10, అక్టోబర్ 2009, శనివారం

ఒంటరి తోడు...


కృష్ణా,

ఎక్కడ నుంచి ఎక్కడికి పాకుతున్నాయో తెలియని ఈ ఆలోచనలు పాదరసం కంటే పదునైనవి, అవనీతలం కంటే బరువైనవి అని నా అనుభవం నాకు నేర్పిన పాఠాలు. .. జీవితం నేర్పించిన ఎన్నో పాఠాలలో ఇది ఎన్నవది అని అడగకు...ఎన్నైనా ప్రతి సారి కొత్తే... మరీ వుత్త బుర్ర తక్కువది నీ ఈ శిష్యురాలు ఏమి చేస్తాము చెప్పు...

రోజు ఎన్నో విషయాలు.. ప్రపంచం దృష్టి లో ఏ మాత్రం ప్రాముఖ్యం లేనివి, మనకు మాత్రమే ఎంతో విలువైనవి నీకు ఎన్నెన్నో చెప్పాలనుకుంటానా... రోజంతా ఎలా గడుస్తుందా నిన్ను చూసిన క్షణమే అవి అన్ని ఎలా పంచుకోవాలా అని ఆలోచించి సందె మబ్బు ముసిరే చీకటి పొద్దు మొదలవ్వగానే, అన్నిటిని ఒక క్రమం లో పదాల మాలికలల్లి చిరుమల్లెలలో కలిపి కదంబం చేస్తుంటాను. ఏమి లాభం నువ్వు రాగానే అన్ని మాటలు ఒక్కసారి ఫక్కుమని నవ్వి విరిసిన మల్లెలలో కలిసి పోతాయో ఏమి పాడో ఒక్కటి గుర్తు వచ్చి చావదు. నువ్వేమో "అందరితో ఎప్పుడు చూసినా పెదవి మీద పెదవి ఎక్కనివ్వకుండా మాట్లాడుతూనే వుంటావు. నన్ను చూస్తే ఏమిటి హఠాత్తు గా మూగ పిల్ల వైపోతావు" అని ఏడిపిస్తావు. ప్రపంచానికి నేనెవరైనా, ఏమైనా నీకు మాత్రం ఎప్పటికి ఈ మూగ పిల్లలానే నిలిచి పోతాననుకుంటా.

కృష్ణా నీవే కదా అని పాడే గొంతులోని మధురిమై పోతావో ఏమో ఒక్కోసారి నువ్వు...నీతో మాట్లాడుతుంటే ఎన్నెన్నో అవ్యక్త రాగాలు చప్పున మదికి మెరుపల్లే తోచి మాయమవుతాయి. నీతో కలిసి అడుగు వేస్తున్నప్పుడు కొబ్బరాకు కొనల సవ్వడులే ఆ మాయమైన రాగాలను ఎన్నో స్వరాలతో కలిపి వినిపిస్తుంటాయి. నిన్ను చూస్తుంటే కదిలే మదిలో భావాలన్నీ నేను ఎప్పటికైనా ఒక పదం లో పెట్టగలనో, ఒక పాదం లో కూర్చగలనో లేదో తెలియదు కాని... నా నేస్తమా, నా ప్రాణమా ఈ రోజు శ్వాస పలికే ఈ అనాచ్చాదిత భావం నీకోసం పంచటానికి ప్రయత్నిస్తున్నా, పంచకపోతే ఇది నన్ను వుక్కిరి బిక్కిరి చేసేస్తోంది మరి......

రాత్రి ఎందుకు అందరు నిద్ర పోతారో నాకు అర్ధం కాదు. "అందరికి నిద్ర పోయినా జీతాలిచ్చే వుద్యోగాలు వుండవమ్మా అందుకని ఇప్పుడే నిద్ర పోతారు మరి" అని నువ్వు అన్నప్పుడూ కోపం తో చిర చిర లాడేను కాని, నిజమే కదా.... ఐనా నువ్వు ఎంత చెప్పినా ఈ బానిస వుద్యోగాలు, ఈ తల తాకట్టు పెట్టి తెచ్చుకునే జీతాల కంటే వాటిని వదిలి నీకోసం నిదుర కాగ గల రాత్రుల కోసం చూడటమే ఇష్టం. రాత్రులే మరి విరజాజులు మాట్లాడతాయి. ఆ మాటలే నీవు వున్నప్పుడు ఏమి చెప్పాలో తెలియదు, నీవు లేనప్పుడు ఎంత రాసినా తనివి తీరదు.

