16, నవంబర్ 2009, సోమవారం

అక్కా అంతేనంటావా ... !!!!

నవంబర్ నెల కౌముది లో నా లేఖ

అక్కా అంతే నంటావా.....!!!!! 


అక్కా,

ఎట్లా వున్నావు? నేను నా పతి... పుత్ర, పుత్రికా రత్నాల తో సహా నిక్షేపం గా వున్నాము.. నిక్షేపం గా అంటే గుర్తు వచ్చిందే మొన్న నాయనమ్మ నిక్షేపం లాంటి నా జాజి కాయ పెట్టె కనపడలేదు అని గోల గోల పెట్టింది అని చెప్పేను కదా... నాయనమ్మ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నాన్న అది పెద నాన్న గారింటికి పంపించేసేరు అంట.. ఎందుకలా గా నాన్న అంటే రోజు దాని గురించి మీ అమ్మ కు నాయనమ్మకు గోలే.. ఆమె కా ఆ పెట్టె ఎత్తే ఓపిక లేదు ప్రతి అరగంట కు ఒక సారి అమ్మ ను రమ్మని రాత్రి తోడు పెట్టిన పాల గిన్నె ఇంకా తీసి నట్లు లేవు తియ్యవే అనో, మొన్న మధ్యాన్నం రెడ్డి గారింటి నుంచి వచ్చిన వులవల మూట అందులోనే పెట్టేనే తీస్తావా దాలి పొయ్య పొద్దుట నుంచి వూరికే వుంది అని ఏదో ఒకటి గొడవ చేస్తోంది అట. పూర్తి గా ఆ మతిమరుపు ఎక్కువ ఐపోయింది..

ఏనాటి అబ్బరాం, జరుగులు మొన్నీ మధ్య న వాళ్ళు పొలం నుంచి వచ్చే టైం అయ్యింది నువ్వు ఇంకా అన్నం వండలేదు అని గోల అంట. మనకు వినటానికి నవ్వు గానే వుంది కాని పాపం అమ్మ కు కష్టం గానె వుంటోంది అనుకుంటా. ఒక పక్క నాన్న చాదస్తం అది చాలదన్నట్లు ఇప్పుడు ఈ నాయనమ్మ తో కూడా. కాని అమ్మకెంత ప్రేమే నాయనమ్మ అంటే..!! నాకు ఆశ్చర్యం గా వుంటుంది.

నాకు మా అత్త ను చూస్తేనే చిర్రు మంటూ వుంటుంది లోన ఆమె మాట్లాడే వెటకారం మాటలకు. మొన్న ఎంత నీలిగిందని ఇంటికి రాగానే కొడుకు తనంతట తనే కాఫీ పెట్టుకున్నాడంట 'ఎంత కష్ట పడుతున్నాడో చంటి' అని, అక్కడికి నేనేదో తిని అరగక తిరుగుతున్నట్లు.. నాకు మాత్రం ఎంత కష్టం గా వుందే ఈ ప్రయాణం చేసే వుద్యో గం చెయ్యాలంటే.. అక్కడికి రవి ఏదో సాయం చెయ్యబట్టి లాక్కొస్తున్నా కాని. దానికి తోడు వచ్చినప్పుడంతా ఈమె సూటి పోటి మాటలు.. మేము మాత్రం చెయ్యలేదా వుద్యోగాలు అంటు. ఏమి చేసిందే ఆ పనికి రాని టీచరుద్యోగం.. ఒక్కనాడన్నా ఎలెక్షన్ పనులకు కూడా వెళ్ళకుండా వాళ్ళ ఆయన పదవి ని అడ్డం పెట్టుకుని ఒక్క సారి కూడా పల్లెటూళ్ళకు బదిలీ లు లేకుండా ఆ గుడివాడ లో పడి హాయి గా బతికేసి వృద్ధ నారి అన్నట్లు చెపుతుంది..

సరే ఈ సోది కు ఏమి వచ్చే కాని బాబి గాడు బాగున్నాడా.. మొన్న వచ్చినప్పుడు వాడి వచ్చి రాని తెలుగు లో ఎంత ముద్దు గా మాట్లాడేడో. ఇంకా నువ్వు తెచ్చిన అన్ కట్ పగడాల దండ చేయించుకోలేదు. పైన అపార్ట్మెంట్ పార్వతి గారు ఏమి చేయించుకోక పోయినా అలా కొక్కెం పెట్టి వేసుకోవచ్చు మూడు వరసలు గా, తరువాత నెమ్మది గా లాకెట్,దిద్దులు చేయించుకోవచ్చు అంటుంది. ఏమంటావు.. మొన్నీ మధ్యన పరమేశ్వర రావు గారు తీసుకోమన్నారని రవి వద్దు అంటున్నా వినకుండా ఈడ్పుగల్లు దగ్గర ఆ దగ్గుబాటి వాళ్ళు ప్లాట్ లు వేసి అమ్ముతున్నారు మంచి ధర కు ఇప్పిస్తాను అంటే ఒకటి బ్లాక్ చేయమని చెప్పేను తీసుకోకూడదు.. పెద్ద దాని పేరు మీద వుంటుంది కదా.

