19, జనవరి 2010, మంగళవారం

నలత కు నెలవై...







కృష్ణా,

మౌన గీతం లోని గీతమాగి మౌనం ప్రజ్వరిల్లితే, జీవిత శిలాఫలకాల కింద కాలధర్మం రాజ్యమేలిందనుకున్నా కాని అనారోగ్యం కంబళి కింద అశక్తుడవై వున్నావని తెలిసి తల్లడిల్లుతున్నా. నా ఆరోగ్య, ఆయుష్యులను తీసుకుని నా కృష్ణుడి కిచ్చి కాపాడమని కోరితే, వంటింటి గూటిలో ని కన్నయ్య నవ్వి "నీదే మాత్రం ఆరోగ్యమేమిటి నీ సఖుడి కివ్వటానికి" అని గేలి చేసి నవ్వేడు. మరి బృదావనం లో నాన్న గారికి నీ సఖి రాధమ్మ ఎవరెవరి దగ్గరి నుంచో అయుష్య్యు తీసుకుని ఇవ్వలేదా..!! నా కృష్ణుడి కి నేను ఇవ్వటానికేమి ఎంత ఐనా రాధమ్మ కున్న ప్రేమార్దత్ర నీకు లేదు అని బాగా పోట్లాడేను లే.


ఎలా వున్నావు కృష్ణా... నిజం గా నిజం...నేను నీకు ఇంత నొక్కి చెప్పనక్కర్లేదు నువ్వు నమ్ముతావనుకో, కానీ నా భావమొక వీచికై బయటకు వచ్చేప్పుడు తిరిగే సుడి ఒక్కో సారి బలమైనప్పుడు మాటల వడి మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటుందనుకుంటా.. కిందటి సారి నువ్వు కల లో వచ్చినప్పుడు నీ భుజంపైని నా తల ను తిప్పి కళ్ళలోకి చూసి చెప్పేవు గుర్తు వుందా "ఇప్పట్లో కనపడను రా, గుండెలోని అశక్తత ను కళ్ళలోకి రానివ్వనని మాటివ్వు.. నిఘంటువు ల లోని పదాలకు చాలని ప్రణయాలింగనపు అనుభూతి ఇద్దరిని కలిపి వుంచే సావాసి కదా దిగులొద్దు" అని. అది విని దిగులు పడ్డానని " లేదు రా నేనెక్కడికి వెళతాను ఈ విరహం, ఈ దూరం తాత్కాలికమే కదా " అని ఓదార్చావు వుత్తరం లో తరువాత. నువ్వు నవ్వుతావు, నీకు నమ్మకం వుండదు, నా కోసం సరే అన్నట్లు వూ కొడతావని నాకు తెలుసు. అయినా కాని నాకు ఖచ్చితం గా తెలుసు ఈ తాత్కాలిక ఏడబాటు తెలిసే, నీలోని నీ నాకు, నా లో నిండిన నువ్వు నచ్చచెప్పేవు అని... ప్రతి భందాన్ని కొన్ని లెక్కల్లో ఇంకొన్ని కొలమానాల్లో ఇరికించేయాలని చూసే వాళ్ళకు నేనేమి చెప్పలేను కాని నమ్మే నీ గుండె చప్పుడు కు మాత్రం తెలుసు నా మాట లోని అంతరార్ధనం.


నీ అనారోగ్యపు ఆనవాలు నా మీదకు వచ్చి వాలింది కామోలు, నెల నుంచి నాకు ఏమి రాయబుద్ది కావటం లేదు చదవ బుద్ది కావటం లేదు. నవ్వుల గల గల ను శీతాకాలపు మంచుకు నెమ్మదైన కెరటాల హోరు కింద దాచి, ఏకాంత మనః సౌధం లో అవిశ్రాంతం గా తిరుగుతున్నా అశాంతి ను తోడు గా తీసుకుని. శూన్యాక్షరాల గవాక్షాలలో నా నీడ నే చూసుకుని నువ్వని భ్రమ పడ్డ క్షణాలెన్నో....నీ కోసమని సాగే అనంత యాత్ర లో తిరిగిన చోటే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ నన్ను నేను కోల్పోయి నువ్వయ్యానేమో... అప్పుడిక ఈ యాత్ర కు ఒక ముగింపు పలకవొచ్చు కదా ఎందుకింత అలసట, తిప్పట అంటే ఏమో నాకు మాత్రం ఏమి తెలుసు


