16, నవంబర్ 2009, సోమవారం

అక్కా అంతేనంటావా ... !!!!

నవంబర్ నెల కౌముది లో నా లేఖ

అక్కా అంతే నంటావా.....!!!!! 


అక్కా,

ఎట్లా వున్నావు? నేను నా పతి... పుత్ర, పుత్రికా రత్నాల తో సహా నిక్షేపం గా వున్నాము.. నిక్షేపం గా అంటే గుర్తు వచ్చిందే మొన్న నాయనమ్మ నిక్షేపం లాంటి నా జాజి కాయ పెట్టె కనపడలేదు అని గోల గోల పెట్టింది అని చెప్పేను కదా... నాయనమ్మ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నాన్న అది పెద నాన్న గారింటికి పంపించేసేరు అంట.. ఎందుకలా గా నాన్న అంటే రోజు దాని గురించి మీ అమ్మ కు నాయనమ్మకు గోలే.. ఆమె కా ఆ పెట్టె ఎత్తే ఓపిక లేదు ప్రతి అరగంట కు ఒక సారి అమ్మ ను రమ్మని రాత్రి తోడు పెట్టిన పాల గిన్నె ఇంకా తీసి నట్లు లేవు తియ్యవే అనో, మొన్న మధ్యాన్నం రెడ్డి గారింటి నుంచి వచ్చిన వులవల మూట అందులోనే పెట్టేనే తీస్తావా దాలి పొయ్య పొద్దుట నుంచి వూరికే వుంది అని ఏదో ఒకటి గొడవ చేస్తోంది అట. పూర్తి గా ఆ మతిమరుపు ఎక్కువ ఐపోయింది..

ఏనాటి అబ్బరాం, జరుగులు మొన్నీ మధ్య న వాళ్ళు పొలం నుంచి వచ్చే టైం అయ్యింది నువ్వు ఇంకా అన్నం వండలేదు అని గోల అంట. మనకు వినటానికి నవ్వు గానే వుంది కాని పాపం అమ్మ కు కష్టం గానె వుంటోంది అనుకుంటా. ఒక పక్క నాన్న చాదస్తం అది చాలదన్నట్లు ఇప్పుడు ఈ నాయనమ్మ తో కూడా. కాని అమ్మకెంత ప్రేమే నాయనమ్మ అంటే..!! నాకు ఆశ్చర్యం గా వుంటుంది.

నాకు మా అత్త ను చూస్తేనే చిర్రు మంటూ వుంటుంది లోన ఆమె మాట్లాడే వెటకారం మాటలకు. మొన్న ఎంత నీలిగిందని ఇంటికి రాగానే కొడుకు తనంతట తనే కాఫీ పెట్టుకున్నాడంట 'ఎంత కష్ట పడుతున్నాడో చంటి' అని, అక్కడికి నేనేదో తిని అరగక తిరుగుతున్నట్లు.. నాకు మాత్రం ఎంత కష్టం గా వుందే ఈ ప్రయాణం చేసే వుద్యో గం చెయ్యాలంటే.. అక్కడికి రవి ఏదో సాయం చెయ్యబట్టి లాక్కొస్తున్నా కాని. దానికి తోడు వచ్చినప్పుడంతా ఈమె సూటి పోటి మాటలు.. మేము మాత్రం చెయ్యలేదా వుద్యోగాలు అంటు. ఏమి చేసిందే ఆ పనికి రాని టీచరుద్యోగం.. ఒక్కనాడన్నా ఎలెక్షన్ పనులకు కూడా వెళ్ళకుండా వాళ్ళ ఆయన పదవి ని అడ్డం పెట్టుకుని ఒక్క సారి కూడా పల్లెటూళ్ళకు బదిలీ లు లేకుండా ఆ గుడివాడ లో పడి హాయి గా బతికేసి వృద్ధ నారి అన్నట్లు చెపుతుంది..

