5, నవంబర్ 2009, గురువారం

కల'వరించిన' క్షణం

కృష్ణా,నీ తలపులెందుకో మనసును గజిబిజి చేస్తున్నాయి. ఈ రోజు ఎందుకంత స్పృష్టం గా వచ్చావు కలలోకి.???? కల నుంచి లేచిన దగ్గర నుంచి నీ విరహమింకా ప్రకాశ వంతమై ఆ అగ్ని లో నన్ను దహించేస్తోంది. ఎవరు ఏమని ఐనా చెప్పని, నేనైతే అందరికి తప్పకుండా చెపుతాను.... కాలిస్తేనేమి, సఫలమయ్యి సుధలను కురిపించనేమి ఏది ఏమైనా ప్రతి ఒక్కరు ఒక్క సారి ఐనా జీవితం లో ప్రేమించాలి.అదేమిటి ఒక్క సారైనా... ఆ లెక్క ఏమిటి అంటావా?? అవును అందరం అంటుంటాము కదా నేను ప్రేమించాను కాని కుదరలేదు అనో, ప్రేమించాను కాని పెదవి దాటలేదు అనో, అది ప్రేమో ఆకర్షణో తెలియలేదు అప్పటికే కాలాతీతమయ్యింది అనో, లేదా ప్రేమించా పెళ్ళి చేసుకున్నా అనో చెపుతుంటాము కదా.. ఆ ప్రేమ లో తీవ్రమైన ఆకర్షణ అవతలి వ్యక్తి పట్ల భరించలేని మోహావేశం.... కాల్చాలి మనసు ను. ఎప్పుడు తలుచుకున్నా ఆ మోహావేశం అప్పుడే పుట్టిందా అన్నట్లు కాల్చి శుభ్రం చేయాలి మనసు మూల మూలలను. అప్పుడే ఆ ప్రేమ దేవతను నీ గుండె లో ప్రతిష్టించి పూజలు చేయ గలవు, మురికి మాలిన్యాలున్నచోట దైవ ప్రతిష్ట చేయ గలమా మరి.ఆటు వంటి ప్రేమ ఒక్క సారి తటస్థించటమే అదృష్టం, ఇంక రెండు, మూడో సారి అంటే ఏమో, వుంటారేమో అంతటి గొప్ప వ్యక్తులు... కానీ కనీసం ఒక్క సారైనా లీలా మాత్రమైనా అనుభవం లోనికి వస్తే చాలు ప్రతి ఒక్కరికి. ఒక సారి ఆ అనుభవం అందుబాటు లోనికి వచ్చాక ఇంక మరి మిగతా విషయాల మీదకు మనసు పోగలదా ప్రజలకు చెప్పు, ఈ ధనం, ఈ మేడలు, పేరంటాలు, కృత్రిమమైన పేలవపు నవ్వులతో అతికించిన ముఖాలు ఇవి ఏమి వుండనే వుండవు.నాకు సంబంధించినంత వరకు నువ్వే కదా నా దేవుడివి, ఇంక ఈ ప్రపంచం లో ఎందులోను నాకు ఆ సమైక్యత, ఆ అనుభవైక మైన అధ్బుతం తోచదు కదా.. నీవు మాత్రం కలలో కూడా నిన్ను పట్టి వుంచే భాద్యతల నుంచి తప్పించుకుని రాలేవు ... అంత ప్రేమ నీకు నామీద లేదా ఆ భాద్యతలు నిన్ను అంత మింగుతున్నాయా అనుకుంటా నేను.. కాని అంతలోనె అంత అనుమాన పడినందుకు నా మీద నాకే అసహ్యమనిపిస్తుంది. పాపం అంత నిస్సహాయులైన నీ వాళ్ళు, నీ మీద ఆధార పడ్డప్పుడు నా ప్రేమ కోసం ఆ చిన్ని అమాయకపు నవ్వులను ఆ జీవితాలను వదిలి నాకోసం రమ్మని నేనెలా చెప్పగలను కదా. అదా ప్రేమ కు అర్ధం అని నన్ను నేనే అనుకుని వూరుకుంటాను.కలలో నేననుభవించిన నీ చొక్కా మెత్త దనాన్ని, నావైపు నువ్వు చూసిన చూపు లోని చల్ల దనాన్ని... పొద్దుట లేచిన దగ్గర నుంచి పూ రేకుల లో, ఆకుల నిగారింపు లో, దేవుడి గది లోని దేవతకలంకరించిన పట్టు వస్త్రం లో, ఎదురైన పసి పాప బుగ్గ లో అన్నిటి లో పోల్చి ఆనంద పడటానికి చూసేను.. వుహు.. వేటికి సరి రావటం లేదు. చూపు కు, ఒక చిన్ని స్పర్శ కు మది అంత గా పలవరించటమేమిటో... ఎదిగిన అనేకానేక ఇతరమైన విలువలలో ముంచుకున్న నాకే అర్ధం కావటం లేదు తెల్లారేక, ఇంక అందరికి ఎలా అర్ధం అయ్యేటట్లు చెప్పగలను చెప్పు...


