21, మే 2010, శుక్రవారం

ప్రశ్నల పరంపర... సమాధానమేమిటో....

ఏప్రెల్ నెల  కౌముది లేఖ
ప్రశ్నల పరంపర... సమాధానమేమిటో....
ప్రియమైన నేస్తం,
ఎలా వున్నారు అందరు? క్షేమమేనా? ఈ ఫోన్ లు వచ్చాక వుత్తరం అనేది కాల గర్భం లో కలిసిపోయిన మేలి ముత్యమైపోయింది. ఈ వుత్తరం అనేది ఎప్పుడు మొదలయ్యిందో కాని దాని విస్తరణా ఖ్యాతి మాత్రం చాలా కాలమే సాగినట్లు వుంది, ఎంతటి దైనా కాల దోషం పట్టక తప్పదు కదా చివరకు. ఈ వుత్తరమేమిటో.....!!!!, ఏదో రాద్దామని మొదలెట్టి..... వుత్తరం దాని పరిణామక్రమం అని అచ్చమైన జీవశాస్త్ర వుపాధ్యాయుడి లా చెపుతున్నా కదు. ఇందు అదే అంటుంది ఏది మొదలెట్టినా చివరకు ఆ లెక్చరర్ వుద్యోగ ప్రభావం మాత్రం తప్పనివ్వరు కదా అని. పిల్లలు కూడా అదే అనుకుంటారు అనుకుంటా, నవ్వుతూ చూస్తారు వాళ్ళ అమ్మ నన్ను దెప్పుతుంటే.

మీ కబుర్లు ఏమిటి? రాజు, పిల్లలు బాగున్నారా? మధ్య వయసు ప్రభావమో... భాద్యతల ముంపో మరి ఏది చేసిందో మాయ కాని, వేగం తగ్గింది జీవితం. తగ్గాలేమో కదు.. ఎప్పటికి దుడుకు జలపాతమల్లే వుంటే ఎలా...! నెమ్మదించిన నది అవ్వాలి కదా. ఈ మధ్య న మీ అమెరికా లో కూడా ఇండియాలో పెంచుకునే ఆస్తులగోలే కాక సాహిత్య పోషణ, కళా పోషణ పాళ్ళు ఎక్కువ ఐనట్లు వున్నాయి. మంచి మార్పు. కేవలం సినిమా ల ప్రభావమే కాక సాహిత్యానికి కూడా పీట వేస్తున్నారు, ఎవరిని చూసినా ఈ మధ్య ఏదో ఒక సాహిత్య సమావేశాలు జరుపుతున్నట్లు వున్నారు. మీ అమెరికా వాళ్ళ కధలు కూడా ఎక్కువ అయ్యాయి సాహిత్యం లో....... ఇక్కడా అక్కడ కూడా. నువ్వు గమనించావో లేదో కాని ఎందుకో అందరు అమెరికా జీవితం లోని లోటు పాట్లనే చూపుతున్నట్లనిపించింది నాకు ఆ కధలు చదువుతుంటే. మరి నేను ఎక్కువ గా చదవలేదేమో.

చాలానే అసంతృప్తి వున్నట్లు వుంది మీకు అక్కడ..????? అప్పుడు ఇంత లోటూ పాట్లు వున్న సమాజాన్ని ఎందుకు వదలరు? నీకు గుర్తు వుందా నీ పెళ్ళప్పుడు మీ మామ గారు అక్షంతలు చేతి లో పుచ్చుకుంటే పసుపు తో చేతులు నాన్సెన్స్ ఐపోయాయి అని మాతో బేసిన్ లో నీళ్ళు తెప్పించి కడిగించారు ఆ పల్లెటూళ్ళో. ఆపైన మాతో అన్నారు ఇండియా లో ఏమి వుంది దోమలు బురద తప్ప అని. ఇప్పటికి తలచుకుని నవ్వుకుంటూ వుంటాము ఆయనను. అదోక అతిశయం, ఇప్పుడొక అతిశయం అనిపిస్తుంది నాకు. ఏమంటావు?

