23, నవంబర్ 2009, సోమవారం

నీదైన నా స్వగతం నీకోసం....





నిన్ను నువ్వు కోల్పోయి నాలో మిగిలే ప్రతి చీకటి రాతిరి, మన ఇద్దరి మధ్యా దగ్గరి తనాన్ని మన వూపిరే నిర్ణయించే కొలమానమవ్వనీ నా సఖి... నా వునికే నీ వూపిరైనప్పుడు ఇంక కొలిచేందుకేముంది, ఇద్దరం ఒకటే అనే వేద మంత్రాన్ని మన గుండెల్ని అనంతం గా పఠించనివ్వటం తప్ప అంటావు నువ్వు ఇప్పుడు..... నాకు తెలుసు ..

తెలిసినదే అయినా...... తెలియ వలసిన రాగాల కోసం సాగే ప్రయాణం లో నా తోడెప్పుడూ వుంటానని బాస చేసి కూడా, భాద్యతల హోరు గాలికి కలవలేనంతగా కొట్టుకుపోయామని తెలిసీ.... కలలో నా రూపు ను వెతికే నా ముద్దుల సత్యభామ చేసిన విన్నపమందిదని చెప్పనా, చెప్ప లేక గుండెల లో ఆగిన వంశధార హోరు ను ఒంటరి పాంధుడనై దాటుతున్న నీ కృష్ణుడు అశక్తుడైనాడు నిన్ను కలవలేక అని మారు సందేశమంపించనా.. ఏమి చేసి నీ వేదన తగ్గించగలనో నాకు తెలియదు రా బంగారం..

నీ ముందు బయట పడి, బేల తనమన్నది మీకాపాదింపబడిన అపవాదు మాత్రమే.... కోరిన మనసు కనుమరుగవుతున్నప్పుడు అది అందరికి వర్తించే ఒక జీవన లక్షణమని చెప్పాలనిపించక వూరుకున్నాను కాని నువ్వు వెళ్ళిన మరుక్షణం నుంచి నాకూ అలానే వుంది రా అమ్ము... అమ్మాయివి, అందునా అబల అన్న పేరు వరం గా పొందినవాళ్ళు కాబట్టి నీ బాధ లోకమొప్పిన వేదన రా, నాది అలా కాదు కదా.. నీకు తెలియదు పైచేయి కూడా ఒక విధం గా శాపమే .. సారీ రా బాధ పెడితే..

మరి నేనేమి చెయ్యను ఎలానో నువ్వు లేవన్న బాధ ను తోసేసుకుని, ఈ పిల్లలకు చేయించ వలసిన ప్రాజెక్ట్ లలో మునిగి వుండగా మనసు మీద విసిరేసిన నిప్పు కణికల్లే నీ వుత్తరం వస్తుంది.. నన్ను పరధ్యానపు పలవరింతలలో ముంచి లేపటానికి.. నిన్న నీ వుత్తరం వచ్చిన దగ్గర నుంచి... శ్రీ ప్రాజెక్ట్ ఫణి కి ఇచ్చాను. ఆమె వర్క్ అంతా సీడీ లో పెట్టి రాఘవ కు పంపించాను అట. రాత్రి ఆఫీస్ క్లోజ్ చేస్తుంటె రాఘవ పరుగెత్తుకుని వచ్చాడు నేను కాదు కదా సార్ 'జీపీస్ లొకేషన్ ఫైండర్' చేసేది నేను 'పోర్టల్' కదా అని. ఇంక అప్పటికి ఓపిక లేక రాత్రికి పంపిస్తాను లే అని చెప్పి ఇంటికి వచ్చేసేను.. ఇంటికి వెళ్ళే సరికి నాన్న గారి వుత్తరం వచ్చి వుంది అమ్మ కు బాలేదు రత్న వాళ్ళ అబ్బాయి కి హార్ట్ ప్రాబ్లం అని చెప్పిన దగ్గర నుంచి ఈమె బెంగ పెట్టుకుని ఏడుస్తోంది అట. ఈ ప్రపంచం లో తల్లి కు మించిన అనుభందం, ప్రేమ ఇంకెక్కడా వుండదు కాని పాపం అమ్మ ను చూస్తుంటే ఆమె కు తిరిగి మేమందరం ఇవ్వగల బహుమానమేదైనా వుంటే దుఃఖం ఒక్కటే కదా అనిపించి అసలు ఈమె ఎందుకు ఇంత అనుభందాలు పెంచుకోవటం అని విసుగనిపిస్తోంది..అలా కోపం గా చూడకు మరి. అసహాయత, పరిష్కారం లేని సమస్యలు ఇలా అంగీకారం కాని భావాలను రప్పిస్తాయి.