కాని అంత మాత్రాన కలలోని నీ స్పర్శ కోసం, నీ క్రీగంటి చూపులో నవ్వు రంగరించి నా మీదకు వదిలిన ఆ అనుభవం కోసం నా మది పడిన కలవరం, అందినప్పుడు మనసు పడిన సంతుష్టి అబద్దమని మాత్రం ఒప్పుకోలేకుండా వున్నాను. కృష్ణయ్యా కలిసి సాగిన ఆ కలయికల సాయం సంధ్య ల వెలుతురు.... మూగిన జీవితపు చీకట్లను పార దోలటానికి ఎంత కాలం సహాయ పడగలవో తెలియదు కాని, వీలైనంత తొందరా గా మళ్ళీ నా కలలోకి తిరిగి రావూ నా జీవితాన తొలి వేకువను వుదయింపచేయటం కోసం..


32 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

అదృష్టవంతులు

మరువం ఉష చెప్పారు...

"ఆ ప్రేమ లో తీవ్రమైన ఆకర్షణ అవతలి వ్యక్తి పట్ల భరించలేని మోహావేశం.... కాల్చాలి మనసు ను. ఎప్పుడు తలుచుకున్నా ఆ మోహావేశం అప్పుడే పుట్టిందా అన్నట్లు కాల్చి శుభ్రం చేయాలి మనసు మూల మూలలను" ఎన్నిసార్లో భస్మమైన నా మనసు సాక్షిగా ... నా మానసం నీ ఎదుట పరుస్తున్నాను.

తనకోసమె కల కన్నానా?
ఆ కలలో తననే కలవరించానా?
కలలో తనని వరించానా?
ఆ కల కరిగిపోతుందని కలత చెందానా?

ఉదయానికి వీడుకోలు పలికానెందుకు?
రాత్రినీ ఆగొద్దని వేడుకున్నానెందుకు?
ఒక రోజు గడిచిందని నిట్టూర్పు విడిచానెందుకు?
నిరీక్షణా ఓ ప్రేమేనని నలుదిక్కుల చాటేందుకే!
----------------------------
భావన, ఆ మాటలు నీవీ లేఖ వ్రాసుకున్నప్పటి స్థితిలో నేనున్న క్షణాన జాలువారిన కవితలోవి. http://maruvam.blogspot.com/2009/05/blog-post_11.html

అందుకే నేను ఎవరికీ చూపని నా లేఖ నీకూ పంచుతున్నాను.

"అమావాస్యకో పున్నమికో ఓ సారి కలలో మాదిరి దరి జేరతావు, అలా మురిపిస్తావు ఎలా కన్నా! గుబులు గుబులుగా వుంటుంది. నిన్నే చూస్తూ గడిపేయాలనిపిస్తుంది. నీ కళ్ళలో కళ్ళు కలిపే ఆ క్షణం కోసం అర్రులు చాస్తూ బ్రతుకుతుంటాను. మునుపటి నీ రాకలోని ఆనందాన్ని పునశ్చరణ చేస్తుఓటాను. ఇన్ని అనుభూతులని పంచుతున్నందుకు, ఆ నవరస భరిత జీవితంలో నన్ను ముంచి తేల్చుతున్నందుకు నీకు ఏమిచ్చినా ఎప్పటికీ వెలకట్టలేను ఈ అనుభవాన్ని."