వచ్చే వయసే కాని తగ్గేది కాదు కదా ఏమిటో నాకు అప్పుడే ఈ మధ్యన కళ్ళు తిరుగుతున్నాయి అని, రవి గోల చేసి డాక్టర్ దగ్గరకు తీసుకెళితే ఆయన బీపీ బోర్డర్ లో వుంది సరిగా తిని ఎక్సర్సైజ్ చెయ్యక పోతే మందులేసుకోవాలి అన్నారు. రవి పెద్ది కి కూడా ఫోన్ చేసి గోల గోల చూడు నీ స్నేహితురాలు ఎలా చెస్తోందో అని.

అవునూ బావ గారి వాళ్ళ బాబాయి గారు వాళ్ళు అదే వినాయక్ ధియేటర్ దగ్గర వుంటారు చూడు వాళ్ళ చిన్నల్లుడు చని పోయాడు అంటగా.. నాకు చెప్పనే లేదే మే , నిన్న దినం కార్డ్ వచ్చింది.. సాయింత్రం రమత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పేరు. పాపం ఏమిటో.. చిన్న వయసు లోనే. అందరు బాగున్నారు ఇంకా రెండు బస్ లు కూడా కొన్నారు కేశినేని ట్రావెల్స్ వాళ్ళవి అని కిందటి సవత్సరమే అనుకున్నాము.

ఏమిటోనే చిన్నప్పటినుంచి నేనేమో ఈ బడా బడా వాగే గుణం, నువ్వేమో మాట పెదవి దాటనివ్వని తత్వం మార్చుకోలేక పోయాము. ఏమి చేస్తాము ఈ జన్మ కు ఇంతే.. వీలు చూసుకుని అన్ని వివరాలతో వుత్తరం రాయి. మాట మాట కు ఫోన్ చెయ్యక. మొన్న వచ్చినప్పుడు బావ గారు కూడా అంటున్నారు మీ అక్క ఫోన్ ల మీద పెట్టిన డబ్బు లతో నెలసరి వాయిదాలు కట్టుకున్నా విజయవాడ లో సగం మాది ఐపోయేది అని. శ్లేష గా అన్నారేమో నాకు తెలియదు కాని నిజమే కదా..... వూరికే అమ్మ కు, నాకు, మావయ్యలకు, పెద నాన్న గార్లకు ఇంకా ఎందెరెందరికి చేస్తావో అర్ధం పర్ధం లేకుండా.. వుంటాను మరి.. బావ గారిని అడిగేను అని చెప్పు.

ప్రేమతో
నీ చెల్లి,
చిన్ని.చిన్నా,

నువ్వేమి మారలేదే వచ్చినప్పుడే చెపుదామనుకున్నాను. ఈ వుత్తరం చూస్తుంటె మళ్ళీ మనం ఇంటి బయట అరుగు మీద కూర్చుని వాదులాడుకుంటున్నట్లు వుందే. గుడ్లవల్లేరు లాకులెత్తేసినట్లు నీ ధోరణే నీది కాని ఎదుటి వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వవు కదా.. నీ చిన్ని వుత్తరం లో చాలానే విషయాలు కలయ తిప్పేసేవు.. చిన్నప్పటినుంచి నీ ప్రత్యేకతే అది.. నీ బలహీనత కూడ అదేనే చిన్ని. దేని మీద ఎక్కువ సేపు కుదురు లేదు సవ్య సాచి లా గా వయసులో వున్నప్పుడు పరుగులు తీయటం బానే వుంటుందేమో కాని ఎప్పుడూ అంటే కొంచం తగ్గించుకోవాలేమో..

నీకు ఎందుకు ఆశ్చర్యం గా వుందే అమ్మ, నాయనమ్మ అనుభందం చూస్తే...!! అమ్మ చెప్పిందా నాయనమ్మ తో కష్టం గా వుందని? నేను నమ్మను నాన్న కు అంతా కంగారే అందుకే పంపించి వుంటారు ఆ భోషాణం పెట్టెను. నాయనమ్మ చిన్నప్పుడు అందులో పటికి బెల్లం ముక్కలు దాచి సాయింత్రం బడి నుంచి ఇంటికి రాగానే ఆ రోజు ప్రసాదం తీసి పెట్టేది గుర్తు వుందా?

ఆమె కు ఎంత అనుభందం ఆ పెట్టె తో, దాలి పొయ్యతో. నిజమే మన చిన్నప్పుడు ఎప్పుడైనా ఆ దాలి పొయ్య నుంచి పొగ రాకుండా గుర్తు వుందా? నాకు మన ఇల్లు అంటేనే ఆ చుట్టింటి పక్క నుంచి గాలితో పాటు గడ్డి కాలుతున్న వాసనతో తేలి వచ్చే దాలి పొయ్య పొగ కూడా మెదల కుండా వుంటుందా కళ్ల ముందు..