జల్లు గా స్నో పడుతూనే వుంది పొద్దుట నుంచి. ఎర్రనైన సంధ్య లో నల్లనయ్య నవ్వితే మోగింది భూపాల రాగమట.. మరి ఒంటరైన సంధ్య దిగులు చీకటులు సావేరా? ఈ రాత్రి... తెల్లటి మంచును నల్లటి చీకటి తో కలిపి ముద్దలు చేసి విసిరి కొడుతుంటే కిటికి దగ్గర నుంచుని చూస్తున్నా. 27 రోజులు యాంటీ బయాటిక్స్ తీసుకున్న నీ శరీరం ఎలా వుండి వుంటుందో, ఆ మందు ల తీవ్రత నే ఫోన్ చేసినప్పటి నీ గొంతులో వణుకై కనపడుతుంటే, మంచుకు వడలి, ఎండి కొమ్మన వుండలేక వదల లేక వూగిస లాడుతున్న వూపిరి తో కదిలే సుగర్ మేపుల్ చెట్టు ఆకు చెపుతోంది నీ బాధ ను జంగం కధ లో బుడగ జంగమల్లే.


ప్రపంచంలో ఇందరుంటారు కదా ఇన్ని కోటాను కోట్ల మనుష్యులు, వారందరిలో ఈ విచిత్రమైన బేక్టీరియల్ ఇన్ఫెక్షన్ నీకే రావాలా అని ఒక దుగ్ధ, వచ్చాక ఆ డాక్టర్స్ అది ఏమిటో, గ్లాండ్స్ వాచి నొప్పి పెడుతుంటే కారణం ఇది అని తెలియ చెప్పటానికి అంత టైం ఎందుకు తీసుకున్నారో ఇదేనా టెక్నాలజీ మెడిసన్ సాధించిన ప్రగతి అని వాళ్ళందరి మీదా అనంతంగా కోపం వస్తోంది. ఇంతలోనే ఎవరికైనా రావొచ్చు కదా నా కృష్ణ కెందుకు అనుకున్నానే..... ఆ ఎవరికో, వారిని ప్రేమించే వ్యక్తులకు ఇంతే బాధ, దుఃఖం కలుగుతుంది కదా. ఆ డాక్టర్స్ ఐనా మనుష్యులే కదా అనే వితరణ, నువ్వు అన్నట్లు 50 రోజుల నుంచి కనిపెట్టలేక సతమవుతున్న బేక్టీరియా లు మన పక్కనే పెరుగుతుంటే ఒక్క మనమే మన కోసమే అనే ఆలోచన ఎంత స్వార్ధం కదా అనే సిగ్గు కలుగుతోంది. కాని ఏమి చెయ్యను కృష్ణా నీకు కలుగుతున్న బాధ, కనీసం దగ్గర వుండి చూసుకోలేని అశక్తత నా మానవ తత్వాన్ని చంపేసి కౄరమైన స్వార్ధం వచ్చేట్లు చేస్తోంది.


విశ్రాంతి తీసుకో అని చెప్పాలంటే పరుగెత్తే జీవన ప్రవాహం పడనివ్వదు అంటావు, మందులు సరి గా వేసుకో అంటే నెల రోజులకు చేసే పరామర్శ కూడ మధురమేలే అంటావు కొంటె గా. సరి గా తిను అంటే ఏమిటి విరహపు దిగులు నా అంటావు. ఏమనాలో కూడా తెలియక సాగే కన్నీటి జలపాతాలను నిదురమ్మకు కానుకనిచ్చి, ఒంటరి దిగులు మేఘాలను వేకువకు తోడు నిస్తూ నీ తలపులలో ఇలా జంటనై ఒంతరి తనాన్ని అనుభవిస్తున్నా.


38 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

కన్నీటి జలపాతాలను నిదురమ్మకు కానుకనిచ్చి నిద్రాదేవి రోదనలో సావేరిరాగాలు పాడావా? దిగులు మోమును మేఘాలకు అరువిచ్చి జలపాతాలను సృష్టించావా? ఇంతకీ మీ కృష్ణయ్య కు మీ శీతాకాలపు చల్లని భావవీచికల వలనే బేక్టీరియల్ ఇన్ఫెక్షన్ చచ్చిపోయిందేమో చూడు. ఇక విశ్రాంతి సమయంలో ఆనంద భైరవి , కల్యాణి పాడతావో లేక చక్రవాకము, శివరంజని పాడతావో నీ ఇష్టం. :)

మరువం ఉష చెప్పారు...

