11, మే 2009, సోమవారం

కృష్ణుడూదిన వేణు గానం

చిన్నా,
ఉభయకుశలోపరి అని మొదలు పెడదామా అంటే మరి అంత అబద్దం తోనా మొదలే అనిపించి ఆపేస్తున్నా! బాగున్నావా అని అడుగుతు మొదలు పెట్టాలంటే "నువ్వులేకుండానా" అని అడిగే నీ కళ్ళు గుర్తు వచ్చి కలం దానతట అదే ఆగిపోతోంది.. ఇలా ఏమి రాయాలా అనే మీమాంస తోనే వారాలు గడుస్తున్నాయి కాని నీకు రాయకూడదని కాదు రా...

రోజు లో 12 గంటలు ఆ ఆఫీసు వాడే తీసేసుకుంటాడా.. ఇంటికి వచ్చి తలుపు తెరుస్తూ అనుకుంటా
"మూసి మూయని తలుపు తెరిచేను మది తలపు విరిసి విరియని మొగ్గ చిక్కింది నా కురుల.... జాగేల నోయి నా చిన్ని క్రిష్ణా" అంటు రాగాలు తీస్తూ ఎదురు వస్తావని.. కాని ఎదురు గా శున్యం పక్కున నవ్వుతు ఎదురు వస్తుంది...

దాని మీదకు తాళాలు విసిరేసి కక్ష్య తీర్చు కుంటాను... నేను మొగవాడిని అనే అహంకారం నిలబెట్టుకుంటానికైనా
వచ్చే కన్నిటి చుక్క ను బలవంతం గా గుండె గోడలకు చెమ్మ గా అద్దేసి తదుపరి కార్య్క్రమానికి తయారు ఐపోతాను అసలు నాకేమి కానట్లు నువ్వనే వునికే నా జీవితం లో లేనట్లు...

నువ్వు అన్నట్లు ఒంటరి రాత్రి నా గొంతు తో తప్ప నా అసలు రూపం నీకు నేను ఎప్పటికి చూపించనేమో...... మరి నీ దృష్టి లో ఈ ఆరు అడుగుల దీరోదాత్తుడు నీ క్రిష్ణ అలానే వుండాలి కదా..

నాకు నీకు లా అంత పెద్ద వుత్తరం రాయటం రాదురా... అందులో నా మనసును అక్షరాలలో కూర్చటం అసలే రాదు... అబ్బ ఏమిటి చెయ్యి ఇలా చురుక్కుమంది.. వో ఫొటో లోనుంచే నీ చూపుల వేడి తట్టుకోలేక పోతున్నా.. సరే సరే మొదలు పెట్టకు రాస్తాను ప్రతి చిన్న విషయం రాస్తాను..

ఏమి వుంటుంది రా చెప్పటానికి కేపిటలిజానికి సోషలిజానికి తేడా కూడా తెలియని మేనేజర్, ఎక్కడ చూసినా పేరుకు పోయిన బ్యూరోక్రసి.... ఎక్కువ ఐన ఆర్ధిక మాంద్యం........ ఇప్పటికే వున్న బుద్ది మాంద్యానికి తోడు.....
సమస్య కు పరిష్కారం గాయానికి బేండ్ ఎయిడ్ కాదు సర్జరి అని తెలుసు కాని తెలియనట్లు నటిస్తారు మా ఒక్క ఆఫీస్ లో నే కాదు అంతా అదే పరిస్తితి...

ప్రపంచం అంతా ప్రేమ తో వెలుగుతోంది... ఆ ప్రేమ జ్యోతి జీవితాలను ప్రకాశం చేస్తుంది అంటారు నీ వంటి పిచ్చి వాళ్ళు నాకైతే ప్రపంచాన్ని మొత్తం స్వార్ధం, ఈగో నడిపిస్తున్నాయి అనిపిస్తుంది....
నిన్న ఆదివారం కదా రామక్రిష్ణా, ప్రకాష్ వాళ్ళు భోజనానికి పిలిచారు....

నిన్న పొద్దుటే వెళ్ళి కాసేపు టెన్నిస్ ఆడి తిని మద్యాన్నం రచనా గోష్టి లో కూర్చున్నాము .... నిన్నటి విషయం "ఆధునిక కవిత్వం/ రచన ల పైన టాగోర్ ప్రభావం" నువ్వు వుండి వుంటే బాగుండేది... ప్రత్యేకం గా నేను చొరబడి అభిప్రాయాలు చెప్పేంత తెలియదు కదా అందుకే వింటూ కూర్చున్నా...