అవును రా చిన్న నిన్ను ఆరకిల్ సర్టిఫికేషన్ పూర్తి చెయ్యమన్నాను ఇంకా మొదలు పెట్టలేదా? మనసు మీదకు మూగే ఆలోచనలను మళ్ళించుకోగల ఏకైక మార్గం సాహిత్యం అంటావు నువ్వు, దానిలో నిన్ను నువ్వు మర్చి పోయి ఒక విశాలమైన ప్రపంచం లో నీకైన ఒక ప్రత్యేకమైన పాస్ పోర్ట్ తో తిరగొచ్చు అంటావు. నిజమే కాని ఒక్కోసారి నాకైతే వున్న సొంత తల నొప్పులు తో పాటు ఇంకా ఎవరివో కూడా నెత్తికెత్తుకుని ఆలోచించే బదులు, నీ మనసు కు సంభందం లేకుండా నీ శక్తి ని మొత్తం కేంద్రీకరించి బుర్ర ను తీసేసుకోగల చదువు హాయి గా వుంటుంది.. ఏమిటో ఈ మనసు, బుర్ర ల మధ్య న గోల.

మొన్న రాత్రి పవర్ కట్ రోజు ఏమి తోచక డాబా మీద కు వెళ్ళి మనం ఎప్పుడూ కూర్చునే చోటు లో దుప్పటి పరచుకుని పొడుకుని ఆకాశం లోకి చూస్తూ.... పక్క నుంచి తేలి వస్తున్న విరజాజుల వాసన నీ తల నుంచి, దూరం గా వసుంధర గారి దొడ్లో నుంచి పాకుతున్న రాధా మనోహరాల సువాసన నీ ఒంటి పరిమళమని భ్రమించి అలవాటు గా నువ్వు మాట్లాడుతున్నావనుకుని 'ఈ సారి తప్పకుండా కొంటాను రా నీకు అచ్చం గా నీలాకాశానికి తణుకులద్దినట్లుండే చీర' అనేసేను. డాబా మీదే వున్న వాసు ఏమిటి సార్ కలవరిస్తున్నారు అని అనేంత వరకు నువ్వు పక్కన ఆ కొబ్బరాకుల నీడ లో ' నా అభిరుచి నీకెప్పుడు అర్ధం కాదని ' అలిగి వెన్నెల ను కొబ్బరాకుల నీడలతో కదుపుతూ కొత్త డిజైన్ లు చేస్తూ వున్నావనుకున్నా.. నా భ్రమ కు నాకే నవ్వు వచ్చింది. చూడు దగ్గరున్నంత వరకు అలా అనుక్షణం నా మీద అలిగి నీ వునికి ని వెలుగు చీకట్లతో వెన్నెల సంతకాలు చేసి ఇచ్చావు ఇప్పుడేమో అవి అన్నీ నిన్ను నాకు తిరిగి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాయి.. అలకలో, కోపం లో అదిరే నా నల్ల పిల్ల ముక్కు కొనల మీద ఆన ఇంకో సారి అలా చెయ్యను వచ్చెయ్యరా ప్లీజ్...

