19, మే 2009, మంగళవారం

ఎడబాటుని జపిస్తూ...

నేస్తమా నా ప్రాణమా నీ లేఖ అందింది. వుహు కాదు కాదు నీ వూపిరి వినిపించింది ఆ లేఖ లో.... ఈ అధ్బుతమైన సాంకేతిక రంగం ఎంత విస్తరించి పోని... దానిని వుపయోగించుకుని నీ రూపం సదా నా కనుల ముందు ఖండాంతరాల నుంచి కూడా ఆవిష్కరింపచేయని... కాని

నా కృష్ణుడూదిన వేణు గానామృతం పదాల మధ్య వూపిరి తో కలిసి స్వరాలు గా.... వరాలు గా మారి... పదాల మద్య మెదులుతు... ఆ పదాలలో కృష్ణయ్య హృదయాన్ని కొంచెం కొంచెం గా అవిష్కరిస్తూ, అంతలోనే జలపాతమల్లే కన్నీటి సుడులలో తిప్పేస్తూ... గాఢమైన అనుభవాల సాంద్రత ను ఆ రాగాలకు దట్టిస్తూ..... జగాలన్నిటిని దాటిస్తూ..

వుహు ఆ అనుభవం... అనుభూతి కి సరి పరచ గల సాంకేతికత ఇంక రాలెదు రా బంగారం... ఐనా నిన్ను చూడటానికి ఇవి అన్ని ఎందుకు చెప్పు. ఒక్క సారి కనుల ఎదుట ప్రపంచం అంతా మాయమయ్యి మనసు ముందు నింగి ని సాగే నీలి మేఘం కోసం పరుగెడుతున్న అమ్మాయి ఆ అమ్మాయి ని మాత్రమే పట్టుకోవటానికి వెను వెంటే పరుగు తీస్తున్న అబ్బాయి నీ స్మృతి పధం లో మెదలరా...........

అంతలోనే నీలిమేఘపు మెరుపులను పూలమ్మి బుట్టలోని విరజాజుల వెలుగు ని కళ్ళల్లో దాచేసిన ఆ జంట కలిసి విశాల మైదానం లో ఎగరేస్తున్న పతంగులు కనపడవా... పతంగుల టప టప లలో కలిసిన గాలిని అందులోని చెమ్మ ను ఆర్ధ్రత గా మార్చి కళ్ళల్లో కన్నీటి పూలను కురిపిస్తు సెలవు తీసుకుంటున్న ఒక పిచ్చి ప్రేమ జంట నీ కళ్ళ ముందు మెదలటానికి ఈ కెమెరా లు ఎందుకు చెప్పు...

నీ వంకర టింకర అక్షరాలనే కోట్ల సార్లు చదువుకుంటు... ప్రతి అక్షరం లోని ఆనందాన్ని ఆవేశాన్ని ఆవేదనను చిన్న్ని రాగాలు గా వాటన్నిటిని కలిపి సాగే అనంత మోహన రాగం గా అంతర్లీనమయ్యే నీ వేణు గానాన్ని వినటం అనే అధ్బుతం ఒక్క వుత్తరం తోనే వస్తుంది ఫోన్ కాని కెమెరా లు కాని వుపయోగ పడ గలవా నువ్వే చెప్పు...

మనం యూనివర్సిటి గుల్ మొహర్ చెట్ల కింద ఆ పూల గుత్తు లను చూస్తూ వాన నీళ్ళ తో కలిసి పరుగెడుతున్న తంగేడు పూల ప్రవాహాన్ని ఆపటం కోసం దోసిళ్ళతో తీసి దాచిన నీళ్ళన్ని గుండె లోనికి చేరి ఒకటె రొద పెడుతున్నాయి రా ఎప్పుడు వస్తావు నువ్వు కలిసి వదిలేద్దాము మళ్ళీ ఆ ధారలను ప్రవాహం లోకి.... వాటిని విడతీసిన పాపమేమో మనం కూడా ఇలా ఎడబాటు ను సహిస్తూ యుగాలు గడుపుతున్నాము...

8 కామెంట్‌లు:

మరువం ఉష చెప్పారు...

