క్రిష్ణా,ఎన్ని యుగాలయ్యాక ఎక్కడ ఈ పాతాళ కుహరాల నుంచీ పిలుపు అనుకుంటున్నావా? ఇక్కడే నీ గుండె లోతుల నుంచే... నేనింక ఎక్కడ వుండ గలను చెప్పూ?
ఎలావున్నావు నేస్తం? ఇంటి ముందు పూలతీవె ఇంటి వెనుక రావిచెట్టు క్షేమమా?కదిలిపోయే కాలమంతా కావ్యమైనా కాదు సుధా మాధురులతో మరొక్క సారి తలుచుకుందాము అంటే... ఎంత రాసినా ఇంకా చెప్పవలసినవి ....అస్పృష్టం గా మనసుకు తోచి తోచనివి......చెపుదామని తీరిక గా కూర్చుని, జ్ఞాపకాల పున్నాగలను ఏరి గుచ్చుదామంటే చిత్రం ఒక్క పువ్వూ కూడా చప్పున రాలి పడటం లేదు... అన్నీ అసంపూర్ణ చిత్ర గీతాలే... అన్నీ మద్యలో ఆగి పోయిన కాలం ఆపేసిన కావ్యాలే... ఏమని చెప్పుకుందాము చెప్పు.........
రోజంతా పూస గుచ్చినట్లు చెప్పూ ...... రోజులో నేను ఎన్ని సార్లు గుర్తు వస్తానో ఎప్పుడెప్పుడు గుర్తు వస్తానో చెప్పు అన్నావు కదు కిందటి వుత్తరం లో... వూ............
ప్రొద్దున కిటికి బయట చిన్ని రంగు రంగుల గువ్వ తన ముక్కుతో అద్దం మీద కొట్టి లేప గానే వసంతమొచ్చిందని నవ్వుకుంటు లేస్తుండగానే అనుకుంటా క్రిష్ణ కు చెప్పాలి ఈ గువ్వ ఈక లో ఆ తెలుపు ఎరుపు కలిపిన లేత రంగు ఎంత అందం తెచ్చిందో దాని చిన్ని పసుపు రంగు ముక్కు ఎంత అందం గా వుందో చెప్పాలి అనుకుంటా కానీ వెళ్ళాలి కదా కదన రంగానికి అని అక్కడికి పిట్ట సంగతి... ...నీ సంగతి ,.....పక్కన పెట్టి పరుగు మొదలు పెడతా...
సరే పైన పని అంతా ఐపోయి కిందకు వచ్చి కిటికి తెర పక్కకు లాగుతుంటే ఎదురుగా చెట్టూ చిన్ని చిన్ని ఎర్రటి మొలకలు పలకరిస్తాయి మళ్ళీ మనసు మీద మూగే ఆలోచనలను తోసేసుకుని పని చేసుకుంటాను.,.. బయటకు వచ్చి పని కి వెళుతుంటే ఎక్కడో నీలి ఆకాశపు అంచున ఒక తెల్లని మేఘం ఏదో నాకంటే తొందర తొందర గా పరుగెడుతు ఇంతలోనే నా కార్ లోనుంచి మంచి పాట వినపడో ఏమో పాపం నిలిచి నన్ను తేరి పారా చూస్తున్నప్పుడూ అనుకుంటా నీకు చెప్పాలని..
ఇంకా....... మధ్యాన్నపు ఎండ ఆకులను తళ తళ లాడిస్తున్నప్పుడు ఆ మెరుపులోని నిగ నిగ లు..... సాయింత్రం తన చీకటి పరదా ని ఆకాశం మీదకు వల విసురుతుంటే ఏమీ చేయలేక మొహమంతా ఎర్రన చేసుకుని తుర్రుమన్న సూరీడి అలక గురించి ఏన్నో చెపుదాము అనుకుంటా... ఒక రోజుకు ఈ టెక్నాలజి అంతా పెరిగి పోయి నా మనసులోని ఆలోచన నేను చెపుదాము అనుకోగానే దానిని కాంతి తరంగాలు గా మార్చి నీకు అందచేసే సాధనం ఒకటి వస్తే బాగుండు...... కొత్త గా వచ్చేది ఏమి వుంది అది ఎప్పుడూ మనతోనే వుంటుంది "మనసు" అంటావేమో నువ్వు అని నవ్వుకుంటా మళ్ళీ నాలో నేనే...
భావాల తీవ్ర త ఎక్కువ ఐందేమో అనిపించి నప్పుడు వాటి గోల తో నిన్ను వుక్కిరి బిక్కిరి చేస్తానేమో అనుకున్నప్పుడు... కాసేపు ఆపుతున్నా.. ఇప్పుడే ఇంద్ర గంటి శ్రీకాంత శర్మ గారి కవితలు చదువుతున్నా.. కొన్ని చాలా బాగున్నాయి నువ్వు వుండి వుంటే నీ లాప్ టాప్ లాక్కుని నీ పిచ్చి డేటా అంతా చెరిపేస్తాను రేపు నీ రాక్షసి మేనేజర్ వుద్యోగం లో నుంచి పీకేసినా సరే అని బెదిరించి మరీ వినిపించే దానిని......
