31, ఆగస్టు 2010, మంగళవారం

ఆవలి అంచుకు మొదటి అడుగున కృష్ణయ్య కు సమర్పణలతో



కృష్ణాష్టమి కు దేవదేవుడి కి ------ చివరి అంచున.... ప్రయాణపు మొదటి అడుగున నిలిచిన యాత్రికురాలి గా మారే క్షణం లో ఆలోచనలను నైవేద్యం గా .

జీవితం లో లెక్కలేని ఆటు పోట్లను ఎదుర్కొని ప్రయాణపు ఆఖరి మజిలిలో నిలిచిన నాకు, తుది లేఖను రాయటానికి హృదయం పగిలి ముక్కలయిన రక్తాశ్రువులే తోడవుతున్నాయి సఖా.... మనిషికైనా జీవిత ఆఖరి చరణం లో అసహాయత, అహంకారం రెండిటిని వదిలేసి.. చెలికాడా నీవు తప్ప అన్యధా శరణం నాస్తి అని నిన్నే వేడుకోవలసి వస్తుందేమో.... అది అసహాయత అనవచ్చేమో, కాని అసహాయత ప్రతిఫలం ఆశించి, అది సాధించలేని అశక్తత తో కలిగేది.... ఇప్పటి క్షణాన, ఇక భౌతిక కోరికలేవి నా దరి దాపులకైనా రాని ఘడియ లో నే నిను వేడేది, " నా పుట్టుకనే నీది చేసుకున్న నా ప్రాణ సఖా..... ఈ నిరంతర యాత్ర లోని వేదనను, ఆనందాలను ఇంకొక్కసారి మననం చేసుకుని, సమీక్షించుకోవాలని వుంది" అనే. నా అంతరంగాల ఆంతర్యాలు నీకు తెలియవని కాదు...... అంతరాగాన్ని.... ఆంతర్యం లోని కోరికను సృష్టించింది నీవైనప్పుడు, దానినే నీకు తిరిగి మనవి చేయటం అంత్య క్షణాలలో నాకు కలిగిన సంధి ప్రేలాపనే కావొచ్చు, ఐనా రోజు ఇలా మొండి తెగువ తో నీ ముందు నీకు తెలిసిన దానినే నీకు తేట తెల్లం చేయాలనే కోరికను మన్నించి ..... లేఖ పూర్తవ్వక ముందే నా ఆత్మ ను నీ పాదాల చెంత సుగంధభరిత పూరేక గా చెయ్యక, నా మనసును బిగ్గర గా రోజు నీకు నివేదన చేసేంత వ్యవధినివ్వు.......



నీ సృష్టి లో ప్రతి జననానికి మరణానికి ఒక కారణం, ఒక వుద్దేశం నిర్దేశింపబడుతుంది అంటారే... మరి నన్ను కారణానికి వుద్దేశించి సృజించావో ఇప్పటికైనా...... నీకైనా అర్ధం అయ్యిందా........? ప్రపంచానికే ప్రేమను పంచి ఇవ్వగలప్రేమ మూర్తి వే... నీ ప్రేమ కోసం నన్ను జీవితమంతా వేచి వుండేటట్లు చేయటం న్యాయమా.... స్త్రీ మనసు కుసుమకోమలమైనది... అది నిరంతరం ప్రేమాన్వేషి... కాని ప్రేమ ఒక్క స్త్రీ పరమేనా... దానిని సృజించి పంచి ఇవ్వగల పురుషుడిసొంతం కూడా ఐనప్పుడు, అతను మాత్రం ప్రేమాన్వేషి కాదా... జగాన ప్రతి క్షణాన బిడ్డగా, సోదరుడి గా, స్నేహితుడి గా, భర్త గా, తండ్రి గా రకరకాల పాత్ర లలో అతను మాత్రం ప్రేమాన్వేషి గా మారడా.. మరి మాకే ఎందుకు పేరు? అది కూడానీ విలాస వివరాలలోని ఒక భాగమా... అసమానత్వపు వెతుకులాటల సమీకరణ లో నేనెప్పుడూ శేషం గానేమారేనెందుకు.......??

