23, అక్టోబర్ 2009, శుక్రవారం

పరిచయమయ్యే ప్రేమలేఖ...కృష్ణా,

మీ వుత్తరం చదవగానే నాకు కలిగిన మొదటి భావం ఆశ్చర్యం.. మీ ప్రేమ గురించి కాదు దానిని మీరు వ్యక్త పరిచిన విధానాన్ని చూసి....... ఆనంద భైరవి ఆలాపన అనంత గాంధారం లో ప్రయోగం చేస్తున్నట్లనిపించింది మీ వుత్తరం చూస్తుంటే... ఎవరికైనా వాళ్ళను పొగిడితే బానే వుంటుంది కదా.. :-)

ఇక మీ వుత్తరం లోని విషయానికి వస్తే... మీ అబ్బాయిలందరు అనుకుంటారు మేము చాలా బాగా వీక్షిస్తున్నాము అమ్మాయిలను వాళ్ళకు తెలియకుండా అని కాని మీకు తెలియని విషయం ఏమిటి అంటే, అమ్మాయిలకు ఈ తీక్షణ వీక్షణాల గురించి కొంచం స్పృహ ఎక్కువ గానే వుంటుంది... మీరు నన్ను గమనిస్తున్నారనేది నాతో పాటు మన ఆఫీస్ లో వున్న ఆడ వాళ్ళందరికి ఇంకా కొంచం మంది మొగవాళ్ళకు కూడా తెలుసనుకుంటా, ఆ విషయమే ఇంకా మీకు తెలియదనుకుంటా.. 

మాస్టారు....నా జాజి పువ్వు తో పాటు మీరు కూడ సగం పైగానే వంగేరు అది ఎక్కడ నేల మీద పడుతుందో అన్నట్లు కాని మీకు, నాకు అప్పుడు నాలుగు టేబుల్స్ దూరం వుంది అని ఆ రూం లో అందరు గమనించేరు మీరు తప్ప... మీరన్నది నిజమే అనుక్షణం ఒకరి చూపు వెంటాడే విహంగమల్లే మన చుట్టూ తిరుగుతుంటే ఇబ్బంది గానే వుంటుంది అలా అనుకోవటానికి పెద్ద ఫెమినిస్ట్ అయ్యే వుండనక్క ర్లేదు నిజం గా చెప్పాలంటె అవును మీ చూపు నన్ను ఇబ్బంది పెడుతూనే వుండేది...

మీ ప్రేమ శీతల సమీరమల్లే, ప్రత్యూష పవనమల్లే సుఖాన్నే కాదు గ్రీష్మ తాపమల్లే ఇరుకున పెట్టిన క్షణాలు ఈ రెండు సవత్సరాలలో చాలానే వున్నాయి... హ్మ్మ్ మొత్తానికి చివరకు ఎలా ఐతే ధైర్యం చేసి... చూపు చురుకు హెచ్చి, కనులలోని మాట కాగితం మీదకు వచ్చింది... క్రిష్ణా నాకు ఏమని చెప్పాలో తెలియటం లేదు... మీరు ఎంతో ప్రేమ గా మీ భావాన్ని జాజుల జల్లెడ వేసి గంధాల, సుమ భందాల మాలికలల్లి నా ముందు పరిచేరు నేను తప్పకుండా అర్ధం చేసుకోగలను మీ భావాన్ని, ప్రేమైక అనుభవాన్ని....  ఇలాంటి క్షణమేదో వస్తుందని అనుకుంటూనే వున్నా సమయం వచ్చేసరికి పదాన్ని కూర్చటానికి కొంచం కష్టం గానే వుంది...

ప్రేమ వేరు (మీరనే ప్రేమ), జీవితం వేరు.... ప్రేమ జీవించటానికి అవసరమయ్యే ఒక సాధనమే కాని ప్రేమే జీవితమంటే ఏమో నాకు నమ్మకశ్యం గా వుండదు... క్షమించాలి ఇది నా అభిప్రాయమే.

