ఇది నా లేఖల సమాహారం.. మనసులోని మాట కనులు దాటి కలలు రేపి కలత నిలిపి కలానికందనంటు పరుగులు పెడుతుంటే కాదంటూ కుదరదంటూ కట్టి నిలిపిందే ఈ బ్లాగ్..
18, ఆగస్టు 2009, మంగళవారం
13, ఆగస్టు 2009, గురువారం
కృష్ణయ్య పుట్టిన రోజు పండుగ
క్రిష్ణయ్యా, ఈ రోజు నీ పుట్టిన రోజు... ఐనా నీకు పుట్టిన రోజేమిటి మా పిచ్చి కాని..... ఆది, అంతాలే లేక సర్వ వ్యాపకుడివైన నీకు ఒక రూపాన్ని, ఒక రోజు ను, ఒక పండుగను నీకోసం కల్పించి మేము చేసే ఈ వేడుక అంతా నీ లీలా వినోదాలలో ఒక భాగం కాదు.... ఐనా మా కోసం మాలో ఒకడి గా చేరి వెన్న తింటు, అల్లరి చేస్తూ, మువ్వలన్ని గల గల మంటు సాగే కాల ప్రవాహమల్లే నువ్వు వేసే గంతులు.... ఇవి అన్ని మా కోసమే కదు...
క్షణం క్షణం పసి పాపల చిలిపి అల్లరిలో వాళ్ళ చిరు ఆనందం లో, ఇంటి ముందు గంతులేసే తువ్వాయి చురుకు చూపులలో.... పెరట్లో విరిసిన రాధా మనోహరం మొగ్గ అంచున రూపుదిద్దుకుంటున్న ఎరుపు వర్ణపు ప్రేమ ఆనవాలు లో, విరిసిన చంద్రవంక లో తళుకులీనే చంద్ర కాంతి తో కలిసి అంచున వూయలలూగుతూ అవ్యక్తా వ్యక్తం గా వినిపించే నీ అనంత వేణు గానం లో..... ప్రతి అణువణువులో నిన్ను ప్రతి క్షణం గుర్తు పట్టిన ఆనందం తో యశోదనై ఈ రోజు నీ పుట్టిన రోజు జరుపుకుంటున్న నన్ను మన్నించి నా ముంగిటకు మళ్ళీ మళ్ళీ అన్ని రూపాలలో....... ఏదో ఒక రూపం లో రావూ...!!!!
ప్రతి క్షణం నిను ఏదో అడిగి, ఇంకేదో కావాలని కోరి... ఇచ్చినదాని విలువ తెలియక...... అది విసిరేసి మళ్ళీ ఇంకేదో కావాలని ఏడ్చి.. విలువైన బొమ్మ ను విసిరేసి అట్ట పెట్టెను చూసి ఆనంద పడి దానిలోని కాగితపు ముక్కలే అనంత సంపదలని భ్రమసిన నన్ను, తండ్రి లా నువ్వు అది తీసి పక్కన పెట్టి విలువైన జీవితాన్ని కానుక గా ఇవ్వటానికి ప్రయత్నిస్తుంటే వద్దని పేచి పెట్టే ఈ పసి బిడ్డను క్షమించి నా ముంగిటకు పసి వాడై నేను నీకు జరిపే ఈ క్రిష్ణాష్టమి ను జరిపించుకోవటానికి రావూ...