చిన్నతనానే నేనెవరో నాకు తెలియకుండానే.... నా పైన కమ్ముకున్న నీలి మేఘమై... నా హృదయాన వర్షించిన వంశీనాదమై.........నన్నావరించుకున్న నీలాకాశ శూన్యమై జీవితాన ఒంటరి పధాన్ని ప్రేమతో కలబోసి సూచించావు. నేనేఅర్ధం చేసుకోలేని దాననై, అనేక రూపాల ప్రేమ ప్రలోభాలకు లోనై, నేను నిర్మించుకున్న దారుల వెంట పరుగెత్తేను. అలాపరుగెత్తటం కూడా నీ మాయలోని భాగమా మోహనకృష్ణా....... పరుగెత్తి తగిలించుకున్న దెబ్బలను చూసుకుని క్షణాన నవ్వుకోగల విజ్ఞత నీ దయేనా......! సమస్తం నీ పాదాల దగ్గర అర్పణ చేసి, కర్మ నాది కాదు, కర్మఫలం నాదికాదు అని వదిలెయ్యగల ధీమా, కొడిగొట్టిపోయే ముందు వెలుగు జిలుగులా?


బాల్యాన నా ఆట పాటలలో ఒక బొమ్మవై, నాతో నిరంతరంసంచరించే బాల్య స్నేహితుడి గా నీ రూపు చిరపరిచితమేనాకు.... తాయిలాల దాచిన మధుర తీపిదనం... ఆటలలోనిఅమాయకత్వం.... నిదుర కళ్ళలో సుఖం.... వానపొద్దు నీటిబుడగల పై తేలిన నవ్వురవ్వల వరాల వెన్నెల లో నాతోసదా సంచరించిన మువ్వల రవళులు నీవే కదా.. యవ్వనాన కోటి ఆశల మైమరుపుల కళ్ళ మీదకుశీతాకోకచిలుక లా వాలిన జిలుగుకలల రూపానివై, నాతోప్రేమ బృందావనాన సంచరించిన కృష్ణయ్యవు నువ్వే కదా.... రాధ గా నేను నీకు అర్పణ చేసుకుని నేను నువ్వులో ఒకభాగమనుకున్నప్పుడు, చిలిపినవ్వుల మానసచోరుడివై నాతో కలసి పక పక లాడిన యదువంశసుధామణి వి నువ్వుకాదూ......?


నీ రూపును.... మదిన, జీవితంలో నిలుపుకుని నీ తోటి సరాగాలను కోటి కలలు గా కనులలో దివ్వెలుగా నింపుకుని, నీముంగిట పూచిన పువ్వై మారాలనుకున్నప్పుడు నువ్వేనా.......... ఆనతిచ్చి, నా జీవితసహచరుడిగా మారి నా కలలోకి, కౌగిలిలోకి వచ్చావు....... నా గుండెలోని కేశవుడివై, పైన నా వొడిలో బాల కృష్ణుడివై నిలచావు.!!!!! మధ్య వయసుతడబాటులలో సంసార రధ చక్రాల కింద నలిగిఫొకుండా చేయూతనిచ్చినా దుఃఖంలో నేనున్నాని వూరటనిచ్చింది నువ్వేకాదా.!!! వృద్ధాప్యాన వొణికిన కాళ్ళ వూతమై, మానసిక చాంచల్యం రాకుండా వెన్నంటి కాపాడిన నేస్తానివై దయామయుడివి నీవు కాదు.... ఐనా కూడా... ఇన్ని రూపాలలో నువ్వు నాతో వున్నా ఎందుకీ అసంతృప్తి.....? క్షణానా....... నువ్వే అది నువ్వే అని నేనెందుకు ప్రామాణికంగా గుర్తించలేక పోయాను? నీ నీలి క్రీనీడలో నువ్వుండిఎందుకు దోబూచులాడేవు?



ఎందుకు క్షణాన సమీక్షలో విజయాలతో పాటు నా అపజయాలు పక్క పక్కనే నిలబడి నన్ను పలకరిస్తున్నాయి.....! ఎందుకంత గా దుఃఖం నన్ను కలవర పరిచి వశపరచుకుంటోంది.... నా ఆరాట పోరాటాలు నన్ను నన్ను గానిలవనీయకుండా ఎగసిన సముద్రపు అలల నురగలలో కలసి, తీరాన్ని ఢీకొని ఎన్నటికి తడి ఆరని వొడ్డునఇంకిపోయాయి? ధర్మాన్ని నిర్వర్తించానన్న నా గర్వం, నాజీవితం లో ప్రముఖ పాత్ర వహించిన నా విజయ నికేతనపుబావుటాల రెపరెపలెందుకని సంతోషాన్ని కలిగించలేక పోతున్నాయి? నేనాచరించిన ధర్మం, సమాజపు గూడు బండినిభుజస్కందాలపై మోసిన వొరిపిడి గుర్తులు అంత వెగటు పుట్టిస్తున్నాయే? నే గెలిచిన తీరాల గుర్తులకంటే నేవిలపించిన క్షణాల వూహలే నెమ్మదిస్తున్న నా శ్వాస కు హాయి కలిగిస్తున్నాయే?