నిదురమ్మా మహ జాణ. సఖుని నలత తలపుల్లో నున్న నెలతని మరింత నలిబిలి చేస్తుంది. "నమ్మే నీ గుండె చప్పుడు కు మాత్రం తెలుసు నా మాట లోని అంతరార్ధనం. " దగ్గర నా గుండె లయ తప్పింది.. ఎందుకంటే నేనచ్చంగా ఆ నమ్మకం మీద ఆధారపడ్డ బంధాన్ని చవిచూస్తున్నాను కనుక... మానసికబంధాలకి ఇన్ని మాటలు అక్కరలేదు రాధమ్మా. నీ కృష్ణకి నీ గుండె పాడే ఈ రాగాలే చాలును, సాంత్వన గీతాలై సత్వరం ఉపశమనం వస్తదిలే కానీసం మనసుకి. ఆ బలమే శారీరక అస్వస్థతని దూరం చేస్తది. మంచి లేఖ. వూహకైనా లోతుగా వుంది.

sunita చెప్పారు...

:-(

Kalpana Rentala చెప్పారు...

“నవ్వుల గల గల ను శీతాకాలపు మంచుకు నెమ్మదైన కెరటాల హోరు కింద దాచి, ఏకాంత మనః సౌధం లో అవిశ్రాంతం గా తిరుగుతున్నా అశాంతి ను తోడు గా తీసుకుని. శూన్యాక్షరాల గవాక్షాలలో నా నీడ నే చూసుకుని నువ్వని భ్రమ పడ్డ క్షణాలెన్నో....నీ కోసమని సాగే అనంత యాత్ర లో తిరిగిన చోటే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ నన్ను నేను కోల్పోయి నువ్వయ్యానేమో... “
భావనా, ఇంత ఆర్ద్రం గా ఎలా రాయగలవో నాకేప్పుడూ ఆశ్చర్యం గా వుంటుంది. పై వాళ్ళిద్దరి కవిత్వం చూస్తే (భా.రా.రే, ఉషా) కామెంటానికి కూడా భయం గా వుంది.పారిపోతున్నా..

శ్రీలలిత చెప్పారు...

ఆత్మ బంధువు గురించి ఆందోళన పడుతుంటే
ఈ మనసేమిటీ ఇలా ఇన్ని మెలికలు తిరుగుతోందీ...

అలసిన బంధువుకి దగ్గరుండి ఆత్మీయంగా సర్వం చూసుకోలేని అశక్తతకు దిగులు
కట్టిపడేసిన సంకెళ్ళను విడిపించుకోలేని అసహాయత
ప్రతి క్షణం కన్నయ్యే గుండెల్లో గుస పెడుతుంటే
ఆపుకోలేని కన్నీళ్ళు రెప్ప ముడి విప్పి జాలువారుతుంటే
ఎందుకూ నీకీ గుబులని కన్నయ్య వెక్కిరిస్తుంటే
యెందుకో తెలీక...యేమని చెప్పడానికీ మాటలు దొరక్క
తెలిసీ అడగడమెందుకని కన్నయ్య పై కోపం తెచ్చుకుందామనుకుని
’కన్నయ్య మీదా.. కోపమా..’ అని నాలో నేనే నిందించుకుని
నన్ను నేను సమాధాన పరచుకున్నా ననుకున్నా.... కాని...
ఈ తగిలించుకున్న బంధాలు
తగులుకున్న బాధ్యతలు
మనసు రోదిస్తున్నా
మెదడు పనిచేయక తప్పని పరిస్థితుల్లో
బాధను అగాధాల్లో పాతిపెట్టి
పెదవులకు చిరునవ్వు అతికించుకుని
యెంత హాయిగా వున్నానో అనుకున్నా...కాని
హాయనేదు వుండేది మనసులోనేనని
కావాలని తెచ్చుకుంటే వచ్చి పెదవులప్సి వాలేది కాదని
ఈ పిచ్చి మనస్సుకి యెప్పటికైనా తెలుస్తుందా.......?

పరిమళం చెప్పారు...

తలపుల జంటతో ఒంటరితనాన్ని తరిమెయ్యాలి కానీ ఇలా బేలతనమేల భావన గారూ !

నేను చెప్పారు...

ముందు చిత్రం చూసి, "నీ నీడ చూపింది నాలో....ఇన్నాళ్ళ లోటేమిటో" గుర్తొచ్చింది... మనిషి పక్కన లేని వెలితి ఎన్ని మాటలూ తీర్చలేవు కదా....

Hima bindu చెప్పారు...

ఏం చెప్పగలం అనుభవించేవారికే తెలుసు ఆ రంపపుకోత ..ప్చ్ .

రాంగోపాల్ చెప్పారు...

భావన గారు,
మీ టపాలోనే కాక అభిప్రాయాలలో కూడ కవిత్వం వరదలా పారుతుంది. చాలా బాగుంది.

మధురవాణి చెప్పారు...