సరే ఈ సోది కు ఏమి వచ్చే కాని బాబి గాడు బాగున్నాడా.. మొన్న వచ్చినప్పుడు వాడి వచ్చి రాని తెలుగు లో ఎంత ముద్దు గా మాట్లాడేడో. ఇంకా నువ్వు తెచ్చిన అన్ కట్ పగడాల దండ చేయించుకోలేదు. పైన అపార్ట్మెంట్ పార్వతి గారు ఏమి చేయించుకోక పోయినా అలా కొక్కెం పెట్టి వేసుకోవచ్చు మూడు వరసలు గా, తరువాత నెమ్మది గా లాకెట్,దిద్దులు చేయించుకోవచ్చు అంటుంది. ఏమంటావు.. మొన్నీ మధ్యన పరమేశ్వర రావు గారు తీసుకోమన్నారని రవి వద్దు అంటున్నా వినకుండా ఈడ్పుగల్లు దగ్గర ఆ దగ్గుబాటి వాళ్ళు ప్లాట్ లు వేసి అమ్ముతున్నారు మంచి ధర కు ఇప్పిస్తాను అంటే ఒకటి బ్లాక్ చేయమని చెప్పేను తీసుకోకూడదు.. పెద్ద దాని పేరు మీద వుంటుంది కదా.

వచ్చే వయసే కాని తగ్గేది కాదు కదా ఏమిటో నాకు అప్పుడే ఈ మధ్యన కళ్ళు తిరుగుతున్నాయి అని, రవి గోల చేసి డాక్టర్ దగ్గరకు తీసుకెళితే ఆయన బీపీ బోర్డర్ లో వుంది సరిగా తిని ఎక్సర్సైజ్ చెయ్యక పోతే మందులేసుకోవాలి అన్నారు. రవి పెద్ది కి కూడా ఫోన్ చేసి గోల గోల చూడు నీ స్నేహితురాలు ఎలా చెస్తోందో అని.

అవునూ బావ గారి వాళ్ళ బాబాయి గారు వాళ్ళు అదే వినాయక్ ధియేటర్ దగ్గర వుంటారు చూడు వాళ్ళ చిన్నల్లుడు చని పోయాడు అంటగా.. నాకు చెప్పనే లేదే మే , నిన్న దినం కార్డ్ వచ్చింది.. సాయింత్రం రమత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పేరు. పాపం ఏమిటో.. చిన్న వయసు లోనే. అందరు బాగున్నారు ఇంకా రెండు బస్ లు కూడా కొన్నారు కేశినేని ట్రావెల్స్ వాళ్ళవి అని కిందటి సవత్సరమే అనుకున్నాము.

ఏమిటోనే చిన్నప్పటినుంచి నేనేమో ఈ బడా బడా వాగే గుణం, నువ్వేమో మాట పెదవి దాటనివ్వని తత్వం మార్చుకోలేక పోయాము. ఏమి చేస్తాము ఈ జన్మ కు ఇంతే.. వీలు చూసుకుని అన్ని వివరాలతో వుత్తరం రాయి. మాట మాట కు ఫోన్ చెయ్యక. మొన్న వచ్చినప్పుడు బావ గారు కూడా అంటున్నారు మీ అక్క ఫోన్ ల మీద పెట్టిన డబ్బు లతో నెలసరి వాయిదాలు కట్టుకున్నా విజయవాడ లో సగం మాది ఐపోయేది అని. శ్లేష గా అన్నారేమో నాకు తెలియదు కాని నిజమే కదా..... వూరికే అమ్మ కు, నాకు, మావయ్యలకు, పెద నాన్న గార్లకు ఇంకా ఎందెరెందరికి చేస్తావో అర్ధం పర్ధం లేకుండా.. వుంటాను మరి.. బావ గారిని అడిగేను అని చెప్పు.

ప్రేమతో
నీ చెల్లి,
చిన్ని.