నిన్ను నీవు మర్చి పోయి ఆలపించే రాగం లో కూడా తాళం తప్పటం అనే అపశ్రుతి దొర్ల కుండా అను నిత్యం నువ్వు జాగ్రత్త పడుతూనే వుండాలి,  "ఎంత గొప్ప రాగమైనా తాళం జతులతో కలిసినప్పుడే సంపూర్తి అవుతుంది" అనేది ఒక అభిప్రాయమైతే దానిని వేర్వేరు వ్యక్తులు వేర్వేరు కోణాలలో చూడ వచ్చు... మీరు దానిని " ప్రేమ నీతో కలిసి జీవితాన్ని పంచుకున్నప్పుడే దానికి సార్ధకత అలా సాగే జీవితమే జీవితానికి, జీవనానికి అర్ధం" అనొచ్చు... మరి నేనేమో "ప్రేమ అందరి తో కలిసి పంచుకున్నప్పుడే... నీ తోటి వాళ్ళకు, అవసరమైన ప్రతి వ్యక్తి కి వివిధ రూపాలలో అందించి జీవితమనే రాగాన్ని స్నేహం, పంచుకోవటం అనే వాటితో కలిపితేనే సమిష్టి సమాజం గా  సంపూర్తి అవుతుంది" అనొచ్చు..

మీకు అర్ధం అవుతోంది అనుకుంటా... అలా అని జీవితం లో సహచరుడి తోడు, దాని విలువను నేను కాదనటం లేదు. ప్రేమ అనేది మొదలు "మన" అనే కుటుంబం తోనే మొదలవ్వాలి, కుటుంబం లో ప్రేమ, సహజీవనం అనే దానిని సాధించలేక పోతే బయట ఏమీ సాధించలేము.. మీరు నా మీద చూపిస్తున్న పెంచుకుంటున్న ప్రేమ నాకు చాలా సంతోషాన్నిస్తోంది, అది ఒక బంధమై.... నాకు బలాన్ని, ముందుకు కలిసి సాగే భవితవ్యాన్ని ఇవ్వాలి కాని..... ప్రేమ ఒక బంధమై, నే చూసే చూపు కు ఒక ప్రతి బంధకమవ్వ కూడదు అని నా ఆశ...

ఇంక ఇంత కంటే ఏమి చెప్పాలో నాకు అర్ధం అవ్వటం లేదు కాని మీ ఆలోచన బాగుంది క్రిష్ణా మనం కలిసి సాగి స్నేహితుల లా నచ్చిన పరిచయస్తులకు లా తప్పకుండా వుందాము. చూద్దాము కాలమే నిర్ణయించని ఆ పరిచయ ప్రభావం మిమ్ములను నన్ను ఏ దారి వైపు తోసుకుని వెళుతుందో... ఈ రోజు సాయింత్రం పని అయ్యాక రెండు ఆహ్వానాలున్నాయి నాకు ఒకటి రంగనాథన్ స్మృత్యర్ధం సాగే మృదంగ వాద్య సభ, ఇంకోకటి ఆధునిక రచయతల మీద గోపిచంద్ ప్రభావం.... మీరు వస్తానంటే నా కైనటిక్ వెనుక సీట్ ఖాళీనే .....:-)

విరాజిత.

19 కామెంట్‌లు:

తృష్ణ చెప్పారు...

ఇదిగో నే వస్తా..నన్నెక్కించుకోరు...

బావుంది..బాగా రాసారు.

sunita చెప్పారు...

chaalaa chakkaTi praemalaekha!!enni oohaloo, enni oosuloo!!

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

తృష్ణగారూ!వాళ్ళను వెళ్ళనివ్వండి,మధ్యలో మనమెందుకు పానకంలో పుడకలాగా! :)

జయ చెప్పారు...

భావన గారు ఎంతో బాగుంది. ప్రేమ అనేది మొదలు "మన" అనే కుటుంబం తోనే మొదలవ్వాలి, కుటుంబం లో ప్రేమ, సహజీవనం అనే దానిని సాధించలేక పోతే బయట ఏమీ సాధించలేము.... ఇది అక్షర సత్యం. ఏ ప్రేమ అయినా కుటుంబసహకారం తో కలకాలం జీవం పోసుకుంటుంది. నిజమైన తృప్తికి దారితీస్తుంది.

మురళి చెప్పారు...

అమ్మాయి కొంచం ప్రాక్టికల్ అన్న మాట.. మామూలుగా అమ్మాయిలు భావుకత్వంగా, అబ్బాయిలు ప్రాతికల్ గా ఉంటారన్నది జనరల్ ఒపీనియన్ కదా.. బాగుందండీ లేఖ, ఎప్పటిలాగే..

పరిమళం చెప్పారు...