నా మనసు కూడా దిగులుగా అయిపొయింది :(
మనలో మన మాట... దిగులు పడటాన్ని కూడా ఇంతందంగా ఆవిష్కరించడం భావన గారికే చెల్లు..

Kalpana Rentala చెప్పారు...

భావనా, ఉషా, భా.రా.రే. మీరు ముగ్గురు ఇంత అలవోకగా కవిత్వం ఎలా రాయగలుగుతారో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాననోచ్...

భావన చెప్పారు...

@భ.రా.రే: ఏమో ఎలా తగ్గిందో కాని తగ్గింది కదా.చల్లని భావ వీచికలతోనో, బాధ తప్త హృదయ వేదనల వేడుకోలు తోనో. చక్రవాకం, శివరంజని రెండు నాకు ఇష్టమైన రాగాలు. అందులో శివరంజని ఇంకా ఇష్టం. అదే పాడుకుంటాను లే. థాంక్ యూ భా.రా.రే
@ఉష: బంధమంటేనే నమ్మకం కదా. మరువాల రాగాల మన్సుల బంధం గట్టిదేలే. లయ తప్పనివ్వకు. :-) గుండె పాడే రాగాల కు స్వస్తత చేకురుతుంది అనుకుంటే ఆనందం గా వుంది. నీ నోటి చలవ వలన జరిగితే ధన్యురాలిని ఉష.

భావన చెప్పారు...

@ సునిత: థాంక్ యూ నా తోటి బాధ పడ్డందుకు, ఇంతకు దిగులేనా లేక వుత్తరం బాలేదనా అర్ధం ఆ పెదవి విరుపు కు, నాకు తెలుసు అది నాతోటి కూడీన దిగులేలే నా గుండె గుబులకది ఎరుకేలే.

@కల్పన : గుండె లోని లయ పదమై బయటకు వస్తే భావాలకేమి ఎటువంటిదైనా పలుకుతుంది ఆ లయ శ్రుతి ని బట్టీ, లయ లేకుండా రాయటానికి ప్రయత్నిస్తే ఎంత సేపైనా ఒక్క పదం కూడా గుర్తు రాదు. భా.రా.రే, ఉష కల్పన పారిపోతోంది పట్టుకోండి పట్టూకోండి. :-)

భావన చెప్పారు...

@ శ్రీ లలిత గారు: "ఆపుకోలేని కన్నీళ్ళు రెప్ప ముడి విప్పి జాలువారుతుంటే" ఎంత అందం గా చెప్పేరండి.
"ఈ తగిలించుకున్న బంధాలు
తగులుకున్న బాధ్యతలు
మనసు రోదిస్తున్నా
మెదడు పనిచేయక తప్పని పరిస్థితుల్లో"
అలవోక గా మనసు ను ఆవిష్కరించేరండీ. ఇది చాలా చాలా అన్యాయమండి. నా మనసు అలా మీ ముందు పుస్తకమల్లే తెరుచుకుని కనపడుతుందంటే.. తెలిసిన మీరే చెప్పాలి పిచ్చి మనసు వూరడిల్లే మంత్రమేదో మరి.

మరువం ఉష చెప్పారు...

కల్పన, కాస్తేదో చురక వేసారాయేం మేడం? నాది కవిత్వమేనా, నిజమే - కాదని విన్నాకే కాస్త సాలోచనలో పడ్డానే ;) లేకపోతే కాస్త ఎక్సర్సైజ్ దొరుకుతుందని పరిగెడుతున్నారా? అలా అయితే ఓకె. నాతో పాటు పదమూడు మైళ్ళు పరిగెత్తిస్తా, వస్తారా?
భావన, నీ బ్లాగు పొలిమేరవరకు ఆపుతాను కానీ అవతల మనకి స్థాన బలిమి లేదే చెలీ? :)

భావన చెప్పారు...

@ పరిమళం: ఒంటరి తనాన్ని కూడా భయపెట్టే మొండితనం నాకు సొంతమే కాని ఒక్కోసారి అనారోగ్యమంటివి బేలను చేసేస్తాయి మరి. :-( ధన్యవాదాలు మరి దిగులు పంచుకున్నందుకు.

భావన చెప్పారు...

@ స్పందన (నేను): అవును ఆ లోటు ఎప్పటీకి తీరనిదే కదా నీడలలో తోడూ తప్పదు కదా.
@ చిన్ని: అవును గుండె గాయమయ్యి గళమందు వొలికేను, గానానికేమో ఆ బాధ అంటుకుని అంతలోని ప్రేమ దాని పైన అద్ది భా.రా.రే చెప్పినట్ళు శివరంజని పాడుకోవటమే. తప్పదు కదా చిన్ని.

