డిసెంబర్ నెల కౌముది లో నా లేఖ
ఒంటరి గూడు
ప్రియమైన రాధి,
ఇంకా నువ్వు నాకు ప్రియమైన దానివే నీకు నేను కాక పోయినా.... అచేతనమైన మనః శరీరాలతో జీవితం పునఃసమీక్షించు కోవటం వలనేమో తప్పొప్పుల మాట అటుంచి అసలు ఈ చిందర వందర ఎక్కడ నుంచి మొదలయ్యిందో కూడా అర్ధం కావటం లేదు. జీవితం లో ఇంత దూరం వచ్చాక జీవితపు మొదలు ను పరిచయం చేసుకోవలసిన అవసరం రావటం నా వరకు దురదృష్టమనే అనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావో కాని.
ప్రతి ప్రశ్న కు సమాధానం వుంటుందని ఎవరన్నారో కాని వాళ్ళకు వెళ్ళి చెప్పాలని వుంది, జీవితమే ఒక అంతు దొరకని ప్రశ్న రా ఇంక చిన్న ప్రశ్న లకు సమాధానం దొరుకుతుందా అని. నువ్వు నేను కలిసిన ప్రతి సారి ఒక వాగ్యుద్ధం మొదలైతే అది మన ఇద్దరి తెలివి తేటలకు ఒక చిహ్నమనుకున్నా, కాని అది పగిలే గుండెల దూరానికి పడే బీటు అనుకోలేదు. అవును మన పరిచయమే ఒక ఆర్గ్యుమెంట్ తో మొదలయ్యింది కదా. గుర్తు వుందా.. మొదటి సారి అంతరాష్ట్రీయ డిబేట్ టీం లో 'కుటుంబం అది పొందుతున్న సామాజిక మార్పులు అది గురి అవుతున్న మిథ్ లు' అనే విషయం మీద మన చర్చ. ఇద్దరం పూర్తి గా రెండు విభిన్న దృక్పధాలతో నాణేనికి రెండు పక్కలా చూపించటానికి ప్రయత్నించాము అని జడ్జ్ మనలను మెచ్చుకున్నాడు, కాని వాదన లో వున్న బలం మూలం గా నాకే మొదటి బహుమతి అని ప్రకటించినప్పుడు ఎర్ర బడిన నీ మొహం ఇప్పటికి నిన్నే జరిగినంత ఫ్రెష్ గా నా మది లో వుంది. ఇప్పుడు అనిపిస్తుంది అప్పటి నుంచి మన పరిచయం పెరిగిన ప్రతి మలుపు లో గెలుపు, ఓటములలో ప్రతి విషయాన్ని నువ్వు చాలా సీరియస్ గా తీసుకున్నావు అని.
కలిసి పెరిగిన అనుభందాల విలువలను.. అభిప్రాయాల తేడా లతో, అపార్ధాల నీడల .... తోసి రాజనుకోవటం నువ్వెందుకు చేసేవు అని నేను ప్రశ్నించను కాని ఏమైనా కారణం వుందా అని మాత్రం అడగాలి అనుకుంటున్నా. మనం 21 వ శతాబ్ధం లో వున్నాము ఇంకా ఆటవిక యుగం లో లేము కదా ప్రతి సమస్య ను చర్చల తో పరిష్కరించుకోవచ్చు అనే నువ్వే పెద్ద గా చర్చ అనేది లేకుండా జీవితం నుంచి బయటకు నడిచి నన్ను పిల్లలను కూడా ఎందుకంత చీకటి తెర ల వెనుక తోసేసేవు? కిందటి సారి కలిసినప్పుడు దాచి, దివ్వు ఇద్దరు నాతో సరి గా మాట్లాడ లేదు నాతో ఎక్కువ సేపు కలిసి వుండటానికి కూడా ఇష్ట పడ లేదు అది నాకు ఎంత క్షోభ గా వుంటుందో నీకు బాగా తెలుసు, తెలిసే వాళ్ళను అలా తయారు చేసేవు కదు. రాధి ఎందుకు నీకు ప్రతి విషయం లో ఇంత మొండి తనం.. 'నేను అనుకున్నదే జరగాలని' పంతం. తప్పు మానవ సహజం కాదా..... తప్పని తప్పు ఒప్పుకున్నాక కూడా జరిగిన వాటినే పదే పదే అనుకుని నాకు ఇంత గా శిక్ష విధించటం ఏమో మరి నీకు న్యాయమనిపిస్తుందా..