30 కామెంట్‌లు:

sunita చెప్పారు...

అబ్బ! ఇంత మంచి మంచి భావనలు ఎలా తోసుకొస్తాయి మీకు. చాలా చక్కగా మనసుకు హాయిగా అనిపిస్తాయి చదువుతుంటే.
keep writing.

పరిమళం చెప్పారు...

అందమైన ఊహ !
అదిసరే "నీలాకాశానికి తణుకులద్దినట్లుండే చీర" అదెక్కడ దొరుకుతుందో చెప్పరూ ప్లీజ్ ..ప్లీజ్ ...

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

భావన గారూ, పొద్దుటినుంచి ఇదిగో ఈ లైన్ల దగ్గర నుంచి కదలలేక అలా ఆగిపోతున్నా..
"మొన్న రాత్రి పవర్ కట్ రోజు ఏమి తోచక డాబా మీద కు వెళ్ళి మనం ఎప్పుడూ కూర్చునే చోటు లో దుప్పటి పరచుకుని పొడుకుని ఆకాశం లోకి చూస్తూ.... పక్క నుంచి తేలి వస్తున్న విరజాజుల వాసన నీ తల నుంచి, దూరం గా వసుంధర గారి దొడ్లో నుంచి పాకుతున్న రాధా మనోహరాల సువాసన నీ ఒంటి పరిమళమని భ్రమించి అలవాటు గా నువ్వు మాట్లాడుతున్నావనుకుని "

ఇక్కడ కాకపోతే సీన్ అంతా ఒకటే కానీ ఎవరిడాబా మీద వాళ్ళు ఒకరికొకరు నిమిషానికోసారి చూసుకుంటూ కలలు కన్నారన్న మాట :D

మురళి చెప్పారు...

"అమ్మ ను చూస్తుంటే ఆమె కు తిరిగి మేమందరం ఇవ్వగల బహుమానమేదైనా వుంటే దుఃఖం ఒక్కటే కదా అనిపించి" ....నిజం..

sowmya చెప్పారు...

భావనగారు
నేను మన చలం బ్లాగు కి ఇవాళే చేసుకున్నాను.
నేను బ్లాగు ప్రపంచానికి కొత్త. వచ్చిన దగ్గరనుండి చలంగారి మీద బ్లాగు కోసం వెతుకుతున్నాను. ఇన్నాళ్లకి ఇది దొరికింది.
చాల సంతోషంగా ఉంది.
చలమెవ్వరని నువ్వు అడగబోకమ్మా... అనే కవిత నాకోసమే రాసినట్తుంది.
అందులో నేను కామెంటు రాయలనుకున్నాను కాని ఎందుకనో వీలు పడట్లేదు.పోస్ట్ కామెంట్ మీద కొడితే ఏవేవో వస్తున్నాయి. ఎలా కామెంటు చెయ్యలో తెలియక దాని గురించి ఇక్కడ రాస్తున్నాను. ఏమీ అనుకోవద్దు.
మన చలం లో ఏలా పాల్గొనాలో వివరంగ తెలియజేయగలరు, ధన్యవాదములు.

జయ చెప్పారు...

చాలా చక్కటి భావనలు. అంతబాగా విడమరచి, మనసును హత్తుకునేలా చెప్పటం అన్నది ఒక కళ. అది అందరి తరం కాదు. భావనా! ఇది చదువుతు నన్ను నేనే మరచిపోయాను.

నిషిగంధ చెప్పారు...

"నీ ముందు బయట పడి, బేల తనమన్నది మీకాపాదింపబడిన అపవాదు మాత్రమే.... కోరిన మనసు కనుమరుగవుతున్నప్పుడు అది అందరికి వర్తించే ఒక జీవన లక్షణమని చెప్పాలనిపించక వూరుకున్నాను."

ఎంత బాగా చెప్పారు!! నిజంగా మీ లేఖలు ఎంత చక్కని అనుభూతిని కలిగిస్తాయో!

