25, ఫిబ్రవరి 2009, బుధవారం

ప్రియమైన నీకు

ప్రియమైన నీకు ,
నువ్వు నేను వేరు కాదు అవును వేరు కానే కాదు మన వలపు తీవ కు వేరు లా ఎక్కడో అడుగున నేను ... చిరు కొమ్మ కు వేసిన చిగురు లా నువ్వు వేరు కానే కాదు కాని ఎప్పటికి వేరే వేరే నే.... కాని ఇద్దరం ఒకరు లేక ఇంకొకళ్ళం లేనే లేము ...చిత్రమైన మన జీవితం...... ఈ దేశపు వాతావరణం లానే.

ఇక్కడ బాగా చలి వచ్చేసింది .. కిందటి వారమైతే దాదాపు గా 2 అడుగుల మన్చు పడింది . అబ్బ తీసి తీసి చిరాకై పోయింది ..... ఈ 3 నెలలు పెద్ద శిక్ష అనుకో ఈ వూర్లో వుండటం ... మార్చ్ వచ్చేసరికి ఎందుకు రా బాబోయ్ ఈ జీవితం ఇంక ఎంత కాలం రా ఈ వూరిలో అనే వైరాగ్యం నెత్తి దాక ఎక్కి వుంటుంది అప్పుడు మొదలు అవుతుంది ప్రకృతి కరుణ మన మీద ... తలుచుకుంటేనే ఆ అందం ఈ మంచు జడులను చలి తుఫానులను వోర్చు కోవచ్చును ...

ఇలానే కాబోలు మన జీవితం లో కూడా ఆశ నడిపిస్తూ వుంటుంది ముందు జీవితం లో వసంతం ఎదురుచూస్తుంది కొంచం గా ఈ కష్టాల పరంపర ను ఎదుర్కుంటే అని.... :-) కానీ మన జీవితం లో మాత్రం ఎప్పటికి వస్తుందో ఆ వసంతం ... చూసి చూసి కళ్లు కాయలే కాచేను అని అదేదో పాత సినిమా లోలా పాట కూడా పాడు కోవాలో ఏమో ...

మన వూరిలో ఈ సరి కి బోలెడన్ని చేమంతులు కనకాంబరాలు , ముళ్ళ గొరింట , డిసెంబర్ పువ్వులు బోలెడన్ని పూస్తాయి కాదు .... పొద్దుట పొద్దుటే పారిజాతాలు ... నిత్య మల్లెలు... ఇవి కాక పున్నాగ పువ్వులు ఎలాను నిద్ర లేపుతాయి ... సాయింత్రమైతే విరజాజుల వానలు , చంద్ర కాంత పూల పలకరింపులు ప్రకృతి ఇచ్చే అదనపు బహుమతి అనుకో ... అబ్బ అవి అన్ని తలుచుకుంటే ఎంత బెంగ గా అనిపిస్తుందో ... వదిలేసి వచ్సెసేము కదా వాటిని అన్ని టిని .. పాపం మా దొడ్లో పూలన్నీ నేను ఇక్కడికి వచ్సెయ్యగానే ఎంత బెంగ పెట్టుకున్నాయో ....