యుగం కితం నా వంటి ఒక పేద తల్లి మమత ని, ఇంకో అధ్బుత ప్రేమ మూర్తి ఆరాధన ను, కొన్ని కోట్ల మూగ జీవుల ఆర్తి ని అన్నిటి కోసం, అందరి కోసం ఈ రోజే వచ్చావట ఈ లోకానికి క్రిష్ణ నామం తో, క్రిష్ణ తత్వం తో, క్రిష్ణ ప్రేమ తో......అంతా నేనే, నేనే ఎప్పటికి, అంతా నాదే అనే మా కంస ప్రవృత్తి ని అణచటం కోసం ఏతెంచావంట ఈ రోజే... మా అహంకారం, పశు ప్రవృత్తి ని పిడి గుద్దులతో అణిచేవంట లే విన్నాను ఆ కథ లు... మా కోపాన్ని ఈసు అసూయలను కూడా కాళీయ మర్ధనం చేసి మా పీచమణిచావంటలే... నల్ల నల్లని మేఘమై నీల మేఘ శ్యాముడివై మా మీద నీ ప్రేమామృతాన్ని వెన్న లా, వేణు రాగం లా మా మీద కుండలతో, బోలైన జీవిత వేణువులతో వంపి వర్షించావంటలే..
ఐతే ఏం...ఎప్పటి కథే... ఎప్పటి వెతే.. .అన్నీ మర్చి మళ్ళీ ఖాళి కుండ తో నీ పూ పొదరింట నుంచు ని నీ కరుణామృతం కోసం నిలబడిన ఈ యాచకురాలిని మన్నించి మళ్ళీ ఒక్క సారి మా ముందుకు పసి బిడ్డ వై ఈ క్రిష్ణాష్టమి కి వచ్చెయ్యవా.....
చూడు దారి గుర్తు పట్టవేమో అని నీ కోసం నీ చిన్ని పాదాలను ముద్రించి వుంచేను .. అమ్మ కోసం పాదం లో పాదం,పదం లో పదం కలిపి నీ చిట్టి అడుగులతో వచ్చెయ్యి లోపలకు నా చిన్ని కన్నా... నీకోసం నా ప్రేమ ను నా ఆప్యాయతను అన్నిటిని అంతా కలిపి నీ కోసం వెన్నుండలు చేసేను, తీపి పాయసం చేసేను, ఆటుకులను పాలతో బెల్లం తో కలిపి తీపి తీపి తాయిలాలు, భక్ష్యాలు చేసేను.. ఈ ఇంటినే ఒక మధుర చేసేను.. నచ్చలేదా.. ఈ కంస ప్రవృత్తి మద మత్సరాలను రాక్షసులు గా నా బిడ్డవైన నీ మీదికే పంపుతోందా, వద్దా.... సరే పద బృందావనం వెళ్ళి పోదాము...
దొంగా ఆ తళుకులీనే నవ్వు చూడు, నాకు తెలుసు లే నీ వేషాలు బృదావనం ఐతే నీ ఆటలన్నీ సాగుతాయని కదు... ఎప్పుడైనా యశోదమ్మ నీ ఆట కాదందా నీ మాట కాదందా... ముందు మధుర గా మలుచుకున్న ఈ అంతరం లోకి ప్రేమమూర్తి వై రా, తరువాత ప్రేమైక లోకమైన బృదావనం వెళదాము.. వుట్టి కూడా కొడదాము.. మరి ఈ పిచ్చి తల్లి కోసమో, నీ మురిపాల రాధ కోసమో, నీ దాసాను దాసులైన నీ లోని రూపాలమైన అందరి కోసమో వచ్చేస్తావు కదు

ప్రేమతో
యశోదమ్మ పంపుతున్న ఆహ్వాన పత్రం...
5, ఆగస్టు 2009, బుధవారం
నేస్తం
నేస్తం,
మనసు మూలల్లోకి తొంగి కూడా చూడనవసరం లేకుండానే నా హృదయం లో ఆలోచనను నా గొంతులోని పదాన్ని భావ నిర్దేశం నువ్వే చేసేవా అన్నట్లు అణువైనా మార్చకుండా చెప్పగల నా నేస్తమా... ఎక్కడ వున్నావు. ఏమై పోయావు ఎందుకంత దూరం వెళ్ళి పోయావు... నీలా నేను నీ మనసు చదవ గలిగే సామర్ధ్యం లేని దానిని అని నీకు తెలుసు కదా మరి తెలిసీ అన్నీ ఎప్పుడు పంచుకునే నీ కలం ఎందుకు అలా ఒక్క సారి మూగ నోము పట్టింది..