నీకోసం నేను ఎంతో కష్టపడి శ్రీ శ్రీ గారి కవిత్వం ఇంకా ఆయన ఎవరు..... ఆ ఉస్మానియా యూనివర్సిటి పుస్తకం ఆ అదే వడ్డెర చండీదాస్ గారి అనుక్షణికం బలవంతం గా విన లేదూ.... సరే ఇక్కడ రాస్తున్నా కంటితో విను...
నిన్ను విడిచి వచ్చాక గాని
నీ స్వప్నచ్చాయలింత బలమైనవనినాకు
తెలియదు....
నిన్నటి నీ శ్పర్శ ఇంతగా నా వునికిని నీలోకి లాగేసుకుంటుందని
నాకు తెలియదు..
నీ ఇష్టానిష్టాలు నాకు తెలియవుఏమి
చెపితే అది వింటావువూ అంటావు...
విషమ సంధర్బాలలో
వడగాలిలో చెట్టులాగా జుట్టు విరబోసుకుని
మండుటెండల్ని పిడికిట బట్టీ
అగ్గి స్నానం చేయటం నాకలవాటు..
నా ఆగ్రహావేశాలే తప్ప
నిన్ను గురించి ఆలోచించిందెప్పుడు??
ఇప్పుడీ ధీర్గ రాత్రి లో నన్నవరించి
సరసన పవ్వళించిన ఏకాంత శూన్యానివి నువ్వు...
వూపిరిని బంధించి బెంగను రేపే స్నేహ శ్పర్శ కాదు మనది...
అలవాటు గా పరిణమించిన దైహిక క్రియ
మన వివాహం
మనకు విశ్రాంతి లేదు...
స్వప్నాల రెక్కలు కత్తిరించటమే కర్తవ్యాల పరాకాష్ట...
విచిత్రం గా వుంది కాని నాకు నచ్చింది.. నీకు ఎలా వుంది... ఇంకా చాలా వున్నాయి బాగున్నాయి ... నాకు తెలుసు నీకు నచ్చవు ఇలాంటి కవితలు... కాని తప్పవు కదా నీకు ఈ తిప్పలు... నా కోసం...
రాత్రి 1 దాటింది.. అమావాస్య రోజులు దగ్గరకు వస్తున్నట్లు వున్నాయి.. చిక్కని చీకటి కమ్మని నిద్ర లా లోకం మొత్తం మీద పరిచి జో కొడుతుంది... అబ్బ ఎంత శబ్ధం చేసుకుంటు వెళుతుందో ఇంటి వెనుక రైలు... అంత లా కూత పెట్టక పోతే ఏమో ఇంత అర్ధ రాత్రి ఎవడు వస్తాడు పట్టాలకు అడ్డు... నిజం గా ఎవడైనా వస్తే వాడు వెళ్ళటానికి కాదు కదా ఇంక ఈ శబ్ధానికి... చూడబోతే రైలు నడిపే వాడికి అన్ని ఇళ్ళల్లో అందరు నిద్ర పోతున్నారు అని నిష్కారణం గా బాధ వచ్చి అందరిని లేపటానికి ప్రయత్నిస్తున్నాడేమో ... వాడికేమి తెలుసు ఎన్ని మనసులు నిద్ర రాక చీకటి లో శూన్యం వైపు చూస్తున్నాయో ఎన్ని మనసులు దిక్కు తోచక ఆలోచిస్తు ఆలోచిస్తూ... అప్పుడే నిద్ర కు జారుకుంటున్నాయో..
పాపం ఇంటి ఎదురుగా గుడి గోపురం మీద పావురం కూడా నిద్ర లోనుంచి వులిక్కి పడి లేచి విచిత్రం గా ఏదో భారం గా శబ్ధం చేసి మళ్ళీ సర్దుకుంది., పాపం దానికి కూడా నాకు లానే అనుకుంటా, ఎన్నాళ్ళు అయినా నీ విరహమింకా కొత్తగానే నీవు లేని వెలితి తప్పించూకోలేనిది గానే వున్నట్లు దానికి ఆ బాధ అలవాటు కాలేదు అనుకుంటా..
16 కామెంట్‌లు:
చాలా బాగుందండి..
మీరు రాసింది చదివేవారికి" చలం ప్రేమలేఖలు" గుర్తొచ్చి తీరాలి . ముఖ్యంగా చివరి పేరా చదువుతున్నప్పుడు. చాలా బావుంది భావనగారూ
బాగుంది!
@మురళీ గారు, ధన్యవాదాలు.