రాత్రి ఎంత అందమైనది కదు...
ఒంటరి గా కిటికి పక్కన కూర్చుని నీకు వుత్తరం రాస్తూ వుంటే బయట వరండాలో కట్టిన చిరుగంటలు... వాన తో కలిసి వచ్చే గాలితో జత కూడి, రాత్రి పాడే ఈ మౌన రాగానికి వురుములతో పాటు దాని వంతు గా అది కూడా తన గొంతు అరువిస్తోంది. తల పక్క కు తిప్పి చూస్తే పక్క మీద నువ్వు నిద్దరోయే చోటు గుబులు గా , కూసంత దిగులు గా నా వైపే చూస్తోంది. అబ్బ ఈ జీవితమంతా నీ కోసం ఎదురు చూస్తు వుండటం తోనే సరి పోతుందనుకుంటా.. పక్కనే జానకి హృదయం తో కామోలు పాడుతోంది "కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని" అంటు. నిజమా కృష్ణా...

ఇంకో జన్మ కావాలా నే కోరుకున్న జీవితం నీతో గడపటానికి.. కావాలేమో... మన పెళ్ళి లో అందరు నన్ను అభినందనల పరంపర లో ముంచేసేరు. " నువ్వు చాలా అదృష్టవంతురాలివి నువ్వు కోరి వలచిన వాడే నీ వాడైపోయాడు" అని. మరి నాతో కలిసి చదివిన అందరికి తెలుసు గా నేను డేటా బేస్ ఆర్కిటెక్చర్ బుర్ర లోకి, నీ రూపం గుండెలోకి ఒకే సారి ఎక్కించుకున్నాను, రియల్ టైం ఆబ్జెక్ట్స్ తో పాటు నిన్ను కూడా నా రియల్ లైఫ్ లోకి ఆహ్వానించేసేను అని. :-)

కృష్ణా నాకు ఒక్కో సారి అనిపిస్తుంది నువ్వు ఇది అంతా నన్ను పరిక్షించటానికి చేస్తున్నావా అని. అమ్మో అంత అపవాదా నా మీద అని మొట్టికాయ వేస్తావేమో కాని నాకైతే అలానే అనిపిస్తుంది. "నీ ప్రేమ కళ్ళ నుంచి ఆగక నా వైపుకు పరుగెత్తి వెనక్కి తిరిగి రాస్తున్న నన్ను ఎన్ని సార్లు భుజాలు పట్టి తిప్పక పోతే నేను ఎందుకు చూసే వాడిని నీ వైపు" అని అనలేదు నీవు తరువాత? తెలిసీ ఏమి తెలియనట్లు ఎంత కాలం ఏడిపించి ఒక్క సారి నాకోసం హాస్టల్ కు వచ్చేసి "ఏరా గీతాంజలి కు వెళదామా" అని అడిగేవు...

ఏమైపోయింది ఆ ప్రేమావేశం.. అంటావేమో నువ్వు "ఎప్పటైకి అలానే వుండాలంటే ఎలా జీవితం, భాద్యతలు విస్తారమయ్యే కొద్ది మన పరిధి కూడా పెరగాలి" అని.. నిజమే రోజు లో 24 గంటలలో ఒక్క నిమిషం కూడా వదలకుండా గడపటం మాత్రమే ప్రేమ అని నేను అనటం లేదు.... కాని కలిసి గడిపే ఒక గంటైనా, వారానికి ఒక రోజైనా మిగతా రోజులకు గంటలకు బతకటానికి కావలసిన జీవన సారాన్ని అందిచలేకపోతే...? వున్న గంట కూడా రేపు చూడవలసిన డాక్యుమెంట్స్ మాట్లాడవలసిన మీటింగ్ ల గురించి ఆలోచిస్తే.... మనం పెట్టుబెడి పెట్టిన స్టాక్ ల గురించి అవి చెయ్యగల లాభాల గురించి ఎప్పుడో మనం రిటైర్ అయ్యాక గడిపే జీవితానికి ప్రగతి సోపానాలంటు ఈ క్షణం లోని జీవితాన్ని కాలదన్నుకుంటున్నాము అనిపించటం లేదా...