మర్చి పోయావా మనం కలిసి చేసుకున్న వాగ్ధానాలు... మనం కలిసి పరుగెత్తిన పూల తోటలు, వణికి పోతూ చేతి లో చేయి వేసుకుని దాటిన సమస్యల సముద్రాలు. ఒక్క రోజైనా.... ప్రయాణం లో ఎంత అలసట కలిగినా, నా బెదురు, భయం గమ్యాన్ని దూరం చేస్తున్నా నన్ను విసుక్కోకుండా నా ప్రతి అడుగులో తోడై నడిచిన నా మిత్రమా... ఎక్కడున్నావు.... నీ ఆచూకి కూడా అందనంత దూరానికి నన్ను ఇలా వదిలేసి పారిపోగల ధైర్యం నీకు ఎవరు ఇచ్చారు.. ఒక్క మాట చెప్పేవా, ఒక్కరోజైనా ఆగి ఆలోచించేవా నువ్వులేని ఈ ప్రపంచం నాకు ఏమవుతుందో...
సరే నా సంగతి వదిలెయ్ నేను లేకుండా నువ్వెలా వున్నావు? గుర్తు వుందా మనం మాస్టారి ఇంటికి వెళ్ళినప్పుడు మాస్టారి జామ చెట్టు కింద కాయలు కోసుకుంటూ నువ్వు కింద కొమ్మకు వున్న జామకాయ కూడా చూసి కొయ్యమని అరుస్తుంటే, మాస్టారు కిందనే వుంది కోసుకోలేవా అమ్మా అని నవ్వితే ఏమన్నావు నువ్వు దానికి "మాస్టారు ఉమ దాని చేతితో తాకి చూసి కోస్తే కాని నాకు తృప్తి వుండదు, నా ఒక్క దాని అభిప్రాయం అభిప్రాయమే కాదు నా ఒక్క దాని జీవితం జీవితమే కాదు నా స్నేహితురాలు లేకుండా అని" గుర్తు వుందా, నా కంటి తో చూసి చెప్పకుండా జామకాయ మంచితనాన్నే నిర్ణయించలేని నువ్వు అంత పెద్ద నిర్ణయం నాకు చెప్పకుండా తీసుకుని నాకు తెలియకుండా ఎలా వెళ్ళిపోయావు.....
జీవితం లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్క సారి ఒక్కసారంటే ఒక్క సారి కూడా నువ్వు తోడు లేకుండా నన్ను నేను ఒంటరి గా చూసుకున్న ప్రత్యేక సంధర్బమే లేదు. గుర్తు వుందా చిన్నప్పుడు అమ్మ లేనప్పుడూ వంట ఇంట్లో దూరి హార్లిక్స్ బొక్కినప్పడు తెలివితక్కువ గా ఆ పొడి నేలమీద వేసి ఆ జిగురు తో పట్టుబడి పోయి తన్నులు తిన్న రోజులు... మావయ్య వాళ్ళతో కలిసి వీధి చివర సత్యం గారింట్లో మామిడికాయల దొంగతనానికి వెళితే నువ్వు వెనుక వుప్పు కారం పొట్లాలు ఎవ్వరికి కనపడకుండా గౌను జేబు లో దాచి తెచ్చేదానివి.