మీ బావ గారు 'అబ్బ స్వగృహా లో వులవ చారు ఎలా ఐనా ఆ రుచే వేరు' అంటే నేను మా వూళ్ళో పొంత పెట్టి రోజంతా వులవలు, గుగ్గిళ్ళు వుడక పెట్టి దానిలోని సారమంతా మా బర్రెల కు కుడితి కలిపేక, మిగిలిన తుక్కు లో నీళ్ళు పోసి తీసిన చారు కూడా అంత కంటే బాగానే వుంటుంది అంటె తెగ వుడుక్కున్నారు అనుకో ..

సాయింత్రమవ్వ గానే గుడిలో నుంచి వచ్చే పాట "ఆజాను బాహుడమ్మ.... అరవింద నేత్రుడమ్మా.... కోదండ రాముడమ్మా.. సీతమ్మ వలచిన, గోపన్న కొలిచిన, భద్రుని బ్రోచిన శ్రీరాముడు... శంఖ చక్ర ధారుడు. అది గో గౌతమి ఇదుగో భద్రాద్రి" అనే పాటను వింటూ.. అప్పుడే జరుగులు పితికిన పాల నురగతో అమ్మ చేసి ఇచ్చిన కాఫీ తాగుతూ, స్టూల్ వేసుకుని ఎగిరెగిరి కోసుకున్న సన్నజాజుల పూల ను మాల కట్టుకుంటున్నప్పటి ప్రశాంతత ఇప్పుడు నువ్వు వెళ్ళే ఎన్ని రిసార్ట్ లలో వస్తుందే...

మనకే అలా వుంటే మరి పూర్తి జీవితమంతా వాటితో గడిపిన నాయనమ్మ కు ఎలా వుంటుందో వూహించుకో.. మర్చిపోయావా... అమ్మ కు మేకు గుచ్చుకుని వాతం కమ్మితే, నాయనమ్మ ఎంత హడావుడి చేసిందో, ఎంత మంది దేవుళ్ళకు మొక్కిందో. తగ్గేక ఒక రోజు అమ్మ కు తలకు పోసి దిష్టి తీసి అమ్మ కు సంధ్య వేళ సాంభ్రాణి వేస్తూ ఎంత హడావుడి చేసిందో నాయనమ్మ. ఇప్పటికి నా మనో ఫలకం మీద అది ఒక చెరగని ముద్ర. అమ్మ కూడా మర్చి పోయి వుంటుందని నేననుకోను. చిన్ని... ప్రేమానుభందాలు మనం పెంచుకుంటే పెరిగేవేనే... నువ్వు చిన్న దానివి అప్పుడు, ఏమి గుర్తు వుండి వుండదు..

మీ అత్త గారి కి కొంచం చాదస్తం అంతే నేను మొన్న వచ్చినప్పుడు ఎంత గొప్ప గానో చెప్పింది 'మా సుమా కు క్షణం కూడా తీరిక దొరకదమ్మా అమెరికా లో మీరైనా ఇంత కష్ట పడతారో లేదో ఒక్క క్షణం కూడా కూర్చోదు' అని ఎంతో ఆపేక్ష గా చెప్పింది.

అలా కాలం తో పాటు పరుగులు తీయకు రా చిన్ని. మీ బావ గారికి, నీకు ఈ పరుగులు తీసే గుణం ఎప్పటికి ఆగుతుందో.. ఏమి చేస్తారు రా ఇన్ని కొని, దాచి చెప్పండి. మొన్న కృష్ణ కూడా వాళ్ళ వూళ్ళో పొలం అమ్మి అది చేస్తా ఇది చేస్తా అని వురుకులు పెడుతుంటే చెప్పేను. రైతు బిడ్దలం మనం, ఆ భూమినే అమ్మేసి ఏమి చేస్తావు ఇంత సంపాదించుకుంటున్నాము మనం ఇప్పుడు..... ఆ కౌలు దారులు ఇచ్చేది శిస్తు కట్టటానికి వస్తే చాలదా ఆ భూమి ని వుంచితే నష్టం ఏమిటి అని. ఇళ్ళు స్తలాలు కొంటే మాత్రం పని వుండదా ఏమిటి.. వదిలెయ్యండి ఆ గోల.

ఆరోగ్యం జాగ్రత్త.. తొందర గా ఐపోతాయని ఆ వేపుడులు చేయక. నాయనమ్మ చేసేది వంకాయ రోటి పచ్చడి, చేసి ఆఖరి లో వుల్లిపాయ కలిపేది, అదీ.... నాయనమ్మ చేసినట్లు చామ దుంపల పులుసు మాత్రం కుదరటం లేదు రా చిన్ని నాకు. ఆమ్మ చేసే వుప్పూకారం పప్పు కూడ రావటం లేదు ఎట్లా ఐనా రాజయ్య తాత చేతి నుంచి వచ్చిన కందులు కావు కదా.. మీకు ఇంకా పంపుతున్నాడా రాజయ్య తాత కందులు, మినుములు. తాత పొలం బలే మంచి నేల కదా దుక్కి దున్నేడంటే రెండో పంట నుంచి కూడా పుట్లు రాలాల్సిందే కదా..