కలిసి మనం వాకింగ్ కు వెళ్ళి, ఒక పుస్తకం కలిసి చదివి, ఒక మంచి సినిమాను చూసి దానిని విశ్లేషించి ఇంతెందుకు ఇద్దరం కలిసి వంట చేసుకుని వరండాలో దుప్పటి వేసుకుని కూచుని కలిసి తిని ఎన్ని రోజులయ్యింది చెప్పు.. ఇంతటి అల్ప సంతోషాలే మనం కలిసి ఆనందించ లేక పోతున్నామే...

నేను ఏం అనకుండానే మొదలు పెట్టేస్తావు నీకు కాలం విలువ తెలియటంలేదు నేను లేనప్పుడు ఆ PMP exam పూర్తి చెయ్యమన్నానా? ఎందుకన్ని గులాబులు దొడ్డి నిండా, పొద్దుగూకులు వాటికోసం అక్కడ తిరగ... ఇక్కడ తిరగ, వున్న కాస్త ప్లేస్ చక్క గా స్టోన్ పరిపించుకుంటే తేలిక కదా ఆ బురద లో నుంచి నడుస్తూ ఎదగవా అన్నావు... గుర్తు వుందా.... ఎదగటమంటే మూలాలు మర్చిపోవటమని నాకు తెలియదు రా.. ఎంత సాధించినా.... ఎదిగినా ఇంకా సాధించ టానికి, ఎదగటానికెప్పుడు ఏదో ఒకటి మిగిలే వుంటుంది మన అంతట మనం ఎదుగుదలను ఎలా వుండాలో అది మనకెంత సుఖానిస్తుందో తెలుసుకుని నియంత్రించుకోక పొతే...

చిటారు కొమ్మల మీదుగా ఎగురుతున్న పతంగి ని చూసి కేరింతలు కొడుతున్న నా నేస్తమా ఆ పతంగి మొదలు ఇక్కడ నేల మీద స్తిరం గా నిలబడ్డ పిల్లవాడి చేతుల నుంచి నియంత్రించబడుతోంది గుర్తు పెట్టుకో... దారం అంచులకు గాజు పొడి రాసి పక్కన వాడి ని తెంచుకుంటూ ఎగరగలుగుతున్నావని మురుస్తున్నావు కాని ఆ పొడి తయారిలో తెగిన నీ చేతి వేళ్ళ గుండా కొంత నీ రక్త నాడులలోకి చేరి నీ హృదయ తంత్రులను కోస్తోంది గమనించుకో... నీ అడుగున అడుగై వేకువ వెన్నెల లో విరిసిన వేగు చుక్కంటి ప్రేమను నిద్ర మత్తుతో తోక చుక్కని భ్రమిస్తున్నావు..

ఏమిటో శిష్యురాలే మాస్టారుకు సుద్దులు చెపుతోందా... మధువని లో రాధిక కు కృష్ణుడికి తేడా లేదు గా.

20 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

Nice

అజ్ఞాత చెప్పారు...

చేతికి గాజుల్లా
కళ్ళకు కాటుకలా
నుదుటికి తిలకంలా
రాధకు మాధవుడు....

Sasidhar చెప్పారు...

Chala bagundhi.... mee blog and kavita...ani simple ga cheppaleke....goppaga cheppadam chetakaka...

SRRao చెప్పారు...

" ఎదగటమంటే మూలాలు మర్చిపోవటమని నాకు తెలియదు "
మూలాలు గుర్తుంచుకుంటే మనిషి మహాత్ముడే అవుతాడు. యాంత్రికంగా మారిపొతున్న జీవితంలో డబ్బు ప్రభావంలో అనుబంధాలు, ఆత్మీయతా విలువలు కొట్టుకుపోతున్నాయి భావన గారూ ! మళ్ళీ ఆ మూలాలు తెలిసేరోజు రాదంటారా !