శలవులకు మావయ్య గారి ఇంటికి నిన్ను కూడా తీసుకుని వెళితే వాళ్ళ అమ్మాయి రమ ప్రేమ వ్యవహారం లో పెద్ద పుడింగి లా గా మద్యవర్తిత్వం చేసి వీపు చిట్ల గొట్టించుకున్నావు మీ అమ్మ తో... :-)
మీ దొడ్లో బొండు మల్లె పూల పొద పక్కన అదేమి చెట్టో కూడా నాకు ఇప్పుడు గుర్తు లేదు దాని కొమ్మల మీద ఎక్కి కూర్చుని శంకరాభరణం లో పాటలు చదివి/పాడి నా కర్ణపుటాలలో తుప్పు అంతా వదల గొట్టే దానివి... ఎవ్వరు వినే వారు కాదు కదా నేను తప్ప నీ పాటలు...
జ్యోతక్క ఆపరేషన్ టేబుల్ మీద చని పోయింది అని ఎంత ఏడ్చామో మర్చిపోయావా! ఏమైపోయివుంటుందే అక్క...... ఆ ప్రాణం ఎటు వెళ్ళి వుంటుందో ఇంక జీవితమంటే ఏమిటి మనం ఇలానే ఎప్పుడో చచ్చి పోతామా అని ఎంత వణికి పోయాము అమాయకత్వం తో వచ్చిన భయం తో... అప్పుడే మనం ఒట్టు పెట్టుకున్నాము గుర్తు వుందా మనలో ముందు ఎవరు చనిపోతే వాళ్ళు మిగతా వాళ్ళకు కనపడాలి పరిక్షలలో తెలియని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి పుస్తకం చూసి వచ్చి అని కూడా ఒట్లు పెట్టుకున్నాము.
చదువుల పేరు తో దారులు వేరయ్యినా ఒక్కటన్నా ఒకరికి ఒకరం చెప్పుకోకుండా ఏరోజైనా వున్నామా? నా గుండెలో క్రిష్ణ నీ కళ్ళలో మెరిసి నచ్చాకే కదా అడుగు ముందుకు పడింది... నాకు నీ మీద ఎంత కోపం వస్తోందా తెలుసా చెంపలు పగల కొట్టాలనిపిస్తోంది... ఎదురు గా చూస్తూ నవ్వుతు వుంటావు... ఎక్కడున్నావు అని ఏడుస్తావు ఇక్కడే వుంటే అని నవ్వుతావు ... ఇంత మనసు లేని దానివైపోయావే నా కళ్ళ నుంచి కారే నీటి చుక్క ను చూసి కూడా నవ్వ గలుగుతున్నావు...అవును లే శరిరాన్ని వదిలేసేవు కదా మనసు కూడా దానితో వదిలేసి వుంటావు...
నువ్వు లేకుండా నాకు జీవితం లో స్నేహమనే పదం కు అర్ధం కూడా తోచటం లేదు... నువ్వు లేని జీవితమే స్నేహ రహితం గా వుంది... నువ్వు లేక సంతోషం సగమైనట్లుంది బాధేమో రెట్టింపైంది ....
మరణమంటే కధ ముగింపు కాదు ఒక కామా నే, కథ మళ్ళీ మొదలవుతుంది స్నేహమెన్నటికి దూరం కాదు అని మధు బాబు గారు చెపుతున్నా..... కన్నీటి తో మసకైన నా కళ్ళకు, దిగులు తో ఒంటరైన నా మన్సుకు ఆ కామానే ధుర్బరం గా వుంది... ప్రాణ స్నేహితురాలినని అనుకుందామంటే నువ్వెళ్ళి పోయావు నా ప్రాణమింకా వుంది,
ఈ జన్మ లో నన్ను మోసం చేసి 30 ఏళ్ళకే వదిలేసి వెళ్ళి పోయినట్లు ఇంక ఏ జన్మ కు చెయ్యక... అలా చేస్తే నీ జత పచ్చి.....
నన్ను వదిలి వెళ్ళిన నా ప్రియ నేస్తం అను కు ఆశ్రు నివాళులతో...
13, జులై 2009, సోమవారం
14, జూన్ 2009, ఆదివారం
నిరంతర ఘర్షణ నీతో పంచుకుంటూ...
