20, అక్టోబర్ 2009, మంగళవారం

పరిచయమయ్యే ప్రేమలేఖ...

అక్టోబర్ నెల కౌముది లో నా లేఖ.   పార్ట్ 1





ప్రియమైన మీకు, 

నేనెవరో తెలియకుండానే మీ ముందు పరిచిన ఈ పిచ్చి వాడి మనసును మీరు తొక్కేస్తూ వెళ్ళి పోతారేమో నన్న బెంగే నన్ను మీ ముందు వ్యక్త పరుచుకోనివ్వకుండా ఆపింది, కాని నన్ను నేను వ్యక్తపరుచుకోకుండా మీకు నేనెలా తెలుస్తాను? తెలియకపోతే నా హృదయం మీకెలా అర్ధం అవుతుంది.... నా ప్రేమ మీ వెంబడి తిరిగే అనేక కోట్ల చూపులలోని ఒకటి కాదు.... దానికొక రంగు, రూపం, మాధుర్యం వుంది అది మీకోసమే పుట్టింది  మీతోనే జీవితాంతం తోడుంటుంది అని మీకెలా చెప్పాలో తెలియక సతమతమవుతూ చేసిన ఒక చిన్ని ప్రయత్నమే ఈ వుత్తరం. నా హృదయం లోని ఒక చిన్ని భాగాన్నైనా మీ ముందు ఈ ప్రయత్నం లో పంచుకోగలిగితే చాలు...

వసంతం అనేది ప్రకృతి అందరికి సమానం గా ముందు వుంచినా దానిని చూడగల, అనుభవించగల రసజ్ఞులకే  ఆ వసంతోద్వేగం అనుభవైకమవుతుంది... మీరూ అందరి తో పాటు అందరిలానే తిరుగుతున్నా మీ వునికి కలిగించగల ప్రత్యేకత  ప్రతి క్షణం నాకు మాత్రమే పరిమితమవుతోంది.

వాల్చిన కనురెప్పల వెనుక సాగే హిందోళం,  అలవోక గా ఎత్తి చూసినప్పుడు సాగే దీపక రాగం, నవ్వినప్పుడు వినిపించిన సింధు భైరవి, కనుబొమ్మలు చిట్లించినపుడు మధ్యమం లో సాగే కల్యాణి, మీరు ఏదో ఆలోచిస్తు దిగులుగా మార్చిన ముఖ కవళికలలో పుట్టే గాంధారం... ఇన్ని రాగాలను ఇముడ్చుకున్న మీరే ఒక కృతి లా అలవోక గా తేలివచ్చే రాగమల్లే నా మనసును దోచిన ఏ నిమిషాన్ని మీకు ప్రత్యేకం గా చెప్పగలను  చెప్పండి, నేనే మీరై ఆ రాగాలాపన లో కరిగిపోయిన క్షణాలను  చెప్పగలను కాని. మీరు నన్ను అసలు గమనించి ఐనా వుంటారని నేను అనుకోవటం లేదు కాని నా చూపు మాత్రం అనుక్షణం మీ వెంట మీ నీడ లా మీ వెనుక సాగే నా శ్వాస లా తిరుగుతోంది... మీకు నాకు రెండే గోడలు అడ్డం భౌతికం గా, కాని మీ మనసును నేను అందుకోవటానికి ఎంత దూరమో నాకు తెలియటం లేదు...

క్రిష్ణవేణల్లే సాగే మీ కేశాల మధ్య చిక్కిన చేమంతి ని అలవోక గా తీస్తూ మీ స్నేహితురాలితో మీరు "నల్లని కృష్ణయ్యను బంగారు వన్నెల రాధమ్మ వదలటమే లేదే"  అంటే నాకెంత ఆశ్చర్యమయ్యిందో  అరె ఈమె నా మనస్సెలా చదివేరు అని  అంతకు ముందు రోజే మీరు జారుతున్న జాజి పువ్వు ను ఆపి దాని స్వస్థానానికి చేరుస్తున్నప్పుడు అనుకున్నా, "బిర బిరా సాగే క్రిష్ణమ్మ నీలి కెరటం మీద మెరిసిన వెండి నురుగల్లే ఆ జాజి కెంత అదృష్టమో విడకుండా ఆమే తోనే వుంటోంది కదా" అని.