చిన్నా,

నువ్వేమి మారలేదే వచ్చినప్పుడే చెపుదామనుకున్నాను. ఈ వుత్తరం చూస్తుంటె మళ్ళీ మనం ఇంటి బయట అరుగు మీద కూర్చుని వాదులాడుకుంటున్నట్లు వుందే. గుడ్లవల్లేరు లాకులెత్తేసినట్లు నీ ధోరణే నీది కాని ఎదుటి వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వవు కదా.. నీ చిన్ని వుత్తరం లో చాలానే విషయాలు కలయ తిప్పేసేవు.. చిన్నప్పటినుంచి నీ ప్రత్యేకతే అది.. నీ బలహీనత కూడ అదేనే చిన్ని. దేని మీద ఎక్కువ సేపు కుదురు లేదు సవ్య సాచి లా గా వయసులో వున్నప్పుడు పరుగులు తీయటం బానే వుంటుందేమో కాని ఎప్పుడూ అంటే కొంచం తగ్గించుకోవాలేమో..

నీకు ఎందుకు ఆశ్చర్యం గా వుందే అమ్మ, నాయనమ్మ అనుభందం చూస్తే...!! అమ్మ చెప్పిందా నాయనమ్మ తో కష్టం గా వుందని? నేను నమ్మను నాన్న కు అంతా కంగారే అందుకే పంపించి వుంటారు ఆ భోషాణం పెట్టెను. నాయనమ్మ చిన్నప్పుడు అందులో పటికి బెల్లం ముక్కలు దాచి సాయింత్రం బడి నుంచి ఇంటికి రాగానే ఆ రోజు ప్రసాదం తీసి పెట్టేది గుర్తు వుందా?

ఆమె కు ఎంత అనుభందం ఆ పెట్టె తో, దాలి పొయ్యతో. నిజమే మన చిన్నప్పుడు ఎప్పుడైనా ఆ దాలి పొయ్య నుంచి పొగ రాకుండా గుర్తు వుందా? నాకు మన ఇల్లు అంటేనే ఆ చుట్టింటి పక్క నుంచి గాలితో పాటు గడ్డి కాలుతున్న వాసనతో తేలి వచ్చే దాలి పొయ్య పొగ కూడా మెదల కుండా వుంటుందా కళ్ల ముందు..

మీ బావ గారు 'అబ్బ స్వగృహా లో వులవ చారు ఎలా ఐనా ఆ రుచే వేరు' అంటే నేను మా వూళ్ళో పొంత పెట్టి రోజంతా వులవలు, గుగ్గిళ్ళు వుడక పెట్టి దానిలోని సారమంతా మా బర్రెల కు కుడితి కలిపేక, మిగిలిన తుక్కు లో నీళ్ళు పోసి తీసిన చారు కూడా అంత కంటే బాగానే వుంటుంది అంటె తెగ వుడుక్కున్నారు అనుకో ..

సాయింత్రమవ్వ గానే గుడిలో నుంచి వచ్చే పాట "ఆజాను బాహుడమ్మ.... అరవింద నేత్రుడమ్మా.... కోదండ రాముడమ్మా.. సీతమ్మ వలచిన, గోపన్న కొలిచిన, భద్రుని బ్రోచిన శ్రీరాముడు... శంఖ చక్ర ధారుడు. అది గో గౌతమి ఇదుగో భద్రాద్రి" అనే పాటను వింటూ.. అప్పుడే జరుగులు పితికిన పాల నురగతో అమ్మ చేసి ఇచ్చిన కాఫీ తాగుతూ, స్టూల్ వేసుకుని ఎగిరెగిరి కోసుకున్న సన్నజాజుల పూల ను మాల కట్టుకుంటున్నప్పటి ప్రశాంతత ఇప్పుడు నువ్వు వెళ్ళే ఎన్ని రిసార్ట్ లలో వస్తుందే...

మనకే అలా వుంటే మరి పూర్తి జీవితమంతా వాటితో గడిపిన నాయనమ్మ కు ఎలా వుంటుందో వూహించుకో.. మర్చిపోయావా... అమ్మ కు మేకు గుచ్చుకుని వాతం కమ్మితే, నాయనమ్మ ఎంత హడావుడి చేసిందో, ఎంత మంది దేవుళ్ళకు మొక్కిందో. తగ్గేక ఒక రోజు అమ్మ కు తలకు పోసి దిష్టి తీసి అమ్మ కు సంధ్య వేళ సాంభ్రాణి వేస్తూ ఎంత హడావుడి చేసిందో నాయనమ్మ. ఇప్పటికి నా మనో ఫలకం మీద అది ఒక చెరగని ముద్ర. అమ్మ కూడా మర్చి పోయి వుంటుందని నేననుకోను. చిన్ని... ప్రేమానుభందాలు మనం పెంచుకుంటే పెరిగేవేనే... నువ్వు చిన్న దానివి అప్పుడు, ఏమి గుర్తు వుండి వుండదు..