జయ చెప్పారు...

ఊహాతీతమైన ప్రేమ, ఎన్ని జన్మలకీ తనివి తీరని ప్రేమ, ముగింపే లేనిది ఈ ప్రేమ......ఎంతకాలమైనా అలా అలా అలా రాసుకుంటూనే పోగలరు కదూ! ఎంత చక్కటి 'భావన ' లో! No words to say..

అజ్ఞాత చెప్పారు...

krishnude ganakaa ee post chooste chattukunna neeku eppatiki veediponi snehitudu avutadu suma... meeru aina mee badani krishnudiki cheppukunnaru... feeling lonely is the hard pain of a heart...

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

చాలా రోజులయింది కృష్ణగీతం విని చాలా బాగుంది.

భావన చెప్పారు...

@ సుజాత ధన్యవాదాలు ఈ పోస్ట్ నచ్చినందుకు, ఇంకా నా సామాన్యమైన బ్లాగ్ ను మీ కలం తో ఈనాడు లో చోటు కల్పించి అసమాన్యమని అనిపించినందుకు..

@ తృష్ణ.. అవును ప్రేమ రూపాలు వేరైనా రాధా మాధవుల వద్దకు వస్తే మాత్రం వాళ్ళు వేరు వేరు కానే కాదు, అది ఒక అధ్బుత ప్రేమ సుధా రస మాధురి... ఎక్కువ బాధ విరహం ప్రెజంట్ చేస్తున్నా.. తొందరలోనే ఆ సుధా రస మాధురి లోని ఇంకో పాయ లోని సుధ ను ఒక చినుకైనా, ఆ చినుకులోని తుంపరనైనా నా బ్లాగ్ లో ప్రతిబింబించగలనని ఆశిస్తున్నా... ధన్య వాదాలు.

@శశిధర్: మీ ఇంత అభిమానికి పాత్రు రాలినవ్వటం నా అదృష్టం...రాయటం ఒక యోగమైతే అది చదివి మెచ్చుకునే వారు వుండటం ఒక భోగం... అలా లేక పోవటం ఒక విషాదం (జంధ్యాల గారికి ధన్యవాదాలతో,క్షమార్పణలతో :-)) ధన్య వాదాలు.

@ రావు గారు ఆ మూలాల విలువ తెలిసే రోజు తప్పకుండా వస్తుంది. మొదలైనది ఏదైనా పూర్తి అయ్యి చివరికి మొదలైన చోటికి రాక తప్పదు, కాని అలా వచ్చినప్పుడు చూడటానికి మనం అంటే ఈ మానవాళి వుంటుందా లేదా అనేదే నా భయం భాధ... ధన్య వాదాలు.

భావన చెప్పారు...

@జయ: అవును ప్రేమ అనేది ఎన్నెన్ని రూపాలలోనైన ఎన్ని 'భావన' ల నైనా పలికించగల అనన్యమైన వస్తువు, ఒక రూపపు అంచులోని ఒక చిన్న తుంపు లోని ఒక మొన ను చూపగలిగినా గొప్పే మరి, మీరు మానవత్వపు అంచును ఆవిష్కరింప చేస్తున్నారు దానికంటే ఇది ఏం వుంది జయా... :-) ధన్య వాదాలు.


@దీపు: feeling lonely is the hard pain of a heart... అవును కదా... హ్మ్మ్ ఎప్పటికి వీడిపోని సహచరుడిగా కృష్ణ ప్రేమ ను పొందటం అనేది ఒక వరం దీపు. ధన్య వాదాలు.

@విజయ్ మోహన్ గారు: ఇది నిజమే.. మీరు నా పోస్ట్ మీద కామెంటేరు బాగుందని... అబ్బ కృష్ణ గీతానికి ఈ రోజు ఒక కొత్త అందం వచ్చిందండి... ధన్య వాదాలు.

మరువం ఉష చెప్పారు...