ప్రతి రోజు మూసుకున్న కనురెప్పల వెనుక సాగే నా కలల రాజ్యం లో మహా రాజ్ఞి ని సెలవడిగి కనులు తెరిచిన ఘడియ... ఆమె నా హృదయ సామ్రాజ్ఞి గా కనురెప్పల మాటు నుంచి గుండె చప్పుడు తో కలిసి నా జీవితానికొక అర్ధాన్ని జీవన మాధుర్యాన్ని నింపుతోంది... ప్రభాతాన వినిపించే తిరుప్పవై లో గోదా దేవి కృష్ణుడికోసం పడిన తపన ఆ కృష్ణుడి  మనసులో కలిగించిన భావమేమో తెలియదు కాని ఈ కృష్ణుడి మనసులో ఆలోకించినా..... అవలోకించినా..... మీ మీద ప్రేమ కోటానుకోట్ల నా భావాలను " ప్రేమ" అనే ఒకే పదం గా మార్చి అన్ని వేదాలను ఓం కారం లోకి ఇమడ్చగలిగిన ప్రణవనాదం లా మోగుతొందది......

వెన్నెలా, చీకటి.... మీ రూపును లోని లావణ్యాన్ని, మీ కాటుక కంటి మెరుపును కలిపి గుప్పెళ్ళ తో నా మీద కుమ్మరిస్తున్న ఈ క్షణం, ఇలా ఈ వెలుగు నీడలు కలిపిన కొబ్బరాకు మాటున జారగిలబడి మీకు రాసే ఈ వుత్తరం, మీ దాకా పంపే ధైర్యం నాకెప్పుడూ వస్తుందో... మీరు అన్ని ఆఫీస్ కాగితాలలానే దీక్ష గా తల వంచి చదివి తలెత్తి మీ పక్కన ఆమె  తో, చూసే వా ఈ పిచ్చోడు ఇలా నన్ను గమనిస్తున్నాడన్నమాట  నాకు తెలియకుండా అందుకే నాకు ఈ మొగవాళ్ళంటె చిరాకు స్త్రీ కు తనదైన క్షణాలను అనేవిలేకుండా మింగేస్తారు ఈ వీక్షణ బకాసురులు అని కాగితాన్ని వుండ చేసి చెత్త బుట్టలో వేసేస్తారేమో అని ఒక భయం (మీరు లంచ్ లో మీ స్నేహితులతో మొగవాడూ వాడి ధాష్టీకం అని నిప్పులు కురిపిస్తున్నప్పుడు నేను అక్కడే మంచినీళ్ళు తాగుతు వింటున్నా మీరు గమనించి వుండరు)

నేను అలాంటి వాడిని కాదు అని అందరి లా చెప్పాలన్నా భయం వేస్తోంది కాని నేస్తామా.... స్నేహ హస్తమందిస్తానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రేమ పిపాసి ని మీరు మొదటే అనుమానాస్పందం గా కాకుండా కేవలం ఒక స్నేహితుడి గా పరిచయస్తుడి గా మీ  జీవన యాత్ర లో మీతో పాటు కలిసి  కొన్ని క్షణాలను పంచుకునే అవకాశమిస్తే నా ప్రేమ మిమ్ములను గెలుచుకోగలదు అనే ధైర్యం తో  మనసు మీదే మూగే ఆలోచనలను వెనక్కి నెట్టి మీకు ఈ వుత్తరం పంపిస్తున్నా... రెండు గోడల అవతల మీ హెలో కోసం ప్రతి క్షణం వెయ్యింతల భారమై వాటిని మోయలేక.... మోస్తూ..... చూస్తున్నా....

ప్రస్తుతానికి
మీ స్నేహితుడు కావాలని ఆశిస్తున్న,
కృష్ణ.

18 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఇది ఏదో తేడాగా వుంది. నేను చదవటంలోనే, లేక అర్థం చేసుకోవటం లోనో..మళ్ళీ రేపు వస్తా (నిద్రమత్తు ఒదిలి)...

Kathi Mahesh Kumar చెప్పారు...

మరీ భావుకత-ఫూలిష్ రొమాంటికతా కలగలిపి ఎక్కువయినట్లు లేదూ!

sunita చెప్పారు...

Baagundi.

Rajasekharuni Vijay Sharma చెప్పారు...

ఒక అమ్మాయి అబ్బాయి మనసును అంచనా వేస్తూ రాసిన ఈ ప్రేమ లేఖ బాగుంది. మి పేరుకు తగినట్టుగా మధుర భావ భరితంగా ఉంది.