భావన చెప్పారు...

@ రాం గోపాల్ గారు: మీ పేరు లోనే రాముడిని కృష్ణుడిని దాచుకోలేదు అలానే వాఖ్యలలో టపాలలో కృష్ణ గీతాన్ని పలికించేందుకు ప్రయత్నం, కవిత్వమనే అంత పెద్ద పేరు వద్దు నాకు కవిత్వం రాదు. మొదటి సారి మిమ్ములను నా బ్లాగ్ లో. ఆదర పూర్వక ఆహ్వానం.

భావన చెప్పారు...

@ మధురవాణి: దిగులు ను గుబులు ను పంచుకున్నందుకు ధన్య వాదాలు. దిగులు లోతు అర్ధం అయ్యి ,దిగులు వైశాల్యం కూడా అర్ధం ఐతే లోతైన లోయల మధ్య విశాలంగా పరచుకున్న ఆకుపచ్చని అరణ్యమల్లే దిగులు అందం గానె వుంటుంది నేను ప్రత్యేకం గా చెప్పేందుకేమి లేదు. అది నా గొప్పతనం కాదు.

భావన చెప్పారు...

@ కల్పన: మా ముగ్గురం ఎలా కవిత్వం చెపుతున్నాము అంటావా... హ్మ్మ్ మొదటి విషయం నేను కవిత్వం చెప్ప... అది నా నేస్తాల పని , నా పని వచనం అది నీకు అందం గా అనిపించి (నీకు అనిపించింది సుమా నేను అనటం లేదు;-))

మీరందరు అన్నిటీని అధ్బుతం గా విశ్లేషించి మాట గా కధగా కవితల గా ఎంత బాగా వివరిస్తారు, మరి నన్ను చెయ్యమంటే కళ్ళు తేల వేస్తా. మీ అందరికంటే ఏ విధం గా మేము గొప్ప గా రాయం, చదివే మీ మనస్సుల అభిమానం. దానికి పాత్రులమవ్వటం మా సుకృతం. అంతే.

అయినా తెలుసు కోవాలనుందా సరే చూడు.

అభిమానం అనురాగము పెనవేసిన స్నేహకిరణాలను అడుగు భాస్కర (సూర్యుడి) వంశం నుంచి రాముడుధ్బవించిన వివరం చెపుతుంది
భాషా భావం మమత మంచితనం కలబోసి చేసిన ఆ మంచి మనసు నడుగు కవితా మందారాలను విరగ బూయించిన చిరు స్పందనల కబురు చెపుతుంది

వేలికొస కే నినదించే అనురాగాల వీణా రాగాన్ని అడుగు కదంబాల కుసుమాల్ని ఎలా పూయించగలదో వివరిస్తుంది
పిల్ల గాలికే కన్నయ్య కాలి సవ్వడికే కదిలే ముద్దుల మరువపు కొమ్మనడుగు సుగంధాల పరిమళాల పాటలతో కవితల్లి కబురందిస్తుంది
కావ్యాలని ఔపోసన పట్టగల ఆ కావ్య హృదయాన్ని అడుగు భావ పరిమళం ఎలా విరజిమ్మ గలదో భానుని కిరణాల సాక్షి గా మెరిపిస్తూ మురిపిస్తూ మైమరపించే కధనం చెపుతుంది.

మనసులో అవ్యక్తం గా కదిలే ఒక ప్రేమ భావాన్ని అడుగు భావం భావనైన (భావన అయిన) వైనం వివరిస్తుంది..
కళ్ళ వెనుక గా పాకుతున్న కలల నీడనో కన్నీళ్ళ జాడనో అడుగు
మాటల సెలయేరు బయటకు దూకి కృష్ణ గీతమైన కబురందిస్తుంది

మా ముగ్గిరి తో జత కట్టి ఏ భావాన్నైనా అనురాగపు జతు ల తో కలిపి
అలవోక గా మా మనసు చదివి దానికి కొత్త భాష్యాలు అధ్బుత పరిమళాలలో సుగంధ చందనాలతో లలిత సుకుమారం గా శిరీష కుసుమాల మధ్యన వుంచి కానుకిచ్చే నెచ్చెలి శ్రీ లలితాల రాగం మా ముగ్గిరికి ఇంకొక అపురూపం.

భావన చెప్పారు...