భావన, అందుకే నా ప్రేమ నీ నిర్వచనానికే మాత్రమూ తగ్గదు. నిర్భయంగా చెప్పిందీ అందుకే నాకు నా ప్రేమ గాఢత తెలుసు.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఈ రోజుకు ఈ కామెంట్ చాలు కదా? మళ్ళీ రేపొస్తాను :)

sunita చెప్పారు...

చక్కటి ఫోటో. చక్కటి భావన.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

"ఎప్పుడు తలుచుకున్నా ఆ మోహావేశం అప్పుడే పుట్టిందా అన్నట్లు కాల్చి శుభ్రం చేయాలి మనసు మూల మూలలను. అప్పుడే ఆ ప్రేమ దేవతను నీ గుండె లో ప్రతిష్టించి పూజలు చేయ గలవు, మురికి మాలిన్యాలున్నచోట దైవ ప్రతిష్ట చేయ గలమా మరి."

ఎంత ఆద్భుతమైన భావన, నూటికి నూరున్నొక్క పాళ్ళు నిజం :-) ఇంకా చాలా చెప్పాలని ఉందండీ, కానీ పరవశం లో మునిగాక ఇంతకన్నా ఎక్కువ మాట్లాడటం కష్టమే కదండీ మరి.

పరిమళం చెప్పారు...

!!!!!

నిషిగంధ చెప్పారు...

కొన్ని కొన్ని చదివాక చాలా సేపటి వరకు ఎవరితో మాట్లాడకుండా, ఏ పనీ చేయకుండా, అలా ఉన్న చోటునే కూర్చుని చదివినదాన్నే మననం చేసుకోవాలనిపిస్తుంది.. ఈ లేఖ కూడా ఆ కోవలోకే వస్తుంది! :-)

కొత్త పాళీ చెప్పారు...

లేఖలో ఉన్న ఉద్వేగం పక్కన ఫొటో పేలవంగా ఉంది. కృష్ణుడక్కడ ఉన్నాడా? మనల్ని ప్రేమిస్తున్నాడా అని కాదు కొస్చెను. ఆ భావన మనలో ఇంత వెర్రెక్కించేంత ప్రేమని రగిలించిందే అన్నది పాయింటు!

జయ చెప్పారు...

చాలా అతీతమైన భావనలు...ఈ కొత్తదనంలో దేన్ని ప్రత్యేకించి చెప్పాలి. పదాలనా...ఆ కలలనా...ఆ కోరికలనా...ఆ పలవరింతలనా!!! లాభం లేదు...ప్రతీ అక్షరక్షరం తన్మయత్వాన్నే కలిగిస్తోంది. మీ పేరు మీకు సరియైనదే భావనా....

శ్రీలలిత చెప్పారు...

కలలోకి నడిచొస్తే
తులాభారం తూచనా
ఎద పిండి తులసిదళం
అర్పించనా నీ మ్రోల.

శ్రీలలిత చెప్పారు...

కలలోకి నడిచొస్తే
తులాభారం తూచనా
ఎద పిండి తులసిదళం
పాదాల నుంచనా

మరువం ఉష చెప్పారు...

అవునూ నాకేనా ఇక్కడ కృష్ణుడు కనపడందీ అనుకున్నాను, నాలాంటి వారున్నారోచ్. భావనా, నేనిక్కడ చూసిందా ప్రేమోద్దీపననీ, ప్రేమ రగిలించె జ్వాలనే. ఆది నుండీ ఆయన వీటికి చిరునామా కనుక ఆ ప్రయోగమే కానీ నాకు కనిపించే నా కన్న లోనే కన్నయ్యను దర్శించటం అలవాటు సుమీ! ;)

భావన చెప్పారు...