Hima bindu చెప్పారు...

యెంత బాగా రాస్తారండీ !అప్పుడే చదవడం అయిపోయిందా అనిపిస్తుంది ,రాధమనోహరాలు మక్కువతో మరీ పెంచుతున్నాను మా ఇంటిపైకి ఎక్కిన్చేసాను

భావన చెప్పారు...

సునీత: నచ్చినందుకు ధన్య వాదాలు. ఎలా వస్తాయి ఆలోచనలు అంటారా....మీరు ఎంచక్క గా చిన్నప్పటి కలలను పిలక జడల గంతులను అక్షర రూపంతో మా ముందుకు పరిగెత్తించినట్లే సునీత. :-)
పరిమళం: ఏమో నాకు తెలియదండి ప్రయత్నిస్తూనే వున్నా. మా అమ్మ కు వుండేది నా చిన్నప్పుడూ నా మోజు చూసి మా అమ్మ నాకు మా అక్క కు లంగాలు కుట్టించింది. నాకు అత్యంత ఇష్టమైన చీర అది. చూడీదార్ ల మీద చున్ని లు గా వేసుకుని సంతోష పడుతున్నా ఏమి చేస్తాం:-(

భావన చెప్పారు...

సౌమ్య: చాలా వున్నాయండి చలం మీద బ్లాగ్ లు. మైత్రేయి గారు, ఇండియన్ గారు, ఇంకా మైత్రేయి గారి బ్లాగ్ లో లింక్ లు కూడా ఇచ్చారు.
http://telugu-chalam-quotes.blogspot.com/
ఇది చూడండి. నేను చలం మీద నా సొంత విశ్లేషణలు ఏమి చెయ్యను. నాకు ఆ అర్హత లేదనిపిస్తుంది అదీ కాక ఏమి చెపుదామనుకున్నా ఆయన గురించి ఆయన దాని గురించి మాట్లాడేసేరు నేను ప్రత్యేకం గా చెప్పేది ఏం లేదనిపిస్తుంది. చలం గారి రచనలు చదవ గలగటమే ఆయన గురించి చెప్ప గలిగే ఒక విధానం అని పిస్తుంది. అందుకే వీలైనన్ని రచనలు ఆన్లైన్ చెయ్యలని ఆశ. మీరు పాల్గొనాలి అంటే మీరు ఏదైనా పుస్తకం గురించి విశ్లేషించగలిగితే రాయండి తప్పక బ్లాగ్ లో పెడతాను. ఇది మన అందరి బ్లాగ్ చలం ఎలా మన అందరి వాడో. నచ్చినందుకు ధన్య వాదాలు. ఇప్పుడూ ప్రయత్నించి చూడండి కామెంట్ అక్కడ రాయటానికి. వస్తుంది అనుకుంటున్నా. :-)

భావన చెప్పారు...

భా.రా.రె: అర్ధం కాలేదు మీరు అన్నది ఇంకో సారి చెప్పరు ప్లీజ్.

మురళి: అవునండి.. ఎంత గా మమైకమై పోతారో మన జీవితాలలో, వాళ్ళ జీవితాలన్నీ కరిగించింది చాలక ఇంకా మన ఒడిదుడుకులు కూడా వాళ్ళే తపన పడితే జాలి వేస్తుంది కోపమ్ కూడా వస్తుంది నాకు. ధన్యవాదాలు.

భావన చెప్పారు...

నిషి: ధన్య వాదాలు. మీ అంత క్లుప్తం గా కవితలో అనంత భావావేశాన్ని కూర్చటం చేత కాక ఇలా లేఖ లా పొడిగిస్తాను. ఇంత పెద్ద గా లాగి కూడా మీ కు మంచి అనుభూతి ని కలిగించటం నా అదృష్టం.