అర్ధ రాత్రి ఇలా కూర్చుని నీకు వుత్తరం రాస్తున్నానా..... మద్యలో రేపు పొద్దుటే ఆఫీస్ లో మీటింగ్ లో ఆడవలసిన అబద్దాలు ఆలోచించుకుంటున్నా... ఇంతలొ ఎక్కడ నుంచి వచ్చిందో ఈ ఈగ ఒకటి నా చుట్టూతూ యెగురుతూ వుంది, చిరాకు గా వుంది ఇంత పెద్ద ఇంటి లో దానికి ఇంక చోటు ఎక్కడ దొరకనట్లు వచ్చి నా దుప్పటి , నా కంప్యూటర్ మీద వాలుతుంది ఏమిటి అని.
కొంచం శ్రద్ద పెట్టి దానిని ఒక్క దెబ్బ వేసి హరీ అనిపిద్దామా అనిపించింది మళ్ళీ అంతలోనే మనం ఒక సారి చేసుకున్న చీమ వేదాంతం చర్చ గుర్తు వచ్చింది...

ఈ ఈగ ను చంపి నేను పాపం మూట కట్టుకుంటానా అసలు ఈగ ను చంపితే పాపం వస్తుందా రాదా.. అప్పుడు మద్యాన్నం నేను తిన్న కోడి కూర రుచి గుర్తు వచ్చి అంతలోనే దిగులు వేసింది ఐతే ఆ కోడి ని చంపిన పాపం చలం గారి కథ లో లా ఈ దిగులు ఫడటం అనే శిక్ష తో పూర్తి అవుతుందా....

చిన్నా నీ ఆలోచనల జబ్బు నాకుకూడా పాకిందిరోయ్....

సావాసాల సుగంధం నాకు కూడా కొంచం అంటిందేమో గంధపు మాను ను నరికే గొడ్డలి కి కూడా ఆ సుగంధం అంటినట్లు... చూడు ఎంత పెద్ద వుత్తరం రాసేనో నేను...

నాకు ఈ వుత్తరాన్ని నీకు పంపాలని లేదు రా.. నేనే తీసుకు వచ్చి నీకు ఇచ్చి నువ్వు చదువుతు ......నవ్వుతు ..... అంతలోనే సగం కళ్ళు మూసి ఆలోచించే ఆ ఆనంద పారవశ్యపు ముద్ర ను ఎదురుగా నుంచుని చూసి ఈ నల్ల పిల్ల ప్రేమ ను ఇంత గా పొంద గలిగేను కదా అని నా అదృష్టానికి నేనే అబ్బురపడాలనిపిస్తొంది
కాని ఆ కోరిక ను మనం మళ్ళి కలిసేప్పటికి వాయిదా వేస్తూ... పంపిస్తున్నా చెలి ఈ వలపు తలపు ను నీ ప్రేమ సౌధం లోకి...

17 కామెంట్‌లు:

భావకుడన్ చెప్పారు...

మంచి భావుకత ఉంది. చెప్పాలనుకున్నదాన్ని సాగదీయకుండా చెప్పే సామర్ధ్యం ఉంది. చాలా బావుంది.

సుజాత వేల్పూరి చెప్పారు...

భావనా,
వేణు గానం మధురంగా ఉంది.చాలా రోజుల తర్వాత వినిపించారు కృష్ణ గీతం!

భావన చెప్పారు...

సుజాత గారు, భావకుడన్ గారు వేణు గానం నచ్చినందుకు ధన్య వాదాలు,
@భావుకడన్ గారు మీరు చెప్పిన టైపోస్ సరి చేసేను చాలా చాలా థేంక్స్ అండి...

నిషిగంధ చెప్పారు...

Beautiful!!

భావన చెప్పారు...

ధన్యవాదాలు నిషిగంధ గారు

మరువం ఉష చెప్పారు...

>> నువ్వు చదువుతు ......నవ్వుతు ..... అంతలోనే సగం కళ్ళు మూసి ఆలోచించే ఆ ఆనంద పారవశ్యపు ముద్ర ను ఎదురుగా నుంచుని చూసి ఈ నల్ల పిల్ల ప్రేమ ను ఇంత గా పొంద గలిగేను కదా అని నా అదృష్టానికి నేనే అబ్బురపడాలనిపిస్తొంది

ఈ కమనీయ దృశ్యం వూహించుకుంటూ నేనూ ఆనంద పారవశ్యం చెందాను. చక్కని శైలి అందునా ఆర్ధ్రత కలిపి మరీ మీ భావాలు బహు బాగా రంగరించారు.

GIREESH K. చెప్పారు...

Very nicely written.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

template బాగుంది. ’క్రిష్ణ’ కాకుండా ”కృష్ణ”అని రాయాలి.చెప్పినందుకు అన్యథా భావించవద్దు.