@ఉష: మన బ్లాగ్ ల బయట కల్పన ను పట్టుకుంటానికి వేరే వాళ్ళను పెడదాము ఈ పొలిమేరలు దాటకుండా చూడు ముందు. నువ్వు కల్పన మేరథాన్ పరుగు పరుగో పరుగు.. నేనేమొ గట్టున వాటర్ బాటిల్స్ ఇస్తా అంతే నమ్మా ముందే చెపుతున్నా.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

సరే భావనా ఉషా ఏమో కల్పన ను పట్టుకోటానికి లగెత్తుద్ది. నువ్వేమో గట్టునకూకోని వాటర్ బాటిల్స్ సప్లై చేస్తుండు. నేనేమో మీరు పడే కష్టాలు చూడలేక సుభ్రంగా తాగిపెడతా. సరేనా?

Kalpana Rentala చెప్పారు...

ఆ..ఆ..ఇప్పుడు చెప్పండి. ఎవరు నాతో పరుగెత్తిస్తానందీ.. ఎవరు వాటర్ బాటిల్స్ ఇస్తానందీ? ఎవరు వొడ్డున కూర్చొని తాగి పెడతానందీ...చెప్పేయండీ...
నేను జోక్ గానో, కేవల పొగడ్త గానో చెప్పటం లేదు. నిజం గా మీ ముగ్గురి కవిత్వం లో నాకు ఒక నిజాయితీ, ఒక భావతీవ్రత, ఒక ఆర్ద్రత కనిపించింది. భా.రా.రే. మాత్రం కొంచెం శబ్ద ప్రేమలో పడుతున్నదేమో అని చిన్న అనుమానం. లేదా ఒక ఉచిత సలహా.
ఉషా, మీది కవిత్వం కాదు అన్న వాళ్ళది విమర్శ కాదు కువిమర్శ. హృదయమ్ వున్న వారికే కవిత్వం వస్తుంది. భాష వున్నవారికి వచ్చేది అక్షర శిల్పం మాత్రమే. రస భావ శిల్పం కాదు. నాకైతే అణు మాత్రం సందేహం కూడా లేదు. మీ ముగ్గురి కవిత్వం పట్ల.
నాకు కూడా మీతో పరుగెత్తాలనే వుంది కానీ రాసి రాసి అలసిపోయాను. ఆగటం మంచిదేమో....మీతో వొడిపోవడం కన్నా ...
మరో నేచ్చెలి శ్రీలలిత భావనాంతరంగం ఇంకా చదవలేదు. చదివి చెప్తాను.
నన్ను పట్టుకుంటానికి అంత కష్టపడనక్కరలేదు. అక్కడ ద్రౌపదీ రెడీ గా వుంది..

మరువం ఉష చెప్పారు...

కల్పన, ఇక మారుమటాడకుండా చేసారు. వినమ్రంగా స్వీకరిస్తూ... ఇకపోతే ఆ పరుగు మాట నిజమేనండి. నాతో మారథాన్ పరుగు కవితల్లో కాదు నేల మీద వేల మందితో కలిసే :) నిజం...

మురళి చెప్పారు...

మీ లేఖలోని ఆర్ద్రత హృదయాన్ని తాకి, కళ్ళ చివరి నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేసిందండీ..

శ్రీలలిత చెప్పారు...

భావనా,
మామూలు మాటల్లో చెప్పే నా అనుభూతికి విలువ నిచ్చి
స్నేహ హస్తం అందించిన మీ అందరికీ....
నిజంగా మీరందరూ యెంత గొప్పవాళ్ళు
యెదుటి మనిషి భాషలోని భావాన్ని తెలుసుకోవడమంటే
అంత సులభమేం కాదు. దానికి రస హృదయం కావాలి.
స్పందించగల హృదయానికే అది గోచరిస్తుంది.
శృతి చేసిన వీణని పలికించగల నేర్పు యెంతమందికుంటుంది?
వేకువ జామున జాజి రేకుపై ముత్యమైన మంచు బిందువు యెంతమంది మనసులను కరిగించగలదు?
కాశీరత్నం రేకు లోని సౌకుమార్యాన్ని యెంతమంది ఆస్వాదించగలరు?
మల్లెల మొల్లల తావిని యెంతమంది ఆఘ్రాణించగలరు?
మొగలిపూల వాసనకు యెన్ని మనసులు మాట్లాడగలవు?
చల్లగా తాకే పిల్లగాలికి మనసులో మెదిలే మధురోహలు యెంతమంది గ్రహించగలరు?
ప్రతి నీటి చెలమా యమునా తీరమే ననే భావం యెంత మధురమో యెంతమందికి తెలుసు?
నాదమయమైన జగతిలో తేలివచ్చే రాగమే మురళీ మోహనుని మధుర వంశీనాదమని యెంతమంది భావించగలరు?
తాను వలచినవాడే కన్నయ్య అనే ఊహ లోని తాదాత్మ్యత యెంతమంది కుంటుంది?
ఆ కన్నయ్యకు దాసోహం అనగలిగే ప్రేమావేశం యెంతమందిలో కలుగుతుంది?
అంత అర్పణ లోనూ తనను కన్నయ్య గుర్తించాలనే పిచ్చి ఆశ యెంతమందిలో వుంటుంది?
ఆ గుర్తింపు కోసం ఆరాటపడే ఆవేశానికి కలిగే బాధ యెంతమందికి అర్థమౌతుంది?
ఆ కన్నయ్య కడగంటి చూపు ఎప్పటికైనా తన పైన పడుతుందనే భావనే యెంతటి పిచ్చి బలాన్నిస్తుంది?
ఆ బలమే తనకు మోక్షానికి మార్గమనే భావన యెంతమందిలో వుంటుంది?
బోసినవ్వులో భగవంతుడిని దర్శించగలిగిన ఘనత యెంతమందికుంటుంది?
అటువంటి వారు మీరందరూ.. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం..
ఈ స్నేహం ఇలాగే మల్లెల మాలలా పరిమళించాలని ఆశిస్తూ....
శ్రీలలిత....