అరె అంతలోనే అంత ఎర్ర గా చూస్తావేంటోయ్ ... నువ్వు బెంగ పెట్టుకోలేదు అని అన్నానా నేను ... ఎర్ర బారిన కళ్ళలో కలువ లు చూడు ఎలా పూచాయో వాటికోసమైనా చంద్రుడి నై నేను రానా ప్రతి రాత్రి నీ కలలో కి అని నన్ను ఓదారుస్తూ నీ కళ్ళలో వచ్చిన మంకెన్నలను నేను చూడలేదనుకుంటావు నువ్వు .... అసలు ఎందుకు దూరం అవ్వాలి మనము అని నేను పెట్టిన పేచీ కు చెప్పిన మాటే మళ్ళి మళ్ళీ వెయ్య సార్లు పరిస్థితులను వివరిస్తూ నా చేతి ని గట్టి గా పెనవేసిన నీ చేయి వణకటం నేను గమనించలేదు అనుకుంటావు నువ్వు .... ఇద్దరికీ తెలుసు మళ్ళీ మన జీవితం లో తిరిగి వసంతం ఎప్పుడో తెలియదు అని కాని ఇద్దరికీ తెలియనట్లు నటించాము అంతే ... చూసేవా అందుకే నేను ప్రతి రోజు నీకు వుత్తరం రాయను .. బాధ పెట్టేనా నా ప్రాణాన్ని .... ఏమి చెయ్యను కృష్ణా ఎంత నన్ను ఓదార్చుకున్నా నువ్వు లేవు నా పక్కన అనే ఆలోచన ఒక శీతల పవనమల్లె మనసును ఒణికిస్తుంది ఒక్కోసారి ..

వు...... సరే కాని మర్చి పోకుండా శని వారం శని వారం బిర్లా టెంపుల్ కు వెళుతున్నావా . నీ కోసం ఎదురుచూస్తూ ఆ పెద్ద రాయి మీద నేను కనపడక పోయినా నా మనసు ఆత్మా అంతా అక్కడే వుంటుంది నీ కోసం ఎదురుచూస్తూ ... నా శరీరం ఇక్కడ వున్నా ....

నిన్న రాం నారాయణ గారి ఇంట్లో చండీ హోమం ఐతే వెళ్ళెను ... చాలా బాగా చేసేరు ... ప్రకృతి ని చూస్తే ఎంత గౌరవం గా ఎంత భయం గా కూడా వుంటుంది కదు .. గాలి నేల నీరు నిప్పు ఆకాశం... వీటిలో ఆకాశం ఏమో తెలియదు కాని మిగతా 4 మూలాలను ను చూస్తుంటే ఎంతో గౌరవం గా కొంచం భయం గాను వుంటుంది ... అలా ప్రజ్వరిల్లే అగ్ని ... చిత్ర విచిత్ర పోకడలు పోతూ గాలి ని తోడు తీసుకుని అంతలో సందె కెంజాయి రంగు ఇంతలోనే దాని లో కలిపే నీలి మిశ్రమం .... ఒక్క నిమిషం లో వెలుగు రవ్వలు అంత లోనే వూపు తగ్గించి కలిసే చీకటి దివ్వెలు ...... ఎంత అందం గా వుంటుందో ఆ మంత్రాలు మనకు ఎలాను అర్ధం కావు కాని ఎంతో శ్రద్ద గా ఆ అగ్ని ని చూస్తూ అది చెప్పే వూసులు వింటూ .. అది పోయే పోకడలు చూస్తూ ఆశ్చర్య పోతూ .. ఆనందిస్తూ .... 4 గంటలు ఎలా గడిచాయో కూడా తెలియలేదు ....

13 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

మధుర భావాల సుమ మాల ........మీ మనసులో మాట .excellent!

భావన చెప్పారు...

ధన్యవాదాలు... భావాల హోరు జలపాతమైతే అందులోని ఒక తుంపర నైనా మీ అందరి తో పంచుకోగలుగుతున్నాను... మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. :-)

మురళి చెప్పారు...

ఇప్పుడే మీ టపాలన్నీ చదివానండి. అనుభూతులని అక్షరీకరిస్తున్న తీరు అద్భుతం. పాఠకులని కూడా మీతో తీసుకెళ్తున్నారు. మరీ అవసరమైతే తప్ప ఇంగ్లిష్ వాడకండి..తప్పనిసరి ఐనప్పుడు ఆ పదాలని తెలుగు లో రాయండి, చిన్న సూచన అంతే.. అన్నట్టు మీ బ్లాగు ని జల్లెడ, కూడలి లో లంకె వేశారా? అలా ఐతే ఎక్కువ మంది చదవడానికి వీలవుతుంది. రాస్తూ ఉండండి..