ఆలోచించు నువ్వేమి చిన్నపిల్లవు కాదు, నీ ఒక్క దాని అభిప్రాయం తో.... నీ ఒక్క దాని జీవిత విలువలతో (నువ్వు అనుకునే జీవిత విలువలు వాటిని నాకు ఆపాదించకు) మొత్తం కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసేవు.. రాధి ఈ రోజు కు నువ్వు ఇంటి నుంచి వెళ్ళి సవత్సరం అయ్యింది కాని నాకు మాత్రం గాయం ఇంకా పచ్చి పుండు లా కెలుకుతూనే వుంది.. ప్రతి క్షణం నువ్వు లేని లోటు నా జీవితాన కనిపిస్తూ నన్ను నా అంతట నేను స్వశక్తి తో ఆలో చించనియ్యకుండా నిర్వీర్యుడను చేస్తోంది. ఇంక ఇంత కంటే ఏమని చెప్పాలో కూడా అర్ధం కావటం లేదు..
ఒక స్థాయి కి వచ్చాక జీవితం మనదే కాదు అందరిది అని చెప్పే నీవే ఆ జీవితాన్ని మా అందరి దగ్గర నుంచి తీసేసుకుని నీ చేతి లో పెట్టుకుని ఆడిస్తున్నావు రా రాధి. నీకు తెలుసు ఆ విషయం. నీకు న్యాయమా నన్ను నా తల్లి తండ్రులతో మాట్లాడ వద్దు అనటం. వాళ్ళు నా తల్లి తండ్రులు. నా వలన కాదు రా అలా వాళ్ళను నిస్సహాయులను చేయటం. ఏమో రా రాధి ఆలోచించు వృత్తి రీత్య, ప్రవృత్తి రీత్యా కూడా ఆలోచించటం, పరిష్కారాలు వెతకటం నీకు అలవాటే కదా.. ఆలోచించు పరిష్కారం దొరుకుతుందేమో ఈ సమస్య కూ.
ఎక్కువ మాట్లాడే కొద్ది నేను బ్యాలెన్స్ ను కోల్పోతానేమో అని ఇక్కడి తో ఆపేస్తున్నా నా మనసు నీకు పంపే వినతి పత్రం మాత్రం నిరంతర సాగే స్రవంతి అని తెలుసు కదా..
ప్రేమ తో
ఎప్పటికి నీ
కృష్ణ.
కృష్ణా,
మీరు చెప్పిన ప్రతి మాట మీరు రాసినంత సూటి గాను అర్ధం అయ్యింది, ప్రతిపదార్ధాలతోనూ, టీకా తాత్పర్యాలతోనూ అర్ధం అయ్యింది. ఎంతైనా కలిసి సాగిన 12 ఏళ్ళ పరిచయం కదా. ప్రతి వాక్యానికి సమాధానం రాయాలనే వుంది కాని దాని వలన ఏమైనా వుపయోగం వుంటుందా అనే ఆలోచిస్తూ దాదాపు గా రెండు నెలలు చేసేను మీకు సమాధానం ఇవ్వటానికి. ప్రతి దానికి జీవితం లో లేటే గా నేను (మీరనే మాటే నాది కాదు). హ్మ్... విభిన్న దృక్పధాల విచిత్ర కలయిక మన పరిచయమైతే, ఆ విభిన్నత లోని మూలమే మనలను విడతీసిన కారణమని నేను అనుకుంటున్నా. "ప్రతి కలయిక విడిపోవటానికి నాంది" అని మీరు షాయరీ లు చెపుతూ అనే వారు గుర్తు వుందా.. అది గుర్తు వచ్చింది నాకు మీ వుత్తరం చదివేక.
హ్మ్.. పదాలను నేర్పు గా కూర్చే కళ మీకు స్వతహా గా దేవుడిచ్చిన వరం. అది పట్టుబట్టి నేర్చుకుని జీవనాధారం చేసుకున్న కధనం నాది. చూడండి ఇక్కడ కూడా నాణేనికి రెండు ప్రతిమలమే. అవును ప్రతి సమస్య ను చర్చలతోనో, మనం వున్న స్థాయి కంటే వేరే గా స్పందించి, ఆ కోణం లో పరిచయం చేసుకోవటం మూలం గానో పరిష్కరించవచ్చు అనుకునే దానిని నేను, కాని కొన్ని కొన్ని సమస్య లకు మౌనమే పరిష్కారమనిపించి మాట్లాడ కుండా వున్నాను.
ఏమని మాట్లాడమంటారు.. అభిప్రాయాల తేడా కాదు, అపార్ధాల నీడ అసలే కాదు మనలను విడ తీసినది జీవన విధానాల లోని.. నమ్మకాలలోని వైరుధ్యం కృష్ణా. మన జీవనం లో ప్రతి క్షణం వాటి మూలం గా కలిగిన ఘర్షణే ఈ మార్పు కు కారణం కాదంటారా. సహ జీవనానికి పునాదైన ప్రేమ నమ్మకం మన మధ్య న సడలి పోయాయి.. అది ప్రేమ కు పరాకాష్ట అని మీరనుకోవచ్చు. అనుకోవచ్చు ఏమి వుంది అన్నారు కూడా కదా... మీ వుత్తరం లో దానిని అడుగడుగునా ప్రదర్శించారు కూడా, కేవలం వాదన ల లోని అభిప్రాయ బేధమే గుండె గోడ లు బీట వారటానికి కారణమా? అది కూడా ప్రతి సారి ఆ వాదన ను 'నేను సీరియస్ గా తీసుకోవటం వలన' అని మీ అభియోగం. ఆపైన ఎందుకు చేసేవు అని నన్ను ప్రశ్నిస్తున్నారు.