అవును మీ బావ గారి వాళ్ళ బావ గారు చని పోయారు పాపం. చాలా సార్లే మాట్లాడేరు కృష్ణ వాళ్ళ బాబాయి తో.. నేను కూడా మాట్లాడేను ఎవరు మాట్లాడినా ఏమి లాభం లే పోయిన వాళ్ళను తిరిగి తేలేము కదా.. పాపం పిల్లలను చూస్తేనే దిగులేస్తోంది.. తల్లి తండ్రులు లేని జీవితం ఎంత సుస్సంపన్న మైనా లోపమే కదా.

సరే మరి వుంటాను ఆరోగ్యం జాగ్రత్త. చింటూ, చాయమ్మ జాగ్రత్త.. కిందటి వారం నువ్వు లేవు, రవి తో పిల్లలతో చాలా సేపే మాట్లాడేను చెప్పే వుంటారు కదా. రవి ఏదో సిందాబాద్ రాజ కుమారుడి కధ చెపుతున్నాడంట ఆ కధ కూడా చెప్పేరు. చిన్నీ.... రవి బంగారు తండ్రే... అడిగేను అని చెప్పు మరి.
వుండనా
ప్రేమ తో నీ అక్క
సింధు.


33 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

చెల్లీ చిన్నీ, అక్కా సింధూ నాకు నిద్రవస్తుంది. పడుకొని రేప్పొద్దున్నే నీకు ఉత్తరం వ్రాస్తాను.

తృష్ణ చెప్పారు...

"పాల నురగతో అమ్మ చేసి ఇచ్చిన కాఫీ తాగుతూ, స్టూల్ వేసుకుని ఎగిరెగిరి కోసుకున్న సన్నజాజుల పూల ను మాల కట్టుకుంటున్నప్పటి ప్రశాంతత ... "

.......ఎక్కడికో వెళ్పోయాను...

sunita చెప్పారు...

baagundi.

మురళి చెప్పారు...

కాసేపు ఎక్కడెక్కడో విహరించి వచ్చాను.. అక్కాచెల్లెళ్ళ ఆలోచనల్లో వైవిధ్యం, వాళ్ళిద్దరి అనుబంధం భలేగా పట్టుకున్నారు.. జాజికాయ పెట్టె అనగానే అప్రయత్నంగా మా బామ్మ గుర్తొచ్చింది నాకు... చాలా బాగున్నాయి ఉత్తరాలు...

అజ్ఞాత చెప్పారు...

బావుందండీ, ఏవైనా.... ఏమే ఒసే అనుకోటంలో ఎంత దగ్గరితనం ఉంటుందో కదా! మా పిన్ని కూతురు నన్ను ఏమే అక్కా ....అంటే మా అత్తగారింటిలో ఆక్షేపిస్తారు. ఏంటా ధీర్గాలు అని.
భా. రా. రె. గారు ఏంటండీ చిన్న పిల్లల్లా....( ఉష గారి బ్లాగులొ భావన గారి వ్యాఖ్యకి ఇది మీ స్పందన కదూ...?)

పరిమళం చెప్పారు...

బావుంది అక్కా చెల్లెళ్ళ అనుబంధం ..... దూరమైపోయిన ఉత్తరాలను మళ్ళీ గుర్తు చేస్తున్నారు !

జయ చెప్పారు...

ఆ అక్కా చెళ్ళెల్ల మద్ధ్యలో నేను కూర్చోని వాళ్ళ వూసులన్నీ నేను ప్రత్యక్షంగా విన్న అనుభూతి నిచ్చారు భావన గారు. ఇంత వివరంగా ఇంకా ఈ రోజుల్లో ఉత్తరాలు రాసుకోవటం కూడా జరుగుతోందా. ఎంతైనా ఉత్తరాలలొ ఉన్న మధురిమే వేరు. మీ ఉత్తరాలన్నీ కూడా చాలా బాగుంటాయి.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

నేనొచ్చేసా... ఏంటి ఇదంతా నిజం వుత్తరమే?
అక్కా చెల్లెళ్ళ కబుర్లు, అమ్మ నానమ్మ కబుర్లు. పల్లెటూరి అందాలు, అందులోని మధురిమలు.

బాగుంది బాగుంది.

అవునండీ దాలిపొయ్యి అంటే మట్టితోనో , రాళ్ళతోనో మూడు కాళ్ళగా చేసి కట్టెలతో మండించే పొయ్యా లేక గాడి పొయ్యా?
మరో విషయం తల్లి తండ్రులు లేని జీవితం ఎంత సుస్సంపన్న మైనా లోపమే కదా! అంటే?