ఎందుకు జీవితం మరీ ఇంత మాములు ఐపోయింది... ప్రేమ లేకా!!! లేకపోతే గొప్ప దైన వెలుతురు వెన్నెల లానే రోజుచూడటం మూలం గా ప్రేమ కూడా మాములు ఐ దైనందిక జీవితం లో కలిసి పోయి ప్రతి విషయం నిస్సారం గా కనపడుతోందా...
అలా కలిసి పోతే జీవితం ఒక అధ్బుతమై ... ప్రతి క్షణమొక వరమవ్వాలే కాని ఇలా ఎందుకువుంటుంది...
నాకింకా గుర్తు వుంది.. మిగతా రోజులన్నీ ఎలా వున్నా పౌర్ణమి రోజు రాత్రి కాసేపు ఐనా బయటకు వచ్చి వెన్నెల వాన లో తడవటం.. గాలి ఎక్కడ నుంచో వింత పరిమళాలను మోసుకుని వస్తూ వుంటుంది.. ఎక్కడ నుంచి వస్తుందో ఆ వింతపరిమళం.. మళ్ళీ తెల్లరితే రాదు ....
బహుశా చంద మామ తన వెన్నెల సంతకాన్ని పూల పరిమళం తో కలిపి కానుక గాపంపుతాడేమో భూదేవి కి... ఇప్పుడేమో అమావాస్య ఏదో పౌర్ణమి ఏదో కూడా గుర్తు లేదు మూగ పోయిన మనస్సుకి. ఎందుకిలా జరిగింది అంటావు....
వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకా విరగ బూసిన పారిజాతాల పరిమళం మనసుకు ఎక్కడో లీల గా తడుతోంది... అసలుజీవితమంటే ఏమిటి....
ఎన్ని సార్లు ఈ ప్రశ్న వేసుకున్నా ఏమో ఒక్కసారి ఐనా జీవితం అంటే విరబూసిన పున్నాగలు కొంచం గా మల్లెమరువం, వీటన్నిటికి మధ్య గా ప్రేమ అనే సమాధానం రావటం లేదు... అసలు అదైతే గా జీవితం అలా అని సమాధానంరావటానికి ......
కాదు అంటావా మరి ఏమిటి అంటావు ఇలా ఎన్నో ప్రశ్న లు వేస్తుంటే ముక్కు పుచ్చుకుని ఇలా ఐతేఎలా నల్ల పిల్ల అన్నిటికి ప్రశ్నలేనా అని వూయించేందుకు నువ్వు లేవు కదా అందుకని అలా అనిపిస్తోందా?
ఏమోమరి... నిన్నకు రేపొక తీరని ప్రశ్న రేపటికి మరునాడొక ప్రశ్న, కాలమనే గాలానికి చిక్కి దొరకనివెన్నెన్నో అనిపాడుకోవాలా???? ఇలా ఆలోచిస్తు ఒక రోజు పొడుకుంటే ఇంక మళ్ళీ లేవని సమాధానం దొరికే ఒక వుదయంవస్తుందేమో అప్పుడు తెలుస్తాయేమో అన్ని ప్రశ్నలకు సమాధానాలు.. ఏమో అదీ చూద్దాము...
కాంతి కవిత రాసి పంపమంటున్నారు... రాయగలను అంటావా...ఇంకా నేను కవితలు.. స్పందించే మనసు లేనప్పుడు ఏస్పందన గురించి కవిత వస్తుంది...
ఏదీ జీవితం లో అత్యంత ప్రియమైనది కాదేమో అనే మీమాంస లో పడిపోతే ఏవిషయం గొప్ప కావటం లేదు కదా.
