క్రిష్ణయ్యా, ఈ రోజు నీ పుట్టిన రోజు... ఐనా నీకు పుట్టిన రోజేమిటి మా పిచ్చి కాని..... ఆది, అంతాలే లేక సర్వ వ్యాపకుడివైన నీకు ఒక రూపాన్ని, ఒక రోజు ను, ఒక పండుగను నీకోసం కల్పించి మేము చేసే ఈ వేడుక అంతా నీ లీలా వినోదాలలో ఒక భాగం కాదు.... ఐనా మా కోసం మాలో ఒకడి గా చేరి వెన్న తింటు, అల్లరి చేస్తూ, మువ్వలన్ని గల గల మంటు సాగే కాల ప్రవాహమల్లే నువ్వు వేసే గంతులు.... ఇవి అన్ని మా కోసమే కదు...
క్షణం క్షణం పసి పాపల చిలిపి అల్లరిలో వాళ్ళ చిరు ఆనందం లో, ఇంటి ముందు గంతులేసే తువ్వాయి చురుకు చూపులలో.... పెరట్లో విరిసిన రాధా మనోహరం మొగ్గ అంచున రూపుదిద్దుకుంటున్న ఎరుపు వర్ణపు ప్రేమ ఆనవాలు లో, విరిసిన చంద్రవంక లో తళుకులీనే చంద్ర కాంతి తో కలిసి అంచున వూయలలూగుతూ అవ్యక్తా వ్యక్తం గా వినిపించే నీ అనంత వేణు గానం లో..... ప్రతి అణువణువులో నిన్ను ప్రతి క్షణం గుర్తు పట్టిన ఆనందం తో యశోదనై ఈ రోజు నీ పుట్టిన రోజు జరుపుకుంటున్న నన్ను మన్నించి నా ముంగిటకు మళ్ళీ మళ్ళీ అన్ని రూపాలలో....... ఏదో ఒక రూపం లో రావూ...!!!!
ప్రతి క్షణం నిను ఏదో అడిగి, ఇంకేదో కావాలని కోరి... ఇచ్చినదాని విలువ తెలియక...... అది విసిరేసి మళ్ళీ ఇంకేదో కావాలని ఏడ్చి.. విలువైన బొమ్మ ను విసిరేసి అట్ట పెట్టెను చూసి ఆనంద పడి దానిలోని కాగితపు ముక్కలే అనంత సంపదలని భ్రమసిన నన్ను, తండ్రి లా నువ్వు అది తీసి పక్కన పెట్టి విలువైన జీవితాన్ని కానుక గా ఇవ్వటానికి ప్రయత్నిస్తుంటే వద్దని పేచి పెట్టే ఈ పసి బిడ్డను క్షమించి నా ముంగిటకు పసి వాడై నేను నీకు జరిపే ఈ క్రిష్ణాష్టమి ను జరిపించుకోవటానికి రావూ...
యుగం కితం నా వంటి ఒక పేద తల్లి మమత ని, ఇంకో అధ్బుత ప్రేమ మూర్తి ఆరాధన ను, కొన్ని కోట్ల మూగ జీవుల ఆర్తి ని అన్నిటి కోసం, అందరి కోసం ఈ రోజే వచ్చావట ఈ లోకానికి క్రిష్ణ నామం తో, క్రిష్ణ తత్వం తో, క్రిష్ణ ప్రేమ తో......అంతా నేనే, నేనే ఎప్పటికి, అంతా నాదే అనే మా కంస ప్రవృత్తి ని అణచటం కోసం ఏతెంచావంట ఈ రోజే... మా అహంకారం, పశు ప్రవృత్తి ని పిడి గుద్దులతో అణిచేవంట లే విన్నాను ఆ కథ లు... మా కోపాన్ని ఈసు అసూయలను కూడా కాళీయ మర్ధనం చేసి మా పీచమణిచావంటలే... నల్ల నల్లని మేఘమై నీల మేఘ శ్యాముడివై మా మీద నీ ప్రేమామృతాన్ని వెన్న లా, వేణు రాగం లా మా మీద కుండలతో, బోలైన జీవిత వేణువులతో వంపి వర్షించావంటలే..
ఐతే ఏం...ఎప్పటి కథే... ఎప్పటి వెతే.. .అన్నీ మర్చి మళ్ళీ ఖాళి కుండ తో నీ పూ పొదరింట నుంచు ని నీ కరుణామృతం కోసం నిలబడిన ఈ యాచకురాలిని మన్నించి మళ్ళీ ఒక్క సారి మా ముందుకు పసి బిడ్డ వై ఈ క్రిష్ణాష్టమి కి వచ్చెయ్యవా.....
చూడు దారి గుర్తు పట్టవేమో అని నీ కోసం నీ చిన్ని పాదాలను ముద్రించి వుంచేను .. అమ్మ కోసం పాదం లో పాదం,పదం లో పదం కలిపి నీ చిట్టి అడుగులతో వచ్చెయ్యి లోపలకు నా చిన్ని కన్నా... నీకోసం నా ప్రేమ ను నా ఆప్యాయతను అన్నిటిని అంతా కలిపి నీ కోసం వెన్నుండలు చేసేను, తీపి పాయసం చేసేను, ఆటుకులను పాలతో బెల్లం తో కలిపి తీపి తీపి తాయిలాలు, భక్ష్యాలు చేసేను.. ఈ ఇంటినే ఒక మధుర చేసేను.. నచ్చలేదా.. ఈ కంస ప్రవృత్తి మద మత్సరాలను రాక్షసులు గా నా బిడ్డవైన నీ మీదికే పంపుతోందా, వద్దా.... సరే పద బృందావనం వెళ్ళి పోదాము...
దొంగా ఆ తళుకులీనే నవ్వు చూడు, నాకు తెలుసు లే నీ వేషాలు బృదావనం ఐతే నీ ఆటలన్నీ సాగుతాయని కదు... ఎప్పుడైనా యశోదమ్మ నీ ఆట కాదందా నీ మాట కాదందా... ముందు మధుర గా మలుచుకున్న ఈ అంతరం లోకి ప్రేమమూర్తి వై రా, తరువాత ప్రేమైక లోకమైన బృదావనం వెళదాము.. వుట్టి కూడా కొడదాము.. మరి ఈ పిచ్చి తల్లి కోసమో, నీ మురిపాల రాధ కోసమో, నీ దాసాను దాసులైన నీ లోని రూపాలమైన అందరి కోసమో వచ్చేస్తావు కదు
ప్రేమతో
యశోదమ్మ పంపుతున్న ఆహ్వాన పత్రం...