క్షణాన నావి అనుకున్న నా భందాలేవి నన్ను కట్టి వుంచలేక బోలు గా ఐపోతున్నాయే...... నాకోసం అంతుతెలియని స్వర్గలోకాలేవో వున్నాయన్న తలపు కంటే, నీ తోడు నాకుంటుందని, నా చేయి అందుకుంటానికి నువ్వు వేచివున్నావన్న వూహ ఆఖరి క్షణం లో కూడా బలాన్నిస్తోంది... అంతలోనే నా పాపపుణ్యాల ఫలితాలేవో నన్ను నీకు దూరంచేస్తాయేమో అనే చింత పట్టికుదిపేసి నా ఆత్మను ఇంకా క్షోభ పెడుతోంది... ఒక మహా యజ్నానికి సమిధ గామారానా......!!! మానవ జీవిత హోమానికి నా వంతు తర్పణం నేను వదిలానా.......? పూర్ణాహుతి లో నామనఃశరీరాలు ఆహుతి అయ్యే సమయం వచ్చిందని అర్ధం అవుతోంది.... క్షణాన జీవితాన్ని పరామర్శించి మరొక్కసారి దాని తప్పొప్పుల గురించి హెచ్చరిక చేసి రావాలనుంది... కాని ఎందుకు? సాగి పోయే కాల గమనం లో అనంతమైనకాళిందిలా నువ్వే మారి.... కాల నాగువై... కృష్ణ వర్ణమై.......నను కమ్మేసే క్షణాన పలకరింపుల చిలకరింపుఅవసరమా.....

విజయం వికట్టహాసం చేసినా, ఓటమి చిరునవ్వుతో వోదార్పును ఇస్తున్నా, అన్నిటికి అతీతమైన మరణ శయ్య మీదనా ప్రాణ సఖా... నా జీవన దాతా.... నిను నేను ఒక కోరిక కోరదలచుకున్నా..... నాకు మోక్షమొద్దు... మోక్షమంటే ఆత్మపరమాత్మ తో కలసిపోవటమే అంటారు కదా, నేను ఇక ఏమాత్రం నేనుగా లేకుండా నీలో లీనమవ్వటమే మోక్షమైతే.... వరాన్ని నాకు నువ్వు జన్మ మొదటిలోనే ప్రసాదించావు... నీ అనంతమైన దయతో, ప్రేమ తో నను వీక్షించావు... అందుకే నాకు ఇంకో జన్మ కావాలి... జన్మ లో నాకు ఒక ఘడియైనా నిను నిను గా గుర్తించి, నేననే అస్తిత్వాన్నికోల్పోయి నీలోని భాగమని గుర్తించే విజ్ఞత ప్రసాదించు. క్షణపు ప్రశాంతత నా జీవితాంతమూ తోడై మోక్షమనేఅనుభవం ఒక జీవితకాలం మొత్తం నేను అనుభవించాలి... నేను అనే అస్తిత్వం వుండగానే నీలోని నా సమర్పణను నేనుఆనందించగలగాలి. ఇదే నా కోరిక... అహంకారాన్ని అతిక్రమించగల జీవితాన్ని ఇవ్వు... మృత్యువుతో అంతమయ్యే అహంకారం, మోహం కాదు... జీవితం లోనే వాటిని అణచి నీలో కలసి పోగల జ్ఞానాన్ని ఇవ్వు నా జీవనప్రియ మిత్రుడా...

ప్రపంచంలోని సుఖ దుఃఖాలన్ని నా కోరిక మేరకు నా పైకురిపించిన దేవదేవుడిని జన్మ తో భందాలు తెగిపోయేక్షణాన కోరే అంతిమ కోర్కె ఇది. కోర్కెతో నా శ్వాస నుమందగించిపోని.... నీలాల కృష్ణవర్ణం నా కనుపాపలలోనిలిచిపోనీ.... అనంతమైన మురళీనాదం, జగాన్నంతానింపివేసే మధుర గానం నా వీనులకు ఆఖరి గొంతు గావినిపించనీ...... ప్రపంచాన్ని నింపి వేసే మనోహర రూపాన్నినా మనో ఫలకం పై వేసే ఆఖరి ముద్ర గా వుండనీ... భావితరాలకు జయం జయం... వంశీకృష్ణునిమోహనగీతాలాపనల ఓం శాంతి... ఓం శాంతి.... ఓం శాతి.. సర్వేజనాః సుఖినోభవంతు....