ఐతే ఆ తర్వాత ప్రేమ పండినట్టే .....ముందు స్కూటీ వెనుక సీటు ..తర్వాత హృదయంలో చోటు :)

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

భావనగారూ,
ఈ ప్రేమలేఖ భలే వుందండి. ఇలా అందరు అమ్మాయిలూ తమ కైనటిక్ వెనుక సీట్ ఖాళీగా పెట్టుకుంటే హ్యాపీగా ఏ స్కూటీ కావాలంటే అది ఎక్కేయొచ్చు :)

Jokes apart,
ఇంతకు ముందు టపాలోను ఇందులోనూ ముఖ కవళికలను,మనోభావాలను రాగాలకు అనుసంధానించి వ్రాసారు. మీరు ప్రొఫెషనల్ సింగరా? ఏమైనా పాడినవి వుంటే మాతో పంచుకోవచ్చుగా?

శ్రీలలిత చెప్పారు...

భావనా, మీరన్నది నిజం. అమ్మాయి సమాధానం అబ్బాయి చెప్పినంత భావుకంగా లేదు. కాని నాకు ఈ సమాధానం నచ్చింది. అమ్మాయిలు కూడా అంత తొందరగా భావోద్వేగానికి లోబడరని అందంగా చెప్పారు. ఈ రోజులని బట్టి ప్రతి ఆడపిల్లా ప్రాక్టికల్ గా ఆలోచిస్తోంది. అది మంచి మార్పు.
ఆడపిల్లలకి వాళ్ళ హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తుంటాయని అందంగా చెప్పారు. పరిచయానికి, స్నేహానికి, ప్రేమకి తేడా ఉందని, ప్రేమని తన చుట్టూ ఉన్నవాళ్ళకి అందరికీ పంచినప్పుడే అది విశ్వప్రేమ అవుతుందన్నట్లు చెప్పారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న మాటని మరోసారి గుర్తు చేసారు. అభినందనలు.

నేనైతే ఇలా రాస్తాను..
ఓ కృష్ణా,
యమునాతీరాన సంధ్యా సమయాన వేయికనులతో నీకై వేచే ఈ రాధ..
ఆలస్యంగా కలియుగంలో భావనగా పుట్టి, అందమైన రాధాకృష్ణుల ప్రేమని విశ్వప్రేమ గా మార్చేసి, నీది ప్రేమా, లేక వట్టి పరిచయమా అదీకాక స్నేహమా అని హేతుబధ్ధంగా ఆలోచిస్తూ తలనొప్పి తెచ్చుకుని, అది తగ్గడానికి సాయంత్రం సంగీతకచేరీకి వెడదామా లేక సాహిత్యసభలకి వెడదామా అని నిన్ను తోడుగా రమ్మంటోంది.
ఓహో..విరాజిత అనాలేమోకదూ..

Malakpet Rowdy చెప్పారు...

Too good!

భావన చెప్పారు...

పొద్దుట నుంచి ఎదురు చూస్తున్నా వస్తారని. ఇదుగో వస్తున్నా అన్నారు తృష్ణా.. ఇది అన్యాయం అసలే మన విరాజిత కు ఒఫిక తక్కువ.:-) ధన్య వాదాలు.
@ సునీత: వూహల, వూసుల కలబోతే కదా మరి లేఖలంటే, అందులో ప్రేమ లేఖ అంటే... ధన్య వాదాలు.
@ విజయ మోహన్ గారు: మీరు కూడానా.. అమ్మా.. :-) ధన్య వాదాలు

భావన చెప్పారు...

@ జయ: కదా.. అందుకే అంటారేమో సామెత. "ఇంట గెలిచి రచ్చ గెలవమని". ధన్యవాదాలు.
@ మురళి: అవునండి రొటీన్ కు కొంచం భిన్నం గా.. కాని అంత భావుకత్వం వున్న అబ్బాయి లు వుంటారు అండి. వుండరంటారా? ధన్య వాదాలు
@ పరిమళం: ఆగండి ఆగండి అంత తొందరైతే ఎలా ఈ కాలం అమ్మాయి ల స్కూటీల వెనుక సీట్ తో కధ మొదలు... పూర్తి కాదు..

భావన చెప్పారు...

@ భ.ర.రె: అబ్బ ఆశ దోసె, అప్పడం, వడియం. ఎక్కేద్దామనే స్కూటీలు.. ఎక్కించుకునే ముందు చాలా ఫిల్టరింగ్ వుంటుందమ్మా.. మరి ఆ ఫిల్టరింగ్ లో ఒక్కళ్ళకోసం నిలబడే సరికి జీవితం ఐపోతుంది ఇంకా ముల్టిపుల్ చాయస్ లు లేవు బాబు.
లేదండి నాకు సంగీతం రాదు. వినటం తో ఆఖరు మన కళాభిరుచి. నాకు సంగీతమన్న నాట్యం అన్నా ప్రాణం, ఏదైనా పర్లేదు శాస్త్రెయమైన, సినిమా ఐనా, జానపదమైనా, చివరకు భజనలైనా సరే రాగ యుక్తం, భావ యుక్తం ఐతే చాలు.. ఇక్కడ మాకు M.I.T లో MITHAS వాళ్ళు పెట్టే వేటిని వదలను నేను.. పాటల విషయం లో.. "ఇల్లే సంగీతము, వంటిల్లే సాహిత్యం ఈ పిల్లలే నా సాధనం ఇంక వింటార నా గానం"

భావన చెప్పారు...