చాలా వరకు నే చదివిన కధలలో, సంస్కృతి నాగరికత ఇండియాలో వదిలేసి, దిగులు గా, భయం గా, భవిష్యత్తు మీద దిగులుతో పిల్లలను సరి గా పెంచలేక బాధ పడుతున్నట్లు వుంటాయి పాత్రలు. లేదా బాగా డబ్బు పిచ్చి తో తల్లి తండ్రులను అత్తమామలను బాధ పెట్టినట్లో వుంటాయి. ఇవి కాక మీకేమి సమస్యలు వుండవా? మీ వూళ్ళో రాజకీయ మార్పులు మిమ్ములను బాధ పెట్టేవో, మీ జీవితాలలో మార్పు కలిగించేవో వుండవా? అక్కడి సంస్కృతి కధ లలో రాసినంత రోత గా వుంటుందా మంచి విషయాలు మీరు తీసుకుని మీ జీవితాలలో అనుష్టించగలిగేవి ఏమి వుండవా? అక్కడుండి పూర్తి గా ఇక్కడి లానో, ఇక్కడుండి పూర్తి గా అక్కడికి లానో పిల్లలను పెంచటం సాధ్యమా? అందులో పిల్లల మనసులు, వారు పడే తాపత్రయం ఏమి వుండవా?
ఇలానే చాలా ప్రశ్న లు వస్తుంటాయి నాకు. మనం ఫోన్ లో ఇవి అన్ని మాట్లాడేంత తీరిక వుండదు. సమయాభావం ఇద్దరికీ, ఆ పైన అడిగి నిన్ను బాధ పెట్టినట్లు వుంటుందేమో అని ఒక సంశయం నాకు. ఇక్కడ చాలా మార్పులు నువ్వు గమనించే వుంటావు వచ్చిన ప్రతి సారి. ఒకే సారి విపరీతమైన వేగం గా ముందుకు, మెరుపల్లే వెనక్కి వేదకాలం లోకి పరుగెత్తాలని ప్రయత్నిస్తున్నట్లనిపిస్తుంది మేము. ఆగి ఆలోచిస్తే చాలానే లోపాలు కనపడతాయనుకుంటా, కాని ఆగి చూసేదెవ్వరు కాలంతో కొట్టుకుపోక.. బాల్యం మీద బెంగ, యవ్వనం వుండాలనే కాపీనం, వృద్ధాప్యం వద్దనే ఆరాటం మాములై పోయింది. మనం చేసేది తప్ప పక్కవాళ్ళు చేసే ప్రతిది విమర్శనాత్మకం గా చూడటం నిత్య జీవన విధానం మాకు. కాని చెప్పేను కదా ఆగి ఆత్మ విమర్శ చేసుకోవలనే ఆలోచన, అంత ఓపిక కూడా మాకు లేదు. మీరు అది చేస్తున్నారా? అందుకే అంత అసంతృప్తి చాయలా ఆ కధలలో...???? సాహిత్యం ఆ తరం ఆలోచన, జీవన విధాన, సాంప్రదాయ రీతులను ప్రతిబింబింప చేస్తుంది అంటారు ఐతే మీ కధలు ఆ పనే చేస్తుందా?

ఎన్నో ప్రశ్నలు సంధించినట్లు వున్నా కదా.. కాలంతో దొరికిన సమాధానలను ఏరుకోవలసిందే కాని చెప్ప తరమా అని ముగించక ఎప్పటికి మల్లే, నీకు తోచిన సమాధానమిస్తావని అనుకుంటూ.

నీ స్నేహితుడు,
కృష్ణ.


కృష్ణ,
బాగున్నావా? ఏమిటి నిజం గానే ప్రశ్న ల పరంపర వదిలేవు నా మీద??? ఇలా ప్రతి దానికి ఆలోచిస్తావనే మరి మేమందరం ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అనేది నిన్ను...!!!!!! ఆగి ఆలోచించే అవసరం లేదంటూనే ఆలోచించే అలవాటు నీది, ఆగి ఆత్మావలోకనం చేసుకుంటున్నాననుకుంటూ వూరికే మాట్లాడే దానిని నేను. నన్నడిగితే నేనేమి చెపుతాను? అందునా నీ అంత సాహిత్యం చదివే అలవాటు లేదు నాకు. రాజు పిల్లలు బాగున్నారు. రవి కు మా దగ్గర యూనివర్సిటీ లో ఎడ్మిషన్ వచ్చింది, వాడి చూపు ఇంకో చోట వుంది, రాజు కు నాకు మాత్రం వాడు దగ్గర గా వుంటే బాగుంటుంది అని వుంది. చూద్దాము. రాజి కు ఇంకా రెండేళ్ళు వుంది కదా కాలేజ్ కు, అప్పటి దాక దాని కధ సుఖాంతమే.