జయ: ధన్య వాదాలు. వుత్తరం లో ఇంత విడమరిచి హత్తుకునేలా చెప్పగలుగుతున్నానంటూన్నారు నా నిజ జీవితం లో ఒక్కరి కి కూడా నేను సరిగా ఏమి చెప్పలేను. అదేమిటో.. పోనిలేండి ఈ రూపం గా ఐనా మెప్పించగలుగుతున్నా. :-)

భావన చెప్పారు...

చిన్ని: రాధా మనోహరాలు తీగ పాకిస్తున్నారా, ఈ సారి ఇన్డియా వచ్చినప్పుడు మీ ఇంట్లోనే రెండు రోజులన్నా మకాం ఐతే నేను. జగ్రత్త ఆకు కు ఒక లాంటి ఆకు పచ్చని పురుగు వస్తుంది. కష్టం గుర్తు పట్టటం. అబ్బ తెల్ల గా మొదలయ్యి లేత గులాబి నుంచి లేత ఎరుపు ఆ పైన ఎరుపయ్యే ఆ తీగ అంటే నాకెంత ఇష్టమో మాటలలో చెప్పలేను. నచ్చినందుకు ధన్యవాదాలు చిన్ని. ఇప్పటికే మరీ పెద్ద వి రాస్తానేమో అని పిస్తుంటే మీరు అప్పుడే ఐపోయిందా అనిపిస్తుంది అంటే చాలా సంతోషం గ వుంది మెప్పించగలుగుతున్నందుకు.

మాలా కుమార్ చెప్పారు...

అందరి బ్లాగ్ లలో కామెంట్స్ తో , హడావిడి , అల్లరి చేసే అల్లరి పిల్ల భావన , భావకురాలైన ఈ భావన ఒక్కరేనా ? అని ఓ బేద్ద అనుమానం వస్తోందే ? ప్లీజ్ ప్లీజ్ నా అనుమానం తీర్చరూ !

తృష్ణ చెప్పారు...

too good...no time for now..will comment again..

give a look to this post--

http://trishnaventa.blogspot.com/2009/07/blog-post_11.html

భావన చెప్పారు...

నెమ్మది గా ఏమి మాట్లాడకుండా చూడ గానే ఈమె ఏమి పెద్ద మాట్లాడరు అన్నట్లు వుంటు.. ఇన్ని కబుర్లు చెపుతూ పైగా నేతి గిన్నెల సలహాలు ఇస్తూ, ఇంకా ఇంత బాగా రాస్తూ ఎన్నో మంచి పాటలను మంచి జ్నాపకాలను అందించే మాల గారి కంటే నా.. :-)
థ్యాన్క్స్ మాల గారు. ఎంత అందం గా లలితం గా మెచ్చుకున్నందుకు.

తృష్ణా మీ పోస్ట్ గురించి మీ బ్లాగ్ లోనే కామెంట్, చాలా చాలా కేరింతలు కొట్టేను మీ పోస్ట్ చూసి.. రాధా మనోహరాల మీద పోస్ట్. నేను ఇండీయా వెళ్ళి నప్పుడు రాసేరు అందుకే మిస్ అయ్యాను. థ్యాన్క్స్ అండి.

శ్రీలలిత చెప్పారు...

భావనా,
అందమైన ఊహలని వర్ణించారు . చాలా బాగుంది. డాబా మీద వేసిన దుప్పటి మీద పడుకుని అనంతాకాశం లోకి చూస్తుంటే ఎన్నెన్ని ఊహలో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి. చల్లగా, మృదువుగా తాకేటి చిరుగాలులు చెవిలో గుసగుసలు వినిపిస్తుంటే, ఏవో తెలియని ఆలోచనలు అంతుపట్టకుండా మనలని చుట్టేస్తుంటే, ఎంతబాగుందో అనుకుంటూ, ఎందుకింత బాగుందో తెలీక, ఇంకా ఏదో కావాలనుకుంటూ ఆ ఆకాశాన్ని అలాగే చూస్తూండిపోతాం కదా..