మీ అత్త గారి కి కొంచం చాదస్తం అంతే నేను మొన్న వచ్చినప్పుడు ఎంత గొప్ప గానో చెప్పింది 'మా సుమా కు క్షణం కూడా తీరిక దొరకదమ్మా అమెరికా లో మీరైనా ఇంత కష్ట పడతారో లేదో ఒక్క క్షణం కూడా కూర్చోదు' అని ఎంతో ఆపేక్ష గా చెప్పింది.

అలా కాలం తో పాటు పరుగులు తీయకు రా చిన్ని. మీ బావ గారికి, నీకు ఈ పరుగులు తీసే గుణం ఎప్పటికి ఆగుతుందో.. ఏమి చేస్తారు రా ఇన్ని కొని, దాచి చెప్పండి. మొన్న కృష్ణ కూడా వాళ్ళ వూళ్ళో పొలం అమ్మి అది చేస్తా ఇది చేస్తా అని వురుకులు పెడుతుంటే చెప్పేను. రైతు బిడ్దలం మనం, ఆ భూమినే అమ్మేసి ఏమి చేస్తావు ఇంత సంపాదించుకుంటున్నాము మనం ఇప్పుడు..... ఆ కౌలు దారులు ఇచ్చేది శిస్తు కట్టటానికి వస్తే చాలదా ఆ భూమి ని వుంచితే నష్టం ఏమిటి అని. ఇళ్ళు స్తలాలు కొంటే మాత్రం పని వుండదా ఏమిటి.. వదిలెయ్యండి ఆ గోల.

ఆరోగ్యం జాగ్రత్త.. తొందర గా ఐపోతాయని ఆ వేపుడులు చేయక. నాయనమ్మ చేసేది వంకాయ రోటి పచ్చడి, చేసి ఆఖరి లో వుల్లిపాయ కలిపేది, అదీ.... నాయనమ్మ చేసినట్లు చామ దుంపల పులుసు మాత్రం కుదరటం లేదు రా చిన్ని నాకు. ఆమ్మ చేసే వుప్పూకారం పప్పు కూడ రావటం లేదు ఎట్లా ఐనా రాజయ్య తాత చేతి నుంచి వచ్చిన కందులు కావు కదా.. మీకు ఇంకా పంపుతున్నాడా రాజయ్య తాత కందులు, మినుములు. తాత పొలం బలే మంచి నేల కదా దుక్కి దున్నేడంటే రెండో పంట నుంచి కూడా పుట్లు రాలాల్సిందే కదా..

అవును మీ బావ గారి వాళ్ళ బావ గారు చని పోయారు పాపం. చాలా సార్లే మాట్లాడేరు కృష్ణ వాళ్ళ బాబాయి తో.. నేను కూడా మాట్లాడేను ఎవరు మాట్లాడినా ఏమి లాభం లే పోయిన వాళ్ళను తిరిగి తేలేము కదా.. పాపం పిల్లలను చూస్తేనే దిగులేస్తోంది.. తల్లి తండ్రులు లేని జీవితం ఎంత సుస్సంపన్న మైనా లోపమే కదా.

సరే మరి వుంటాను ఆరోగ్యం జాగ్రత్త. చింటూ, చాయమ్మ జాగ్రత్త.. కిందటి వారం నువ్వు లేవు, రవి తో పిల్లలతో చాలా సేపే మాట్లాడేను చెప్పే వుంటారు కదా. రవి ఏదో సిందాబాద్ రాజ కుమారుడి కధ చెపుతున్నాడంట ఆ కధ కూడా చెప్పేరు. చిన్నీ.... రవి బంగారు తండ్రే... అడిగేను అని చెప్పు మరి.
వుండనా
ప్రేమ తో నీ అక్క
సింధు.