పిల్లల కబుర్లు, ఇందు కబుర్లు ఏమి రాయనే లేదు. ఈ సాహిత్యం, సమాజం నీ ఆలోచన పూర్తి గా ఆక్రమించినట్లు వున్నాయే...!!!!! ఇక్కడి వాళ్ళందరి గురించి అడిగితే అందరి తరపున వకాల్తా తీసుకుని నేనేమి చెప్పగలను చెప్పు. కాని నిజమే కధలలో ఎందుకో అసంతృప్తి బాగా ప్రతిఫలిస్తుంటుంది, అంటే అలా రాస్తే నే బాగుంటుంది అని రాస్తారో లేక మరి నిజం గానే అలా ఫీల్ అవుతారో తెలియదు. నావరకు నాకేమి అసంతృప్తి లేదు ఇక్కడ వున్నందుకు. వుండవలసి వచ్చినందుకు రిగ్రెట్స్ కూడా లేవు. నీకు తెలుసు కదా నాకు అసలు ఇక్కడి కి రావటం ఆసక్తి లేదు కాని వచ్చా కదా. వచ్చాక చాలా మంది లానే ఒక పల్లెటూరి ను చూసుకుని, అక్కడో ఇల్లు కొనుక్కుని కాస్త దూరం వెళ్ళి వుద్యోగం చేసుకుంటూ పిల్లలను పెంచుకునే సగటు 90 ల లో వచ్చిన కుటుంబాలలో నేను ఒకదాన్ని. ఈ దేశం లోకి వచ్చిన విధానాన్ని బట్టి, వున్న చోటు బట్టి ఆ అనుభవాలను బట్టీ ఈ దేశం మీద మనకొక అభిప్రాయం కలుగుతుంది అనుకుంటా.

నాకైతే నచ్చింది ఆ అనుభవం. ఎక్కడా మోసం లేదా?? ఎక్కడా వివక్షత లేదా???? అంటే ఎందుకు వుండదు వున్నాయి. సంస్కృతి నాగరికత తేడా లేదా అంటే ఎందుకు లేదు నిక్షేపం గా వుంది. దేని గొప్ప దానిదే. మనం తీసుకునే విధానాన్ని బట్టి జీవితం కనపడుతుందేమో. సాహిత్యం లో అలా ఎందుకు రాస్తారు అంటే ఏమో ఎవరి అనుభవాలు వాళ్ళవి కదా, ఇక్కడ వుండే భారతీయులు అందునా ఎంతోకొంత సాహిత్యం తో పరిచయమున్నవాళ్ళు సంఖ్యాపరం గా తక్కువ కాబట్టి కేవలం అలాంటి కధలే కనపడుతున్నాయేమో కాని అన్ని అవే అనేమి లేదు. ఎక్కువ గా 90 ల ఆఖరి వరకు వచ్చిన వాళ్ళకు కల్చర్ డిఫరెన్స్ వుంటుంది. దానిలో ఇమడాలంటే తల్లి తండ్రులు గా మాకు, మొదటి తరపు పిల్లలు గా మా పిల్లలకు....... ఘర్షణలు తప్పవు కదా. ఎక్కడైనా దేశం తో సంభంధం లేకుండా, తరానికి తరానికి కొంచం తేడా వుంటుంది ఏ పని నైనా ఏ విషయాన్నైనా చేసే.... చూసే విధానం లో. దానికి మేము మాత్రం పెద్ద ఎక్సెప్షన్ ఏమి కాదు. మావి మావి అని అనుకుంటున్న మన విలువలు మన వెనుక తరానికంటే వేరు గా లేవా, మనవైన ఆలోచనలు మన ముందు తరం వారికంటే వేరుగా వుండవా? విలువ, సంస్కృతి, సంప్రదాయం అనేది కాల మాన పరిస్తితులను బట్టి మారుతుంది. మారనిది సత్యం అసత్యం మాత్రమే అని నా నమ్మకం.