ఇక నీవు రావేమోనని రేయి ఎదురుచూపుల్లో, నిట్టూర్పుల్లో గోరువెచ్చనైన నా గుప్పిట ఈ వేకువల్లో విప్పి అందులో నా పెదవితో నీ రూపు చిత్రించి, ఆ మోమునిండా ముద్దులద్ది, తిరిగి గుప్పిట గట్టిగా మూసి నీ ద్వారంలోకి పంపాను. అవందుకుని మరి నీ తీపి తేనియలద్ది నా లెక్కకు సరి జోడుగా వెనక్కి పంపేయ్. అవే వూపిరిగా వేచివుంటాను వెయ్యిన్ని వేకువల వరకు. నా వలే మారకు, నీ ముగ్దతనం నాకిచ్చే కానుక అని మాట తీసేసుకున్నావు. అందుకే "కలలో నీవైతే కలనే వరించనా, నిన్నే కలవరించనా" అని పాడుకున్న ఆ తొలిప్రేమ నుండి, "నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జనమలో ఇక ఏ జన్మకైనా ఇలా ..." అని నా మాటలు చాలవని ఇలా అరువు పాటలు కూడా నీ నామ కోటికి అలంకారాలుగా అద్ది ఇంకేమి చేయాలో తెలియక ఇంకా చెప్పాలన్న తపన వదలక, తనివీ తీరక..

నా శక్తానుసారం ఏ రాగద్వేషాలు మన నడుమ ప్రవేశించకుండా చూస్తున్నాను. నీ నుండి నాకు, నా నుండి నీకు దైవం పట్లవుండే ఇష్టం, శ్రద్ద, ప్రేమ, భక్తి మాత్రమే పయనించాలని, ఇవే మనకి పరిణితిని కలిగించి యోగ, ధ్యాన మార్గాల్లో సంపూర్ణతని ప్రసాదించాలని నా ప్రార్థన.

నీకు వునికి కలగజేసిన అమ్మ, నాన్నలకి కృతజ్ఞతలు తెల్పుకుంటూ నీకు "ఇష్టకామ్యార్ధసిద్ధి" కలుగజేయమని దైవాలకు నా విన్నపం.

*****

ఇలా నా వేదనలు మలుపులు తిరిగేంత కదిలించిన నీ రచనకి భావన, నా విరహాలాపనలే చిరు కానుకలు.

మరువం ఉష చెప్పారు...

భావన, ఇంత గాఢంగా లోనైన స్థితిలో వ్రాసుకున్న మునుపటి నా కవిత. చదేసావేమో కూడా -- నిను చేరక నేనుండలేను http://maruvam.blogspot.com/2009/08/blog-post_26.html

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

Book mark
>>"కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని" అంటు. నిజమా కృష్ణా...

ఈ రోజు ఇక్కడదాకా చాలు, మొత్తం చదివి ఆరగించుకోలేనేమో :)


I'll be back tomorrow.

భావన చెప్పారు...

ఉషా... అబ్బ ఒక్క సారి భావోద్వేగపు ప్రవాహం లో ఈతలు కొట్టించి మునకలేయించేసేవు గా. "నీ నామ కోటికి అలంకారాలుగా అద్ది ఇంకేమి చేయాలో తెలియక ఇంకా చెప్పాలన్న తపన వదలక, తనివీ తీరక.." ,"నా నుండి నీకు దైవం పట్లవుండే ఇష్టం, శ్రద్ద, ప్రేమ, భక్తి మాత్రమే పయనించాలని, ఇవే మనకి పరిణితిని కలిగించి యోగ, ధ్యాన మార్గాల్లో సంపూర్ణతని ప్రసాదించాలని నా ప్రార్థన." అబ్బ ఉషా ప్రేమ లో కూడా అనంతమైన విశ్వ ప్రేమ ను కలిపి చాలా బాగా చెప్పేవు.. ఏమిటో మాటలకు రానట్లు వుంది.. ఇంక కవిత ఐతే చెప్పనే అక్క్ర్లేదు.. చదువుతు వుక్కిరి బిక్కిరయ్యాను ఇంకో సారి. నీ చిరు కానుక కాదు కాదు కొండంత విరహమొక అగ్ని జ్వాల లా భాద పెడుతోందోయ్ ఎలా ఇప్పుడు ;-)


భా. రా.రె గారు సరే రేపటికోసం వేచి చూస్తా మరి. :-)

మురళి చెప్పారు...