@లలిత గారు,
ధన్యవాదాలు నచ్చినందుకు. అవునండి నా మీద చలం ప్రభావం చాలానే ఎక్కువ. చిన్నప్పటినుంచి తెగ చదివెయ్యటం మూలాన అనుకుంటా భావం వ్యక్తీకరించటం లో ఆయన ప్రభావం నా మీద వుంటుంది. నిజం గా నాకు ఆలోచనలు అలానే వస్తాయి మరి ఏమి చెయ్యమంటారు చెప్పండి. :-)
@ధన్యవాదాలు చైతన్య
"ఎన్నాళ్ళు అయినా నీ విరహమింకా కొత్తగానే" బావుందండీ ....విరహముకూడా సుఖమే కాదా ...మళ్ళీ కలయిక మధురము కాదా..
అవునండి విరహం కూడా అలవాటు ఐతే సుఖమేనేమో...విరహమంటే అగ్ని శిఖల మద్యన మెరిసే వెన్నెల... విరహమంటే వూపిరాడనివ్వని గాలి హోరు...
చలం గుర్తొస్తే తప్పేం లేదుగానీ చలంతో పోలిక అక్కర్లేకుండానే చాలా బావుందని నా మనవి.
పరిమళం గారూ విరహము కూడా సుఖమన్న వాడు మాత్రం నిజ్జంగా వెర్రికుట్టే. అలా ఫీలయ్యేవాళ్ళు .. మాసోకిజం పూర్తిగా వంటపట్టిందనుకోవచ్చు. బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ .. అయ్యబాబోయ్, ఇక్కడ కూడా భావనే! :)
"కానీ వెళ్ళాలి కదా కదన రంగానికి అని అక్కడికి పిట్ట సంగతి... ...నీ సంగతి ,.....పక్కన పెట్టి పరుగు మొదలు పెడతా".....
ఆలోచనలకి అక్షరరూపం ఇవ్వాలని అనిపించినప్పుడల్లా కుర్చుని రాయగలిగితే ఎంత బావుంటుందో కదా...కొన్ని ఆలోచనలు తీరాన్ని తాకే అలల వలే క్షణకాలం ఉండి వెళిపోతే, మరికొన్ని అవి వదిలేసిన ఆల్చిప్పల్లా అందంగా గుర్తుండిపోతాయి......అచ్చం మీ లేఖలో వాటిలా....
భావనా, మీ కవిత చాలా బాగుంది. మీ లాగే చాలా మందిమి కనుక మాకు బాగా నచ్చి ఉండచ్చు.
మీ విరహం మాకు మంచి పోస్ట్ ని ఇచ్చినా, మిమ్మల్ని మీ .. , మీకు బ్లాగ్ రాసే తీరిక లేకుండా ఆనందం లో నింపాలని , అంత తీరిక తనకు కుదరాలని కోరుకొంటూ..
నేను: నాకు అలానే అనిపిస్తుంది రాయాలి అని పించినప్పుడల్లా రాసే వీలు వుంటే ఎంత బాగుండు అని.ధన్య వాదాలు అంత అందమైన మెచ్చుకోలు ఇచ్చినందుకు.
మైత్రేయి: మీ అభిమానానికి ధన్య వాదాలు. :-) మీ చలం సేకరణ గురించి మీ బ్లాగ్ లోనే మాట్లాడతాను.
"ఎన్నాళ్ళు అయినా నీ విరహమింకా కొత్తగానే
నీవు లేని వెలితి తప్పించూకోలేనిది గానే... "
ఇంకా ఎన్నాళ్ళిలా? మీరిద్దరూ ఎప్పుడు కలుసుకుంటారు?
మురళి క్రిష్ణ గారు, క్రిష్ణ తత్వమే అంత ఎప్పుడూ కలుస్తూనే వుంటాడు కాని ఎప్పటికి అందడు. చూద్దాము ఎప్పటికైన కలుస్తామేమో. :-) ఏమో గుర్రమెగర వచ్చు నేనే స్వారి చెయ్యవచ్చు... అన్నట్లు....... ఏమో అతడు రాను వచ్చూ..... నేనే జోడి కాను వచ్చు...
మీ కొత్త టెంప్లేట్ బావుందండీ ! కృష్ణగారిని కలిశారా ఏమి ? మమ్మల్ని మరిచారు !
ఫరిమళ గారు,
టెంప్లేట్ నచ్చినందుకు ధన్య వాదాలు... క్రిష్ణ గీతం క్రిష్ణుడిని కలిసినా ఆగేది కాదు కదా రాగం మారుతుందేమో కలిస్తే అంతే ...
ఇంతటి కవితాత్మక వచనాన్ని...కసితీరా చంపెయ్యాలి లేదా నిలువునా నింపెయ్యాలి అనిపిస్తోంది. ఏం చెయ్యాలి?
కామెంట్‌ను పోస్ట్ చేయండి