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

అయ్యో లలితగారూ మేము కొట్లాడుకోవడం లేదండీ. ఇంత పెద్ద వుత్తరం రాత్రి చూడగానే గుడ్లు తేలేసాను. అసలే భావన వ్రాసే భావుకత అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది.ఇదంతా ఇప్పుడు చదివి ఊహాలోకాల్లోకి వెళ్ళడమెందుకని టపాని ఠక్కున మూసేశా :)

భావన చెప్పారు...

తమ్ముడు భ.రా.రే: అంత నిద్రొస్తుందేం... :-) :-) ;-)

తృష్ణ: నేను ఇంకా దూరం వెళ్ళేను మీ తిలక్ గారి మీద పోస్ట్ చూసేను.. ష్.. ష్... ఈ భా రా రే వచ్చి అక్కడ నుంచి దూకమంటారు వూరుకోండి.. ధన్యవాదాలు.

సునీతా: టాంక్ యూ .. :-)

భావన చెప్పారు...

మురళి: అవును మా నాయనమ్మ దగ్గర కూడా పెద్ద జాజికాయ భోషాణం పెట్టె అమ్మో ఎంత బరువో మూత... ప్రపంచం లో నాకు ఇష్టమైన వస్తువులలో అది ఒకటోదో రెండోదో.. ధన్య వాదాలు.

లలిత: అవును అండి మీ గోదావరి వాళ్ళకు కొంచం పట్టింపులు మర్యాదలు ఎక్కువ మా వైపు మాములు గా అనుకుంటాము. ధన్యవాదాలు.
భా.రా.రే అంతే చిన్నపిల్లాడి లా లలితా. గోడ కుర్చి వేయించుదాము లే.. :-)

భావన చెప్పారు...

పరిమళం: అవునండి.. నాకు అదే బెంగ గా వుంటుంది ఇలా అన్నీ మర్చి పోతున్నామే అని. :-(

జయ: ఇప్పుడా.... ఎవరైనా రాసుకుంటారేమో మరి! మా అక్క కు, స్నేహితులకు చిన్నప్పుడు రాసే దానిని ఇప్పుడూ ఏమి లేదు.. :-( అందుకే గా మీ అందరికి రాసేస్తున్నా ఇప్పుడూ..

భావన చెప్పారు...

భా.రా.రె: దాలి పొయ్య అంటే మట్టి తో చేసి అలికి పిడకలు గడ్డి పెడతారు చాలా నెమ్మది గా తక్కువ సెగ తో పొద్దుటే రాజేస్తే అలా వెలుగుతునే వుంటుంది. కట్టెలు పెట్టరు గడ్డి కూడా బాగా పెనేసి పురులకు పెడతారు చూడు అలా టై చేసి పెడతారు నెమ్మది గా రాజుకోవటానికి. మధ్యాన్నం దాకా ఈ వులవల వంటివి వుడక బెట్టి మధ్యాన్నం నుంచి నీళ్ళ పొంత పెడతారు ఒక్కోసారి. కృష్ణా జిల్ల పల్లెటూళ్ళలో వంటిల్లు కు చుట్టిల్లు అని కొంచం వెనుకగా వుంటుంది,అది దాని పక్కన ఈ దాలి పొయ్యా ఒక సాధారణ దృశ్యం, మిగతా జిల్లాలలో కూడా వుంటుందేమో నాకు తెలియదు.
ఇంక "తల్లి తండ్రులు లేని జీవితం ఎంత సుస్సంపన్న మైనా లోపమే కదా! అంటే?" నిజం గా తెలియకే అడిగేరా? :-|

teresa చెప్పారు...

భావనా,

చాలా రోజుల తర్వాత ఊరుకోలేక మొదలెట్టిన కామెంటు--
ఉత్తరం బాగుంది, బోలెడు జ్నాపకాల్ని తవ్వింది్.
కానీ మీ శైలి చాలా చోట్ల క్రిష్ణా జిల్లా మాండలీకం నించి కొంత deviate అయిపోయిందనిపించింది. ఉదా- పగడాలు చేయించుకోడం.. చుట్టించుకోడం.

దాలి పొయ్యి పాలు మరిగించేది, దాలి గుంట ఉలవలు ఉడికించేదీ. రెండూ వేరని నేననుకుంటున్నా. బై ద వే, ఈ ఉలవల దాలిగుంటల్లో చిన్న పిల్లలు నడుచుకుంటూ వెళ్ళి పడిపోయి వళ్ళు కాలటం దారుణం గదూ, అరుదుగా వినబడుతుండేది :(

భావన చెప్పారు...