"దారం అంచులకు గాజు పొడి రాసి పక్కన వాడి ని తెంచుకుంటూ ఎగరగలుగుతున్నావని మురుస్తున్నావు కాని ఆ పొడి తయారిలో తెగిన నీ చేతి వేళ్ళ గుండా కొంత నీ రక్త నాడులలోకి చేరి నీ హృదయ తంత్రులను కోస్తోంది గమనించుకో..." ఆశ్చర్యం.. ఇంత అందంగా కాదు కానీ, ఇదే అర్ధం వచ్చే మాటలు నా మిత్రులతో చెప్పా ఒకటి రెండు సందర్భాలలో... ఎప్పటిలాగే చాలా బాగుందండీ టపా... కొంచం తరచూ రాస్తుండమని మనవి...

పరిమళం చెప్పారు...

మీ భావుకతలో పాఠకులని మునకలు వేయించడం మీకు మామూలే ....నాకు ఈతరాదండీ బాబూ ...బైటకు రాలేకపోతున్నా :)

భావన చెప్పారు...

మురళి: మీరూ చెప్పేరా... ఎవరికి వారికి ఆ బాధ అనుభవమైతే తప్ప కోస్తుందని తెలియదు అండి, ఐనా వూరుకోలేము.. చెపుతుంటాము అనుకోండి. తరచు రాయాలనే ప్రయత్నిస్తాను అండి కాని పనులన్ని అయ్యి కూర్చుంటే ఒక్కోసారి ఎందుకో కలం కదలనటుంది, కాలం మాత్రం దొర్లి పోతుంది. తప్పక ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.
@పరిమళం: పదాలకు కవిత్వపు పరిమళాన్ని, రాతకు మంచితనపు సుగంధాన్ని అద్దగల పరిమళానికి ఈత రాదా.. సరే ఈత కొట్టి భావ సాగరం (భవ సాగరం ఐనా ఇదే సూత్రమేమో మరి) లోనుంచి బయటకు రాకుండా హాయి గా రిలాక్స్ అవ్వండి మిమ్ములను ఆ కెరటం తేల్చి సుమధుర తీరాలలో దింపుతుంది...

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఎప్పటి లానే చాలా బాగుంది భావన గారు. సాధారణం గా కాస్త పెద్ద టపా కనపడగానే నా చూపులను అక్షరాల వెంట పరుగెట్టిస్తాను, అక్కడక్కడా కొన్ని పదాలు ఎగరేసి భావం అర్ధం చేసేసుకుని హడావిడిగా చదివేస్తాను. కానీ మీ లేఖలు మాత్రం నా చెవి పట్టి మెలేసి కుదురుగా కూర్చో పెట్టి ఒక్కో అక్షరాన్ని పేర్చి, ప్రతి పదాన్ని అర్ధం చేసుకుని, ప్రతి వాక్యాన్ని అనుభూతించి ఆస్వాదించేలా చేసి చదివిస్తాయి. ఈ రోజు సమయాభావం సాకు చెప్పి అలానే హడావిడిగా చదువుదాం అని ప్రయత్నించి విఫలమై రెండు సార్లు చదివి అనుభూతించి ఆనందించాను. భావ సాగరం లో ముంచినందుకు నెనర్లు :-)

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

తెలిసిందిలే తెలిసిందిలే చిలకులొలుకు చిలక చాతుర్యం,భావనాంతరంగ వనవాస విహారాలూ, డాటాబేస్ లో నిక్షిప్తమైన రికార్డులు, ప్రైమరీ కీ తో వెలుపలికి వచ్చే రిజల్ట్ సెట్టూనూ. అప్పుడప్పుడు ఇండెక్స్ డ్రాప్ అయి పడే బాధలూ. ఇప్పుడేమో మనోభావల బ్యాకప్పు లూనూ :)

wonderful,ప్రతి వారి జీవితంలో ఇవి బాధ్యతలు పెరిగే కొద్దీ తీరని తలపులేమో

నేను చెప్పారు...

ఇంకో జన్మ కావాలా నే కోరుకున్న జీవితం నీతో గడపటానికి.. కావాలేమో...