జయ చెప్పారు...

బాగుంది ఈ ప్రేమలేఖ. ప్రేమ పిపాసి భావాలు ఇంకా బాగున్నాయి. చాలా అందమైన భావాలు. కలలో కూడా ఊహించని అందాలు ఈ లేఖలో కనిపిస్తున్నాయి.

శ్రీలలిత చెప్పారు...

నాకింకా ప్రియమైన మీకు,
వద్దూ..వద్దూ అనుకుంటూనే వదలకుండా చదివా నీ లేఖని. మనసుని మల్లెల పందిరి చేసి, దానిపై మాలతీ లతను పాకించి, ఆ పూలపై "ఝ్హూమ్" అంటూ గింగిరాలు కొట్టే తుమ్మెద శబ్దానికి చిన్ని సుమబాల ఎలా కదలిపోతుందో అలా అల్లలాడిపోయా. కాని అదేమిటో ఆ వింత అనుభూతి ఎంత బాగుందో. వద్దు వద్దని పైకి అంటున్నా వద్దన చేరితే ఎంత బాగుండునో అనిపించింది.
"మగవారికి మగువలెపుడు దూరముగా మెలగాలని..." అని ఏనాడో పెద్దలు చెప్పారని నలుగురిలో పైకి అలా మాట్లాడతాం కాని నిజానికి అసలు సంగతి మీకూ నాకూ తెలియనిదా. మనసు చదవగలిగేవారికి భాష అవసరమా...?
కృష్ణ కి స్నేహితురాలు కావాలని ఆశించే (ఇంకెవరు) రాధే...

వేణూశ్రీకాంత్ చెప్పారు...

భావన గారు, ఉదయం నుండీ ఓ నాలుగు సార్లు ఇటు వచ్చి ఉంటానండీ... బాగుంది అని ఒక చిన్న పదం తో సరిపుచ్చలేక... మరింత వివరంగా ఇంకేమి చెప్పాలో తెలీక సతమవుతున్నాను. కౌముది లో లేఖ పూర్తిగా చదివాను చాలా బాగుంది.

మొన్న ఏదో బుడుగుకి లేఖల పాఠాలు నేర్పుతానన్నారు కానీ, ఎన్ని పాఠాలు చదివినా ఎంత నేర్చుకున్నా ఇంత భావుకత తో నిండిన లేఖలు నే ఎప్పటికైనా రాయగలనా అనిపిస్తుంది. ఆహా హా నేను గురువిణి గారి సామర్ధ్యాన్ని ఏమాత్రం సందేహించడం లేదండోయ్ :-) నా సందేహం నా ఆలోచనా శక్తి మీద మాత్రమే.

మురళి చెప్పారు...

విజయ్ శర్మ గారు అన్నట్టుగా ఒక అమ్మాయి అబ్బాయి మనసుని ఊహిస్తూ రాసిన లేఖలా ఉందండీ.. కాకపొతే ఆ అబ్బాయి మరీ టీనేజ్ అబ్బాయిలా అనిపిస్తున్నాడు నాకు.. పదాల పొందికలో అతి సున్నితత్వం చూపించడం వల్లనేమో...

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

నిన్నరావటానికి కుదరలేదండీ, ఇంతకీ మీరెప్పుడైనా అబ్బాయిల ప్రేమలేఖలు చదివారా? :p

పరిమళం చెప్పారు...

ఇంతకూ అప్పటి ఆ ప్రియతముడు ఇప్పటి మీ జీవన సహచరుడే కదూ :)

భావన చెప్పారు...

భా. రా.రె: తేడా గా వుందా? ఏమిటో చెప్పవచ్చు కదండీ... మరీ కవితాత్మకత ఎక్కువ అయ్యిందా. వెర్రి తనం అబ్బాయి లో కొంచం మారాకులు వేసిందా? ;-)

మహేష్: ఎక్కువ ఐన ఒక సెటిమెంటల్ అబ్బాయి ని చూపించాలనే నా ప్రయత్నం. అమ్మయ్య నేను చేసిన ప్రయత్నం ఫలించినట్లే మీకు అలా అనిపించింది అంటే. ధన్యవాదాలు.

సునిత: టాంక్ యూ మేడం..

భావన చెప్పారు...