చాలా రోజుల తరువాత మీతో కామెంటించగలిగినందుకు మరి గర్వం గా వుంది తెరెసా..
ఇంక భాష.. అవును నిజమే కదా చుట్టించుకోవటమంటారు కదా... మారుస్తాను. ధన్యవాదాలు తెలియచెప్పినందుకు.
మేము దాలి గుంట నే దాలి పొయ్య అని కూడా అనే వాళ్ళము.. అవును దాని మీదే పాల కుండ కూడా పెట్టే వాళ్ళము కాని రెండు పొయ్యలెప్పుడూ గుర్తు లేదు మరి. మా అమ్మమ్మ తెగ అనేది ఏమిటో ఏ పొద్దు లేచినా దాలిగుంట కాడే పొద్దెక్కుతుంది అనుకునేది స్వగతం లా, తరువాత ఎప్పుడో తెలిసింది నాకు ఐద్ సామెత అని, ఆమె నిజం గా ఆ దాలి గుంట దగ్గర అని లిటరల్ గా ఆ అర్ధం తో అనేది అనుకునే దానిని నేను.. :-)
అవును పాపం చిన్నప్పుడు నేను కూడా విన్నా అలా వొళ్ళు కాలటం చిన్న పిల్లలది అందులో పొయ్య మరి ఇంటి ఎదురు గా కూడా వుండదు కదా.
మళ్ళీ ఎన్ని కబుర్లో చూసేరా..

అజ్ఞాత చెప్పారు...

భా.రా.రె గారు ప్చ్....ఎంత నిరాసపరిచారండీ!
భావనగారు, జిల్లా మొత్తం సంగతి ఏమోకానీ ......మా ఇళ్ళల్లో మాత్రం మరీనండీ ! అమ్మయ్య( అమ్మ), అప్పయ్య( అక్క) , వదినియ్య ( వదిన) బావజ్జీ ( నాన్న) మామ్మయ్య( మామ్మ) ఇలా ఉంటాయి పిలుపులు .ఎవరూ నవ్వకూడదేం.....
దాలి పొయ్యి పాలు కాయటానికి ఉపయోగించేవారు. ఇది కాకుండా పొట్టు పొయ్యి అని మధ్యలో కర్రపెట్టి దాని చుట్టూ గట్టిగా రంపం పొట్టు వంటిది కూరేవారు అది అలా మెల్లగా సాయంత్రందాకా కాలుతూ వుండేది .
అయినా ఇదేంటండీ......పొయ్యిమీంచి పెనంలో పడ్డట్టూ అన్న సామెత ఉందికానీ .....ఇలా అంతా ఉత్తరంలోచి పొయ్యిమీద పడ్డాం.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

రెండు లేఖలు చాలా బాగున్నాయండీ. పైన ఎవరో అన్నట్లు ఆలోచనలొ వైరుధ్యాన్ని భలే పట్టుకున్నారు. ఇక ఙ్ఞాపకాలకైతే కొదవేలేదు, వర్షం పడిన తర్వాత కాస్త పెద్దగా ఎదిగిన సన్నజాజి మొక్కని కుదిపితే జలా జలా నీటి బింధువులను రాల్చినట్లు మది అంతా బోలెడు ఙ్ఞాపకాల జల్లులతో తడిసింది. చిన్నపుడు అమ్మకి గులాబీలూ, కనకాంబరాలూ, నందివర్ధనాలు కోసిచ్చిన రోజులు గుర్తుకొచ్చాయి.

అజ్ఞాత చెప్పారు...

అయ్యో.....సామెత తిరగేసి నట్టున్నానుకదా! పెనం మీంచి పొయ్యిలోపడ్డట్టూ......ఇది కరెక్ట్

భావన చెప్పారు...

లలితా మీరేమి బాధ పడకండి భా రా. రె మీద మరువం ఉష బ్లాగ్ లో కత్తులు విసిరేను చూడండి.:-)
అవునా అంత మర్యాద గా పిలుచుకుంటారా నవ్వెందుకు గాని ఠారెత్తి పోతాము మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడాలంటే. మీరు సామెత తప్పు రాసినా మాకు సరిగానే అర్ధం అయ్యింది అవును పొట్టూ కూరిన పొయ్యలు వుంటాయి కాని అంత వాడకం చూడలేదు నేను మా వైపు. కుంపటి మీద పప్పు పాలు చేసేది మా అమ్మమ్మ. కుంపటి అంటే బొగ్గుల కుంపటి. నిజమే పొయ్యల మీద మొదలయ్యింది కదు సంభాషణ. దాలి పొయ్య ఎంత పని చేసింది.. :-)

భావన చెప్పారు...

వేణు నచ్చినందుకు ధన్యవాదాలు. చిన్నప్పుడూ అమ్మకు కంకాంబరాలు కోసిచ్చే వారా మంచి అబ్బాయి.. మా అబ్బాయి ని బయటకు వెళ్ళి నాలుగు ఆకులు తుంపుకు రారా అంటే వినాయక చవితి కి ఏమి ఆకులు ఫెర్న్ ఆకులా మేపుల్ ఆకులా అని అదేదో సినిమా లో సుత్తి వీర భద్ర రావు లా లిస్ట్ చదువుతాడు కాని చెయ్యడు. అవును చాలా బాగుంటుంది కదు వాన తగ్గ గానే సన్నజాజి పందిరి కుదిపితే జాజి పూల వాన ను నీటి చుక్కల బోనస్ కలిపి విర జిమ్ముతుంది.

మాలా కుమార్ చెప్పారు...