@విజయ మోహన్: అవునండి అదృష్ట వంతు రాలినేనేమో అనుకుంటా కృష్ణయ్య ను కల లో ఆవిష్కరించుకోగలుగుతున్నానంటే. ధన్య వాదాలు.
@ ఉషా: హ్మ్మ్.. నీకు ఎంత రాసినా ఇంకా కొంచం మిగిలే వుంటుంది.. కల 'వరించినా', కలవరించినా కళ్ళ ముందు కన్నయ్య గా సాష్కాత్కరించుకున్నా ప్రతి దాని అర్ధం,భావార్ధం ప్రేమే కదా. ప్రేమ గాడత తెలియకనే కలయిక లోని గాఢతను, పునశ్చరణ పు అనుభవాన్ని నవరస భరిత నాయికా మణులు గా కూర్చి రాసేవని అనుకోను లే మిత్రమా.. 'వెలకట్టలేని అనుభవాన్ని వెలివేయ గల మనసులు కూడా వుంటాయి ' జాగ్రత్తా

భావన చెప్పారు...

@ భ.రా.రే: ఏమిటి వాయిదాల పద్దతా? అలా ఐతే ప్రతి వాయిదాకొక చిన్న కవిత బాకి మరి.. ఆలోచించుకోండి.

@సునితా: నచ్చినందుకు ధన్య వాదాలోయ్.. 'మంచి భావన' అంటే వుత్తరం లో భావనా, రాసే భావనా? ;-)

@వేణు: పరవశం లో మునిగిన వేణువు పలకలేక మూర్చనలు పోతే, పలికించెడి శ్రీ'కాంతుడు' వున్నాడు గా పలికిస్తాడు లెండి కష్టమేమి కాదు. :-) నచ్చినందుకు ధన్య వాదాలు.

భావన చెప్పారు...

@ పరిమళం: దీని భావమేమి తిరుమలేశా.. ద్వారకా నగర వాసా... పలుకరాదటె మా పరిమళాల కొమ్మ పలుకువై. ఆ వన్నెల చిలుక కులుకువై..
నచ్చిందనే అనుకుంటున్నా ఆ భావం తో మరి. ధన్యవాదాలు.

@ నిషి: మరి మననం చేసుకున్నారా... ఇంక భావాల పరీక్ష కు తయారేనా.
చాలా తేలిక ప్రశ్నలేస్తానులే మొదటి సారి కదా:
ప్రశ్న 1: నడి రాత్రి లో కదిలిన తలపేదో కలల కొలను దాటి కాగితం మీద కు రప్పించగల ఇంధనమేది? 4 లేదా 5 లైనుల లో వివరింపుము.
ప్రశ్న 2: గుండె చెలమలలో కదిలిన ప్రేమ భావం కంటి నుంచి బయటకు ఎందుకు వస్తుంది: రెండిటి కి గల సంబంధమును నిర్వచించుము, వివరింపుము.. ;-)

భావన చెప్పారు...

@కొత్తపాళి: లేఖ లో వున్న నా ఆత్మ ను పట్టుకున్నారండి.. అంతే కదా.. వుద్వేగపు పొంగులు రగిల్చిన ప్రేమ భావమే ఈ లేఖ అని అంత పెద్ద లేఖ ను రెండు లైను లలో చెప్పేసేరు మీరు .. అవునండి పిక్చర్ లో నా ఆత్మ లేదు కదా. అందుకే తేలిపోయిందేమో.. :-)

@ జయ: ఇంకా మా జయ రాలేదేమా అనుకున్నా.. అమ్మయ్య వచ్చేసేరు.. ప్రత్యేకించి దేని గురించి చెప్పనక్కర లేదు. అన్నిటిని కలిపిన తన్మయత్వమే పరాకాష్ట కదా .... నేనింకా మీ పిక్చర్ కు రుబాయి రాయాలి మర్చి పోలేదు మీ కృష్ణ శాస్త్రి గారి మీద పోస్ట్ ఎంతో బావుంది కామెంట లేదు.. వస్తున్నా వస్తున్నా..