విజయ్ శర్మ గారు: అవును కొంత వరకు సాహసమే అమ్మాయి అబ్బాయిని ప్రెజంట్ చెయ్యటం... అందులోను అంతరంగిక వుత్తరాలలోని భావాలను చెప్పాలనుకోవటం. ఈ కృష్ణ గీతం లో అక్కడక్కడా చేసేను ఆ సాహసం.. మీకు నచ్చినందుకు ఎంతో సంతోషమండీ. ధన్యవాదాలు

జయ: ప్రేమ అనే భావం లో అందమే అది కదా.. బాగుంటుంది కదు అబ్బాయి లు కూడా ఇంత లలితం గా భావ వ్యక్తీకరణ చేస్తే... అరుదు కాని మృగ్యమైతే కాదు ఇటు వంటి వాళ్ళు అనుకుంటున్నా ఏమంటారు..

లలితా: బలే రాసెసేరు అండి. బాగుంది ఈ సారి మీ లేఖ కొంచం కాపీ కొట్టేసుకుంటాను. ఈ సారికి మాత్రం అమ్మాయి కొంచం వేరు గా సమాధానం చెపుతుంది ఏమనుకోవద్దే...

భావన చెప్పారు...

వేణూ: భావుకత ఎవ్వరి సొంతం కాదు.. బుడుగు చెయ్యలేనిదేమిటి...? మీరేమి ఆలోచించకండీ.. రాయవలసిన టైం వస్తే మీరే ప్రెవేటు పెట్టేస్తారు.. ;-) ధన్యవాదాలు.

మురళి: అబ్బాయి లో మరీ అపరిపక్వత కనపడుతోందా...! సరే అమ్మాయి కూడా అదే ఫీల్ అవుతున్నట్లు వుంది.. అదే చెపుతుంది చూడండి... ;-) ధన్యవాదాలు.

భావన చెప్పారు...

భా. రా. రె: హ హ హ.. బలే అనుమానం వచ్చిందే మీకు .. ఐతే అబ్బాయి లు అలా రాయరంటారు ఐతే... ఎక్కువ కాదు కాని చదివేను అబ్బాయిల ప్రేమ లేఖలు... ఎక్కువ కాదు కాని ఇంత కంటే భావుకత్వం వున్నవి కూడా... మా కాలమప్పుడు మేము ఇలానే రాసుకునే వాళ్ళం మరి... ;-)

పరిమళం: మీరు చాలా అమాయకులండి... లేదండి పైన భా. రా.రే గారి సమాధానం చూడండి :-(

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

భావన గారూ సరదాకే అన్నానండోయ్. కోపగించవద్దండీ. ఇక టపా విషయానికొస్తే నచ్చలేదనికాదు కానీ అబ్బాయి వ్రాసే ప్రేమ ఉత్తరాల్లో భావుకత పాళ్ళు తక్కువ, ఆ పాళ్ళు కొద్దిగా ఎక్కువ వుంటాయేమో అని అంతే :)

ఇకపోతే మీ కాలం అంటున్నారు, మీరేమన్నా క్రీస్తుపూరవమోళ్ళా? మహా అయితే ఓ రెండుమూడేళ్ళు అటో ఇటో అంతే :)

మరువం ఉష చెప్పారు...

భావన, మరీ ఆలస్యంగా వచ్చాను. మతి కాస్త తప్పి మరువపు వనంలోనే తచ్చాడిన తప్పిదం :( కానీ నా స్పందన టపాగా వ్రాస్తాను. అంతగా ఎద కదిలింది. మరల వస్తాను నేస్తం.

Hima bindu చెప్పారు...

ఎన్ని సార్లు చదివానో !

భావన చెప్పారు...

@భ.రా.రే కోపమెందుకు. వూరుకూరికే కోపమెందుకండి.. మా అబ్బాయి లా చెపుతున్నారే ,వాడు అంటాడు అమ్మా ఎప్పుడు అంత ఓల్డ్ గా ఆలోచిస్తావు వున్నట్లు వుండి నాకు లా ఆలోచిస్తావు you are weired అని. ;-)

@ ఉషా. ఎదురుచూస్తుంటాము నీ టపా కోసం. నేను గుర్తు చేస్తాను లే నువ్వు మర్చి పోయినా..

@ చిన్ని: థ్యాంక్స్ చిన్ని, భ.రా.రే చూడు మీరెప్పుడు అబ్బాయి ల లేఖలు చదవలేదా అని ఏడిపిస్తున్నాడు.. :-(