అక్క చెళ్ళెళ్ళ ఉత్తరాలు బాగున్నాయండి .
అంతా బాగుంది , కాని , ఎంత గుడ్ బాయ్ మీవాడు , నోటి నుండి మాటే రాదు . అంతటివాడిని మీ మాట వినడు అనటము బాలే !

నేస్తం చెప్పారు...

అబ్బా మీ పోస్ట్ దాని వాక్యలు.. ఎంత బాగున్నాయో..నిన్నటి నుండి మా ఆయనకు వినిపిద్దాం అని తెగ ప్రయత్నిస్తున్నా..వినరేం..ఎంత మిస్ అయిపోతున్నారు మా ఆయన వినరేం :(

సిరిసిరిమువ్వ చెప్పారు...

ఎన్ని జ్ఞాపకాలని తిరగతోడాయో మీ అక్కాచెళ్లెళ్ళ ఉత్తరాలు. మన ఇళ్లల్లో తరతరాల సంపదలు కొన్ని ఉంటాయి. భోషాణం అందులో ఒకటి...ఇంటికో పెద్ద ఆభరణంలాగా ఉండేది..దానితో ఎన్నెన్ని అనుబంధాలో! దాని మూత తీసి చూస్తే ఎన్నెన్ని రహస్యాలో!

అన్నట్లు మొన్నో రోజు దేనికోసమో నెట్టులో కెలుకుతుంటే యాదృచికంగా మీ ఫోటో చూసాను....ఎక్కడ చూసి ఉంటానో చెప్పుకోండి..అది మీరే అని రూడీ చేసుకున్నానులే!

భావన చెప్పారు...

మాల గారు: అక్క చెల్లెళ్ళ అనుభందం అలాంటిది కదా మీకు నేను ప్రత్యేకం చెప్పేది ఏమి వుంది లే. :-)
మా వాడు అలా మీ ముందు నెమ్మది గా వుంటాడు అది చూసి మీ వంటి వాళ్ళందరు అయ్యో పాపం మంచోడూ... అనుకుంటారు.. నాకు కోపం వచ్చినప్పుడల్లా దీవిస్తా నీకు మంచి మార్షల్ ఆర్ట్ వచ్చిన చైనీస్ అమ్మాయో, బాగా నాట్యం తెలిసిన ఇండియా అమ్మయో దొరకాలి కోపం వచ్చినప్పుడల్లా గది లోకి వెళ్ళటం... చుంగ్ చాంగ్ చూంగ్ లేక పోతే తక ధిమి తక ధిమి.. (గది లోకి ఎందుకంటే ఎంత అనుకున్నా కొడుకు కదా నా ముందు కొడితే బాధ గా వుంటుంది గది లోకి తీసుకెళ్ళి కానిచ్చమ్మా అని నేనే సలహా ఇస్తాగా) ;-)

భావన చెప్పారు...

నేస్తం అంతే నేస్తం హృదయం లేని మొగవాళ్ళు ఈ సారి క్రికెట్ లేక విరహపడిన స్నేహితులు అని పోస్ట్ రాస్తాను అప్పుడు మీ వారే చూపిస్తారు అబ్బ చూడు ఈమె ఎవరో ఎంతా బాగా రాసేరో అని.. హంతే నేస్తం హంతే.. ;-) నచ్చినందుకు ధన్య వాదాలు.


సిరిసిరి మువ్వ: అవును కదా భోషాణం పెట్టి ఒక సంపదలా వుంటుంది మా పెద్దమ్మ పెట్టె మూత ఎత్తుతుంటే నాకు బలే ఆసక్తి గా వుంటుంది ఏమి తీస్తుంది ఇప్పుడూ అని. (ఆమె విస్తరాకో లేదా పెరుగు గిన్నో తీస్తుంది అనుకో) అదేదో మణి మాణిక్యాలున్నట్లు అందులో.
అవునా నన్ను చూసేరా ఎక్కడ కౌముది లో అయ్యి వుంటుంది లేదా నా married last name యలమంచిలి తో ఏవో పిక్చర్స్ వుంటాయి నెట్ లో అవి చూసేరా? వూ మా నాన్న గారి పేరు మీద ఏదో సాహిత్య అవార్డ్ ఇచ్చినప్పుడూ భాస్కర రావు గారు నా ఫొటో తీసుకున్నారు మా ముగ్గురిది అది చూసేరా, అబ్బ ఏమో నబ్బ మీరే చెప్పాలి నా వూహా శక్తి కి అందటం లేదు..

Hima bindu చెప్పారు...

హుమ్మ్ !నేనెప్పుడు అక్కకి ఉత్తరం రాశానబ్బా :)
చాలా చాల బాగున్నాయి కబుర్లు .

భావన చెప్పారు...

చిన్ని మీరే గా మొన్న రాసి మీ అక్క అడ్డ్రెస్ బదులు నాకు పమ్పిన్చినట్లు వున్నారు మర్చి పోయి.. ;-) ’చిన్ని’ అనేది నాకు ఇష్టమైన నిక్ నేమ్ చిన్ని. నచ్చి నన్దుకు టాన్క్ యూ..