కొత్త పాళీ చెప్పారు...

చాలా మధురంగా రాశారు. అభినందనలు.
ఒక సూచన. మూణ్ణాలుగు వాక్యాలకంటే పెద్ద పోస్టు రాసినప్పుడు చిన్న చిన్న పేరాలుగా విభజిస్తే చదివే వారికి సౌకర్యంగా ఉంటుంది.
మీ వూళ్ళో మార్చిలోనే కరుణిస్తుందా ప్రకృతి? మాకు అంత అదృష్టం లేదు. ముందు వెచ్చటి ఉష్ణోగ్రతలతో ఊరించి, మనల్ని మన జాగ్రత్తనించి ప్రమత్తుల్ని చేసి అప్పుడ్ గూబ గుయ్యనేలాగా ఒక అడుగు మంచు నెత్తిన గుమ్మరిస్తుంది :)

భావన చెప్పారు...

@కొత్త పాళీ: ధన్య వాదాలు. తప్పక మీ సూచన పాటిస్తాను... ఇప్పుడే మొదలు పెట్టిన తప్పటడుగులు.. మీ అందరి చేయూత సదా నాకు కొండంత అండ.. మా వూళ్ళోను అంతే నండి. మురిపించి మెరిపించి మోసగించటం లో తక్కువ కాదు... :-)
@మురళి: ధన్యవాదాలు. మీ సూచన తప్పక పాటిస్తాను. నేను కూడలి లో లింక్ వేసేననే అనుకుంటున్నా, మొదటి లో ఈమెయిలు ఇచ్చాను వారు వేసే మనే అన్నారు.. ఎలా చూడాలి లింక్ వుందోలేదో.. :

Subba Reddy చెప్పారు...

అబ్బ,ఎంత పరిమళం మీ రాతపూలకి. మనసులను రాళ్ళు చేసుకున్నమనిషులు ఎక్కువైపొతున్నారని మౌనంగా కన్నీళ్ళు కార్చే నాకు,అంతర్జాలంలో కనబడుతున్న పరిమళభరిత పాళీలు ధైర్యాన్నిస్తున్నాయ్.భయంలేదు ఈ ప్రపంచాన్ని మార్చుకోవచ్చు.
-సుబ్బారెడ్డి

భావన చెప్పారు...

పరిమళం రాసే నా రాతలోనే కాదు చదివే మనసుది కుడా... నచ్చినందుకు ధన్యవాదాలు... అవును మార్చగలం ఈ ప్రపంచాన్ని కూసింత కరుణ.. కూసింత మానవత అందరం పంచుకోగలిగితే...

Hima bindu చెప్పారు...

మొన్న కాంప్ నిమిత్తం భీమవరం వెళ్లి అక్కడినుండి ఏలూరు వెళ్ళ.దారి లో ఇదేనమ్మ తమ్మిలేరు అని డ్రైవర్ చెప్పగానే .,కార్ ఆపుకుని అక్కడ ఐదు నిముషాలు గడిపాను, చలం గార్ని తలుచుకుంటూ ,,,.ఎందుకో మీకు అర్దమాయే ఉంటది ,,.

శరత్ కాలమ్ చెప్పారు...

ఉష, మధురవాణి మరియు మీరు వ్యాఖ్యలకు ఇచ్చే సమాధానాలు చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి. అవి చదువుతుంటే గలగలా పారుతున్న సెలయేరులో నడుస్తున్నట్లే అనిపిస్తుంటుంది నాకు.

భావన చెప్పారు...