పరిమళం చెప్పారు...

రాధకు తగ్గ కృష్ణుడే సుమీ .......

మురళి చెప్పారు...

గతంలో నాకు రెండు మూడు సార్లు ఓ సందేహం వచ్చింది. ఈవిడ ఉత్తరాలు రాస్తూ ఉంటారు.. ఆ కృష్ణుడు వాటిని చదవడమే కాని జవాబులు రాయడా? అని. ఇప్పుడా సందేహం తీరిపోయింది.. ఆయన మీకు సరిజోడని తెలిసిపోయింది.. ఒక్క మెతుకు చాలంటారు కదండీ.. అన్నట్టు చాలా రోజులు గ్యాప్ ఇచ్చినందుకు కోప్పడాలనుకున్నాను కానీ, టపా చదివాక మొదట టపా గురించి రాయకుండా ఉండలేకపోయాను.. చాలా బాగుంది..ప్రతి దృశ్యం కళ్ళముందు కనిపిస్తూ..

భావన చెప్పారు...

ఉష , గిరీష్ , విజయమోహన్, పరిమళ, మురళి అందరికి ధన్యవాదాలు నచ్చినందుకు.
@విజయమోహన్ గారు.. నాకు ఎప్పుడు అనుమానం క్రిష్ణ అని రాయాలా కృష్ణా అని రాయాలా అని. నేను పలకటం కృష్ణా అని పలికితే అందరు నవ్వేవారు క్రిష్ణుడి నీడవు నీకు క్రిష్ణ అనటమే రాదు అని. అందుకే బలవంతం గా క్రిష్ణ అని అలవాటు చేసుకున్నా. మొన్నీ మధ్య చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాలలో ఆయన కూడా కృష్ణ అనే అన్నారు, ఇప్పుడు మీరూ అన్నారు, ఐతే నేనే సరి నా స్నేహితులు కాదు.. ఇక నుంచి కృష్ణ అనే రాస్తాను. నమ్మకం కలిగించినందుకు ధన్యవాదాలు.
@పరిమళ కృష్ణుడెప్పుడు రాధ కు తగిన వాడే కాదా మరి.
@ఉష గారు.. ఆర్ధ్రత... భావానికి అందం రాయటం లోనే కాదు చదివే మనసును బట్టి కూడ వస్తుంది అందం..
@ మురళి గారు మీకు కోప్పడే హక్కు ఎప్పుడు వుంది అండి... ఈ ఒక్కసారికి క్షమించెయ్యరు ఇంక ఎప్పుడు ఇలా చెయ్యనేం...

కొత్త పాళీ చెప్పారు...

ఓపెనింగు సూపరు (నాది శుద్ధ తెలుగు అంటారా? హన్నా!)
.. క్రిష్ణ .. కృష్ణ .. పలికేవాడు మనసున్నవాడూ, మనవాడూ ఐతే ఎలా పిలిస్తే ఎమైంది?
ఆ చేత్తోటే కక్ష్య యావత్తు కత్తిరింపించి మీ కక్ష తీర్చుకోండి.

భావన చెప్పారు...

మీ తెలుగు శుద్ధ తెలుగు అంటే మీరు ఏంటి అండి ఏదో శుద్ధ వేస్ట్ తెలుగు అన్నట్లు బాధ పడతారు...
నిజమే పలికెడి వాడు మనవాడైతే పలికించేది వాడే ఐతే క్రిష్ణ అన్నా కృష్ణ అన్నా ఒకటే అనుకోండి... నీలమేఘశ్యాముడిని నీలాంబర వర్ణుడిని ఏమంటే పలకడు... ఐనా కూడా కొంచం బాధ అనిపిస్తుంది తప్పు పలికితే...

Hima bindu చెప్పారు...

గంధపు మానును నరికే గొడ్డలికి ఆ సుగంధం అంటినట్లు.......మీ కృష్ణుడు ఎంత బాగా చెప్పారండి ..
మీరు చాల బాగా రాస్తున్నారు ..

భావన చెప్పారు...

మనసు ప్రేమ మయం ఐనప్పుడు అన్నీ అందం గా కనపడతాయి చిన్ని. ప్రేమ జీవితాలను వెలిగించే ఒక జ్యోతి. అందుకే మీకు నచ్చింది. ధన్యవాదాలు

మధురవాణి చెప్పారు...

చాలా చక్కటి అనుభూతిని అందించింది మీ చిన్ని కృష్ణుడి లేఖ.!
నిజంగా కృష్ణుడి వేణుగానం విన్న అనుభూతి కలిగింది.

భావన చెప్పారు...

మధురవాణి గారు ధన్యవాదాలు అది కృష్ణుడి గొప్పతనం