భావన చెప్పారు...

అవును లలితా. సరి గా అటు వంటి నా అనుభవమే నా కృష్ణుడి నోటి నుంచి వచ్చింది. డాబా మీదనో ఇంటి ముందు నవ్వారు మంచం వేసుకునో వెన్నెల రాత్రి ఆకాశాన్ని చూస్తూ వుండటం అబ్బ ఎందుకు లే అదొక మధురమైన అనుభవం కదా. అందరం ఆ ప్రేమానుభూతుల అనుభవాల పల్లకి లో ఎక్కి తిరిగిన వాళ్ళమే కదా అంతటి అనుభూతి ని అనుభవాన్ని ఆ పల్లకి ని మోసి అందించిన వాళ్ళము కూడా కదా అందుకనే మనకు నచ్చుతుంది.. కదా.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

భావన గారు,

కాల చక్రంతో పోటీ పడుతూ సాగే నా దినచర్యలో భాగంగా హడావిడిగా చదివేసి వెళ్ళకూడదని. నింపాదిగా నెమ్మదిగా అక్షరమక్షరమూ కూడదీసుకుని ప్రతి పదాన్ని ఆస్వాదిస్తూ చదువుకోవాలని మొన్నటి నుండి మీ పోస్ట్ ఒపెన్ చేసే ఉంచాను. ఇప్పటికి కుదిరింది కాస్త కుదురుగా కూర్చుని చదవడానికి. మీ లేఖ నాకందించిన అనుభూతిని చెప్పడానికి’బాగుంది’ అన్న ఒక్కమాట ఖచ్చితంగా చాలదు. కానీ ఇంకెలా చెప్పను,

కాలవ గట్టు మీద కూర్చుని నీళ్ళలో పాదాలుంచి అప్పుడపుడూ చేపపిల్లలు అలవొకగా ఓ ముద్దిచ్చి గిలిగింతలు పెడుతుంటే చిన్నగా పాదాలు మాత్రం కదుపుతూ మోకాళ్ళమీద పెట్టుకుని చదివిన చందమామ కథల్లే ఉందని చెప్పనా... లేకా సాయంసంజె వెళ ఇంటి ముందు మొక్కలకి నీళ్ళు పోసి మెట్ల పై కూర్చుని గాలిలో తెలివచ్చే తడి మట్టి వాసనని అస్వాదిస్తూ నీళ్ళలో తడిచిన కనకాంబరాల గింజలు చేసే చిటపటల చిరు సవ్వడి వింటూ చదివిన యండమూరి నవలల్లే ఉందని చెప్పనా... లేక డాబా పైకి పాకిన జాజి తీగ పక్కన పరిచిన మెత్తని పరుపుపై కొబ్బరాకుల నీడలో పిట్టగోడకి ఆనుకుని కూర్చుని చుక్కలు లెక్కపెడుతూ అక్కడక్కడా కూడిన నక్షత్ర సమూహాలకు భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తుంటే నా నెచ్చెలి చెప్పిన ఊసల్లే ఉందని చెప్పనా...

Please ignore previous comment and publish this.

భావన చెప్పారు...

వేణు శ్రీకాంత్: ఎంత మంచి పోలిక లు చెప్పేరు అండి. ఆ విషయమే మర్చి పోయాను నేను, సాయింత్రం మొక్కలకు నీళ్ళూ పోసి నీడ లో కూర్చుని మట్టి వాసన ను కనకాంబరపు గింల చిట పట లను వినటం.. థ్యాన్క్స్ ఆండి గుర్తు చేసేరు... బాగా రాసేరు మీరు కూడా ఒక వుత్తరం రాయండి మీ అనుభవాల మాలిక ను గుచ్చి ప్రొది చేసి... ధన్య వాదాలు.

మురళీ కృష్ణ చెప్పారు...