జయ చెప్పారు...

ఏమిటి భావనా ఇది. నా లాంటి వాళ్ళను ఏడిపించాలనేనా! ఇంత బాధ భరించే శక్తి నాకస్సలు లేదు. మీ కృష్ణుని బాధ తొందరలోనే తీరుతుంది. ఇద్దరూ జంటగా మారథాన్ లో పాల్గొంటారు. లేదా ఇద్దరూ జంటగా వాటర్ బాటిల్స్ ఇద్దురుగాని. సరేనా. ఇంక ఎప్పుడూ ఇలా మాత్రం ఏడిపించకమ్మా!!!

భావన చెప్పారు...

@భ.రా.రే: ఏమి తాగి పెడతావమ్మా? ;-)

@ కల్పన: నీ ప్రేమ అది. మా అదృష్టం ఇది.

@ ఉషా: అంతే అంతే.. నేను నీళ్ళ బాటిల్ ఇవ్వటమె ఖాయం, మాట మార్చేది లేదు.

భావన చెప్పారు...

@ మురళి: నా దిగులు తడి ను పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీ అందరిని కూడా నా బాధ తో దిగులు పెట్టేస్తున్నందుకు బాధ గా వున్నా, మీ అందరి వంటి సాహిత్యాభిమానుల, కళాభిమానులతో కలసి దిగులు పంచుకోగలుగుతున్నందుకు కించిత్తు గర్వం గా కూడా వుంది.

భావన చెప్పారు...

@ శ్రీలలిత గారు: మాట రాని మౌనం లో మీకు తల వంచి అభివాదం చేయటం తప్ప ఏమి చెయ్యలేనండి. అధ్బుతం మీరు చెప్పిన వాటిలో ఎన్ని వున్నాయో లేవో మాకు తెలియదు కాని మీరు వర్ణించిన తీరు అధ్బుతం పరమాధ్బుతం. మమ్ములను అంత సుసంపన్నం చేసి మీ స్నేహమందించినందుకు ప్రేమ తో గౌరవమ్ తో వినమ్రత తో మీ ఉష, భా.రా.రే , భావన.

భావన చెప్పారు...

@ జయమ్మ: నిన్ను ఏడిపించటమా, అయ్యో కానే కాదు నా బాధ నీ గుండె చెమరింత అయ్యింది అంతే. మెమిద్దరం కలసి వాటర్ బాటిల్స్ అందించే వాళ్ళమేలే పరుగెత్తే బ్యాచ్ కాదు. పరుగెత్తే వాళ్ళను చూస్తూ గట్టున సొల్లు చెప్పే వాళ్ళమే మేము, తొందర లో కోలుకోవాలనే మీ ఆకాంక్ష మాకు వెయ్య ఏనుగుల బలం.

తృష్ణ చెప్పారు...

అక్షరాలను బయటకు రానివ్వని మౌనం మనసుని ఆవహించేసిందండీ...చాలా బావుందనటం చిన్న మాటే..

వేణూశ్రీకాంత్ చెప్పారు...

మనసంతా భారమైపోయింది భావన గారు. మీ కృష్ణ త్వరగా కోలుకోవాలని, మళ్ళీ నూటికి నూరుపాళ్ళూ పరిపూర్ణ ఆరోగ్యం తన సొంతమవ్వాలని, తుళ్ళే ఆనందం మీ సొంతమవ్వాలనీ మనసారా కోరుకుంటూ...

సవ్వడి చెప్పారు...

భావన గారు ముందుగా మన్నించండి.