మన మొదటి పరిచయం లోని టాపిక్ మీకు బాగా గుర్తు వుందే.. అవును కుటుంబం అనే మిథ్ మనం విడి పోవటానికి కారణం. కుటుంబం లో వుండవలసినవి అని మీరనుకున్న, మీరు వుంచిన...... పొరల మందం ఎక్కువ అయ్యి కలపవలసిన ప్రేమ, అనుభందం పల్చనైపోయినట్లుంది. తప్పు ను తప్పు అని ఒప్పుకోవటం మూలం గా ఒప్పు ఐపోదు కృష్ణా.. ఆ దిశ గా సాగే నడక ముఖ్యం. నడిచేరా మీరు ఆ దిశ గా ???? ప్రయత్నించారా? ?????ప్రేమ వివాహాలలో కూడ వివాహేతర సంబంధాలు వుంటాయి అంటే నేను నమ్మే దానిని కాదు, కాని అది నిజమై నా ముందు నిలబడి వెక్కిరించిన రోజు నా క్షోభ మీరు అర్ధం చేసుకున్నారా?
ఈ క్షణాన ఒంటరి తనం తో నిర్వీర్యుడైన నా జీవన సహచరుడా ఈ ఒంటరి తనం తో నేను నడిచిన క్షణాలన్ని యుగాలై ఇంకా నా వెనుక నీడ లానే వున్నాయి. ' తప్పే' అని ఒక్క మాట అంటే సరి పోయిందా. ఏమన్నారు నేను అడిగిన రోజు 'పదే పదే తప్పు చేసి ఒప్పంటున్నారు' అన్నప్పుడు...... నేను మొగవాడిని బయటకు వెళ్ళినప్పుడు వుండే అనేకానేక ఒత్తిడుల మధ్య న జరిగే ప్రతి విషయాన్ని, కేవలం మన మధ్య వుండే కాపురం ప్రేమ ల మధ్య కు కలిపి ముడి పెట్టకు అన్నారు. సున్నితమైన మనసు వుండటమే కాదు కృష్ణా అవతలి వాళ్ళకు కూడా అది వుంటుందని గుర్తించటం కూడా అవసరమే కాదు అంటారా.
మీ నాన్న గారి లానే మీరు ఆలోచిస్తున్నారు కాని ఆయన కంటే విధ్యాధికులు కదా, ఆ అధికత మీ తప్పు ను అందం గా కప్పి పుచ్చుకుంటానికి దానిని సమర్ధించుకోవటానికి మాత్రమే వుపయోగ పడింది. కాని బేసిక్ ఇన్స్టింక్ట్స్, ఆ పైన నన్ను అవమానించటానికి మీ నాన్న గారి తో కలిసి మీరు పెరిగిన వాతావరణమే ముందుకు వచ్చింది. అందుకే ఆ వాతావరణం పిల్లలకు వద్దని బయటకు వచ్చాను. అనుక్షణం తల్లి తెలివి తేటలు ప్రశ్నించ బడుతు, వెక్కిరించబడుతూ అంతలోనే ఆ కుటుంబం అనే మిథ్ తో ప్రేమించబడుతూ సాగే ఆ ద్వంద ప్రమాణాల జీవన విధానం వద్దు కనీసం ఆ లూప్ లో నుంచి పిల్లలనైనా బయటకు రాని కృష్ణా. నేను 12 సవత్సరాలు ప్రయత్నించాక అర్ధం ఐంది అందులోనే వుంటూ ఆ ద్వందత ను ఎదిరించటం కష్టం అని.
కలిసి సాగే సహ జీవనం లో ప్రేమ అనేది ఒక మిథ్ లా కాకుండ ఒకరికొకరు అనే మాట కు ఒకే అర్ధం తో, ఒకే ప్రమాణం తో, ఇల్లంటే మొగ వాడు అలసి ఇంటికి రాగానే అతని అలసట తీర్చి అన్ని అందించే ప్రేమ గోపురం ఆ ప్రేమ అందించే భార్య మూల స్థభం మే కాక, అలసి గూడు చేరిన గువ్వలు రెండిటిని కలిపే ఒక ప్రేమ గోపురమై, ఒకరికొకరు మానసిక ఆలంబన ఇవ్వగల గూడవ్వాలని అటు వంటి భావి తరాన్ని తయారు చేయాలనే ఈ క్షణపు నా ఒంటరి గూడు ను నా చేతులతో నిర్మించుకుంటున్నా.. దాని అర్ధం, విలువ మీకు తెలిస్తే ఎప్పుడైనా తలుపు తట్ట వచ్చు.
రాధిక.