బావుంది. ఈ ’భావన’ ఇంకా బాగా రాయగలరు. మీకు మాకు మధ్య రెండే రెండు నిమిషాలు... ఒక్క మెరుపు... మళ్ళీ చీకటి... ఏం జరిగిందో తెలియదు... యుగానికి సరిపడే అవ్యక్తానందం... గుండెల్లో ఇమడలేనంత... కళ్ళల్లోనూ కొంత...

మురళీ కృష్ణ చెప్పారు...

"మనసు మీదకు మూగే ఆలోచనలను మళ్ళించుకోగల ఏకైక మార్గం సాహిత్యం" బహుశా...మనసు మీదకు మూగే ఆలోచనల వరకు బానే వుంటుంది. గుండె చీరుకుపోయినప్పుడు... ఆ మంటలను ఆర్పగలిగే ఒకే ఒక నేస్తం కన్నీళ్ళేనేమో...

లక్ష్మి చెప్పారు...

భావన గారు, నాకు వేణు గారిలాగ అంత అందంగా చెప్పటం రాదు కానీ నిజ్మగా చాలా చాలా బాగుంది, ఎక్కడొ తట్టి పోయింది మీ టపా

cartheek చెప్పారు...

అక్క మీకు భావన అని పేరు పెట్టినందుకు ఇంత అద్భుతంగా రాస్తారా ?
లేక ఇంత అద్భుతమైన భావుకత మీకు సొంతం అవుతుందని ముందే తెలిసి అమ్మ,నాన్న మీకు ఈ పేరు పెట్టారా ?

సూపర్ అక్క చాలా చాలా బాగా రాసారు....
మీరెంత రాసారో అంతకన్నా పెద్ద టపాలా కామెంటాలని ఉంది కాని అవన్నీ బయటకు రావడం లేదు రాయడానికి....

Hima bindu చెప్పారు...

తప్పకుండ రండి మన దేశం వస్తే .....పచ్చపురుగు వుంటదనితెలీదు ,గమనించాలి ఇక మీదట .

భావన చెప్పారు...

మురళి కృష్ణ: అవ్యక్తానందం కళ్ళ లో కూడా ఇమడలేదు జారి అనంత ప్రేమ సాగరం లో కలవకుండా. ఆ మెరుపు వెలుగులు ప్రేమ వెల్లువలు సదా నీ జీవితం లో నింపుకోవాలని ఆశిస్తూ.. సాహిత్యం చీరుకు పోయిన గుండె గాయం కూడా మాన్చగలదు ప్రయత్నించు...

భావన చెప్పారు...

కార్తీక్ : నచ్చినందుకు ధన్యావాదాలు.. నా పేరు భావన కాదు. నా పేరు ఉమ. జీవితమంటే భావనల కలయిక అని నమ్మే నేను బ్లాగ్ ల లోకి భావన నై వచ్చాను ఈ రాత లన్ని నా భావనలే కదా.. :-)

చిన్నె. మీ ఆహ్వానం అట్టీ పెట్టు కుంటున్నాను అండోయ్..

వెన్నెల చెప్పారు...

ఉమగారు...ఆహా ఎంతచక్కటి స్వగతం, మీ మధుర 'భావనల 'కృష్ణ గీతం''తో మమ్మల్ని మంత్రముగ్దులని చేస్తున్నారు..

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

అడ్డెడ్డే భావనా ( మనూరి పక్క యాస వేసుకోండి) , ఎంత హమాయకంగా అర్థం కాలెదు అని అడిగారండీ. ఏంలేదు మీరు వర్ణించిన విధంగానే చదువుకొనే రోజులు గుర్తొచ్చీ అలా వ్రాసానండి. అంటే ఎవరి మిద్దె మీద వాళ్ళమే చదువుకోవడానకని వెళ్లేవాళ్ళం. కానీ చదువా సంధ్యా ...నిమిషానికోసారి దిక్కులు చూడనే సరిపోయేది ;-)

జయ చెప్పారు...

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.