భావన చెప్పారు...

@ శ్రీ లలిత: మన కవితాత్మల పలకరింపు బలే వుంది. మీరు,ఉషా పలకరించే తీరే వేరు..
కలలోకి నడిచొచ్చిన విభునికి
తులాభారమా..
అమ్మయ్యో ఒకసారైన అవమానం చాలదు... :-|
అష్ట భార్యల అభినివేశం తో రుక్మిణినైతే
అర్పించిన తులసి దళాన్ని అరిచేత వుంచేడు కృష్ణయ్య..
అర్పించనా ఇంక నా ఆత్మ ను ఆ పరమాత్మ మ్రోల?

భావన చెప్పారు...

@ ఉషా: ప్రేమ రగిలించే జ్వాల: కృష్ణ రూపం లో నాకు, కన్నయ్య రూపం లో నీకు.. ప్రేమాంశ రూపం లో కొత్తపాళి గారికి.. పరమాత్మ రూపం లో విజయ మోహన్ గారికి.. అంతశ్చేతనాల ఆశ్చర్యాంబుధి లో పరిమళానికి, తన్మయాల భావ ప్రవల్లికను జయ కు... ఆనందాల హేల లో సునీత కు.. మనః శరీరాలను అచేతనం చేసిన వుద్వేగపు వూపిరై నిషి ను, రుక్మిణమ్మ ఆరాధనాల శ్రీ గంధాలను శ్రీలలితకు.. వుండుండి పైకెగసే కవితా ప్రవాహపు జోరు ను భా.రా.రే కు.. చూడు మన అందరికి ఎన్ని రాగాలను భావాల గంధాలను సుగంధాలను అందించిందో ఒక చిన్న కల.. అధ్బుతం కదు..

మరువం ఉష చెప్పారు...

ఆ అన్ని మనసులో వేలం పాటలో కొనేసాగా. ఇక జాగరూకత అవసరంలేదు ;) అర్థం అయిందా ప్రియ భామినీ..!!!!!! [శుక్రవారం కదా అందుకే ఇలా లల్ లల్ లాహీరే]

తృష్ణ చెప్పారు...

http://trishnaventa.blogspot.com/2009/05/blog-post_9466.html

పై లింక్ ఒకసారి చూడండి....నా ప్రేమ భావన కూడా కనబడుతుంది..
ఇటీవల వచ్చిన "రబ్ నే బనాది జోడీ" లో ఈ పాట నాకు బాగా నచ్చింది...ఈ ఒక్క వాక్యమ్ కోసం..మళ్ళీ మళ్ళీ వింటానీ పాట..."तुझ मे रब दिखता है यारा मै क्या करू.."

ना कुछ पूछा....ना कुछ मांगा
तु ने दिल सॆ दिया जॊ दिया
ना कुछ बॊला...ना कुछ तोला
मुस्कुराकॆ दिया जॊ दिया

तु ही धूप तु ही छाया
तु ही अपना तु ही पराया
और कुछ ना जानू मै
बस इत ना ही जानू
तुझ मेइ रब दिखता है यारा मै क्या करू
सज्दॆ सर झुक ता है यारा मै क्या करू
तुझ मे रब दिखता है यारा मै क्या करू
ప్రపంచాన్ని మరిపించే ప్రేమంటే ఇదేనేమో....కదూ...

మురళి చెప్పారు...

"కలలో నేననుభవించిన నీ చొక్కా మెత్త దనాన్ని, నావైపు నువ్వు చూసిన చూపు లోని చల్ల దనాన్ని... పొద్దుట లేచిన దగ్గర నుంచి పూ రేకుల లో, ఆకుల నిగారింపు లో, దేవుడి గది లోని దేవతకలంకరించిన పట్టు వస్త్రం లో, ఎదురైన పసి పాప బుగ్గ లో అన్నిటి లో పోల్చి ఆనంద పడటానికి చూసేను.. వుహు.. వేటికి సరి రావటం లేదు." ఈ వాక్యం నాకు చాలా చాలా చాలా నచ్చింది.. ఎందుకో చాలా సార్లు చదువుతూ ఉండిపోయాను..

