడినైన నన్ను, ఏ గొప్ప వరం మూలం గానో తటస్ఠించిన ఈ గొప్ప సంబరాన్ని, ఎన్ని మాటలలో పలికించగలను చెప్పు. ఇంత ఘాడమైన అనుభవం ఒక సారి కలిగేక ఇంక వేరే జీవితం వైపుకు ఎవరి చూపైనా మళ్ళ గలదా.....

ఇన్ని జీవితాలు...... ఎన్నెన్నో ఆలోచనలు........ కొత్త దనాలు, పాత దనాలు....... చిత్రమైన జీవిత పాట్లు, పేద గొప్ప, ఆడ మొగ ఎక్కువ తక్కువలు ఎందుకు ఇవి అన్ని..... ఒక్క సారి ఆగి ఆలోచించమను అందరిని. ఇవి అన్నిటి వెనుక అంతఃసూత్రం గా అందరికి కావల్సింది ప్రేమ కాదా, దాని కోసం కాదా ఈ పరుగులు. కాదు అధికారం కోసం, కాదు డబ్బు కోసం, కాదు సంతోషం కోసం అని వేరు వేరు సమాధానాలు ఇస్తారేమో అందరు. కాని వాటన్నిటికి వెనుక కారణం ప్రేమే కదా కుటుంబం మీద ప్రేమ తోనో, తన మీద ప్రేమ తోనో, పేరు మీదనో, పదవి మీదనో, అధికారం మీదనో.... ఒక వస్తువు మీద ప్రేమ తోటే కదా ఈ ప్రపంచం తిరుగుతుంది. ఆ ప్రేమ మిమ్ములను నడిపిస్తుంది అంటే ఎందుకో ఒప్పుకోరు. పాత కాలం ఆలోచనలు, వేగమైన.... యంత్రయుగమైన కాలం లో పరుగెడుతున్నాము, పరుగెత్తు అంటారు. నువ్వు పరుగెత్తి సాధిద్దాము అనుకునేది నేను నా చెలి ప్రేమ లో, నా చెలి గుండెలో నేనెప్పుడో సాధించాను అంటే ఎందుకో నన్ను జాలి గా చూసి, గొణుక్కుంటూ వెళ్ళి పోతారు.
నేను ఏడుస్తున్నానని, నిన్ను తలచుకుని కాలాన్ని నిరుపయోగం చేస్తున్నానని, నా తెలివి, నా శక్తి ఇతర వ్యవహారాలకు వుపయోగించనని వీళ్ళందరి ఫిర్యాదు. నా మీది ప్రేమతో చెపుతారు. వాళ్ళను అంత బాధ పెడుతున్నందుకు నాకు సిగ్గు గానే వుంటుంది రా. కాని ఒక్క సారి కళ్ళు మూసుకుంటే రా రమ్మన్న నీ పిలుపు, నీ వేలి కొసల నుంచి నా గుండెలోకి నువ్వు పంపిన విద్యుత్తరంగాల తో నా మనఃశరీరాలు అచేతనమయ్యాయి అని, వాటిని మళ్ళీ నువ్వు వచ్చి బంధ విముక్తులను చేస్తే గాని మోక్షం లేదని ఎలా చెప్పను..

నువ్వు రావు..!!!!!! ఇంతగా హృదయమంతటి తోను ప్రేమించి నా ఆత్మ ను కట్టేసి, నన్ను నిరుపయోగం గా చేసిన నా చెలీ...... రారాదా.. రావు కదు...... జీవితాంతం తోడుంటానని బాస చేసిన చెలికాడు, అడుగులో అడుగు వేసి కలకాలం తోడుంటానని అగ్ని శిఖలమీద ప్రమాణం చేసిన వరుడు.... తోడు రాకుండా, అనారోగ్యాన్ని పంచుకోకుండా స్వార్ధం తో నిలుచుండి పోయాడని, తెలిసి అలిగి వెళ్ళి పోయావు కదా.

కలవాలనే ఆశ తో ముంగిటకు వచ్చిన నిన్ను, నాకంటే ముందే కౌగిలించుకున్న మృత్యు దేవత తో చెలిమి చేసి రానని వెళ్ళి పోయావు కదు... వెళుతూ నీతో తీసుకెళ్ళిన నా ఆత్మ ను తిరిగి పంపకుండా నీకేం తోడు తో హాయి గా వున్నావు. నీకెలా తెలుస్తుంది తనదైన ఆత్మ లేని ఈ జీవం ఇక్కడ ఎలా విల విల లాడుతోందో... అదుగో ఆగకుండా అలల మీదు గా వినిపించే నీ గొంతు ఏదో సందేశన్ని ఇస్తున్నట్లే వుంది. హృదయొమొగ్గి వినని నా ప్రాణ సఖి......