శ్రీలలిత చెప్పారు...

నేనసలు ఇప్పుడిప్పుడే మీతో మాట్లాడకూడదనుకున్నా. ఇంతింత భావుకతతో, ఎప్పటెప్పటి కబుర్లో తెలిపే ఉత్తరాలు. అస్సలు మాట్లాడకుండా మౌనంగా ఆస్వాదిద్దామనుకున్నా.. కాని మా గోదావరి జిల్లా మాట వచ్చిందే.. మరి ఊరుకోలేకపోయాను. అందులోనూ మా లలిత ఒక్కతే అయిపోయింది. మా గోదావరి జిల్లా వాళ్ళకి మర్యాదలు ఎక్కువని మీరంటే ఎవరో చెప్పిన జోక్ గుర్తు వచ్చింది. ఇది కేవలం జోకేసుమా.. అలా అనుకునే చదవండి...
కృష్ణాజిల్లా ఒకాయన నాతో అన్నారు కదా..” మీ గోదావరి జిల్లా వాళ్ళకి మర్యాదలు ఎక్కువండీ..” అని.’
”అంటే ఏమిటండీ?..” అనడిగా..
”అంటే ఏముందండీ.. ఇంట్లోకి దొంగ వస్తే మేము దొంగాడొచ్చాడు..అంటాము. మీరు దొంగగారు వచ్చారు అంటారు..”అన్నాడాయన..
అదన్నమాట...

భావన చెప్పారు...

శ్రీ లలిత గారు ఇది అన్యాయం నాతో మాట్లాడొద్దు అనుకున్నారా.. వూ వూ వూ నేను ఏడుస్తున్నా. అమ్మయ్య లలిత మీ గోదావరి నా దగ్గరకు లాక్కొచ్చాయి మిమ్ములను. ఇద్దరకు ధన్యవాదాలు. జోక్ బాగుంది. నేనొక జోక్ చెప్పనా.. ఇది నిజం గా జరిగింది. నా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో మా జూనియర్ రాజమండ్రి అమ్మాయి వచ్చింది నాకు నా క్లాస్ మేట్స్ కన్నా జూనియర్ లతోనే ఎందుకో బాగా స్నేహమెక్కువ. ఒక రోజు ఎండాకాలం మధ్యాన్నం ఒక ఐదుగురు వరకు రూమ్ లో కబుర్లు చెప్పుకుంటున్నాము మా రాజమండ్రి అమ్మాయి తలుపు తీసి ఆయ్ ఇటు వచ్చి షోడా ఒకటి ఇవ్వండి అంది.. మాకు సౌండ్ లేదు షో్డా బండి అబ్బాయి ని మీరు అని మొదటి సారి విన్నా, అంటే ఆ అబ్బాయి తక్కువ అని కాదు కాని మా కృష్ణా జిల్లా వాళ్ళకు అది ఖచ్చితం గా వూహ కు అందని విషయం. తేరు కున్నాక తెగ ఏడిపించామనుకోండి. ఐనా పాపం మంచిది. మా కోసం ఎన్ని మంచి మంచి స్వీట్స్ తెచ్చేదో శెలవలకు వెళ్ళినప్పుడల్లా. మా వైపు అంటారు గోదావరి వాళ్ళకు పిల్ల ను ఇవ్వలేము ఆ పెట్టుపోతలు మన వల్ల కాదు ఆ సారె కే ఐపోతాయి ఒక లక్షన్నర. పిల్ల ను తెచ్చుకుంటే బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు అని. ఇంకా చాలా వున్నాయి ఒక పోస్ట్ రాయొచ్చు.

తృష్ణ చెప్పారు...

మీరు అడిగిన కధ రాసాను జవాబులో..వీలున్నప్పుడు వచ్చి చదువుకోండి మరి..

మరువం ఉష చెప్పారు...

:( పైన అంతా చెప్పేసారు నేనాల్సిన మాటలు. కొన్ని అమ్మమ్మ గారి వూర్లో వేసవి సెలవలకి వెళ్ళినపుడు జరిగినవే. నీ అంత బాగా వ్రాలేను కనుక ఒక్కటే మాట. ఇంకా అలా అలా చదువుతూ ఇక్కడే వుండాలనివుంది. వంకాయ రోటి పచ్చడి, ఉలవచారు అంటే పడిచస్తాను. సన్నజాజులు అంటే మహా మోజు. బహుశా నీకు ఇష్టమ్మయ్యే ఈ లేఖల్లోకి జొప్పించివుంటావు. ;)

మాలా కుమార్ చెప్పారు...

పాపం బుజ్జి గాడు !

అజ్ఞాత చెప్పారు...

maa naanamma ippudu adea paristhitiloe vundi. kaani maa amma leadu.oepikaga bharistuu,appudappudappudu visukkutunnadi manumaraalu koedalaina naa maradalu pilla. mii post chuustea okkasaari eavoe jnaapakaalu sudulu tirigaayi.