అమాయకత్వం ఒక వరం కదా హాయి గా ప్రతి దాన్ని నమ్ముతాము అదే నిజం అని అనుకుంటాము కాని దాని మూలాలను ఎప్పుడు ప్రశ్నించటం మొదలు పెడతామో కదులు తాయి ఆ మూలాలు.... అవి వచ్చి మనతో మాట్లాడతాయి
నువ్వు అనుకున్నంత గొప్పవేమి కాదు మేము అని ఇంకా ఎన్నెన్నో దాగిన చరిత్ర కందనినిజాలు చెపుతాయి అంతే అప్పటి వరకు మనం వాటిమీద నిర్మించుకున్న సౌధాలన్నీ కూలుతుంటే ఏమి చెయ్యలేనినిసహాయత ఒక వైపు, నిజం లోని తీవ్రత కలిగించే సంతోషం ఇంకో వైపు...
నువ్వు నా దగ్గర లేక పోవటం కూడా ఒక విధం గా మేలేనోయ్ నువ్వే వుంటే ఇంత ఆలోచన కు తావేది.... నిజాన్ని నిగ్గుతీయాలనేంత కోరిక వుండదు కదా..
నువ్వు నన్ను ఎప్పుడూ సత్యాన్వేషి కమ్మన్నావు, కాని మరీ ఇది ఇంత బాధ ను, నిషాను రెండిటిని ఇస్తుందని నీకు తెలుసా? తెలిసే ఈ దారి నాకు సూచించి వూరుకున్నావా????
చేయ పట్టుకుని ఈకష్టమైన దారిని సుగమం చేయకుండా? వున్నాగా నీకు తోడు గా ప్రతి ఘడియ... నేను లేకుండానే దాటేవా ధీర్ఘ వర్షచ్హాయా రోజులన్నిటిని అంటావేమో... వు.... అది నిజమేలే...
మొన్నెప్పుడో సోమరి వేసవి సాయింత్రం బద్దకం గా ఏమి తోచక...... మరి కట్టటానికి మల్లె మాలలు లేవు... చదువుదామంటే ఒక మంచి పుస్తకం లేదు... సరి కలిసి టీ తాగుతు వాదనేద్దాము నాకు నచ్చిన కవి సామ్రాట్ విశ్వనాధ సత్యన్నారాయణ గారి గురించో నీకు నచ్చిన గోన బుద్దా రెడ్డి గారి గురించో అంటే నువ్వూ లేవాయే...
అందుకని ఎప్పుడో లోపల పడేసిన కోలాటం కర్రలు తీసి కాసేపు మనం చూసిన మహా నంది క్రిష్ణ కోలాటం పాటకు తాళంవేయాటానికి చూస్తే చాలా కష్టం ఐపోయింది రా.. మరీ నీ సావాసం ఎక్కువ ఐ పుస్తకాలకు, ఆలో చనలకు దగ్గర.... పనులకు, ప్రపంచానికి దూరం ఐపోతున్నా.. అదే మంటె అదే అసలు ప్రపంచం అంటావు
కిందటి నెల M.I.T లో MITHAS వాళ్ళది సంతాన గోపాలన్ గారి కర్నాటిక్ వోకల్ జరిగింది అట.. నా మైల్ ఎందుకనోరాలేదు.. ఎప్పుడు ఫోన్ చేసి చెప్పే శ్రీనివాసన్ కనీసం చెప్పలేదు.. ఎందుకు చెపుతాడు కిందటి సారి నువ్వు వచ్చావని మంచితనం గా భోజనానికి పిలిస్తే ఆయనతో ఆలోచనలలో సామ్య వాదం, ఆచరణలలో ఫ్యూడలిజం అంటు వాదనపెట్టుకున్నావు...
జీవితం లో ప్రతి దానికి వాదనై పోతోంది రా గమనించావా ఘర్షణ లో నుంచి పుట్టేదే నిజం ఆ ఘర్షణే లేకపోతే అమృతం పుట్టేదా అన్నావు మొన్న ఒక సారి మరి హాలాహలం కూడా ఆ నిరంతర ఘర్షణ లో నుంచే కదా అంటె ఆహాలహలమే లేక పోతే ఈ అమృతం విలువే లేదు అంటావు...