ఈ వెదవ అప్పుడు అంత వాదించి.. ఇప్పుడు కనీసం నా బ్లాగు కూడా చూడట్లేదు అని తిట్టుకుంటున్నారని తెలుసు.. ఏమీ అనుకోకండి.. కొన్నిసార్లు అంతే అలా జరిగిపోతుంది.



నవ రసాల్లో ఆర్ధ్రత రాయడం కష్టం.. ఆ తరువాత హాస్యం కష్టం. కాని మీరు అలవోకగా ఆర్ధ్రతని రాస్తున్నారు. గుడ్..

ఇంతకీ రాధి, కృష్ణలను మరింత విషాదంలోకి ఎందుకు తీసుకెళ్ళారు. మీ పాత్రలు.. మీ ఇష్టం అనుకోండి. కాని రాధాకృష్ణలను తలచుకుంటే నాకు ప్రణయ కావ్యాలే గుర్తు వస్తాయి.



మీ కామెంట్లు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కల్పన గారు మిమ్మల్ని ఎక్కడ మెచ్చుకున్నారో నేను అక్కడే అభినందిస్తున్నాను. " అశాంతిని తోడుగా తెచ్చుకొని..." అన్నారుగా! ఆ లైన్లు బాగా నచ్చాయి.

ఆ తరువాత మీరు కల్పన గారికి ఇచ్చిన కామెంట్ అత్భుతం. ఎన్నిసార్లు చదివానో నాకే తెలీదు. అది చదివినప్పుడు నా అనుభూతిని వివరిస్తాను వినండి... మొదటి మూడు లైన్లకే వేరే లోకంలోకి వెళ్లిపోయాను. సగం చదివేసరికి సన్నని పులకరింత.. చివరికి వచ్చేసరికి కళ్లు మసకగా తయారయ్యాయి. మీరు మరికొంత రాసి ఉంటే నా కళ్లు మీ కవితని అభిషేకించేవి.. అంత బాగా రాసారు. నాకెందుకో ఇటువంటి సాహిత్యమే ఇష్టం. ఇది చదివాక ఒక కోరికని విన్నవించుకోవాలనుకుంటున్నాను. ఈ విధంగా ఒక పెద్ద టపాని రాయండి. ప్రణయకావ్యం లా ఉండాలి.



లలిత గారు కూడా బాగా రాసారు. ఆవిడకి మీకు ఉష గారికి ఒక విషయం అడగాలనుకుంటున్నాను.. కన్నయ్య ఎనిమిది మందిని చేసుకున్నా.. మీరెందుకు అతన్నే ప్రేమిస్తారు. భర్తలో అతన్నే ఎందుకు చూసుకుంటారు. కాస్త వివరంగా చెప్పండి.

భావన చెప్పారు...

అలా ఏమి అనుకోవటం లేదు కృష్ణ.. అన్ని సార్లు అన్నీ చూడాలంటే కుదరదు కదా.. అదేదో వుద్యోగం లా. :-)
థ్యాంక్స్ అంత నచ్చినందుకు. అన్ని రకాల భావాలు పలికించాలని నా ప్రయత్నం.. కొన్ని అనుభవాలు, కొన్ని అనుభూతులు, కొన్ని వూహలు కొన్ని స్వగతాలు కొన్ని పరగతాలు. అన్నిటిని కలిపి పూస గుచ్చే ప్రయత్నం కృష్ణ గీతం. ఇవి నా ఒక్క దానికే కాదు అందరివైన భావాలు. వొట్టి ప్రణయాన్నే చూడాలంటే http://kristnapaksham.blogspot.com/2009/07/blog-post.html
చదవండి. ఇలా కాని వుత్తి రాధా కృష్ణుల ప్రణయ కావ్యమంటే ప్రయత్నిస్తాను రాయటానికి.

భావన చెప్పారు...

కృష్ణా అబ్బో ఇంత పెద్ద ప్రశ్న సింపుల్ గా అడిగేసి సమాధానం చెప్పమంటే కష్టమే నండి. కొంచం ఆలోచించి చెపుతాను పదాలలో ఎలా పెట్టగలనో మనసలోని భావాన్ని. :-)

సవ్వడి చెప్పారు...

take your own time madam.. but i am curiously waiting..

సవ్వడి చెప్పారు...

భావన గారు! మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను. లేకపోతే కన్నయ్యపై మీకు గల ప్రేమను... మీ భర్తలో కన్నయ్యను చూసుకుంటున్న వైనాన్ని.. ఒక పెద్ద టపా ద్వారా తెలియజేయండి. మీ సమాధానం మాత్రం వివరంగా ఉండాలి.