@చిన్ని.. అవును తమ్మిలేరు అంటే చలం గుర్తు రాకుండానే వుండరు.. తమ్మిలేరు అనే ఏమి వుంది ఎక్కడ కాసిన్ని నీళ్లు దాని ఒడ్డున ఒక చిన్ని గుడిసె లేదా ఒక బంగ్లా వున్నా నాకు చలమే గుర్తు వస్తాడు... అదే కాదండోయ్ సోమరి వేసవి కాలపు మద్యాన్నపు పూట, బద్ధకం గా కదిలే మేఘం చూసినా.. అలసిన సాయింత్రపు పడమటి గాలి నారింజ పూల పరిమళాన్ని తోడూ తెచ్చుకున్నా నాకు ఆయనే గుర్తు వస్తారు. ఆ అలసిన గుండె వెతికిన చూపు... మరచిన తలపు.. విసిగి కలిసిన ఆధ్యాత్మిక దారి అందులో ఆయన కు దొరికిన శాంతి... ఏ క్షణాన మర్చి పోగలం చిన్నీ... ఆ ఆలోచనల ఘోష తీవత్ర వాటిని లక్షల వాలికలు చేసి మన అందరి గుండెలోకి ఒక్కో చ్సిన్న తునకను పంపితేనే ఇంత ఆలోచిస్తూ ప్రతి దానిలోని నిజానిజాలను న్యాయ అన్యాయాలను గురించి మధన పడుతున్నామే పాపం ఆయన ఎంత ఘోష అనుభవించారో...

@శరత్ నా రాతలు నచ్చటమే కాకుండా నా వ్యాఖ్యలు కూడా నచ్సినదుకు ధన్య వాదాలు (నీ రాతలు నచ్చాయని నేను ఎక్కడా అనలేదే అంటారా :-)) చక్కటి సెలయేరు లో నడక పాదాలకు ఎంతో వుల్లాసం ఇంకా నడక కొనసాగించటానికి వుత్సాహం ఇస్తాయి కాని ఒక్కోసారి సెలయేటి జోరు ఎక్కువ ఐతే పాదాల మీద అదుపులేక సెలయేటి తో పాటు కొట్టుకుని కూడా వెళతాము. నా వ్యాఖ్య ల సెలయేటి ని నా భావాల జోరు ను కూడా మీ అందరి తో పంచుకోవాలనే నా కోరిక...

మురళీ కృష్ణ చెప్పారు...

భావాన్ని ఎలా వ్యక్తపరచాలో కుడా తెలియదు. పదాల్ని ఎలా కూర్చాలో అసలే తెలియదు.

for loop, if condition (computer languages) తో నిర్విరామంగా పోరాడుతూ వుండే నాకు మంచి నీటికీ, పన్నీటికీ తేడా తెలియజేసారు (మీ బ్లాగ్ చాలా ఆహ్లాదంగా వుంది).

మీరందరూ ఒకరినొకరు పలకరించు కోవటం, ప్రొత్సహించుకోవటం చాలా బావుంది, ఒకే తల్లి(తెలుగు తల్లి) పిల్లల్లాగా.

మీరందరూ సాహితీ ప్రవాహం లో ఈతకొడుతూ వుంటే, మిమ్మల్ని చూస్తూ ఈ సాహితీ నది ఒడ్డున మరి కొంతసేపు సేదతీరాలని వుంది. అదిగో, నా ప్రేయసి (work), నన్ను వదిలి ఒక గంట కూడా వుండలేదు. వెళ్ళాలి. అందరికీ నా నమస్సులు.

భావన చెప్పారు...

మురళీ కృష్ణ గారు,
ధన్యవాదాలు మీకు నచ్చినందుకు నా రాతలు.. చూస్తుంటే ఆ if clause సరిగా declare చెయ్యక indefinite loop లో పడిపోయినట్లు వున్నారు.. emergency exit ఏమైనా వుందేమో చూడండి. ఒక్క సారి వస్తే మీరు మాతో కలిసి ఈత కొట్టవచ్చు మరి..

సిరి చెప్పారు...

చాలా బాగుంది అండి భావన గారు :) ఇలా మనసులో ఉన్న భావాల్ని కాగితం మీద పెట్టగలగడం నిజంగా గొప్ప విషయం ... మనసుకి ఒక భాష ఉంటుంది కానీ దానిని ఇలా అక్షరం లోకి మార్చడం నిజంగా చాలా బాగుంది .