"ఇంత అల్ప సంతోషివేంటిరా నువ్వు" అన్న మాటలు గుర్తొచ్చాయ్....ఏమో మరి నాకదే జీవితం....

భావన చెప్పారు...

వేణు శ్రీకాంత్ గారు,
మొత్తానికి బుడుగు ని చెవి మెలేసి కూర్చో బెట్టి వుత్తరాల ప్రైవేట్ చెప్పి మళ్ళీ అప్ప చెప్పించు కుంటున్నానన్న మాట. మరి అలా కూర్చోబెట్టి చవించక పోతే సీగానపసూన కు మీరెలా వుత్తరమిస్తారు చెప్పండి.. అయ్యో అలా సిగ్గు పడకూడదు బుడుగూ.. వచ్చి చదువుకోమ్మా. ;-) ధన్యావాదాలు.

భా. రా. రె గారు కనిపెట్టేసేరే... (కొంచం తూగోజీ వాళ్ళ ధీర్గం వేసుకోండి) ఎలా ఐనా స్మార్ట్ మాస్టారు మీరు. డేటాబేస్ లలో నిక్షిప్తమైన రికార్డ్ లకోసం ప్రైమరీ కీ ఏ లేని, ఇండెక్స్ లు కూడా డ్రాప్ ఐన జీవితపు టేబుల్ లో జ్ఞాపకాల సీక్వెల్ రాస్తే అది అనంతమైన లూప్ లో పడి తిరుగుతోంది... :-( ఇప్పుడే అందిన వార్త మన ప్రియతమ డీభిఏ లు (బ్రహ్మ, శంకరయ్య) బ్యాక్ అప్ కరప్ట్ ఐనందు వలన, పైపెచ్చు ఈ జ్ఞాపకాల సీక్వల్... వున్న డేటాబేస్ ను కూడా నాశనం చేస్తున్నందున దానిని చంపి వేస్తామని నోటీస్ పంపేరు, ప్రేమ అనే ప్రైమరీ కీ, సమయస్పూర్తి అనే ఇండెక్స్ పెట్టి మళ్ళీ నా సీక్వల్ తిరిగి ప్రాసెస్స్ చెయ్యమని అభ్యర్ధన పెడితే కాదు ఈ డేటాబేస్ లో కుదరదు లే అంటున్నారు, అస్సలు మనసు లేని డీబిఏ లు కదు... వృధాప్యపు మరుపు అనే కమ్మాండ్ పంపి చంపే లోపు వీలైనన్ని ఇలా హార్డ్ కాపీ లు తీయాలని ప్రయత్నం.. :-) :-) :-(
అవునండి... భాద్యతలు పెరిగే కొద్ది నిజ జీవితపు పోరాట ప్రావాహం లో ఎన్నో వదులుతూ ఎన్నిటినో కలుపుకుంటు కొన్ని వచ్చినందుకు ఆనందం కొన్ని పోయినందుకు ఆనందం (ఏమిటొ దాసరి నారయణ రావు గుర్తు వస్తున్నాడా) హి హి హి ధన్యవాదాలండి.

@ నేను: నేనంటే నువ్వే కదా. ఆ నువ్వు నేనే కదా నా గతించిన జ్ఞాపకపు సజీవ చిత్రం నువ్వే కదా, ఘడియ క్రితం ప్రేమోద్రేకపు జీవితానుభవం నీకు ( అంటే మీ యువతరానికి అన్నమాట) ఇచ్చేసేకే కదా ప్రశాంతం గా సాగే నదీమ తల్లుల మయ్యాము మేము.. మా సాయం కాలపు ధీర్ఘ చాయా నీడవు నువ్వే గా అందుకే ఎన్నో పదాలు గుర్తొస్తున్నాయి బుల్లెమ్మా. :-) తప్పేమి లేదు అవును అంతే ఎవరికి వారు అలా నిర్ణయించుకున్నదే జీవితం ఏమి దిగులు పడకు మా అనుభవాల ను నీకు దారి చూపించే కర దీపిక గా.. (నీడ వైపు కాదు సుమా వెలుగు వైపు) సాగిపో all the best