తామర తూడునే రెండుగా విడతీస్తూ పువ్వుతో ఒక హారం చేసి ఒక ప్రేమికుడు తన ప్రేయసికి ఇవ్వటం అటువంటి అందమైన అనుభూతికి నేను ప్రత్యక్షసాక్షినవటం. ఆ రెండూ వ్యక్తుల్లో నేను లేను అయినా నాలోను అదే సపందన.

అలాగే పున్నాగ కాడలనే అల్లికకి వాడుతూ పూలతో మాల అల్లి నేను నా ప్రాయపు వయసున నా వూహల్లోని ప్రియతముని కోసం కవితల్లలుకుంటూ కృష్ణ ఒడ్డున గడపటం మరో స్పందన.నిజ జీవితంలోవి ఇంత అపురూపం కాకపోయినా అవీ మధురమైనవే. వూహల కన్నా వాస్తవమే ఇంకా అనుకోని అనుభూతిని అనూహ్యంగా తెస్తుందనీ అనుభవంతో చెప్పగలను.

కొత్త పాళీ చెప్పారు...

"వాన నీళ్ళ తో కలిసి పరుగెడుతున్న తంగేడు పూల ప్రవాహాన్ని ఆపటం కోసం దోసిళ్ళతో తీసి దాచిన నీళ్ళన్ని గుండె లోనికి చేరి ఒకటె రొద పెడుతున్నాయి"
శబాష్!
కానీ కొంచెం జాగ్రత్త వహించకపోతే, హృదయాల్ని ఆవిష్కరించడం, జలపాతంలాంటి కన్నీరు .. ఇలాంటి పడికట్టు పదబంధాలు (cliche) ముంచెత్తే ప్రమాదం ఉంది సుమా!

మురళి చెప్పారు...

"నీ వంకర టింకర అక్షరాలనే కోట్ల సార్లు చదువుకుంటు... ప్రతి అక్షరం లోని ఆనందాన్ని ఆవేశాన్ని ఆవేదనను చిన్న్ని రాగాలు గా వాటన్నిటిని కలిపి సాగే అనంత మోహన రాగం గా అంతర్లీనమయ్యే నీ వేణు గానాన్ని వినటం అనే అధ్బుతం ఒక్క వుత్తరం తోనే వస్తుంది ఫోన్ కాని కెమెరా లు కాని వుపయోగ పడ గలవా నువ్వే చెప్పు..." ....చాలా బాగుందండి..

rishi చెప్పారు...

" యూనివర్సిటీ గుల్మొహర్ చెట్ల క్రింద
వాన నీళ్ళ లొ " ఓహ్..ఒక్కసారిగా
తడిసిన ముగ్ద లా ఆగస్ట్,సెప్తెంబర్
నెలల్లొ ..ఉన్న మా యునివర్సిటి ..అందాలు
కన్నుల్లొ ప్రత్యక్షం ...బావుందండి .

పరిమళం చెప్పారు...

పై కామెంట్స్ అన్నీ నావేనోచ్ .... :)
అద్భుతమైన భావనలు....

హరే కృష్ణ చెప్పారు...

గుల్ మొహర్ అంటే తుంగేటి పూలు కదా ..:)
బాగుంది మీ టపా

భావన చెప్పారు...

ఉష, కొత్తపాళి,మురళి,రిషి, పరిమళం, హరే కృష్ణ ధన్య వాదాలు.
@కొత్తపాళి, తప్పకుండా మీ సలహా గుర్తు పెట్టుకుంటాను.
@ హరే కృష్ణ .. అగ్ని పూలు అని అంటారు గుల్మొహర్ ను... కొందరు తంగేడు పూలను కుడా గుల్మొహర్ అంటారు కాని తంగేడు పసుపు పచ్చగా వుంటాయి...

Kathi Mahesh Kumar చెప్పారు...

ఎడబాటుని జపించడమో అదరహో! ఇక అక్కడ్నుంచీ అందుకుని జ్ఞాపకాల్లోకి విసిరేసారు. ఇంకా నేను వెనక్కిరాలేదు. ఇప్పట్లో రాదలుచుకోలేదు. వచ్చి వ్యాఖ్యరాసే కోరికలేదు.