@ శ్రీ లలిత: ఎంత నిజం కదు ఎల్లలు లేని ప్రేమ ప్రపంచాన్ని నింపుతుంది అంటూనే ప్రేమను విడ గొట్టి హేతు బద్దత ను కలిపి ఆలోచనలకు లొంగని భావాన్ని తెలిసిన తర్కం లోకి నింపాలని ప్రయత్నించి తల నొప్పి తెచ్చుకుంటోంది అమ్మాయి. ;-) నేను రాసినప్పటి మూడ్ అంత బాగా మీ కలం నుంచి ఎలా వచ్చిందమ్మా.. అధ్బుతం.. అదేనేమో కదు ప్రేమ గొప్పతనం.. భావమేదైనా భావన ఎవరైనా.. స్పందించే మనసులలో మాత్రం ఒకే రూపం పొందుతుంది కదా... ఆప్యాయం గా చేతిని తీసుకుని అంతరంతరాలలో పొంగే ప్రేమ ను ఒక చిన్ని స్పర్శ ద్వారా నో కంటి చూపు ద్వారానో చెప్పలేను కాబట్టి ఈ కీ బోర్డ్ మీద్ నాట్యం చేసే వేళ్ళ కొనల నుంచే గ్రహించగలరని ఆశిస్తున్నా..

భావన చెప్పారు...

@ రౌడీ గారు: ధన్య వాదాలండి నచ్చినందుకు ( ఇంతకు too good అంటే నచ్చినట్లేనా?? :( )

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

MITHAS (SAH-T-IM) పేరు బాగుంది. ఓ మీరు పాడే సంసార సరిగమలు మేము వినడానికి రెడీ.. పాడాలేగానీ ఏదైనా వింటాం :)

మరువం ఉష చెప్పారు...

భావన, చివరి నుండి రెండొ పేరా పదం పదం నేను ఒకసారి కాదు పదిసార్లు పలికానిప్పటికి జీవితంలో. త్వరలో మళ్ళీ వచ్చి నా నిజ స్పందన వ్రాస్తాను. ప్రస్తుతానికి సెలవ్.

మాలా కుమార్ చెప్పారు...

భావన గారు ,
మీ ప్రేమ లేఖ బాగుందండి .ఇంతమంది ఇంత చక్కగా చెపితే నేను సింపుల్ గా బాగుంది అంటే పేలవముగా వుంది కాని , నేను నంతబాగా భావాన్ని వ్యక్తీకరించ లేనండి .

Hima bindu చెప్పారు...

జీవిస్తున్నారు -:)...చాల బాగుంది ప్రతి వాక్యం.

భావన చెప్పారు...

భ.రా.రే. మీ చమత్కారం బాగుంది MITHAS ను SAH-T-IM చేసేరు.. మంచి ఆర్గనైజేషన్. మీరు వినటానికి రడీ కాని నేను పాడటం మొదలు పెడితే అపశ్రుతులు ఎక్కువ వినిపించి మిమ్ములను ఇబ్బంది పెట్టటం ఎందుకని పాడను.
@ఉషా అన్ని సార్లు పలికావా ఏమా కధ మాకు చెప్పాలి మరి.. ;-)
@ మాల గారు: బహుకాల దర్శనం ఎప్పుడో కాని రారు మహానుభావులు నా బ్లాగ్ లోకి. మీరు చెప్పింది చక్క గానే వుంది.. మనస్పూర్తి గా మీరు ఇచ్చే అభినందన కంటే చక్కనైనది ఏమి వుంటుంది అండి, మీరు భావాన్ని వ్యక్తీకరించలేరా మరి అదే జోకులంటే... :-)
@ చిన్ని: ధన్య వాదాలు.. వర్తమానం తో పాటు... వూహలో , జ్ఞాపకం లో,అనుభవం లో, ఆలోచనలో.. ప్రతి క్షణం జీవించటం తప్పదు కదా ఫ్రెండ్ ..