భావన చెప్పారు...

ఉషా :-) :-) నేనిలా వూహించుకుంటున్నా నిన్ను... ఉషా ఈజ్ ఎ గుడ్ గర్ల్ అన్ని గుడ్ హాబిట్స్ తెలుసుకో నేస్తం.. కొలను పక్కన కాపురం గుండెలోన గోపురం బుజ్జమ్మేనా? (ఉషా పాడినట్లు అన్నమాట)

@తృష్ణా : అవును ప్రపంచాన్ని మరిపించగలది ప్రేమే కదా.. పాట బలే వుంది.. హింది స్పీడ్ గా చదివేస్తాను రాసేస్తాను కాని నెమ్మది గా అర్ధం చేసుకుంటాను.:-) బాగుంది కదా మీనింగ్.

@ మురళి: ఏమీ మాటలు లేవండి మొత్తం వుత్తరం లో, కలలో నేననుభవించిన క్షణాన్ని సంపూర్తి గా అనువదించిన మాట మీ దృష్టి ని ఆకట్టుకుందంటే చెమ్మగిల్లిన కనులతో అభివందనాలు అందించటం తప్ప.

Hima bindu చెప్పారు...

భావన ....అగ్నిలో దహించివేస్తుంది ....అధ్బుతంగా రాస్తారండీ ! నేను ఎప్పుడు అనుకుంటుంటాను ఈ బ్లాగుల వలన మీవంటివారి రచనలు చదివే అవకాశంలభించిందని .

cartheek చెప్పారు...

బావన గారు అద్భుతంగా రాసారండి..

భావ వ్యక్థీకరణ చాలా బాగుందండి....

మరువం ఉష చెప్పారు...

భావన, ఇంత దాకా పాడుతూనేవున్నా కదా, అందుకే నీతో మాట్లాడలేదు :)

నీ పాటని పొడిగించి పూర్తిచేయాలనుంది... ఆదివారం సాధక బాధల్లో వున్నానిక. :(

తృష్ణ, అది నాకూ నచ్చిన పాట. వినటం ఇష్టమే కానీ తెలుగువాటంతగా అర్థం చేసుకుని, పాడే ప్రయత్నం తక్కువ హిందీ పాటల్ని.

భావన చెప్పారు...

చిన్ని. నాకే ఎంతో సంతోషం గా వుంది నా భావాన్ని మీ అందరితో పంచుకోగలుగుతున్నందుకు మీరు మెచ్చుకుంటున్నందుకు ఇంకా మీ అందరివి చదవ గలుగుతున్నందుకు. దాదాపు గా రెండు సవత్సరాల కింద ఈ బ్లాగ్ ల గురించి మిత్రులు చెపితే కనీసం ఇప్పటికైనా ఇలా మీ అందరిని కలవటం అయ్యింది. సంతోషం నాది.

కార్తీక్: మీరు చదివే మనసు లో కూడా వుంటుంది ఇదే లేఖ ను చూపిస్తే కలలు రావటమేమిటో అందులో ఈ గోల ఏమిటో అని పెదవి విరిచి నవ్వే వారిని కూడా చూసేను. చదివే మనసులో లేని అధ్బుతం రాసే వారి చేతిలోను రాదు. ధన్యవాదాలు.

ఉష: మరి తొందర గ పూర్తి చెయ్యి పాట. నేను నా అదివారపు సాధక బాధకాలు పూర్తి చేసి గత గంట నుంచి అదేదో పరిక్ష కు కూర్చున్నట్లు వరస గా చదువుతూ వెళుతున్నా బ్లాగ్ లు. ;-)

పరిమళం చెప్పారు...