నిజమే కాని వీటన్నిటికి మించిన సత్యమొకటి వుంటుంది, అది మౌనం నుంచే.... అనతానంత మైన విశ్వ శాంతి నుంచే పుడుతుంది ... ఏమంటావు...?
19, మే 2009, మంగళవారం
ఎడబాటుని జపిస్తూ...
నా కృష్ణుడూదిన వేణు గానామృతం పదాల మధ్య వూపిరి తో కలిసి స్వరాలు గా.... వరాలు గా మారి... పదాల మద్య మెదులుతు... ఆ పదాలలో కృష్ణయ్య హృదయాన్ని కొంచెం కొంచెం గా అవిష్కరిస్తూ, అంతలోనే జలపాతమల్లే కన్నీటి సుడులలో తిప్పేస్తూ... గాఢమైన అనుభవాల సాంద్రత ను ఆ రాగాలకు దట్టిస్తూ..... జగాలన్నిటిని దాటిస్తూ..
వుహు ఆ అనుభవం... అనుభూతి కి సరి పరచ గల సాంకేతికత ఇంక రాలెదు రా బంగారం... ఐనా నిన్ను చూడటానికి ఇవి అన్ని ఎందుకు చెప్పు. ఒక్క సారి కనుల ఎదుట ప్రపంచం అంతా మాయమయ్యి మనసు ముందు నింగి ని సాగే నీలి మేఘం కోసం పరుగెడుతున్న అమ్మాయి ఆ అమ్మాయి ని మాత్రమే పట్టుకోవటానికి వెను వెంటే పరుగు తీస్తున్న అబ్బాయి నీ స్మృతి పధం లో మెదలరా...........
అంతలోనే నీలిమేఘపు మెరుపులను పూలమ్మి బుట్టలోని విరజాజుల వెలుగు ని కళ్ళల్లో దాచేసిన ఆ జంట కలిసి విశాల మైదానం లో ఎగరేస్తున్న పతంగులు కనపడవా... పతంగుల టప టప లలో కలిసిన గాలిని అందులోని చెమ్మ ను ఆర్ధ్రత గా మార్చి కళ్ళల్లో కన్నీటి పూలను కురిపిస్తు సెలవు తీసుకుంటున్న ఒక పిచ్చి ప్రేమ జంట నీ కళ్ళ ముందు మెదలటానికి ఈ కెమెరా లు ఎందుకు చెప్పు...
నీ వంకర టింకర అక్షరాలనే కోట్ల సార్లు చదువుకుంటు... ప్రతి అక్షరం లోని ఆనందాన్ని ఆవేశాన్ని ఆవేదనను చిన్న్ని రాగాలు గా వాటన్నిటిని కలిపి సాగే అనంత మోహన రాగం గా అంతర్లీనమయ్యే నీ వేణు గానాన్ని వినటం అనే అధ్బుతం ఒక్క వుత్తరం తోనే వస్తుంది ఫోన్ కాని కెమెరా లు కాని వుపయోగ పడ గలవా నువ్వే చెప్పు...
మనం యూనివర్సిటి గుల్ మొహర్ చెట్ల కింద ఆ పూల గుత్తు లను చూస్తూ వాన నీళ్ళ తో కలిసి పరుగెడుతున్న తంగేడు పూల ప్రవాహాన్ని ఆపటం కోసం దోసిళ్ళతో తీసి దాచిన నీళ్ళన్ని గుండె లోనికి చేరి ఒకటె రొద పెడుతున్నాయి రా ఎప్పుడు వస్తావు నువ్వు కలిసి వదిలేద్దాము మళ్ళీ ఆ ధారలను ప్రవాహం లోకి.... వాటిని విడతీసిన పాపమేమో మనం కూడా ఇలా ఎడబాటు ను సహిస్తూ యుగాలు గడుపుతున్నాము...