మాంసం తినని వాడికి తినే వాడిని చూస్తే చిన్న చూపు, తినే వాడికి గొడ్డు మాంసం తినే వాడిని చూస్తే చిన్న చూ,పు, గొడ్డు మాంసం తినే వాడికి అసలు తినని వాడిని చూస్తే చాలా చిన్నచూపు.. చీర కట్టుకున్నామె చూడిదార్ లు వేసుకునే ఆమె కన్న సంస్కృతి ని ఎక్కువ గా పోషిస్తున్నానన్న నమ్మకం, చూడిదార్ ఆమె కు స్కర్ట్ వేసుకునే ఆమె కన్నా ఎక్కువ అని అభిప్రాయం, ఈ మూడూ వృత్తి ప్రవృత్తి లను బట్టి వేసుకునే ఆమెకు, బికినీ వేసుకుని బీచ్ లో పొడుకున్నామె ను చూస్తే పరిహాసం విలువలు లేని వాళ్ళని, ఆమెకు న్యూడ్ బీచ్ లలో తిరిగే వాళ్ళను చూస్తే లోక్లాస్ అనుకుంటుంది. ఇచ్చానుసారం తిరిగే ఆమెకు ఈ మిగతా అందరిని చూసి బానిస బతుకులు జీవించటం చేతకాదు అని వెటకారం. ఇందులో మనం ఏ గ్రూప్ లో వుంటే ఆ అభిప్రాయాలను సమర్ధిస్తాము. జీవితాన్ని కొంచెం పెద్ద గాడి లో చూసే అవకాశం వుంది ఇక్కడ కావాలనుకుంటే. అక్కడా వుంటుందేమో నువ్వన్నట్లు టైం వుంటే.

ప్రత్యేకం గా సాహిత్యానికి వేరే ప్రత్యేకత ఏమి లేదు. మన అనుభవాలు ఆలోచనలు కధలు గా ప్రతిఫలిస్తాయి. సాపేక్ష సిద్ధాంతమే అన్ని చోట్లా కృష్ణ. నేనైతే కధలు రాయను కాబట్టి ఇంతకంటే ఏమి చెప్పలేను. మరీ ఈ కధ లలో రాసినంత..... వీళ్ళందరు వాపోయినంత చెడ్డ గా ఏమి వుడదు ఇక్కడ. మనకేమి కావాలో మనం నిర్ణయించుకోవాలి కదా. నా వరకు పిల్లలకు భాష ముఖ్యం అనుకున్నా. పిల్లలు ఇక్కడ ఈ సమాజం తో ఎంత కలిసి పోయినా నా వాళ్ళతో (వాళ్ళ వాళ్ళు కూడా) కనీసం తడుముకోకుండామాట్లాడాలి. ఇది చెప్పినంత తేలిక కాదు. చాల శ్రమ ఓపిక లతో కూడిన పని. పిల్లలు ఒక విధం గా చాలా అదృష్టవంతులు. best of both worlds దొరుకుతాయి. కాని పాపం చాలా శ్రమ పడతారు రెండు ప్రపంచాల మధ్య సమన్వయం కుదుర్చుకునే వరకు. ఆ సమన్వయపరచుకోవటం లో తల్లి తండ్రుల సహాయం లేని వాళ్ళకు ఇంకా సమస్య, సమస్య వస్తే ఎవరమైనా ఏమి చేస్తాము? ఏదో ఒక పక్క కు వెళ్ళి మన తర్కం మనం పెంచుకుంటాము. పిల్లలు అలా చేసి అమెరికా పక్కకు వెళ్ళి వెక్కిరించే తల్లి తండ్రులను వెక్కిరించటానికి మనం నమ్మే సంస్కృతి సాంప్రదాయాలను డిఫెన్స్ గా చేసుకుంటారు. అలాంటి వాదనలు బలె తమాషాగా వుంటాయి వినటానికి. అలా బాధ పడిన ఒక తండ్రి లేక తల్లి కలం నుంచి అమెరికా గురించి మధురమైన అనుభవాల మాలిక లా కధ ఎలా వస్తుంది.

ఏది ఏమైనా మంచి ప్రశ్న వేసేవు నేను పూర్తి గా సమాధానం చెప్పలేను చూద్దాము మనకు అలవాటైన ఆలోచన "కాలమే చెప్పని సమాధానాన్ని కలవని తీరాలను కలిపే వంతెనలు బలం గా పడ్డాయో......... వూగుతున్నాయో అనుమానాల అపోహల అపార్ధాల నడుమ."

ప్రేమ తో,
వేణి.