!!!! దీని భావం మీ భావుకత్వానికి మనసు మూగబోయిందని !ఆశ్చర్యంతో కళ్లు తప్ప చేతులు నాభావాన్ని చెప్పలేక పోయాయని ! :)

sunita చెప్పారు...

రెండూను. లేఖలోని భావన, లేఖ రాసిన భావన(ఈ మాట ఇంతకుముందు కూడా చెప్పాను.

మురళీ కృష్ణ చెప్పారు...

"ఎప్పుడు తలుచుకున్నా ఆ మోహావేశం అప్పుడే పుట్టిందా అన్నట్లు కాల్చి శుభ్రం చేయాలి మనసు మూల మూలలను. అప్పుడే ఆ ప్రేమ దేవతను నీ గుండె లో ప్రతిష్టించి పూజలు చేయ గలవు, మురికి మాలిన్యాలున్నచోట దైవ ప్రతిష్ట చేయ గలమా మరి." -- ఏ చలం పుస్తకం నుండి కాపీకొట్టారూ...?? ;)

"కలలో నేననుభవించిన నీ చొక్కా మెత్త దనాన్ని, నావైపు నువ్వు చూసిన చూపు లోని చల్ల దనాన్ని..." నేను నిశ్శబ్దంగా వున్నప్పుడు లీలగా ఈ మాటలే చాలా రోజులు గుర్తోస్తూ వుండినాయి. ఇక మిగతా పోస్ట్ మామూలుగా అనిపించింది.

"నాకు సంబంధించినంత వరకు నువ్వే కదా నా దేవుడివి". ఎవరూ...?? క్రిష్ణయ్య దేవుడా...? మీకూ తనకూ అంతదూరమా? మేమైతే భరించలేము అంతదూరాన్ని. మేము తను వేరు వేరు అంటే నేనస్సలు ఒప్పుకోను. (మాధవుడి నేస్తాలు అలానే వుంటారు మరి.)

అయితే, ఇక్కడ, అందరి అభిప్రాయాలు బాగున్నాయి.
ఉష గారు - మీ కవిత చాలా బావుంది. చిన్ని కవితలో భలేగా ఒదిగారు. పరిమళం, నిషిగంధ, జయ, శ్రీలలిత... ఇలా మీ అందరినీ కాదు కాదు మీ అందరి 'భావన'లను ఒకే చోట చూడగలటం చాలా బావుంది.

భావన చెప్పారు...

పరిమళమ్: నాకు తెలుసు గా మీ మనసు, నేను సరిగానే అర్ధం చేసుకున్నా ఐతే.. హీ... (నోరు ఆ చెవి నుంచి ఈ చెవి దాకా సాగింది అన్నమాట సంతోషం తో)
సునీత: అబ్బ ఇంకో సారి చెప్పించుకుందామని లేవోయ్.. చూడూ మళ్ళీ మొదటి సారి చెప్పినట్లు ఎంత సతోషమేస్తోందో.. :-)

భావన చెప్పారు...

మురళి: నీకు దెబ్బలు పడతాయి అబ్బయ్ కాపీ గీపీ అన్నావంటే చలం ఆత్మ ను ఒక సెకను అలా ఆవహింప చేసుకోవటమే ..

నాకు నిజం గా కల లో వచ్చిన భావమే ఆ మురళి గారికి, నీకు కూడా నచ్చిందన్నమాట. మురళి లో పలికే రాగం మురళి కి అర్ధం అయ్యిందా?

ఐతే కృష్ణయ్య ను పూర్తి గా జీవితానికి అన్వయించుకున్న అదృష్టవంతుడివన్నమాట

అందరి ’భావనలు’ నచ్చినందుకు అందరి తరపునా ధన్య వాదాలు.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

>>వీలైనంత తొందరా గా మళ్ళీ నా కలలోకి తిరిగి రావూ నా జీవితాన తొలి వేకువను వుదయింపచేయటం కోసం.

వీలైనంత తొందరా గా మళ్ళీ ఒకపోష్టు తిరిగి వ్రాయరూ, మా మదిలోన మళ్ళీ వేకువను వుదయింపచేయటం కోసం.